25, జులై 2023, మంగళవారం

*** చాలా సంవత్సరాలకి 113K బస్సుతో నేను బస్సులో కనిపించిన వింతలు- విశేషాలు, నా జ్ఞాపకాలు *** - 94

 *** చాలా సంవత్సరాలకి 113K బస్సుతో నేను

బస్సులో కనిపించిన వింతలు- విశేషాలు, నా జ్ఞాపకాలు ***

దూరం నుంచీ చెయ్యి చూపించాను...



113K బస్సు డ్రైవర్ ఆపాడు. “తొందరగా రామ్మా!” అన్నాడు. ఒక్క ఉదుటన బస్ ఎక్కాను. కండక్టర్ వెనక నుంచి వస్తూ...

“ఎక్కడికి వెళ్ళాలి?”
“ఎస్ ఆర్ నగర్”
మళ్ళీ “ఎక్కడికి?” అన్నాడు.
“సంజీవరెడ్డి నగర్”
“సంజీవరెడ్డి నగర్ కాదు ఎస్ ఆర్ నగర్ అనాలి” అన్నాడు.

నేను నవ్వేసి “ఓహో అలాగా... బస్ ఎక్కి చాలా రోజులైంది. ఏమనాలో కూడా గుర్తులేదు. టికెట్ ఇవ్వండి” అన్నాను. 27 సంవత్సరాలు సంజీవరెడ్డి నగర్ లో ఉన్నామని అతనికి తెలియదుగా...

డ్రైవర్ వెనక ముగ్గురు కూచునే అడ్డసీటు వుంది. ఈమధ్య బస్సుల్లో సీట్లు కూడా మార్చినట్టున్నారు. నేను ఆసీటులో కూర్చున్నాను. నా పక్కనున్న తల్లీ, కూతుళ్లు ఏదో ఫంక్షన్ కి వెళ్ళివచ్చినట్టున్నారు. డ్రైవర్ మాటలకి, నా మాటలకి కూతురు నన్నుచూసి నవ్వింది. ఎక్కడికో ఫంక్షన్ కి వెళ్ళిట్టున్నారు. ఒంటినిండా నగలు, పట్టు చీరలు. ఆ అమ్మాయి చాలా కూల్ గా వుంది.

***

ఇంతలోకే ఓ స్కూటర్ పిల్ల బస్సుని రాసుకుంటూ బస్సు ముందునుంచి పోయింది. డ్రైవర్ ఒక్కసారి అదురుకుని సడన్ బ్రేక్ వేశాడు. ముందు కూచున్న మాకు ఒక్కసారి గుండె దడదడ కొట్టుకుంది. నేను “పడిందా...” అని గట్టిగా అన్నాను. “లేదు వెళ్ళిపోయింది” అన్నాడు డ్రైవర్. అమ్మయ్య అనుకున్నాను. పిల్లలు చాలా తుంటరిగా వున్నారు.

***

ముందు బస్ స్టాప్ లో బస్ ఆగింది. ఓ నాజూకు నారి, వాళ్ళమ్మ కాబోలు ఎక్కారు. చూడ్డానికి ఆ అమ్మాయి తమాషాగా వుంది. ముక్కుకి ఫ్యాన్సీ ముక్కెర పెట్టుకుంది. చెవులకి పొడవైన లోలకులు వేలాడుతున్నాయి. కోల మొహం. తెల్లగా వుంది. అందం అంటే అంత అందంగా ఏం లేదు. పెళ్ళయ్యింది. ఆ సన్నటి శరీరాన్ని ఒకటే మెలికలు తిప్పుతోంది. జుట్టు అంత ఒత్తుగా లేదు. కాకపోతే నొక్కుల నొక్కుల జుట్టు గాలికి మొహం మీద ఆటలాడుతోంది.

నేను కూచున్న సీటులోంచి ఆ అమ్మాయి మొహం బాగా కనిపిస్తుంది. ఎందుకో పదే పదే చూడాలనిపించింది. నాలుగైదుసార్లు చూశాను. కానీ ఆ అమ్మాయి మొహంలో నవ్వులేదు. కళ్ళు తీక్షణంగా దేన్నో వెతుకుతున్నట్టు ఆరాటపడుతున్నాయి.

