31, అక్టోబర్ 2022, సోమవారం

మధ్యలో గుర్తుకు వచ్చిన ఒక చిన్న పిట్టకథలాంటిది - 56

 మధ్యలో గుర్తుకు వచ్చిన ఒక చిన్న పిట్టకథలాంటిది - 56

*** పాల ప్యాకెట్ ప్రహసనం ***

*** అందరికీ తెలిసిన విషయాలే కానీ, మాకు పాలు పోసే కృష్ణ కోటీశ్వరుడు అయ్యాడుగా మరి. ***

పాల ప్యాకెట్ కి నెలకి ఒకసారి డబ్బులు ఇచ్చే పద్ధతి వుండేది. ఆ వేసే వాడు గుమ్మం వరకూ వచ్చి ఇవ్వకుండా ఒకోసారి తలుపుకొట్టకుండా దూరం నుంచి విసిరేవాడో ఏమో... తలుపు తెరిచేసరికి గుమ్మం ముందంతా పాల వరద. ఖాళీ అయిన ఆ ప్యాకెట్ ప్రశాంతంగా నిద్రపోతోంది. మర్నాడు అడిగితే – “నేను మంచిగనే వేసా... పిల్లి కొరికిందేమో” అనేవాడు. రోజూ పిలిచి ఇస్తున్నాడు కదాని బయట కవరు తగిలించలేదు.

పిల్లి కొరుకుతుందని తెలిసీ కనీసం తలుపు కూడా కొట్టకుండా చేసిన పని అది. మళ్ళీ వాళ్ళమ్మ దగ్గిరకి వెళ్ళి ఇంకో ప్యాకెట్ తెచ్చుకోవాల్సి వచ్చేది. ఈ గొడవంతా ఎవరు పడతారు. అప్పుడే కొత్తగా మాకు దగ్గరలో ఉన్న పార్కు దగ్గర మదర్ డెయిరీ వాళ్ళ మిల్క్ బూత్ పెట్టారని విన్నాం. అదీ చూద్దాం అని కొన్నాళ్ళు ప్యాకెట్ పాలు మానిపించేసి, పొద్దున్నే అక్కడికి వెడితే లీటరు పాలకి టోకెన్ ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. కోయిన్ వెయ్యగానే అక్కడో బాటిల్ కానీ, గిన్నె కానీ పెడితే వచ్చే పాలు చూస్తే పిల్లలకి వింతగా అనిపించి అవే తీసుకుందాం అనేవారు.

కానీ ఎన్ని పనులు చేసుకుంటాం. పొద్దున్నే ఇంటి బయటికి రావాలంటే కష్టం. అదీ మానిపించేసి మణికొండ (12 కిలోమీటర్లు దూరం) నుంచి కృష్ణ అనే అతను స్కూటర్ మీద తెచ్చి పోస్తున్నాడంటే అతన్ని పెట్టుకున్నాం. పాలు బాగానే పోసేవాడు. కానీ ఒక్కోసారి పాలు పసరు వాసన వేసేవి. వికారం వచ్చేది. ఏంటీ ఇలా వున్నాయని మర్నాడు అడిగితే బర్రె ఏవో ఆకులు తింది అందుకని అలా వున్నాయి అన్నాడు. మొత్తానికి సరిగ్గా పొయ్యకపోతే మానెయ్యి అంటే తర్వాత బాగానే తెచ్చేవాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవరకూ అతను మానలేదు.

ఒక రోజు కృష్ణ “అమ్మా... మణికొండ దగ్గిర ఎకరం 40 వేలు అమ్ముతున్నారు. ఒక ఎకరం తీసుకోండి. ముందు ముందు చాలా బావుంటుంది” అని చెప్పాడు. అతను చెప్పినప్పుడు మణికొండ నిర్మానుష్య ప్రాంతం, అక్కడక్కడ పొలాలు, కొండలు గుట్టలు తప్ప ఏమీలేవు. అప్పుడు చేతిలో డబ్బులు కూడా వున్నాయి. ఏమోలే ఎందుకు మనకి తెలియని చోట అనుకుని అప్పటికే తెలిసిన వాళ్ళ ద్వారా కొన్న రెండు స్థలాలు ఉన్నాయి కదా అనుకున్నాం.

కొన్ని రోజులకి పాలుపోసే కృష్ణ రావడం మానేశాడు. మా దగ్గిర డబ్బులు కూడా తీసుకోలేదు. ఫోన్ చేస్తే బయటికి వెళ్ళాడని చెప్పారు. తర్వాత తర్వాత అసలు ఫోను రింగయినా తియ్యట్లేదు. ఒకరోజు ఎక్కడికో వెళ్ళి వస్తుంటే... పక్కన కారు ఆగింది. పట్టించుకోకుండా వచ్చేస్తుంటే “అమ్మా ఎక్కడికి వెడుతున్నారు. నేను కృష్ణ” అన్నాడు. చక్కగా నీట్ గా తయారయిన ఆ వ్యక్తిని చూస్తే పాలుపోసిన కృష్ణ అని ఎవరూ అనుకోరు. ఇంతకీ ఏంటంటే మణికొండలో ఉన్న వాళ్ళ పొలాలన్నీ మంచి రేటుకి అమ్ముడయ్యి కృష్ణ కోటీశ్వరుడు అయిపోయాడు.

స్థలం కొంటే ఎలా వుండేదో.... ఎవర్ని నమ్మాలో తెలియదు. ఎంతోమంది నష్టపోయిన వాళ్ళూ వున్నారు. మొత్తానికి కొనలేదు. దురదృష్టం అదృష్టం – కర్మ అనేవాటి గురించిన ఆలోచనలకి దూరం కాబట్టి మేమేం బాధపడలేదు. ప్రయత్నం లేందే ఏదీ అవదనే జీవిత సత్యం ఉంది కదా...

