31, అక్టోబర్ 2022, సోమవారం

మధ్యలో గుర్తుకు వచ్చిన ఒక చిన్న పిట్టకథలాంటిది - 56

 మధ్యలో గుర్తుకు వచ్చిన ఒక చిన్న పిట్టకథలాంటిది - 56

*** పాల ప్యాకెట్ ప్రహసనం ***

*** అందరికీ తెలిసిన విషయాలే కానీ, మాకు పాలు పోసే కృష్ణ కోటీశ్వరుడు అయ్యాడుగా మరి. ***

పాల ప్యాకెట్ కి నెలకి ఒకసారి డబ్బులు ఇచ్చే పద్ధతి వుండేది. ఆ వేసే వాడు గుమ్మం వరకూ వచ్చి ఇవ్వకుండా ఒకోసారి తలుపుకొట్టకుండా దూరం నుంచి విసిరేవాడో ఏమో... తలుపు తెరిచేసరికి గుమ్మం ముందంతా పాల వరద. ఖాళీ అయిన ఆ ప్యాకెట్ ప్రశాంతంగా నిద్రపోతోంది. మర్నాడు అడిగితే – “నేను మంచిగనే వేసా... పిల్లి కొరికిందేమో” అనేవాడు. రోజూ పిలిచి ఇస్తున్నాడు కదాని బయట కవరు తగిలించలేదు.

పిల్లి కొరుకుతుందని తెలిసీ కనీసం తలుపు కూడా కొట్టకుండా చేసిన పని అది. మళ్ళీ వాళ్ళమ్మ దగ్గిరకి వెళ్ళి ఇంకో ప్యాకెట్ తెచ్చుకోవాల్సి వచ్చేది. ఈ గొడవంతా ఎవరు పడతారు. అప్పుడే కొత్తగా మాకు దగ్గరలో ఉన్న పార్కు దగ్గర మదర్ డెయిరీ వాళ్ళ మిల్క్ బూత్ పెట్టారని విన్నాం. అదీ చూద్దాం అని కొన్నాళ్ళు ప్యాకెట్ పాలు మానిపించేసి, పొద్దున్నే అక్కడికి వెడితే లీటరు పాలకి టోకెన్ ఇచ్చి డబ్బులు తీసుకునేవాడు. కోయిన్ వెయ్యగానే అక్కడో బాటిల్ కానీ, గిన్నె కానీ పెడితే వచ్చే పాలు చూస్తే పిల్లలకి వింతగా అనిపించి అవే తీసుకుందాం అనేవారు.

కానీ ఎన్ని పనులు చేసుకుంటాం. పొద్దున్నే ఇంటి బయటికి రావాలంటే కష్టం. అదీ మానిపించేసి మణికొండ (12 కిలోమీటర్లు దూరం) నుంచి కృష్ణ అనే అతను స్కూటర్ మీద తెచ్చి పోస్తున్నాడంటే అతన్ని పెట్టుకున్నాం. పాలు బాగానే పోసేవాడు. కానీ ఒక్కోసారి పాలు పసరు వాసన వేసేవి. వికారం వచ్చేది. ఏంటీ ఇలా వున్నాయని మర్నాడు అడిగితే బర్రె ఏవో ఆకులు తింది అందుకని అలా వున్నాయి అన్నాడు. మొత్తానికి సరిగ్గా పొయ్యకపోతే మానెయ్యి అంటే తర్వాత బాగానే తెచ్చేవాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవరకూ అతను మానలేదు.

ఒక రోజు కృష్ణ “అమ్మా... మణికొండ దగ్గిర ఎకరం 40 వేలు అమ్ముతున్నారు. ఒక ఎకరం తీసుకోండి. ముందు ముందు చాలా బావుంటుంది” అని చెప్పాడు. అతను చెప్పినప్పుడు మణికొండ నిర్మానుష్య ప్రాంతం, అక్కడక్కడ పొలాలు, కొండలు గుట్టలు తప్ప ఏమీలేవు. అప్పుడు చేతిలో డబ్బులు కూడా వున్నాయి. ఏమోలే ఎందుకు మనకి తెలియని చోట అనుకుని అప్పటికే తెలిసిన వాళ్ళ ద్వారా కొన్న రెండు స్థలాలు ఉన్నాయి కదా అనుకున్నాం.

కొన్ని రోజులకి పాలుపోసే కృష్ణ రావడం మానేశాడు. మా దగ్గిర డబ్బులు కూడా తీసుకోలేదు. ఫోన్ చేస్తే బయటికి వెళ్ళాడని చెప్పారు. తర్వాత తర్వాత అసలు ఫోను రింగయినా తియ్యట్లేదు. ఒకరోజు ఎక్కడికో వెళ్ళి వస్తుంటే... పక్కన కారు ఆగింది. పట్టించుకోకుండా వచ్చేస్తుంటే “అమ్మా ఎక్కడికి వెడుతున్నారు. నేను కృష్ణ” అన్నాడు. చక్కగా నీట్ గా తయారయిన ఆ వ్యక్తిని చూస్తే పాలుపోసిన కృష్ణ అని ఎవరూ అనుకోరు. ఇంతకీ ఏంటంటే మణికొండలో ఉన్న వాళ్ళ పొలాలన్నీ మంచి రేటుకి అమ్ముడయ్యి కృష్ణ కోటీశ్వరుడు అయిపోయాడు.