అంతచక్కటి పిల్ల మటమటలాడుతోంది. నవ్వుచూడాలనిపించింది. ఉన్నట్టుండి ఏదో చుడువాపల్లీ లాంటిది తీసి పక్కనావిడకి ఇచ్చి తనూ గబగబా తినేస్తోంది. ఆ తినడంలో ఈ సమస్యకి పరిష్కారం వుందా అన్నట్టు వుంది. ఇంక చూస్తే బావుండదని రోడ్డు వైపు చూడ్డం మొదలు పెట్టాను.

***

ఆ అమ్మాయిని పరిశీలించే హడావుడిలో బస్సు తిలక్ నగర్ మీద నుంచి వెడుతోంది. తిలక్ నగర్ చూడగానే ఓ జ్ఞాపకం పొరలలోంచి బయటికి వచ్చింది. నేను హిమాయత్ నగర్ లో పనిచేసినప్పుడు భూషణ్ మాతో పనిచేసేవాడు. ఒకరోజు వచ్చి “మా ఇంటి దగ్గర ఒక స్కూలు అమ్మకానికి వచ్చింది. 8 వేలకి ఫర్నిచర్, గుడ్ విల్ తో బాటు అమ్ముతున్నారు. మీరు 3 వేలు పెట్టి పార్టనర్ షిప్ తీసుకుంటారా? ఒకసారి మా ఇంటికి రండి” అన్నాడు.

నేను నిజంగానే స్కూలులో పార్టనర్ షిప్ తీసుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే డిగ్రీ అవగానే కొన్ని నెలలు స్కూల్లో చేసిన అనుభవం నా వెన్నుతట్టింది. ఆదివారం వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళింట్లో వెజిటబుల్ బిర్యాని పెట్టారు. అది తిన్నాక బాదం మిల్క్ ఇంట్లో చేసినది ఇచ్చారు. కాసేపు ఛెస్ ఆడుకుందాం అని, తను వాళ్ళావిడ నాకు ఎలా ఆడాలో చెప్పి నాతో ఆడారు. అది మొదటి సారే అయినా చాలాసార్లు వాళ్ళని ఓడించాను. కానీ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఆడలేదు.

నన్ను తీసుకెళ్ళి స్కూలు చూపించాడు. చాలా బావుంది. “నేను ఊరికి వెళ్ళి మా పెద్దక్కతో మాట్లాడి చెప్తాను. అంతవరకు ఆగండి” అన్నాను. అతను అప్పటికి సరే అని తల వూపాడు.

నేను ఊరు వెళ్ళడం అక్కకి చెప్పడం జరిగింది. అప్పటి వరకూ మా ఇంట్లో ఎవరూ స్వయంకృషి మీద పైకిరావడం తెలియదు. అక్క మౌనంగా వుండిపోయింది. కానీ నేనేమీ నిర్ణయం తీసుకోలేకపోయాను. 1986లో 2000 వేలు చాలా ఎక్కువే మరి.

***

అటు పక్క ముందు సీటులో ప్రశాంతంగా కాళ్ళు జాపుకుని కూచున్న ఒకావిడ నిద్రలోకి వెళ్ళిపోయింది. మధ్యమధ్యలో కళ్ళు తెరిచి తనెక్కడుందో చూసుకుంటోంది. ఫీవర్ హాస్పిటల్ బస్ స్టాప్ లో బ్యాగ్ సద్దుకుని హడావుడిగా దిగిపోయింది. ఓహో ఎంత నిద్రలో వున్నా ఆవిడలో వున్న అలారం చెప్తుందనమాట అనుకున్నాను.


***

చూస్తుండగా బస్ బరకత్ పూరా వైపు మలుపు తిరిగింది. ఆ మలుపు నన్ను ఒక్కసారి నాలో ఉలుకుని కలిగించింది. అమ్మతో గడిపిన ఇల్లు, ఆ రోజులు గుర్తుకు వచ్చాయి.

రాఘవేంద్రస్వామి గుడికి దగ్గిరికి రాగానే అప్పటి నుంచీ ఇప్పటి వరకూ మారని కళ్ళ డాక్టరు బోర్డు కనిపించింది. అమ్మకి కంటికి ఏదో అయ్యిందని దగ్గరలో ఉన్నాడు కదా అని తీసుకెడితే... అమ్మ ఏదో చెప్పబోతే చాలా విసుక్కున్నాడు. అమ్మ చాలా బాధపడింది. నేను “సరిగ్గా చెప్పండి. మీరు కాకపోతే ఇంకొకరు” అని అమ్మ తీసుకుని ఇంటికి వచ్చేశాను.