పాల సంగతి మళ్ళీ మొదటికి వచ్చింది. కానీ క్రమం క్రమంగా ప్రతి షాపులోనూ పాలప్యాకెట్ లు అమ్ముతున్నారు. కృష్ణ తెచ్చిన పాలకి అలవాటు పడిన పిల్లలు ప్యాకెట్ పాలు ఇష్టపడలేదు. మళ్ళీ గేదెపాలు పోసేవాళ్ళని చూడాల్సి వచ్చింది.


కొన్ని చోట్ల ప్యాకెట్ మీద ఏదో కొత్త పేరు వుంటుంది. తీసుకుంటే ఇంతే సంగతులు. కెమికల్ తో తయారు చేసే ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారు. ఒకసారి ఎవరో ఒక గుడికి వెళ్లి పంచామృతం తీసుకుని వచ్చాక గొంతు నొప్పి లాంటి రకరకాల అనారోగ్యాలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. ఏదైనా పాల విషయంలో ఈ రోజుల్లో జాగ్రత్త పడాల్సిందే.

21, అక్టోబర్ 2022, శుక్రవారం

ప్రముఖులతో, ప్రముఖ సంస్థల పనులతో బిజీ బిజీ - 55

 ప్రముఖులతో, ప్రముఖ  సంస్థల పనులతో బిజీ బిజీ - 55


*** ఈశాఫౌండేషన్ ***



ఈ హడావుడిలో మా ఫ్రెండ్ నృత్యకళాకారిణి సరళ గారు వచ్చి, "నాగలక్ష్మిగారూ నేను ఈశాఫౌండేషన్" కి వెళ్ళాను. వాళ్ళు నాకు బాగా పరిచయం వాళ్ళ 'ఈశా రుచులు' పుస్తకం నాకు బాగా నచ్చింది తమిళ్ లో వుంది. మీ వారికి తమిళ్ వచ్చు కదా...! తెలుగులో చేస్తారా...?" అని అడిగారు.

ఆయనకి తమిళ్ బాగా వచ్చినా ఆఫీసు వర్కుతో అసలు టైము వుండదు. పైగా ఇంతకుముందు పడడం వల్ల కొంచెం వీక్ గా వున్నారు. అక్కావాళ్ళింటి పక్కన ఒక తమిళ్ ఆవిడ, తెలుగు ఆవిడ వున్నారు. "పనేదన్నా వుంటే చెప్పండి బోరు కొడుతోంది" అని ఒకసారి అన్నారు.

    పుస్తకం అర్జంటు కాదుకాబట్టి ... సరే అని అవన్నీ ఇద్దరినీ కలిసి తెలుగులో చెయ్యమని ఇచ్చాను. తమిళ్ ఆవిడకి తెలుగు మాట్లాడడం వచ్చు. తెలుగు ఆవిడ ఆవిడ చెప్పేది రాసుకుని మొత్తానికి పూర్తి చేశారు.

పనయ్యాక ఇద్దరికీ కలిపి ఒక 7 వేలు ఇచ్చాను. ఎంత సంతోషించారో. ఇంట్లో వుండి సంపాదించుకున్నామని ఆనందపడ్డారు. ఇంకేమైనా చెప్పండి చేస్తాం అన్నారు. అప్పుడప్పుడూ కొన్ని కంపేర్ చేసి పెట్టమని ఇచ్చేదాన్ని. ఎంతోమంది ఏ పని దొరుకుతుందా అని చూసేవాళ్ళూ వున్నారని అర్థం అయ్యింది.

నేను పుస్తకం అంతా రెడీ చేసి సరళగారికి ఇచ్చాక దాన్ని ఈశా వాళ్ళు ఎమెస్కో వాళ్ళకి ప్రింట్ కి ఇచ్చినట్లు తెలిసింది.

తర్వాత ఈశా నుంచి వ్యాసాలు వాళ్ళు ఇ-మెయిల్ లో పంపిస్తుంటే చేసి పంపించేదాన్ని. రమ్మని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పటి వరకూ అస్సలు కుదరలేదు.


నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచీ కంప్యూటరే లోకంగా ఉంటూంటే... సాయంత్రం అయ్యిందంటే మా పక్కన పోర్షన్ల వాళ్ళందరూ... అక్కడున్న అరుగు మీద చేరి, కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఒక్కసారి నేను వాళ్ళలో లేనందుకు మనసులో మధనపడ్డాను.

కానీ మరొక్కసారి ఆలోచిస్తే... వాళ్ళు నన్ను రావద్దని అనలేదు, నవ్వద్దనీ అనలేదు. నేనంటే వాళ్ళందరికీ చాలా ప్రేమ. నా మాటకి ఎప్పుడూ విలువిస్తారు. నేనెప్పుడు ఖాళీగా దొరుకుతానా అని చూస్తుంటారు. అయినా వాళ్ళపని వేరు, నా పని వేరు కదా అనుకుంటూ పొద్దున్న చెయ్యాల్సిన పని హడావుడిలో పడ్డాను. జీవితం చిన్నది కాబట్టి ఎక్కడికక్కడ ఆనందంగా వుండడం నేర్చుకున్నాను.
గుడిపూడి శ్రీహరిగారు


ఇంతలో మా ఇంటికి దగ్గరలోనే వున్న ప్రముఖ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరిగారు వచ్చి, “ఏమ్మా ఏంచేస్తున్నావ్? వాకింగ్ వెడుతూ ఇటు వచ్చాను. నాకు వర్కు చేసిపెట్టావు కదా.... డబ్బులిద్దామనీ - నా పేరు మీద, మీ ఆంటీ (హోమియో డాక్టర్) పేరు మీదా కొన్ని విజిటింగ్ కార్డులు కావాలి మేటర్ ఇద్దామనీ వచ్చాను. యూసఫ్ గూడాలో సత్యవాణి గారు ఉంటారు. నీకు ఆవిడ ఫోన్ నెంబర్ ఇస్తాను వెళ్ళి కలు. నీ గురించి చెప్పాను” అని వెళ్ళిపోయారు.

