2, నవంబర్ 2022, బుధవారం

*** జీవనయానంలో జర్క్*** - 57

 

*** జీవనయానంలో జర్క్***  - 57

 

**** సాఫీగా జరుగుతున్నజీవనయానంలో ఒక జర్క్ - సద్దుకునేలోపున ఇష్టంలేని కొత్తదారుల్లో పయనం. ప్రముఖుల పరిచయాలు, అనుభవాల ఒరవడిలో నేర్చుకున్న పాఠాలు. ***

 

ఊపిరాడకుండా చేస్తున్న మా వర్కులకి ప్రింట్స్ ఇచ్చి ఇచ్చీ అలిసిపోయిన మా ప్రింటర్ రెస్ట్ తీసుకుంటానంది. దాంట్లో మెయిన్ పార్టు పోయింది. అసలే ఆపిల్ కంప్యూటర్ దానికి సంబంధించిన పార్టులు పోతే అవి రావడానికి టైమ్ పడుతుంది. పోనీ కొత్త ప్రింటర్ కొందామంటే అప్పటికే మేము కంప్యూటర్ కి ప్రింటర్ కి లక్ష రూపాయల పైనే పెట్టాం. కానీ మా పెట్టుబడి కన్నా చాలా ఎక్కువే సంపాదించాం.

 

 

మళ్ళీ ప్రింటర్ కొనాలంటే చాలానే పెట్టాల్సి వస్తుంది. ఈలోపున ఆపిల్ కంప్యూటర్లకి పోటీగా ఐబిఎమ్ వాళ్ళ పి.సి.లు వచ్చాయి. ఆపిల్ కన్నా చాలా తక్కువ రేటు. కానీ మా కంప్యూటర్ బాగానే పనిచేస్తోంది. ఎవరో చెప్పారు. ఆపిల్ కంప్యూటర్ కి, ఐబిఎమ్ పి.సి.కి రెండింటికీ పనిచేసే ప్రింటర్స్ వస్తున్నాయి. తొందరపడకండి అని చెప్పారు.

 

ఈలోపున కంప్యూటర్ మీద పనులు చేసుకుంటూ ప్రూఫులకి బయట తెలిసిన వాళ్ళ దగ్గిర ప్రింట్స్ తీసుకునే వాళ్ళం. ఇల్లు కదిలి బయటికి వెళ్ళాలంటే టైమ్ వేస్ట్ అనిపించేది. బయట కూడా చాలామంది ప్రెస్సుల వాళ్ళు కంప్యూటర్లు కొనుక్కున్నారు. చిన్న చిన్న స్క్రీన్ ప్రింటర్స్ కూడా ఏదో ఒక రకంగా మేనేజ్ అయిపోతున్నారు. కానీ కస్టమర్స్ రావడం ఆగలేదు.

 

ఇంతలోనే తెలుగు అకాడమీలో మూడు ఆపిల్ కంప్యూటర్ల మీద ఉన్న ఆపరేటర్స్ కి ప్రమోషన్స్ ఇచ్చి సీట్లు మార్చారు. వాళ్ళకి అనుభవం ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు కావాలి. నాకు కబురు చేశారు. నేను ఇంట్లోనే చేసుకుంటున్నాను అని చెప్పాను. నాకు వెళ్ళడం ఇష్టం లేక చాలా రోజులు తాత్సారం చేశాను. ఫోన్లు చేస్తున్నారు. సరే అని ఒక రోజు తెలుగు అకాడమీకి వెళ్ళాను. అక్కడ ప్రింటింగ్ మేనేజర్ చంద్రమౌళిగారు,  డైరెక్టరు మంజులత గారు మీకు ఇంట్లో చేసినప్పుడు నెలకి ఎంత వస్తుందో ఇక్కడ కూడా అంతే వస్తుంది. (నేను ఎలాంటి వర్కులు చేశానో, మాకు ఎంత వచ్చేదో వాళ్ళకి తెలియదు) మా దగ్గిర వర్కు చేసి చూడండి అన్నారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా మాకు చెప్పండి. మీరేమీ ఇబ్బంది పడద్దు అన్నారు. ఇంకా చాలా మాటలతో మభ్యపెట్టారు. ఈ ఉద్యోగం permanent కాదని తెలుసు. నా వ్యక్తిత్వానికి అదో పెద్ద సవాలైంది. వాళ్ళు అడిగిన పద్ధతి చూస్తే అప్పుడు కాదనలేకపోయాను. నేను ముందు ఎపిసోడ్ లో చెప్పాను కదా... మా చెల్లెలికి ఆ ఉద్యోగం విడిచి పెట్టి వచ్చానని. సరేలే ఈ వంకతో చెల్లెలు అక్కడే చేస్తోంది కాబట్టి తనని కలవచ్చని అనుకున్నాను. 