***

హిమాయత్ నగర్ వచ్చింది. అదో పెద్ద ప్రపంచం అయిపోయింది. అప్పటి ప్రశాంతత లేదు. పెద్ద హోటళ్ళు, షాపులు. నగరం నడిబొడ్డున ఒక ధనవంతమైన షాపింగ్ సెంటర్లా అయిపోయింది.

హిమాయత్ నగర్ లో ఒకప్పుడు మినర్వా హోటల్ చోటులో గాయత్రీ భవన్ వున్నప్పుడు దాని ముందు ఒకతను పెన్నులు అవీ పెట్టుకుని కూచునేవాడు. అతను ముసలివాడు అయిపోయాడు. కొడుకనుకుంట కూచున్నాడు. ముసలాయన వచ్చేపోయే వాళ్ళు బళ్ళు, కార్లు పెట్టుకోవడాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. బస్సు మెల్లగా లిబర్టీ వచ్చింది. ఇప్పుడు మున్సిపల్ ఆఫీసు పక్క నుంచి వెళ్ళట్లేదు.

ఆ గాయత్రీ భవన్ లో ఎన్నోసార్లు టిఫిన్ చేశాం. మంచి రుచికరంగా వుండేది. ఈ మధ్య రాజ్ భవన్ రోడ్డులో గాయత్రీ భవన్ చూశాను. అదీ, ఇదీ ఒకటో కాదో తెలియదు.




***

లిబర్టీలో ఉన్న మున్సిపల్ ఆఫీసు వాళ్ళు ఆ చోటుని పార్కింగ్ కి సెట్ చేసుకున్నారు. అడ్డాలు పెట్టేశారు. అక్కడ పక్కనే ఎప్పుడూ విశాలాంధ్ర వాళ్ల బుక్ షాప్ వుండేది. చాలా పుస్తకాలు కొన్నాం. బస్సు అటు వెళ్ళకపోవడంతో అమ్మ కాసేపు మురికివాసన పీల్చే పని తప్పింది అనుకున్నాను. ఆ మురికి వాసన ఇప్పటికీ ముక్కులోంచి కడుపులో ఎక్కడికో వెళ్ళి వికారం తెప్పిస్తుంది.

***

మొత్తానికి 113K లో ఊరంతా తిరిగి అనుభవాలు, అనుభూతులు నెమరు వేసుకుంటూ అమీర్ పేట ఛర్మాస్ పక్కన బస్ స్టాప్ లో దిగి ఆటోలో ఇంటికి వెళ్ళిపోయాను. మొత్తానికి 200 రూపాయలలో ఉప్పల్ వెళ్ళి, వచ్చాను. డబ్బులకోసం కాదు. ఎప్పుడైనా బయటి ప్రపంచం ఎంత మారిపోయిందో చూడాలంటే బస్సు కూడా ఒక సాధనమే. చక్కగా అన్నీ కనిపిస్తాయి. కానీ అస్తమానం ఆ టైం పెట్టలేం.

11, జులై 2023, మంగళవారం

మరో ప్రముఖ వ్యక్తి, పుస్తకాల ప్రియులు నర్రా కోటయ్యగారు - 93

 మరో ప్రముఖ వ్యక్తి, పుస్తకాల ప్రియులు నర్రా కోటయ్యగారు - 93


ఇన్నయ్యగారికి, వెనిగళ్ళ వెంకటరత్నం గారికి చిరకాల మిత్రులు కోటయ్యగారు. వీరందరూ ఎన్నో కార్యక్రమాలలో కలిసి పనిచేశారు.

ఆయన ఏవో కొన్ని చిన్న చిన్న పేపర్లు చేయించుకోవడానికి మా ఇంటికి వచ్చేవారు. చిన్న చిన్న పుస్తకాలు కూడా చేశాం. మాట మాత్రం చాలా నెమ్మదిగా, సున్నితంగా మాట్లాడతారు. ఇన్నయ్యగారు చాలాసార్లు కోటయ్యగారికి చాలా గొప్ప గత చరిత్ర వుంది.

వారి ఇంటికి వెళ్ళి ఆయన చెప్తుంటే టైప్ చేసి పెట్టండి. పుస్తకంగా తీసుకురావచ్చు అన్నారు. కానీ కోటయ్యగారు ఎందుకో మరి ఆ విషయంలో అంత శ్రద్ధ చూపించలేదు. తర్వాత ఆయన తను ముద్రించిన పుస్తకాల గురించి ఒక చిన్న పుస్తకాన్ని తీసుకువచ్చారు.