స్థలం కొంటే ఎలా వుండేదో.... ఎవర్ని నమ్మాలో తెలియదు. ఎంతోమంది నష్టపోయిన వాళ్ళూ వున్నారు. మొత్తానికి కొనలేదు. దురదృష్టం అదృష్టం – కర్మ అనేవాటి గురించిన ఆలోచనలకి దూరం కాబట్టి మేమేం బాధపడలేదు. ప్రయత్నం లేందే ఏదీ అవదనే జీవిత సత్యం ఉంది కదా...

పాల సంగతి మళ్ళీ మొదటికి వచ్చింది. కానీ క్రమం క్రమంగా ప్రతి షాపులోనూ పాలప్యాకెట్ లు అమ్ముతున్నారు. కృష్ణ తెచ్చిన పాలకి అలవాటు పడిన పిల్లలు ప్యాకెట్ పాలు ఇష్టపడలేదు. మళ్ళీ గేదెపాలు పోసేవాళ్ళని చూడాల్సి వచ్చింది.


కొన్ని చోట్ల ప్యాకెట్ మీద ఏదో కొత్త పేరు వుంటుంది. తీసుకుంటే ఇంతే సంగతులు. కెమికల్ తో తయారు చేసే ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారు. ఒకసారి ఎవరో ఒక గుడికి వెళ్లి పంచామృతం తీసుకుని వచ్చాక గొంతు నొప్పి లాంటి రకరకాల అనారోగ్యాలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. ఏదైనా పాల విషయంలో ఈ రోజుల్లో జాగ్రత్త పడాల్సిందే.

2 కామెంట్‌లు:

  1. వాళ్ళమ్మ వ్యాపారం వృద్ధి చెందడానికని చేసిన ట్రిక్కులేమో? కానీ ఇటువంటి వాళ్ళ నిర్లక్ష్య ధోరణి ఎక్కువగానే ఉంటుంది. కస్టమర్ డబ్బులు మన జేబులోకి వచ్చెయ్యాలి, మనం ఏం చేసినా వాళ్ళు భరించాలి అన్నది వాళ్ళ పాలసీనా అనిపిస్తుంది. పేపర్లు వేసే వాళ్ళూ అంతే - చూసి చూసి కాంపౌండ్ లోపల నీటి గుంటలో వేసేవాళ్ళు. ఇప్పుడు అపార్ట్-మెంట్ల గోల వచ్చిన తరువాత వాటి వరకు తగ్గినట్లుంది.

    పాకెట్లు రావడానికి ముందు రోజుల్లో సీసాలతో ఉండేది పాల సరఫరా. అదే బాగుండేది - ఆ గాజు పాలసీసాను విసిరెయ్యలేడుగా, అందువల్ల జాగ్రత్తగా గుమ్మం దగ్గర పెట్టేవాడు.

    మీరు చెప్పిన పార్క్ దగ్గర పాల బూత్ లాంటి బూత్ కు (బటన్ పాలు అనేవాళ్ళు మా వాళ్ళు 🙂) మేం కూడా తరచుగానే వెడుతుండేవాళ్ళం. మీరన్నట్లు ఆ ఏర్పాటు సరదాగా ఉండేది.

    ఇక పాలవాళ్ళ దగ్గర సాకులు రెడీగా ఉండేవి. పాలు మరీ నీళ్ళగా ఉంటున్నయేమిటయ్యా అని అడిగితే ఈ మధ్య గేదె ఎక్కువ నీళ్ళు తాగుతోందమ్మా అనే జోక్ అలాగే పుట్టినట్లుంది 🙂🙂.

    అవునండి, ఈ కల్తీమయమైన కాలంలో పాలే కాదండి, ఇతర వస్తువుల విషయంలో కూడా (ఉదాహరణకు - నూనె ను జంతువుల ఎముకల నుండి తయారు చేస్తున్నారట భాగ్యనగర శివార్లలో 😳). డబ్బు వేటలో పడిపోయిన వ్యాపారులు ఉచ్చంనీచం పూర్తిగా వదిలేసినట్లున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును సర్ ప్రపంచమంతా కల్తీమయం అయిపోయింది. మీరు బలే వివరంగా చెప్పారు. గేదెపాలు పోయించుకున్నప్పుడు ఒకోసారి పసరు వాసన వచ్చేవి. అదేమిటి అంటే ఏవో ఆకులు తింది అని చెప్పేవాడు. ఎవరికి తోచిన సమాధానం వాళ్ళకి రెడీగా వుంటుంది. నూనె గురించి కూడా ఈమధ్య నేను వింటున్నాను.

      ధన్యవాదాలు సర్.

      తొలగించండి