 

కానీ అక్కడ మేము ఒక పుస్తకం చేశామంటే అది ఫైనల్ అయి రావాలంటే చాలా టైం పట్టేది. అమ్మయ్య అనుకుని దానికి బిల్ పెట్టుకుంటే నలుగురు సంతకాలు పెడితే కానీ డబ్బులు చేతికి రావు. ప్రభుత్వరంగ సంస్థ కదా... కానీ ఎంత తేడా... నేను నా సొంతంగా ఒక ఆఫీసు పెట్టుకుని దానికి నేనే అధిపతినయి, ఎంతోమంది ప్రముఖులు నా చేత వర్కుచేయించుకుని, నేను అడగక ముందే నా చేతిలో డబ్బులు పెట్టినప్పుడు నేను పొందిన ఆనందం ఇక్కడెలా పొందగలుగుతాను.

 

అక్కడ ఇమడడం నా వల్ల కాలేదు.  కొన్ని విషయాలు నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాయి. రోజూ నేను ఎందుకు వచ్చానా... అని అనుకోని రోజు లేదు. కానీ నాగురించి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇది అహంకారం కాదు. స్వయంకృషిలో నేను పొందిన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాననే బాధ. నేను ఇక్కడ నుంచి ఏమయినాసరే బయటికి వెళ్ళిపోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను. నేను ఎదురు చూసిన రోజు వచ్చింది.

 



తెలుగు యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పేషీలో (2004) తెలుగు కంప్యూటర్ ఆపరేటర్ కావాలన్నారని మా ఫ్రెండ్ చెప్పింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను. యూనివర్సిటీ చూడాలని చాలా రోజులుగా అనుకున్నాను. వైస్ ఛాన్సలర్ జి.వి.సుబ్రహ్మణ్యంగారు, మృణాళినిగారు, సుబ్బారావుగారు ప్రముఖులందరూ ఇంటర్వ్యూ చేశారు. జి.వి.సుబ్రహ్మణ్యంగారు ఇంటర్వ్యూ చేసిన పద్ధతి చాలా బాగా అనిపించింది. నేను ఒక ఆపరేటర్ గా వెళ్ళినా ఒక సంచాలకులు మాట్లాడినట్లు కాకుండా ఒక చక్కటి స్నేహితులు మాట్లాడినట్లు నా గురించి అన్ని విషయాలు అడిగారు. అన్నీ వివరంగా చెప్పాను.

 

మీకు ఇక్కడ ఎక్కువ పనేమీ వుండదు. నెల తిరిగేసరికి మీ శాలరీ మీకు వస్తుంది. యూనివర్సిటీ నుంచి కూడా మీరు వర్కులు తీసుకుని ఇంట్లో చేసుకోవచ్చు. కానీ, ఇక్కడ కూడా మీకు డబ్బులు చేతికి వచ్చేసరికి లేటవుతుందిఅన్నారు. నేను పట్టికెళ్ళిన నా సర్టిఫికెట్లు ఒక్కటి కూడా చూడలేదు. చూపించబోతే అవసరం లేదన్నారు. ఆరకంగా ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశం వచ్చింది.