***
***
ఈనెల 16వ తేదీన వెనిగళ్ళ వెంకటరత్నం గారు నాకు ఫోన్ చేసి “నర్రా కోటయ్యగారిని చూసి చాలా రోజులైంది. ఆయనకిప్పుడు 88 సంవత్సరాలు. ఈమధ్య కొంచెం ఒంట్లో బావుండలేదని విన్నాను. ఆదివారం సాయంత్రం వస్తాను. చూసివద్దాం మీకు తెలుసు కదా...!” అన్నారు. నేనూ “సరే” అన్నాను. నేను, మా వారు కలిసి వెంకటరత్నంగారి కారులో కోటయ్యగారింటికి వెళ్ళాం.

పద్మావతీ ప్యాలెస్ పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలో వుంది. కొంచెం వెతుక్కుంటూ వెళ్ళాం. పక్కరోడ్డులోనే వున్న అడ్రస్ కూడా ఎవరూ చెప్పలేకపోయారు. మొత్తానికి ఇంట్లోకి వెళ్ళాం. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. (నారాయణగూడాలో ఒకప్పుడు బాగా పేరున్న జయనర్సింగ్ హోమ్ స్వంతదారిణి డా. జయప్రదగారిని ఇష్టపడి, ఆదర్శవివాహం చేసుకున్నారు.) శ్రీమతి జయప్రద గారు కాలం చేసి 5 సంవత్సరాలు అవుతోంది. కోటయ్యగారికి ఒక సహాయకురాలిని పెట్టారు. ఇద్దరు మగ పిల్లలూ కుటుంబాలతో అమెరికాలో వుంటారు.

ఆయనకి 88 సంవత్సరాలయినా మేము భయపడినంత లేవలేని స్థితిలో లేరు. చక్కగా నడుచుకుంటూ హాలులోకి వచ్చి కూచుని, పనమ్మాయిచేత మంచి కాఫీ కలిపించి ఇచ్చి చాలాసేపు కబుర్లు చెప్పారు.

చక్కటి చిత్రాలతో ఇంపుగా తీర్చిదిద్దిన ఇల్లు. పుస్తకాలంటే చాలా ప్రాణం. కొంతమంది పుస్తకాలు ముద్రించుకోవడానికి ఆర్థిక సాయం కూడా చేశారు. ఇల్లంతా పుస్తకాలు తీర్చి దిద్ది అల్మారాల నిండా వున్నాయి. వాటిని చూస్తే ఆవి సేకరించడానికి ఆయన పడిన కష్టం, వాటిమీద ఆయనకి ఉన్న ప్రేమ తెలుస్తోంది.

గోపీచంద్ గారి రచనలన్నీ 10 భాగాలుగా ముద్రించి అన్నీ ఒక చోట వుండే ఏర్పాటు చేశారు. వీరి దగ్గర ప్రముఖ రచయితల పుస్తకాలతో సహా ఎన్నో విలువైన పుస్తకాలు వున్నాయి. ఇంక నిఘంటువులయితే చెప్పనక్కరలేదు. అన్ని రకాల నిఘంటువులు నేను చూడలేదు – బ్రౌణ్య తెలుగు ఇంగ్లీషు నిఘంటువు, సూర్యాంధ్రరాయా నిఘంటువు, పదబంధ పారిజాతము ఇలా ఇంకా ఎన్నో... కొంతమంది ఈ లైబ్రరీని వీరి అనుమతితో విషయసేకరణకోసం ఉపయోగించుకుంటారని చెప్పారు.

నేను పుస్తకాల గురించి అడిగితే ఒకో రూంలోకి తీసుకెళ్ళి నాకు అన్ని పుస్తకాల గురించి ఎప్పుడు ప్రింట్ చేశారో. ఎక్కడ నుంచి తెచ్చారో ఆ వివరాలన్నీ చెప్పారు. అప్పుడు ఆయనలో కొత్త ఉత్సాహం కనిపించింది. ఆయన ఇంట్లో మామూలుగా నడవగలిగిన స్థితిలో వున్నా... అప్పుడప్పుడు తల తిరగడం వల్ల పొరపాటున కింద పడకుండా... సపోర్ట్ తోనే నడుస్తున్నారు. మొహంలో చాలా ఉత్సాహం ఉంది. 88 సంవత్సరాల వార్థక్యం ఏమాత్రం కనిపించలేదు. ఇంట్లోనే వాకింగ్ చేస్తానని చెప్పారు. టివిలో న్యూస్ చూడడం, అమెరికాలో ఉన్న పిల్లలు, మనవలతో కబుర్లు చెబుతూ కాలక్షేపం చెయ్యడం వీరి దినచర్య. పుస్తకం పట్టుకుని చదివే ఓపిక లేదు.