*** పలుకు తేనెలతల్లి సత్యవాణి గారు అంటారు ***



గుడిపూడి శ్రీహరి గారు ఇచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి టైం తీసుకుని సత్యవాణిగారింటికి వెళ్ళాను. ఇంటి ముందు రంగు రంగుల గులాబీలతో ఇల్లు చక్కగా వుంది. లోపలికి వెడుతుండగానే ఆవిడే ఎదురు వచ్చారు. ఎర్రటి అంచున్న ముదురు ఆకుపచ్చ చీరలో చక్కటి అందమైన, నిండైన విగ్రహం. మొహంలో ఒకలాంటి వర్చస్సు. చక్కటి నవ్వు. ఆవిడని చూస్తుంటే అలాగే చూస్తూన్న నన్నుచూసి – “నీ పేరు నాగలక్ష్మి కదమ్మా శ్రీహరి గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. రామ్మా... కూచో” అని ఆదరపూర్వకమైన మాటలతో పిలిచారు.

*** పుల్లారెడ్డి స్వీట్స్ కూడా మా కంప్యూటర్ ని వదలలేదు ***




***జీవితంలో మొదటిసారి సన్మానం***

సత్యవాణిగారు “నాగలక్ష్మీ... పుల్లారెడ్డి స్వీట్స్ సంస్థాపకులు (1948 కర్నూలు) పుల్లారెడ్డిగారు, ఒక పుస్తకం వేస్తున్నారు. దాన్ని నువ్వు డిటిపి చేసి ప్రింట్ కి రెడీ చెయ్యాలి” అని దానికి సంబంధించిన పేపర్లు కొన్ని నా చేతులో పెట్టారు. ఆ పుస్తకాన్ని అనుకున్న టైం పూర్తి చేశాను. ప్రింట్ కూడా అయిపోయింది. ఆదివారం సాయంత్రం సనత్ నగర్ లో శంకర్ యాదవ్ గారు స్థాపించిన హిందూ పబ్లిక్ స్కూల్ పక్కనే, ఆయన కట్టించిన దేవాలయాల ఆవరణలో పుస్తకావిష్కరణ జరిగింది.

ఆ పుస్తకావిష్కరణ సభలో నన్ను స్టేజి మీదకి పిలిచి నాకు పుల్లారెడ్డిగారిచేత శాలువా కప్పించి, నాకు స్వీట్ ప్యాకెట్, పుస్తకం, ఒక మెమెంటో ఇప్పించారు. ఎన్నో పుస్తకాలు చేసినా... స్వయంకృషితో పైకొచ్చిన గొప్ప వ్యక్తి చేతుల మీదుగా నాకు మొదటిసారి సన్మానం జరిగింది. సన్మానాల గురించి ఏమీ తెలియనిదాన్ని కాబట్టి సంతోషంగానే అనిపించింది. ఒక నిమిషం ఆయనకి నమస్కారాలు, కృతజ్ఞతలు చెప్పి స్టేజి మీద నుంచి కిందకి వచ్చాను.

*****

*** ***నాంపల్లిలో ఉన్న పుల్లారెడ్డి నేతి మిఠాయిలు అంటే అందరికీ చాలా ఇష్టం. హైదరాబాదు ఎవరైనా వస్తున్నారంటే ముందు పుల్లారెడ్డి స్వీట్స్ కొనుక్కున్న తర్వాతే వేరే ఏమన్నా కొనుక్కునేవారు. అప్పటి వరకూ నేతితో చేసిన స్వీట్స్ ఎక్కడా దొరికేవి కాదు. నాంపల్లి కూడా అంత రద్దీగా వుండేది కాదు కాబట్టి స్వీట్ షాపుని తేలికగా గుర్తుపట్టగలిగేవాళ్ళం. ఇంకెక్కడా బ్రాంచిలే వుండేవి కాదు. ఎంతో అపురూపంగా తినేవాళ్ళం. మా బాబాయి కొడుకు మెహదీపట్నంలో మా దగ్గిరకి వచ్చినప్పుడు ఆ షాపు నుంచి జీడిపప్పు పాకం తెచ్చేవాడు. బలే రుచిగా వుండేది. దసరా వచ్చినా, న్యూ ఇయిర్ వచ్చినా షాపు దగ్గిర ఎప్పుడూ రద్దీయే. ఇప్పుడు చాలా చోట్ల పెట్టారు. కానీ ఆ రుచే వేరు అనిపిస్తుంది. *** ***

*****

ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత సత్యవాణిగారు మళ్ళీ పిలిపించి మాది ***సత్యపథం మాసపత్రిక*** ఉంది. నేను ఎలా చెయ్యాలో చెప్తాను. నువ్వు చేసిపెట్టాలి అన్నారు. మియాపూర్ దగ్గిర దీప్తి శ్రీనగర్ లో ఉన్న ధర్మపురి క్షేత్రానికి సంబంధించిన పత్రిక అది. మొదట్లో ఆవిడ రాసిచ్చేవారు కానీ, రాను రాను నువ్వే ఏవి పెడితే బావుంటుందో చూసి మాగజైన్ తయారు చెయ్యమన్నారు. 16 పేజీల పుస్తకం కాబట్టి నేను ఆవిడకి నచ్చినట్టుగా చేసి ఇస్తున్నాను.

ఈ ధర్మపురి క్షేత్రంలో మొదట అమ్మవారి గుడి ఒక్కటే వుండేది. క్రమక్రమంగా అక్కడ రకరకాల దేవాలయాలు వచ్చేసి, రకరకాల కార్యక్రమాలతో సందడిని సంతరించుకుంది. వెళ్ళే దారంతా నిర్మానుష్యంగా వుండేది. అక్కడో ఇల్లు, అక్కడో ఇల్లు బిక్కు బిక్కుమంటూ వుండేవి. ఇప్పుడదంతా ఒక ఊరులాగా అయిపోయింది.