 

మధ్యాహ్నం యూనివర్సిటీకి వెడుతున్నానని ఇంట్లో చెప్పాను. వెంటనే వచ్చేస్తాను కదా అనుకున్నాను. కానీ అర్జంటు కాన్ఫిడెన్షియల్ లెటర్ ఏదో చెయ్యాల్సి వచ్చింది. ఆపిల్ కంప్యూటర్ కాదు ఐబియమ్ పి.సి. కొంచెం ఆపరేషన్ తేడా వుంది. ఆ లెటర్ చేసేసేసరికి రాత్రి 7.30 అయిపోయింది. ఇంక గబగబా యూనివర్సిటీ గేటు బయటే ఉన్న బస్ స్టాప్ లో బస్సెక్కి ఇంటికి వెళ్ళిపోయాను. సెల్ ఫోన్లు లేవు. సమాచారం తెలియదు. ఇంట్లో కంగారు పడుతున్నారు. అన్నీ చెప్పాను. అన్ని పనులూ చూసుకుని అప్పటికే ఇంట్లో ఒప్పుకున్న వర్కులు చెయ్యడానికి వెళ్ళిపోయాను.

 

ఇక పొద్దున్న లేచిన దగ్గరనుంచీ పిల్లలని స్కూలుకి పంపి హడావుడిగా యూనివర్సిటీకి వెళ్ళేదాన్ని. నేను వెళ్ళిన రెండు రోజులకి రిజిస్ట్రార్ గా ప్రొ. గురుమూర్తిగారు వచ్చారు. చాలా మంచి వ్యక్తి. కొన్ని ముఖ్యమైన లెటర్లు పక్కనే వుండి చేయించుకునేవారు. కొన్నిసార్లు పి.ఎ. లక్ష్మి, నేను గురుమూర్తి గారితో కలిసి భోజనం చేసేవాళ్ళం. ఆ సమయంలో ఆయన ఒక కుటుంబ వ్యక్తిగానే కనిపించేవారు. ఇవన్నీ బాగానే వుండేవి. నిజంగానే యూనివర్సిటీలో నాకు ఎప్పుడో కానీ పని వుండేది కాదు. నాకు టైము ఎలా గడపాలో అర్థం అయ్యేది కాదు.

 

అక్కడ థియేటర్ ఆర్ట్స్ స్టూడెంట్స్ వేసే నాటకాలకి సంబంధించిన ఇన్విటేషన్ లు చేయించుకునేవారు. చాలా గొప్ప నాటకాలు వేసేవారు. నాకు ఒక్కసారన్నా వాళ్ళు వేసే గొప్ప గొప్ప నాటకాలు చూడాలనిపించేది. చిన్న పిల్లలు, వాళ్ళ చదువులు, నేను వచ్చేవరకు ఎదురు చూపులు ఆఫీసు నుంచి పరుగులు పెట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. పిల్లలు తొందరగా పెద్దవాళ్ళయితే బావుండును అనుకున్నాను. ఖాళీ వున్నప్పుడు అన్ని డిపార్ట్ మెంట్లకి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకు, అక్కడి విషయాల తెలుసుకుని వచ్చేదాన్ని. ఆయా డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్లు చాలా బాగా మాట్లాడేవారు. అన్నీ వివరంగా చెప్పేవారు. ఎన్.టి. రామారావుగారు తెలుగు యూనివర్సిటీ పెట్టడం వెనక అంతరార్థం తెలిసింది.

 

 కానీ అది ఎంత వరకు విజయవంతం వుతోందో అనేది నాకు అర్థం కాలేదు. చాలామంది పెద్దవాళ్ళు పరిచయం అయ్యారు. ఎన్నో విషయాలు తెలిశాయి. అక్కడ పనిచేసే ప్రతి వాళ్ళూ నాతో చాలా బాగా మాట్లాడేవారు. నాకు ఏమీ ఇబ్బంది వుండేది కాదు. కానీ వచ్చే శాలరీనే చాలా తక్కువ. అవి నాకు ఎందుకూ సరిపోయేవి కాదు.  నా స్వయంకృషిలో ఎప్పుడూ చేతిలో డబ్బులుండేవి. మా వారు  జాబ్ చేసినా ఆ పరిస్థితుల్లో అవి సరిపోయేవి.

