6, నవంబర్ 2022, ఆదివారం

ఆనందంగా ఇంటికి - 58

 

ఆనందంగా ఇంటికి - 58



యూనివర్సిటీకి బై చెప్పేసి ఆనందంగా ఇంటికి వచ్చాను. పిల్లలు కూడా అమ్మ మన ఎదురుగానే వుంటుంది కదా అని సంతోషించారు. రాత్రికి అస్సలు ఏ వర్కులు ముట్టుకోలేదు. పిల్లలతో కబుర్లు చెపుతూ గడిపాను.

పొద్దున్నే పిల్లల్ని స్కూలుకి పంపించి, నేను మళ్ళీ మైండ్ సెట్ చేసుకుని వర్కులు చేసుకుందామనుకుంటుండగా... నరిసెట్టి ఇన్నయ్యగారికి, మావారికి కంబైండ్ ఫ్రెండ్ ఇసనాక మురళీధర్ “నాగలక్ష్మి గారూ... ఏం చేస్తున్నారు? ఏంటి యూనివర్సిటీకి గుడ్ బై చెప్పేశారుట కదా...!” అనుకుంటూ వచ్చారు. నేను “అవునండీ... మీరేంటిలా వచ్చారు?” అన్నాను.

"ఏమీ లేదు నరిసెట్టి ఇన్నయ్యగారు, కోమల గారు ఇద్దరూ పుస్తకాలు రాస్తున్నారు. మీ గురించి చెప్పాను. ఇన్నయ్యగారేమో ఒకసారి మిమ్మల్ని రమ్మన్నారు” అన్నారు.

ఇంతలోకే మా వారు "రేపు పొద్దున్న ఇద్దరం కలిసి వస్తాం. మీరు కూడా అక్కడికి రండి" అని అడ్రస్ తీసుకున్నారు.

ఇంక నాకు మాట్లాడే అవకాశం లేదు.

బల్కం పేట నుంచీ పొద్దున్న నేను, మా వారు కలిసి ఆటోలో సారధీ స్టూడియోస్ బస్ స్టాప్ కి వెళ్లాం. నాకేమీ తెలియదు కాబట్టి ఆయన్ని ఫాలో అయిపోయాను. అక్కడ షేర్ ఆటో ఎక్కాలన్నారు. ఎక్కాం. ఆటోలో కూచున్నాక ఒక్కసారి కళ్ళు మూసి తెరిచేలోపున అరకిలోమీటరు దూరం తీసుకుపోతున్నాడు. ఒయ్యారాలు పోకుంటూ రోడ్డు మీద ఆ ఆటో పోయే ఆ స్పీడు చూస్తే నాకు కళ్ళుతిరిగినంత పనయ్యింది. మధ్య మధ్యలో గాలిలోకి కూడా లేచినట్టనిపించింది. దేనికో గుద్దేస్తాడని గట్టిగా కళ్ళుమూసుకుని కూచున్నాను. జూబిలీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరమాత్రం ట్రాఫిక్ వుంది కాబట్టి ఆపాడు. కొంచెం ఊపిరి పీల్చుకున్నాను. మొత్తానికి జర్నలిస్టు కాలనీ బస్ స్టాప్ దగ్గర ఆపాడు. ఆ ఆటో అతన్ని చూస్తుంటే కోపం వచ్చేస్తోంది. మావారు అతనికి డబ్బులు ఇచ్చి, “మనం ఇటే వెళ్ళాలి” అన్నారు.

ఎటెళ్ళడమో ఏమో.... కానీ... అమ్మో... నేను మళ్ళీ ఈ రూటులో రాకూడదు. అసలే అవసరమైతే రోజూ అక్కడికే వచ్చి కొంతసేపు టైప్ చెయ్యాలని కూడా చెప్పారు. ఇంత దూరం. పైగా ఆ ఆటో స్పీడు తట్టుకోవడం నా వల్ల కాదు. వెళ్ళి కలిసేసి నేను రానని చెప్పేస్తే సరి - అనుకుంటూ మా వారిని అనుసరించాను.

వాళ్ళ గేటులోకి అడుగు పెట్టగానే... ఎడమవైపు కుండీల నిండా రంగు రంగుల పువ్వుల మొక్కలు. కొంచెం ముందుకి నడిచి వాళ్ళింట్లోకి వెళ్ళాం. ఇల్లంతా నీట్ గా చక్కగా వుంది. లోపల ఇన్నయ్యగారు, కోమల గారు కూచుని ఉన్నారు. “పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు?” అని అడిగారు. ఇద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అన్ని పలకరింపులు అయ్యాక ఇన్నయ్య గారు “నేను ఒక పుస్తకం ట్రాన్స్ లేట్ చేస్తున్నాను. అది టైప్ చేసి బుక్ ఫార్మేట్ లోకి తీసుకురావాలి” అంటూ కొన్ని పేపర్లు ఇచ్చారు.

