23, జూన్ 2022, గురువారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 25 *** ఆ మంచితనానికి హద్దుని చూడలేదు***

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 25  *** ఆ మంచితనానికి హద్దుని చూడలేదు***


నేను నా ఉద్యోగంలో ఒడుదుడుకులు, విజయాలు చెప్పేముందు నాకు కొత్త విద్య నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చిన మా ఎమ్.డి. విజయపాల్ రెడ్డిగారి కుటుంబం గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక కుటుంబంలో అందరూ మంచివాళ్ళు వుండడం అప్పుడే నేను కొత్తగా చూశాను. అంతేకాకుండా వీళ్ళ కుటుంబానికి నమ్మిన బంటు రాములు. వాళ్ళ కుటుంబానికే కాదు. నాకు ఏ అవసరం వచ్చినా... ఆఘమేఘాల మీద అందించేవాడు. పెద్ద సెక్యూరిటీ గార్డ్.

మా ఆఫీసు ఉన్న బిల్డింగ్ పక్కనే ఆనుకుని ఉన్న బిల్డింగ్ విజయపాల్ రెడ్డిగారు వాళ్ళది. అందులోంచి ఇందులోకి దారి వుంది. కాబట్టి అటూ ఇటూ తిరగడం వాళ్ళకి అనుకూలంగా వుండేది. వాళ్ళ కుటుంబానికి కూడా ఆఫీసులో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం వుండేది.

ప్రముఖ అడ్వకేట్ ప్రతాప్ రెడ్డిగారు

విజయపాల్ రెడ్డి గారి తండ్రిగారు ప్రముఖ న్యాయవాది, సాహిత్యవేత్త అయిన కె. ప్రతాప్ రెడ్డిగారి ఏకైక కుమారుడు. ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు. అందరినీ ఒక పద్ధతిగా పెంచారు. ఆయన నియమనిష్టలకి ఆయన దగ్గిర పనిచేసే అందరికీ వణుకు పుట్టించేది. ఎంత కఠినంగా వుండేవారో అంత మంచితనం కూడా వుంది. ఇంట్లో కూడా టిఫిన్ కి కానీ, భోజనానికి కానీ అందరూ ఒకే టైముకి రావాలి. ఆ టైము దాటితే వాళ్ళకి టిఫిన్, భోజనం ఆ రోజుకి వుండదు. ఇంక ఆలోచించే ప్రసక్తే లేదు. సాధారణంగా ఆయన ఒక కేసు తీసుకుంటే విజయమే వుండేదని విన్నాను. సిటీలో ఆయనకి చాలా గొప్ప పేరుంది. వీళ్ళు సామాన్యంగా కనిపించే కోటీశ్వరులు.

ప్రతాప్ రెడ్డిగారి (ఫోటో ప్రతాప్ రెడ్డిగారిది) గొప్పతనం ఇలా -

నేను ఆఫీసులో వుండగా ఉన్నట్టుండి ఒక రోజు సిటీలో కర్ఫ్యూ ప్రకటించారు. ఆ టైములో సిటీలో చాలా కఠినంగా వ్యవహరించారు. నేను ఇంటికి వెళ్ళేందుకు బస్ లు లేవు. అక్క పెళ్ళయి బావగారు ఇక్కడ ఉద్యోగం వుండడంతో మళ్ళీ హైదరాబాద్ వచ్చేసింది. కర్ఫ్యూ పెడుతున్నారని తెలిసి ఆఫీస్ కి ఫోన్ చేసింది. ప్రతాప్ రెడ్డిగారు ఫోన్ తీశారు.

ఇక తను ఆగకుండా “ఏంటి సర్ మీకు ఆమాత్రం తెలియదా... తను ఇంటికి ఎలా వస్తుంది?” అంటూ పెద్ద ఎత్తున మాట్లాడేసింది. తనని పూర్తిగా మాట్లాడనిచ్చి –

“అమ్మా! ఇక్కడ మీ చెల్లెలికి వచ్చిన ఆపద ఏం లేదు. మేమందరం వున్నాం. రేపు పొద్దున్న మీ చెల్లెలు క్షేమంగా ఇంటికి వస్తుంది” అని చెప్పి, కొడుకుని పిలిచి -