ఇవన్నీ అటుంచి ఆవిడ ఆధ్యాత్మికత గురించి కానీ, సమాజ సేవని గురించి కానీ, సామాజిక స్పృహ గురించి కానీ మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క పేపరు చూడకుండా లోపల రికార్డయిన చిప్స్ పెట్టుకున్నట్లు అనర్గళంగా మాట్లాడతారు. స్కూళ్ళకి వెళ్ళి స్టూడెంట్స్ జీవితాన్ని గురించి చెప్తారు. ఆవిడ గురించి తెలియని వాళ్ళండరు. పరిచయం అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకుండా వాళ్ళలో గొప్పతనాన్ని చూసినప్పుడు మనం నేర్చుకోవలసినవి చాలా కనిపిస్తాయనిపిస్తుంది నాకు.
సత్యవాణిగారు వాళ్ళ ఇంటి ఆడబడుచులాగా నాకు ఆరునెలలకి ఒక చీర ఇస్తుంటారు. నేను ఇప్పటి వరకూ ఆవిడ చేతుల మీదుగా 30 చీరలు అందుకున్నానేమో... ఇవన్నీ జీవితంలో ముఖ్యం కాకపోయినా. ఎప్పటికీ నన్ను వాళ్ళింటి మనిషిలా చూడ్డం చాలా సంతోషం కలిగించే విషయం. మా పిల్లల పెరుగుదలని, అంచెలు అంచెలుగా పెళ్ళిళ్ళు అయేవరకూ చూసిన వాళ్ళలో ఆవిడ ఒకరు. ఆ అనుబంధం ఇప్పటి వరకూ కొనసాగుతూనే వుంది.

ఆవిడ పరిచయంతో ఎంతోమంది ప్రముఖులు పరిచయం అయ్యారు. నేను కొన్నిసార్లు ఆవిడ వర్కు గురించిన వివరాలకోసం మియాపూర్ వెడితే సత్యవాణిగారి మనిషిగా నన్ను ధర్మపురి క్షేత్రంలో వాళ్ళు కూడా అభిమానంగా అదరిస్తారు. నాకు ఫోన్ లో ఏదో ఒకటి డిక్టేట్ చేస్తూ వుంటారు. వాళ్ళ గుడిలో జరిగే ప్రతి కార్యక్రమానికి కావలసిన ఆహ్వాన పత్రికలు, రకరకాల లెటర్లు నేనే చేసి ఇస్తుంటాను. వాళ్ళ అల్లుడికి, అమ్మాయికి మా అబ్బాయి వెబ్ సైట్స్ చేసి ఇచ్చాడు.

నాకు ఎవరితో పరిచయం అయిన ఎవరైనా సరే వృత్తి ధర్మం నెరవేర్చడమే నాధ్యేయం అనుకునేదాన్ని.
***

*** ఋషిముఖ్ – ఆర్ట్ ఆఫ్ లివింగ్ (శ్రీ శ్రీ రవిశంకర్) మాసపత్రిక తెలుగులో ***


అప్పటి వరకూ ఇంగ్లీష్ లో ఉన్న ఋషిముఖ్ ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు తెలుగువారికోసం తెలుగులో చెయ్యాలనుకున్నారు. రవిశంకర్ గారి శిష్యులైన ముఖ్య శిష్యులైన సంధ్య గారు, మూర్తి గారు మా అడ్రస్ తీసుకుని మా ఇంటికి వచ్చారు. కలర్ వర్క్ చెయ్యడం అప్పటికి నాకు ఇంకా అలవాటు అవలేదు. బెంగుళూరు నుంచి ఇంగ్లీషులో చేసిన వాళ్ళ నుంచి నాకు ఫోనులో కొరెల్డ్రా సాఫ్ట్ వేర్ లో ఎలా చెయ్యాలో చెప్పించారు. వాళ్ళు పంపిన ఇంగ్లీషు పత్రిక నమూనా చూసి తెలుగు మేగజైన్ ని సెట్ చేసేదాన్ని.

సంధ్యగారు, మూర్తిగారు చాలా మంచి వ్యక్తులు. వాళ్ళు ఓపికగా కూచుని ప్రతి చిన్నదీ జాగ్రత్తగా చేయించుకునేవారు. సంధ్య గారు చక్కటి గొంతుతో పాటలు బాగా పాడతారు. మొత్తానికి వాళ్ళ వలన కొత్త విషయాలు చాలా నేర్చుకున్నాను. ఇంచుమించు చాలా నెలలే ఆ మాగజైన్ తెలుగులో నేను చేశాను. తర్వాత వాళ్లు బెంగుళూరులో ఉన్న వాళ్ళ ఆఫీసులో అన్ని భాషలకి సంబంధించిన ఆపరేటర్లని వేసుకుని వాళ్ళు చేసుకోవడం మొదలు పెట్టారు.

12, అక్టోబర్ 2022, బుధవారం

సంసారంలో సరిగమల్లా నా కంప్యూటర్ పనిలో కూడా రకరకాలు - 54

 సంసారంలో సరిగమల్లా నా కంప్యూటర్ పనిలో కూడా రకరకాలు - 54


నేను చేస్తున్న ఈ పెద్ద పెద్ద సంస్థల వర్కులు కాకుండా చుట్టుపక్కల ఉన్న స్క్రీన్ ప్రింటర్స్, చిన్న చిన్న ప్రెస్ ల వాళ్ళూ రెగ్యులర్ గా వస్తూ వుండేవారు. వాళ్ళలో వాళ్ళే నీ తర్వాత నేను, నా తర్వాత నువ్వు అని చెప్పేసుకునేవారు.


ఒక విజిటింగ్ కార్డ్ చెయ్యాలంటే కొంతమంది ఇలా కావాలి అని చెప్పి వెంటనే చేయించుకుని వెళ్ళిపోయేవారు. కొంతమంది ఐదు నిమిషాల పనికి ఈ పేరు ఇక్కడ, కంపెనీ పేరు అక్కడ అంటూ చాలాసేపు చేసేవారు. వాళ్ళని చూస్తే విచిత్రంగా వుండేది. కానీ వాళ్ళు ఒక కంపెనీ విజిటింగ్ కార్డులు ఆర్డర్ తీసుకుంటే వాళ్ళకి ఎప్పటికీ పని వుండేది. కానీ ఆ రంగుల వాసనలు భరించడం కష్టం. కానీ డబ్బులు బాగానే సంపాదించుకునేవారు. ఎవరి ఆర్డర్ ఎవరికి వెళ్ళిపోతుందోననే భయం.