“నా రైటింగ్ అర్థమవుతుందా చూడండి, రాయడానిక కొంచెం కష్టం గానే వుంది. నేను చెప్తుంటే టైప్ చేస్తే ఇంకా బావుంటుంది” అన్నారు. నేను ఏమీ మాట్లాడలేదు. “ఆలోచించి చెప్పండి” అని, “మురళీ నాగలక్ష్మికి పైన కంప్యూటర్ రూం చూపించు” అన్నారు.

మురళీధర్ పైన కంప్యూటర్ రూంకి రమ్మని దారితీశారు. బయటికి వచ్చి పక్కనే ఉన్న మెట్ల మించి పైకి వెడితే పైనంతా రకరకాల మొక్కలు. కిందకి వంగిపోయిన పెద్ద పెద్ద మామిడి, జీడిమామిడి చెట్లు, మల్లెపందిరి, అన్నిటికీ మధ్యలో అప్పుడే నిండా పిందెలు ఉన్న పనస చెట్టు బలే వుంది. వాటి వెనక చక్కటి ఇల్లు. నాకు బలే నచ్చేసింది.

కంప్యూటర్ వుండే రూం చూపించారు. ఇంక సరే ఆ వర్కు అయ్యే వరకు వద్దామని డిసైడ్ అయిపోయాను.

ఒక ఆఫీసులాగా రానక్కరలేదు కాబట్టి సరే అనుకున్నాను. అందులోనూ కోమలగారూ, ఇన్నయ్యగారూ మాట్లాడే పద్ధతి కూడా బాగా నచ్చింది. పనసకాయలు పెద్దవి అయ్యాక ఇచ్చారు. తేనె పనస అంటారుట. అసలు ఆ రుచి ఎక్కడా చూడలేదు. అవి బాగా పండిపోతే నోట్లోకి జారిపోతాయి తొనలు. (ఇన్నయ్యగారూ వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసి, అమెరికా వెళ్ళిపోయినా... ఈ సంవత్సరం వరకూ ప్రతి సంవత్సరం పనసకాయలు ఒక ఆటో నిండా తెచ్చుకుని అందరికీ పంచిపెడతాం.)

రేపటి నుంచి వస్తానని చెప్పాను. మర్నాడు పొద్దున్న 10.00 గంటలకి రమ్మన్నారు. చిన్న చిన్న స్క్రీన్ ప్రింటర్స్ అందరూ బయట ఎక్కడెక్కడో చేయించుకుంటున్నారు. పుస్తకాలు చేయించుకునేవాళ్ళు మాత్రం నేను మళ్ళీ ఇంట్లో చేస్తున్నాను అనగానే వచ్చి కలుస్తామన్నారు. అందుకని నేను నిశ్చింతగానే వున్నాను.

తెల్లారింది. పిల్లల పనులు చూసేసి, నేను బల్కంపేట నుంచి సారధీ స్టూడియోస్ బస్ స్టాప్ వరకు (3 కిలోమీటర్లు) నడుచుకుంటూ వెళ్ళాను. ఇప్పుడున్నన్ని బస్సులు అప్పుడు లేవు. మా వారు బస్ ఎక్కమన్నారు కానీ, ఏ బస్ ఎక్కాలో తెలియలేదు. అన్ని బస్ లు ఫుల్ గా వస్తున్నాయి. టైం 10 అయిపోయింది. మొత్తానికి ధైర్యం చేసి షేర్ ఆటోనే ఎక్కి నేను వెళ్ళేసరికి ఇన్నయ్యగారు నాకోసం ఎదురు చూస్తూ కూచున్నారు.

ఆయన రోజూ కొంత కొంత మేటర్ పక్కన కూచుని చెప్తుంటే ఒక పది రోజులలో పుస్తకం పూర్తిచేశాం. కోమల గారు ‘వైల్డ్ శ్వాన్స్’ అనే పుస్తకం ‘అడవికాచిన వెన్నెల’ తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకం కూడా చేశాను. చైనాలో ఒక తల్లి, కూతురు, మనవరాలు పడిన కష్టాలు. చైనాలో వాళ్ళ జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో... తెలియచేస్తుంది. చాలా అద్భుతమైన పుస్తకం. చక్కటి అనువాదం. దీనికి ముప్పాళ రంగనాయకమ్మగారు చాలా రివ్యూ ఒక పుస్తకంగా రాశారు.