“విజయపాల్! రాములుకి చెప్పి అమ్మాయికి కావలసినవన్నీ జాగర్తగా చూడమని. మన గెస్ట్ రూంలో అన్ని ఏర్పాట్లు చెయ్యండి” అని చెప్పారు. వెంటనే నాకు మంచి భోజనం, పడుకునేందుకు రూము ఏర్పాటు చేశారు. నిజంగా ఆరోజు వాళ్ళు చూపించిన ఆప్యాయత చాలా గొప్పది, మరిచిపోలేనిది. ప్రతాప్ రెడ్డి గారు మర్నాడు పొద్దున్న ఆయనతోబాటు టీ తాగడానికి పిలిచి “రాత్రి నిద్ర బాగా పట్టిందామ్మా! ఏమీ భయపడలేదు కదా?” అని, రాములు నిన్ను కారులో ఇంటి దగ్గర దింపుతాడు అని చెప్పారు. నేను తలాడించి బయటికి వచ్చేశాను.

అయితే నేను కారు దగ్గిరకి వెళ్ళేవరకు నాతో ఎవరు వస్తున్నారో అర్థం కాలేదు. ఆశ్చర్యం వేసింది - విజయపాల్ రెడ్డిగారి అమ్మగారు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ కజిన్, వాళ్ళ అక్క అందరూ రాములు డ్రైవర్ చేసిన ఫియట్ (అప్పట్లో ఫియట్ కారంటే చాలా గొప్ప) కారులో సంజీవరెడ్డి నగర్ లో అక్కావాళ్ళ ఇంటి దగ్గర దింపారు. అది కూడా ప్రతాప్ రెడ్డి గారు హుకుం జారీచేశారు. ఈ సంఘటన నేను మరిచిపోలేనిది.

నాకు వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసినన్ని రోజులు అడుగడుగునా ఆదుకున్నారు. ఇవన్నీ ముందు ముందు తెలుస్తాయి.

దాదాపు 35 సంవత్సరాల తర్వాత నేను రాములు ఫోన్ నెం. సంపాదించి పలకరించాను. ఎంతో సంతోషించాడు. మా కుటుంబంలో అందరినీ పేరు పేరునా అడిగాడు. ఎవరికి గుర్తుంటుంది మేడమ్. ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు. నాకు సంతోషమయింది అన్నాడు.

ప్రతాప్ రెడ్డిగారు వాళ్ళు చిలుకూరు దగ్గిరకి వెళ్ళిపోయారు. విజయపాల్ రెడ్డిగారి అమ్మగారు కిందటి సంవత్సరం చనిపోయారు. వీలైతే ఒకసారి వాళ్ళింటికి తీసుకుని వెడతాను అన్నాడు. కానీ కరోనా కారణంగా కలవలేకపోయాను. త్వరలోనే వారిని కలవాలి.


2 కామెంట్‌లు:

 1. సంపన్నులయినా కొంత మందిలో సంస్కారం ఉండేది … ఒకప్పుడు. మీ ప్రతాప రెడ్జి గారు ఆ కోవకు చెందిన ఒక విశిష్ట వ్యక్తిలా తోస్తున్నారు. నియో-రిచ్ క్లాసులో రాను రాను మృగ్యమైపోతోంది.

  అన్నేళ్ళు గడిచిపోయినా మీరు గుర్తుంచుకుని రాముల్ని పలకరించడం చాలా ప్రశస్తమైన పని.

  హిమయత్ నగర్ లోనే (అశోక్ నగర్ వెళ్ళే రోడ్డు మీద) ఆనాటి ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి వల్లూరి బసవరాజు గారి (వి.బి.రాజు) ఇల్లు ఉండేది. పాతతరం నాయకుల తరహాయే వేరు లెండి.

  రిప్లయితొలగించు
 2. ప్రతాప్ రెడ్డిగారు ఒక సాహితీ వేత్త కూడా... ఒక మూడు సంవత్సరాల క్రితం వరకు చాలా సాహితీసమావేశాలకి హాజరయ్యారు.

  వీరి మంచితనానికి ఇది మచ్చుతునక మాత్రమే... వీరిని గుర్తుపెట్టుకున్నా... రాముల్ని పలకరించినా... అది ఎందుకనేది మీకు ఇంకా ముందు ముందు తెలుస్తుంది సర్.

  మీరనట్లు ఆ అభిమానాలు మృగ్యమైపోవడానికి సెల్ ఫోన్లు, విపరీతంగా పెరిగిపోయిన టీవీ ఛానెళ్ళు కారణం.

  వీళ్ళు ప్రస్తుతం చిలుకూరు దగ్గర ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుని వున్నారు. వాళ్ళని కలవాలని వుందని రాములుకి ఫోన్ చేశాను. రమ్మని చెప్పారు.

  రిప్లయితొలగించు