నేనేమీ విసుక్కోకపోయినా... మేడమ్ ప్లీజ్ ఏమీ అనుకోకండి, పెద్ద కంపెనీ వర్కు అని బతిమాలేవారు. పైగా “ఏంటి మేడమ్ ఏ టైములో వచ్చినా మీ మొహం ఒక్కలాగే వుంటుంది. మీకేంటి మేడమ్?” అని పొగడ్తలొకటి. వాళ్ళ మాటలకి ఓ నవ్వు నవ్వేసి ఊరుకునేదాన్ని.

రెగ్యులర్ గా వర్కు చేయించుకునే శ్రీనివాస్ విజిటింగ్ కార్డు ప్రూఫు తీసుకుని వచ్చి, “మేడమ్ ఇది ఫైనల్ ఇచ్చెయ్యండి. చిన్న మార్పు వుందంతే...” అన్నాడు. నేను దాన్ని చూసి ఆశ్చర్యపోయి, “నేనెప్పుడు చేశాను? నాదగ్గిర చెయ్యలేదు” అన్నాను.

“మీరు చెయ్యలేదు కానీ మీ కంప్యూటర్ లోనే ప్రూఫ్ తీసుకున్నా...?” అన్నాడు.

“ఏంటి శ్రీనివాస్ అసలేం మాట్లాడుతున్నావు?” అంటే – ఓ నవ్వు నవ్వి -

“అంత ఆశ్చర్యం ఎందుకు మేడమ్? నేను అర్జంట్” అని మీ ఇంటికి వచ్చాను. మీరు బయటికి వెళ్ళారుట.

మీ అమ్మాయి “ప్రూఫేకదా అంకుల్ నేను చేసి ఇస్తాను అని, నేను అడిగినట్లు విజిటింగ్ కార్డు ప్రూఫ్ చేసి ఇచ్చింది. మీరు నేర్పారనుకున్నాను” అన్నాడు.

నాకు ఆశ్చర్యమే మరి పిల్లల చదువులు, వాళ్ళ సంగీతం, ఆటలు సంగతి పట్టించుకునేదాన్ని కానీ, ఎప్పుడూ కంప్యూటర్ దగ్గిరికి రానివ్వలేదు.

స్కూలు నించి వచ్చాక వీణాని అడిగితే... “అవును చేసి ఇచ్చాను. నువ్వు వర్కు చేసేటప్పుడు ఒకరోజు వెనకాల నిలబడ్డాను. అప్పుడు ఎలా చేశావో అర్థం అయ్యింది” అంది. అలా నాకు తెలియకుండానే వాళ్ళు నేను చేసేది చూసి కంప్యూటర్ నేర్చుకున్నారు. వర్కు చేసేటప్పుడు అందులో లీనం అయిపోవడం వల్ల కొన్ని విషయాలు తెలిసేవి కావు.

****

రజ్జు, సర్ప భ్రాంతి లా....

మా ఇంటిని ఆనుకునే ఇల్లుగలవాళ్ళ వర్కుషాపు వుండేది. ఎప్పుడూ అక్కడ నుంచీ చప్పుళ్ళు వినిపిస్తుండేవి. కానీ నా పనిలో నేను వుండడం వల్ల అది నాకు పెద్ద ఇబ్బంది వుండేది కాదు. పనివాళ్ళు చాలామంది వుండేవారు.


మా అబ్బాయి శ్రీవత్స పిల్లలతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఓ చెక్కముక్కో, ఇనపముక్కో, కర్రో, చిన్న చిన్న రాళ్ళో తీసుకుని వచ్చి బీరువా వెనక ఉన్న ఒక అలమార్ల పడేసేవాడు. అది వాడి భోషాణం. బీరువా వెనక నుంచి సగం బయటికి కనిపించేది ఆ అలమారు. పిల్లలతో ఆటలు లేనప్పుడు అవన్నీ పరుచుకుని కూచుని చెక్కముక్కలన్నీ కలిపి రోబో బొమ్మని తయారుచేశాడు. అబ్బో బలే చేశాడు అనుకున్నాం. ఏవో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుండేవాడు. (దేన్నయినా క్లిక్ మనిపించే సెల్ ఫోన్లు అప్పట్లో లేకపోవడం విచాకరం).

ఒక రోజు నేను వర్కు చేస్తున్నదాన్ని లోపలికి వెడుతూ ఎందుకో ఆ అలమారు వంక చూస్తే పాము తలలా కనిపించింది. ఒక్కసారి బయటికి పరిగెత్తి “పాము, పాము” అని అరిచాను. మొత్తం పక్కన వర్కుషాపులో ఉన్న వాళ్ళందరూ పరుగు పరుగున కర్రలు తీసుకుని వచ్చి ఎక్కడమ్మా అని అడిగారు.

చూపించాను. నేను ఎలా చూశానో అది కదలకుండా అలాగే వుంది. వాళ్ళు “అసలు పాము ఎక్కడ నుంచి వచ్చింది. వచ్చే అవకాశమే లేదు” అనుకుంటూ కర్రతో దాన్ని బయటికి లాగారు. తీరా చూస్తే అది అచ్చు పాము అని భ్రమింపచేసేట్లున్న కర్రముక్క. వాళ్ళందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు.

తర్వాత మా అమ్మాయి “అలా ఎలా భయపడ్డావమ్మా...! అది కర్ర అని నాకు తెలుసు. ఎందుకంటే వాడికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా -

“నా మంత్రదండంతో శపిస్తాను అని, ***పందరానే, కుతకుత, లమలమ*** అంటాడు. నేనేమో నవ్వేస్తాను. దాన్ని మేము కుక్క కర్ర అని కూడా అంటాము” అని చెప్పి నవ్వడం మొదలు పెట్టింది.