***
***

కోటయ్యగారు హేతువాది. అటు రాజకీయ వాదులకు ఇటు, కళా ప్రియులకు, రచయితలకు దగ్గరగా వుండేవారు. ఆయనకు సన్నిహితంగా తెలిసిన వారిలో తాతాజీ (తాపీ ధర్మారావు), త్రిపురనేని గోపీచంద్, రామినేని భరద్వాజ, రాజకీయ వాదులలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, స్పీకర్ దివి కొండయ్య మొదలు, చెంచురామానాయుడు వరకు తెలియని వారు లేరు. కొందరు జడ్జీలు ఆయనతో సన్నిహితంగా వుండేవారు. అందులో ఆవుల సాంబశివరావు, చల్లా కొండయ్య గారు మొదలగువారున్నారు.

సెక్రటేరియట్ లో కళాకారుల సంఘం ఏర్పరచి చురుకుగా అనేక కార్యక్రమాలు జరిపించారు. సి.ధర్మారావు మొదలు అనేకమందితో ఈ రంగంలో పనిచేశారు.

హేతువాద ఉద్యమంలో ఎన్.కె. ఆచార్య, రావిపూడి వెంకటాద్రి ఆయనకు అతిసన్నిహితులుగా పేర్కొనదగినవారు కోటపాటి మురహరిరావు, చంద్రలత ఉన్నారు. రాష్ట్రంలో హేతువాద, మానవవాద కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూత నిచ్చారు. ప్రచురణ రంగంలో యథాశక్తి తోడ్పడ్డారు. రచయితలు తమ రచనలు తెలుగులోకి తీసుకురావడానికి ఆయన చేసిన సహాయాన్ని మరచిపోకుండా చాలామంది ఆయనకు తమ రచనలను కృతజ్ఞతాపూర్వకంగా అంకితం చేశారు.

ఆలిండియా రేడియోనుండి ప్రసంగాలు చేసి శ్రోతలను ఆకట్టుకున్నారు.

నర్రా కోటయ్య సినిమా రంగం లో ప్రయోగాలు చేసి దేవాలయం, అరుణ కిరణం ,వందేమాతరం అనే మూడు ప్రొడ్యూస్ చేసి, 100 రోజులు ఆడిన తరువాత ఆ రంగం నుండి విరమించుకోవడం విశేషమే. సినీ హీరో రాజశేఖరును రంగ ప్రవేశం చేసినది కూడా కోటయ్య గారే..

వీరు సేకరించిన పుస్తకాలు ఇంకా ఎంతోమందికి ఉపయోగపడాల్సిన అవసరం ఉంది.

All reactions:
Nalini Erra, Bhandaru Srinivas Rao and 64 others

4, జులై 2023, మంగళవారం

***ప్రతిష్ఠాత్మకమైన పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ వర్క్*** - 92

 ***ప్రతిష్ఠాత్మకమైన పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ వర్క్*** - 92

2015లో ప్రగతి ప్రింటర్స్ వాళ్ళు చెప్పారని మాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చారు జలదంకి సుధాకర్ గారు. ఆయన గురించి వినడమే కానీ చూడలేదు. ఆయన మాకు చెప్పిన విషయం –

“అతి చిన్నవయసులో ప్రపంచానికి దూరమయిన పరుచూరి రఘుబాబు స్మారకంగా పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ 1991 లో స్థాపించారు. 24 సంవత్సరాలుగా అఖిలభారత నాటకపోటీలు నిర్వహిస్తూ వచ్చాం. 25 సంవత్సరాలయిన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పరుచూరి రఘుబాబు స్మారక నాటక రజతోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా తెలుగు నాటక రచయితల ప్రత్యేక సంచిక ***దృష్టి*** పేరుతో వేస్తున్నాం” అని రోజుకి కొంత కొంత దానికి సంబంధించిన మేటర్ ఇచ్చి డిటిపి చెయ్యాలని వెళ్ళారు.