 

 

***

 

*** మధ్యలో సాహసాలొకటీ.... ***

 

బల్కం పేటలో మా ఇంటి దగ్గర నుంచి లోకల్ ట్రెయిన్ నాంపల్లికి వుండేది. యూనివర్సిటీ వాళ్ళు చాలామంది అందులోనే వెడుతుంటే నేను కూడా అందులోనే వెళ్ళేదాన్ని. బల్కంపేటలో లోకల్ ట్రైన్ స్టేషన్ చాలా దగ్గర.  ఒకోరోజు ట్రెయిన్ అందుకోవాలని పరుగులు పెట్టుకుంటూ ప్లాట్ ఫాం మీదకి వెళ్ళేసరికి దూరంగా వస్తూ కనిపించేది. ట్రెయిన్ ఎక్కాలంటే బ్రిడ్జ్ ఎక్కి దిగాలి. ఆ ట్రెయిన్ మిస్సతే అరగంట వరకూ ట్రెయిన్ లేదు. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. ఇటువైపు నుంచి అటువైపుకి రెండే రెండు నిమిషాల్లో ఎక్కి దిగి ట్రెయిన్ని అందుకునేదాన్ని. అమ్మో ఎన్ని ట్విస్ట్ లు.  ఎంత తొందరగా తెమలాలన్నా పిల్లలని స్కూలుకి పంపించి, మిగిలిన పనులు పూర్తి చేసుకునేసరికి ఆ హడావుడి తప్పేది కాదు.

 

మళ్ళీ యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు లోకల్ ట్రెయిన్ లోనే వచ్చేదాన్ని. సరిగ్గా సా. 6గం. 2 నిమిషాలకి ట్రెయిన్ వుండేది. నా పని ముందే అయిపోయినా రిజిస్ట్రార్ పి.ఎ. లక్ష్మికి పని తెమిలేది కాదు. అన్నీ అయ్యి ఇద్దరం బయల్దేరేవాళ్ళం. లక్ష్మి, నేను యూనివర్సిటీ పది నిమిషాల తక్కువ 6 గం.లకి నాంపల్లి స్టేషన్ కి అడ్డదారి నుంచి వెళ్ళేవాళ్ళం. రోజూ చూసే డ్రైవర్ ఒకోసారి బయల్దేరబోతూ ఒక్క నిమిషం ఆపేవాడు. కానీ ఒక రోజు ఇలాగే లేటయింది. ట్రెయిన్ రెడీగా వుంది. మమ్మల్ని చూసి ఆపాడు. లక్ష్మి పొడుగ్గా వుంటుంది. ఒక్క అంగలో ఎక్కేసింది. నేను ఎక్కుతుంటే ట్రెయిన్ కదిలి పోయింది. ఒక్క విసురుగా లోపలికి పడ్డాను. చేతిలో టిఫిన్ బాక్స్ ల కవర్ ఎగిరి డమడమా చప్పుడు చేసుకుంటూ అంతదూరంలో పడింది. అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. గబగబా నన్ను లేవదీసి – “తొందరగా రండమ్మా... ఎందుకొచ్చిన సాహసాలు. లేకపోతే బస్సులు చాలా వుంటాయి కదా.... ఇంటి దగ్గర ఎదురు చూసేవాళ్ళున్నప్పుడు ఇలాంటి పనులు చెయ్యకండిఅన్నారు. దెబ్బతో లోక్ ట్రెయిన్ కి స్వస్తి చెప్పాను. యూనివర్సిటీ గేటు ముందరే బస్ స్టాప్. చాలా బస్సులు వుండేవి. ఇక ఇంటికి క్షేమంగా అందులోనే వెళ్ళేదాన్ని.

 

***

 

ఇంత కష్టపడి అక్కడికి వెడితే నెలలో మహా అయితే వారం రోజులు వర్కు వుండేది. వాళ్ళు శాలరీ పెంచాలంటే చాలా పెద్ద ప్రోసెస్. అన్నీ బావున్నాయి కదా అని నేను ఊరికే కూచోలేకపోయాను. ఇంతలోనే జివి సుబ్రహ్మణ్యం గారు ప్రపంచానికి దూరం అయ్యారు. మంజులతగారు వి.సి.గా వచ్చారు.