అప్పుడప్పుడు దాన్ని చూసి నవ్వుకోవడానికి ఆ కర్రని ఇంకా అపురూపంగా దాచుకున్నారు. నా వర్కులలో నేను అలిసిపోయినా ... వీళ్ళు చేసే చిలిపి పనులతో మనసు మళ్ళీ శక్తిని పుంజుకునేది.

5, అక్టోబర్ 2022, బుధవారం

*** స్టేట్ హోం నుంచి ICDS ప్రాజెక్ట్ వర్కు *** - 53

 *** స్టేట్ హోం నుంచి ICDS ప్రాజెక్ట్ వర్కు*** - 53


స్టేట్ హోంలో సంధ్యగారి దగ్గర పనిచేసే రఘు- “మేడమ్ మీరు ఇలా లోపలికి స్ట్రెయిట్ గా వెళ్ళండి. మీకు ICDS అని బోర్డు కనిపిస్తుంది. అక్కడ రాజ్యలక్ష్మి మేడమ్ మిమ్మల్ని రమ్మన్నారు” అన్నాడు.

నేను రఘు చెప్పిన చోటికి వెళ్ళాను. ప్రాజెక్ట్ RDO రాజ్యలక్ష్మిగారు “మీకోసమే వెయిటింగ్. మాకు తెలుగు చేసే వాళ్ళు కావాలంటే మీ పేరు చెప్పారు” అని కుర్చీచూపించి - “మాది ఐసిడిఎస్ - ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ వర్క్. ఈ ప్రాజెక్ట్ వర్కులో కొన్ని కాన్ఫిడెన్షియల్ వుంటాయి. చాలా జాగ్రత్తగా చెయ్యాలి. పిల్లలకి సంబంధించినది కాబట్టి, మధ్య మధ్యలో ***యునిసెఫ్*** వాళ్ళ పని కూడా చెయ్యాల్సి వుంటుంది” అన్నారు.

***

*** (ICDS- Integrated Child Development Services – assisted by World Bank ). ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, ప్రపంచబ్యాక్ సహకారంతో భారతదేశంలో చేపట్టిన ఒక ప్రభుత్వ కార్యక్రమం - ఇది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకి, తల్లులకు పోషకాహారం, గర్భిణీ స్త్రీలు, వారి పోషక అభివృద్ధి అవసరాలు ప్రీస్కూల్, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, రోగనిరోధక శక్తికి కావలసిన ఆహారం అందించడం లాంటి సేవలని అందిస్తుంది. - అంగన్ కేంద్రాలు (AWC లు), అంగన్‌వాడీ వర్కర్స్ (AWW లు), అంగన్‌వాడీ హెల్పర్‌లు (AWH లు) కార్యక్రమాలు వీరి పర్యవేక్షణలో వుంటాయి.****
***

వర్కు మొదలయ్యింది. మధ్యమధ్యలో మీటింగ్స్ కి జిరాక్సులు తీయించడం స్పైరల్ బైండింగ్ పనులతో అస్సలు తీరుబడి లేకుండా అయిపోయింది. వాళ్ళ ఆఫీసుకి కూడా రెగ్యులర్ గా వెళ్ళాల్సి వచ్చేది. స్టేట్ హోం మెయిన్ గేటులోంచి లోపలికి ఒక అర కిలోమీటరు నడవాల్సి వచ్చేది. పిల్లలు ఇంట్లో వున్నప్పుడు వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళడం, వాళ్ళు ఆడుకుంటూ వుంటే, నేను పని చూసుకుని రావడం అలవాటయిపోయింది. అయితే -

*** జిరాక్స్, స్పైరల్ బైండింగ్ చేసే షాపు లాల్ బంగ్లా ఎదురుగా *** శ్రియ జిరాక్స్*** - వైట్ పేపర్ ఎ4 సైజుది మంచిది కావాలంటే అక్కడే. క్వాలిటీ జిరాక్స్ కావాలంటే అక్కడ క్యూలో నిలబడాలి. ఎంత డబ్బులు తీసుకున్నా, చాలా మర్యాదగా, ఓపికగా మాట్లాడి పని చేసిపెట్టేవాళ్ళు. ***

*** శ్రియ కాకుండా అమీర్ పేటలో ఈ చివర నుంచి ఆ చివరదాకా వున్న Pancom Business Centre లో ఒకే ఒక్క జిరాక్సు, స్పైరల్ బైండింగ్ షాపు వుంది. ఎస్.ఆర్.నగర్ లో ఒకటి కొత్తగా పెట్టారని విన్నాను. ***

***

*** సంజీవని మాసపత్రిక ***

ఈ మీటింగ్ పనులు కాకుండా - మాతాశిశు సంరక్షణ కోసం *** సంజీవని మాసపత్రిక*** ప్రారంభించారు. స్పెషల్ ఎడిషన్ న్యూస్ పేపరు సైజులో వుండేది. వాళ్ళకి కావలసిన డిజైన్ లో సెట్ చేసి చూపించాను. టైం కలిసి రావాలి కదా... ఎందుకంటే అప్పుడప్పుడప్పుడే టెక్నాలజీ పుంజుకుంటోది. వాళ్ళు చాలా సంతోషించారు. వాళ్ళు దాన్ని డైరెక్ట్ ప్రింట్ కి ఇచ్చెయ్యచ్చు. అయితే దానికి బొమ్మలు వెయ్యడానికి ఆర్టిస్టు కావలసి వచ్చింది. ఒకతను వేస్తానన్నాడు కానీ, అతని రేట్లు, టైము వీళ్ళకి నచ్చలేదు.

“నాగలక్ష్మి ఇన్ని పనులు చేస్తున్నారు కదా! బొమ్మలు కూడా మీరే ఎందుకు వెయ్యకూడదు ప్రయత్నించండి” ఉన్నతాధికారి రషీద్ అన్నారు.

నేను సరే ప్రయత్నిస్తానని చెప్పాను. వాళ్ళు ఎలాంటి లోగోలు కావాలి, ఎక్కడెక్కడ ఎలాంటి బొమ్మలు కావాలో చెప్పారు. యాపిల్ కంప్యూటర్లో *** ఫ్రీ హాండ్*** అని వుంది. దాంట్లో వాళ్ళు అడిగిన బొమ్మలన్నీ గీశాను.