దానికి సంపాదకులు పరుచూరి గోపాలకృష్ణ గారు, సహ సంపాదకులు జలదంకి సుధాకర్ గారు, మేము పుస్తకాన్ని అలంకరిస్తే, రమణజీవిగారు కవర్ డిజైన్ చేసి పుస్తకాన్ని అందాన్నిచ్చారు.

"నాటక రచయితలు వారి రచనలను సాహితీ విమర్శకులు విశ్లేషించడం కాకుండా వారే విశ్లేషించి వివరించే కొత్త ప్రయోగానికీ, సాంప్రదాయానికీ శ్రీకారం చుట్టి నాటక రచయితల పక్షాన తెలుగు నాటక రంగానికి మేము అందిస్తున్న చిరుకానుక ‘దృష్టి’ " - పరుచూరి గోపాలకృష్ణగారు

గొల్లపూడి మారుతీరావుగారు మొదలుకొని మొత్తం 50 మంది నాటక రచయితల అనుభవాలతో కూడిన వ్యాసాలు వున్నాయి. ఏప్రిల్ 2015లో ఈ పుస్తకం ముద్రించి, ఆవిష్కరించారు. ఎంత మంది నాటక రచయితలున్నారో..... నాటకం ఎంత గొప్పదో అని చాలా ఆశ్చర్యంవేసింది. ఒక నాటకం వెయ్యాలంటే అందులో ఉన్న కష్టనష్టాలు, అనుభూతులు అర్థమయ్యాయి. సుధాకర్ గారి ద్వారా చాలా గొప్ప పుస్తకం చేసి కొత్త విషయాలు తెలుసుకున్నాం అనిపించింది.

ఆ తర్వాత సుధాకర్ గారు ఇంకా ఈ పుస్తకంలో ముద్రణలోకి రాని రచయితల వ్యాసాలతో రెండవ భాగం కూడా ముద్రించాలి అనుకున్నారు కానీ, అది కొన్ని కారణాలవల్ల ముందుకి వెళ్ళలేదు. కానీ ఆయన మాతో ఫోన్ లో టచ్ లోనే వున్నారు. ఎప్పుడైనా... ఆయనకి సంబంధించిన చిన్న చిన్న కవితలు చేసిపెడుతుంటాను.

***
***

***మరిచిపోలేని విలువైన సంఘటన***
మా అబ్బాయి ఎంగేజ్ మెంట్ జూబిలీ హిల్స్ ఫిల్మ్ నగర్ క్లబ్ లో జరిగింది. దానికి ఎప్పుడూ బిజీగా వుండే సుధాకర్ గారు- పాత్రికేయ సంఘ అధ్యక్షులు, ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ ఇండియన్ కమిటీలో సభ్యులు భగీరథ గారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. భగీరథగారు హాలు విషయంలో చాలా సహకరించారు. భగీరథగారు మాకు ఇన్నయ్యగారి ద్వారా పరిచయం అయ్యారు. అప్పుడప్పుడు ఇన్నయ్యగారి వ్యాసాల గురించి చర్చిస్తూ వుంటారు.


మరోసారి మా పిల్లలు మాకు చెప్పకుండా చేసిన ఫంక్షన్ లో మేము ఊహించని విధంగా నాకు తెలిసిన వాళ్ళందరినీ ఆహ్వానించిన సందర్భంలో –

*** ప్రముఖ సినీ గేయ, కథా రచయిత సుధాకర్ గారు మా దంపతుల మీద చక్కని కవిత రాసి తీసుకు వచ్చి, అక్కడ చదివారు. ఇది జీవితంలో మేము మరిచిపోలేని సంఘటన. అంత గొప్ప వ్యక్తి అయిన సుధాకర్ గారు రాసిన కవితకి మేము చాలా ఆనందించాం. మా జీవితంలో మాకు ఇది చాలా గొప్పగానే అనిపిస్తోంది. ***



తర్వాత కరోనా విజృంభించడంతో ఆయన దగ్గర నుంచి ఆ పేపర్ మేము తీసుకోలేకపోయాం. కనీసం మా అబ్బాయి దగ్గరున్న వీడియో నుంచి దాన్ని తీసుకుందామంటే అది ఎందుకో మొరాయిస్తోంది. అందుకని ఆయన రాసిన విలువైన, మాకు అపురూపమైన కవితని ప్రస్తుతం మీకు అందించలేకపోతున్నాను. ఎప్పుడో ఒకప్పుడు మీ ముందుంచుతాను.