 

ఇంక ఒక నిర్ణయానికి వచ్చేశాను. నా కోసం ఎదురు చూస్తున్న కస్టమర్స్ వున్నారు. మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతారని అందరూ అడుగుతూ వుండేవారు. వెంటనే ఎవర్నీ సంప్రదించకుండా కంప్యూటర్ లో నా ఆర్థిక అవసరాలకి శాలరీ సరిపోవట్లేదు కాబట్టి నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాను అని ఒక లెటర్ రాసి రిజిస్ట్రార్ గారికి ఇచ్చాను. నేను రాసినది చూసి ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. ఆయన చేతుల్లో ఏమీ వుండదు కాబట్టి సంతకం పెట్టారు.

 

పేషీలో ఉన్న ఆఫీసరు, యూనివర్సిటీలో నాకు తెలిసినవాళ్ళందరూ మీరు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ మీరు లోపలికి రాలేరు. ముందు ముందు మీకు బావుంటుంది. అలా ఎందుకు రిజైన్ చేశారుఅన్నారు. నేను నవ్వేసి బయటికి వచ్చేశాను. చాలామంది మంచి మిత్రుల్ని వదిలిపెడుతున్నానని బాధగానే అనిపించింది కానీ, నా భవిష్యత్ నిర్ణయం నన్ను హెచ్చరించింది.  

 

అమ్మయ్య అని స్వేచ్ఛా వాయువులని ఆనందంగా పీల్చుకున్నాను. ఒక్కసారి ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా నాదే అనిపించింది. నా రూటులోకి నేను మళ్ళీ వచ్చేశాను. చాలా విషయాల్లో నిర్ణయం భయపడకుండా తీసుకోవడమే నా భవిష్యత్తుకి బాట అయ్యింది.

 

6 కామెంట్‌లు:

  1. హు(, ఏమిటో ? యాతనలన్నీ కొని తెచ్చుకున్నట్లు అనిపిస్తోంది మీరు వ్రాసిన ఈ ప్రహసనం చదువుతుంటే. శుభ్రంగా మీ బిజీ బిజీ వ్యాపారం మీకుండగా అటువంటి టెంపరరీ ఉద్యోగాలకి ఎందుకు వెళ్లారు ? ఏదయినా మొహమాటం అయితే తప్పనిసరి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జీవితంలో ఇలా కూడా పాఠాలు నేర్చుకుంటాం సర్. మాకు ఏదో ఉపకారం చేస్తారనుకున్నాను.

      తొలగించండి
    2. నిజంగానే ఏదో ఒక రకంగా మేము సెట్ చేసుకుని వర్కు చేసుకుని వుంటే బావుండేది.

      తొలగించండి
  2. ఒక సినిమాలో (షాషాంక్ రిడెంప్షన్) లో ఒక మోర్గాన్ ఫ్రీమాన్ డైలాగు ఉంది. జైల్లో ఏళ్ల తరబడి ఉన్నవాడికి బయటకి వెళ్ళాలని ఉండదుట. దాన్ని వాళ్ళు "ఇంస్టిట్యూషనలైజ్డ్" అని పేరు పెట్టారు. అది అనుభవిస్తే కానీ తెలియదు. మీరు జేరిన ఉద్యోగం అటువంటిదే. అందులో ఉన్నవాళ్ళు బయటకి వెళ్లకండి అని చెప్పడానికి కారణం కూడా ఇదే - "ఇంస్టిట్యూషనలైజ్డ్" అవటం. అందులోంచి బయట పడ్డారు తొందరగా. సంతోషం. మీ కధ చదువుతున్నాను కానీ కామెంట్ పెట్టడం కుదరలేదు. దీనితో సినిమా తీయవచ్చు. ఎందుకేనా మంచిది ఒక కాపీరైట్ పెట్టుకోండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను ఫేస్ బుక్ లో పెట్టినప్పుడు కొంతమంది సినిమా తీస్తే అందులో ఏ కారెక్టర్ ఎవరుంటారో చెప్పేసుకున్నారు. ఇప్పుడు మీరంటుంటే గుర్తుకు వచ్చింది. మీరు బాగా వివరించారు. నా కథ నాకే ఆశ్చర్యంగా వుంది. చాలా ధన్యవాదాలండీ చదువుతున్నందుకు.

      తొలగించండి