*** ***

*** ఫోటోలలో ఉన్న బొమ్మలు ***

‘మీనా’ సంచి తగిలించుకున్న బొమ్మ - సీతాకోకచిలుకలతో ఉన్న మీనా బొమ్మ ***యూనిసెఫ్*** వాళ్ళు ఐడియా ఇస్తే గీశాను.

***పాపాయిని ఎత్తుకున్న అమ్మబొమ్మకోసం, సంచి తగిలించుకున్న పాప బొమ్మ కోసం చాలా కష్టపడ్డాను. వాళ్ళు కొద్ది కొద్ది మార్పులు చెప్పేవారు. ఈ రెండింటికి ఒక రెండు రోజులు టైం పట్టింది. ***

*** సంజీవనిలో మీకు ఫోటోలలో కనిపిస్తున్న ప్రతి బొమ్మా నేను కంప్యూటర్ లో గీసినదే. ***











మొత్తానికి సంజీవని పేపరు ప్రతి నెలా రకరకాల బొమ్మలతో చక్కటి రూపాన్ని సంతరించుకుంది. ముచ్చటగా వున్న ఆ పేపరు చూసి సంచాలకులు దమయంతి (ఐఎఎస్) గారు చాలా మెచ్చుకున్నారు. రెండుసార్లు ఆవిడని కలిశాను కూడా. RDO లైన రాజ్యలక్ష్మిగారు, శ్యామ సుందరిగారు ఈ వర్కు వాళ్ళే చూసుకునేవారు. మా ఇంటికి కూడా వస్తుండేవారు.

మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. వాళ్ళని తీసుకుని ఐసిడిఎస్ కి వెళ్ళాల్సి వచ్చేది. ఆఫీస్ లో వాళ్ళు నా పని పూర్తయ్యేవరకూ పిల్లలతో కాలక్షేపం చేసేవారు. అప్పటికే పిల్లలు నాతో వచ్చి చాలా విషయాలు తెలుసుకునేవారు.

*** ఎదురు చూడని సవాల్ ***

ప్రపంచ బ్యాంక్, ఐసిడిఎస్ ల స్పెషల్ కాన్ఫరెన్స్ ఒకటి ఉందని చెప్పి దానికి కావలసిన మేటరంతా కొంత చేస్తూ వుండమని నాకిచ్చారు. మిగిలినది మేము వచ్చి ఇస్తామని చెప్పారు. ఆ మీటింగులు మూడు రోజులు ఉంటాయి కాబట్టి ఇంగ్లీషు, తెలుగు రెండూ అర్జంటే. రాత్రి 8 గంటలకి రషీద్ గారు, రాజ్యలక్ష్మి గారు వచ్చారు. మేము పక్కన కూచుని చెప్పేస్తాం అయిపోతుంది అన్నారు. నేను ఎంత సేపు చేస్తానులే అనుకున్నాను.

రషీద్ గారు పదకొండు గంటల వరకు వుండి వెళ్ళిపోయారు. రాజ్యలక్ష్మిగారు పక్కనే కూచుని చెప్తున్నారు. రాత్రి 1 అయ్యేసరికి నేను తూలిపోతున్నాను. ఆవిడ మధ్యలో నన్ను తట్టి లేపుతూ నేను చేసేది సరిగ్గా వస్తోందా రావట్లేదా అని చూసుకుంటూ నాకు నిద్ర రాకుండా పాటుపడుతూ మొత్తానికి తెల్లారగట్ల 6 గంటలకి వర్కు పూర్తి చేసుకుని తీసుకుని వెళ్ళారు. ఒకరోజయితే మా ఇంట్లోనే చాప ఇమ్మని కంప్యూటర్ రూంలో పడుకున్నారు. ఒక గంట సేపు పడుకుని పిల్లలని స్కూలుకి పంపించి, మళ్ళీ పనిలో పడ్డాను. మా వారు ప్రింట్స్ తియ్యడంలో సాయం చేసేవారు. ఆయన పొద్దున్నే వెళ్ళిపోవలసి వచ్చేది.

*** మొండిచెయ్యి చూపించిన జిరాక్స్ మహానుభావుడు ***

ఇదిలా వుంటే - రేపు మీటింగ్ చివరి రోజు నేను ఒక పన్నెండు స్పైరల్ పుస్తకాలు కావాలన్నారు. మేటరంతా ముందు రోజు చేసినది జిరాక్స్ తీయించి, స్పైరల్ చేయించాలి. జిరాక్స్ కి డిమాండ్ బాగా వుండడంతో మా ఇంటి ఎదురుగా ఉన్న అబ్బాయి “మేడమ్ నేను జిరాక్స్ పెట్టాను. మీకు అర్జంట్ ఏమైనా వుంటే తీసి ఇస్తాను” అన్నాడు. అమ్మయ్య జిరాక్స్ కి అయినా ఎక్కడికీ వెళ్ళక్కరలేదు అనుకున్నాను.

సాయంత్రం మొత్తం పన్నెండు కాపీలకి కావలసిన పేపర్లు ఇస్తే రాత్రి లేటయినా తెచ్చి ఇస్తాను అన్నాడు. నేను పొద్దున్న 10.30కి వాళ్ళకి పుస్తకాలు అందించాలి. సరే అని నిశ్చింతగా పడుకున్నాను. కానీ ఎవరినీ పని విషయంలో తొందరగా నమ్మే అలవాటు లేదు. రాత్రి 12 అయ్యింది అతను రాలేదు. ఎలాగో ఒక రెండు గంటలు నిద్రపోయాను. పొద్దున్నే 5 గంటలకి వెళ్ళి బెల్ కొట్టాను. నిద్రతో తూలుకుంటూ వచ్చాడు. నేనేమీ చెయ్యలేదు మేడమ్. కరంటు పోయిందని అబద్ధం చెప్పి సగం మాత్రం తీసిన పేపర్లు నా చేతిలో పెట్టాడు. ఆ టైములో అతన్ని తిట్టే ఓపిక కానీ, దెబ్బలాడే టైం కానీ లేదు.

ఇంటికి వచ్చాను. అప్పటికి 6 గంటలయ్యింది. మా అమ్మాయిని లేపి “నేను ఎస్ ఆర్ నగర్ లో ఎవరో జిరాక్స్ పెట్టారుట. వాళ్ళు పొద్దుటి నుంచీ వుంటాడుట. నేను వెళ్ళి ప్రింట్స్ తీసుకుని వస్తాను. మీరు ఇంట్లో వుండండి” అన్నాను. “అమ్మో… నువ్వు ఒక్కదానివీ వెడతావా మేము వస్తాం, ఒరేయ్ చిన్నూ లేవరా అమ్మకి సాయం వెడదాం” అని వాడిని లేపేసింది. పాపం మంచి నిద్రలో ఉన్న వాడు ఏమీ అర్థం కాక లేచి కూచున్నాడు.

ఏమిటో వాళ్ళు నాకు సాయమో, నేను వాళ్ళకి సాయమో కూడా ఆలోచించే టైము లేదు. పేపర్లన్నీ ఒక కవర్ లోనూ, వాడిని చంకలోనూ ఎత్తుకుని అమ్మాయిని తీసుకుని బయటికి వచ్చి రిక్షా వుంటే ఎక్కి ఎస్ ఆర్ నగర్ వెళ్ళాను. మొత్తానికి జిరాక్స్ షాపు ఓపెన్ చేసి వుంది. అక్కడ కావలసిన మిగిలిన సగం ప్రింట్స్ తీసుకుని ఇంటికి వచ్చాను. అవన్నీ ఆర్డర్ లో పెట్టాలి. నేను కాఫీ తాగి, పిల్లలకి పాలు కలిపిచ్చాను.

నేను ఆర్డర్ లో పెట్టుకుంటుంటే మా అమ్మాయి నాకు కావలసిన సీరియల్ ఆర్డర్ లో గబగబా పెట్టి ఇచ్చింది. అంత చిన్న పిల్ల వీణా పెద్ద వాళ్ళలా సాయపడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. తను పెట్టిన వాటిలో ఎక్కడా ఒక్క పొరపాటు కూడా లేదు. అప్పటికి టైం 8 గంటలయ్యింది. వాళ్ళకి తినడానికి ఏవో పెట్టి, నేను గబగబా రెడీ అయ్యి ఆఘమేఘాల మీద అమీర్ పేట వెళ్ళాను. అప్పటికి ఉ. 9.00 గంటలు. స్పైరల్ బైండింగ్ అతనికి ముందు రోజే చెప్పాను. అవసరమైతే వస్తాను అని. అప్పుడే ఓపెన్ చేసిన అతను ఒక అరగంటలో గబగబా పుస్తకాలు తయారు చేసి ఇచ్చాడు.

అమ్మయ్య అని గట్టిగా ఊపిరి తీసుకుని, ఆ పుస్తకాలతో ఐసిడిఎస్ కి వెళ్ళాను. నాకోసం శ్యామసుందరి, రాజ్యలక్ష్మిగార్లు ఎదురు చూస్తున్నారు. అప్పటికే శ్యామసుందరిగారు తెగ టెన్షన్ పడుతూ ఉన్నారని రాజ్యలక్ష్మి గారు చెప్పారు. ఆవిడ ఆ పుస్తకాలు తీసుకుని, “చూశావా…! శ్యామా! నాగలక్ష్మి పుస్తకాలు తెస్తుంది అంటే నువ్వు తెగ కంగారు పడ్డావు” అని, “చాలా థాంక్స్ నాగలక్ష్మీ! మీరు రేపొకసారి ఆఫీసుకి రండి మీకు ఇంకెంత ఇవ్వాలో లెక్క చూద్దాం. బిల్లు పెట్టేసుకుందురుగాని” అన్నారు.

“అమ్మయ్య పని విజయవంతం, మనం ఇంటికి” అనుకుంటూ ఇంటికి వచ్చేశాను. ఆరోజు పిల్లల స్కూలు డుమ్మా… వాళ్ళని తీసుకుని సత్యం థియేటర్ లో సినిమా చూసి, అమీర్ పేట స్వాతి హోటల్లో భోజనం చేసి, మా వారు ఇంటికి వచ్చే టైం కి ఇంటికి వచ్చేశాం.

ఇలా చేసిన ఐసిడిఎస్ వర్కు నాకు చాలా డబ్బులు సంపాదించి పెట్టింది. ఒకసారి 20వేలు ఒకేసారి చేతిలోపడింది. అది చాలా ఎక్కువ. అప్పట్లో వీణాధరీ గ్రాఫిక్స్ పేరుతో కెనరా బ్యాంక్ లో కరెంట్ అకౌంట్ వుండేది. ఎప్పుడూ నిండుగా డబ్బులు వుండేవి. చేసేవన్నీ గవర్నమెంట్, పెద్ద పెద్ద సంస్థల పనులే కావడంతో చెక్కులే ఇచ్చేవారు.

ఒక విషయం ఆశ్చర్యం నేను మా ఊరు తాడేపల్లి గూడెంలో స్కూలులో చేసిన కొద్ది రోజులలో ఐదవ తరగతిలో నా స్టూడెంట్ గా ఉన్న అబ్బాయిని అక్కడ ఉద్యోగస్థుడుగా చేస్తున్నాడు. ఒకరోజు నేను ఆ ఆఫీసుకి రావడం చూసి ఆశ్చర్యపోయాడు. మేష్టారండీ (ఊళ్లో అప్పుడు ఆడయినా మగయినా మేష్టారు అనే అనేవారు.) అంటూ ఎన్నో కబుర్లు చెప్పాడు. నాకూ చాలా సంతోషమేసింది. తర్వాత ఊరెళ్ళినప్పుడు తన ఫ్రండ్స్ అందరికీ చెప్పాడుట.