ఇవయిపోయిన తర్వాత కోమల గారివి, ఇన్నయ్యగారివి చాలా పుస్తకాలే చేశాను. మా ఇంట్లోనే వర్కు చేసుకుంటూ, చేసి ఇచ్చేదాన్ని. అప్పుడప్పుడు ఏమైనా వ్యాసాలు, లెటర్లు వుంటే రమ్మనేవారు. పదిహేను రోజులకి ఒకలెక్క చెప్పమని వాటికి డబ్బులు ఇచ్చేసేవారు. అలా నాకు వాళ్ళ కుటుంబంతో సన్నిహితత్వం అలవాటయిపోయింది.

నేను ఎప్పుడైనా వాళ్ళింటికి వెళ్ళి వచ్చేటప్పుడు మా అమ్మాయి "అమ్మా...! ఎస్. ఆర్. నగర్ లో ఉన్నావా...? నేను వస్తున్నాను. ఇద్దరం కలిసి వద్దాం" అనేది. ఇద్దరం దారిలో కలిసేవాళ్ళం. వస్తూ వస్తూ అక్కడ ఒక పానీపూరీ బండి దగ్గిరకి వెళ్ళి పానీ పూరీ తినేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఇంటికి వెళ్ళడం వీణాకి చాలా ఇష్టంగా వుండేది.

అక్కడ ఒక బండీ అతను ఫలూదాతో మిల్క్ షేక్ చేసేవాడు. చాలా బావుండేది. ఇద్దరం కలిసి అది తాగేసి మావారికి, మా అబ్బాయికి ప్యాక్ చేసి పట్టికెళ్ళేవాళ్ళం. ఇంకోసారి ఫ్యూట్ జ్యూస్. ఇప్పుడు రోడ్లమీదకి ఎప్పుడైనా వెడితే నేను, మా అమ్మాయి కబుర్లు చెప్పుకుంటూ తిరిగిన రోజులు గుర్తుకు వస్తాయి. అదొక చక్కని అనుభూతి.

4 కామెంట్‌లు:

  1. తిరిగి మీ ప్రపంచంలోకి వచ్చేసారన్నమాట? అమ్మయ్య. ఇక మీ పనులకు మీరే సర్వాధికారి. గుడ్.

    రిప్లయితొలగించండి
  2. అవును సర్ అదే నాకు ఆనందంగా అనిపించింది. నమస్కారం సర్.

    రిప్లయితొలగించండి
  3. మీరు ఎలా డీటీపీ చేసేవారు? వారు లైవ్‌గా డిక్టేట్ చేస్తుంటే అలాగే చేసేయటం కుదురుతుందా మరి? మీరు మేటర్ అంతా ఇలా సేకరించుకొని తరువాత డీటీపీ ఫార్మేట్ చేసేవారని అనుకుంటున్నాను. అఫ్‌కోర్స్ నాకు ఈడీటీపీ చేయటం తెలియదు లెండి. అందుకే అడుగుతున్నాను.

    రిప్లయితొలగించండి
  4. కొంతమంది స్క్రిప్ట్ ఇస్తారండీ.... దీంతో మాకు రకరకాల చేతిరాతలు అలవాటయ్యాయి. నరిసెట్టి ఇన్నయ్యగారు ఇండియా నుంచి అమెరికా వెళ్ళిపోయాక నాకు అమెరికా నుంచి ఫోన్ లో డిక్టేట్ చేసేవారు. నేను గూగుల్ ఛాట్ లో వీడియో కాల్ చేసి గూగుల్ డాక్యుమెంట్స్ లో టైప్ చేసేదాన్ని. నేను టైప్ చేసేది ఆయనకి కనిపించేది. తప్పులుంటే వెంటనే కరెక్ట్ చేసేవారు. అలా ఆయన పుస్తకాలు ఐదు చేశాను. అంటే యూనీకోడ్ ఫాంట్ మనం బ్లాగర్ లో చేస్తున్న ఫాంట్ లో చేసేదాన్ని. దాన్ని మళ్ళీ అనూఫాంట్స్ లోకి మార్చుకుని పుస్తకంగా రూపుదిద్దేదాన్ని. ఇన్నయ్య గారి శ్రీమతి కోమలగారు స్క్రిప్ట్ అమెరికా నుంచి పోస్ట్ చేసేవారు. వాళ్ళ పుస్తకాలు చాలానే చేశాను. అయితే డబ్బుల విషయంలో చాలా లిబరల్ గా వుండేవారు. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఇస్తారు. కొంతమంది ప్రింట్ అయిన పుస్తకాలు ఇచ్చి మళ్ళీ చెయ్యమనేవారు. డిటీపి అంటే ఏమీ లేదండీ... మనకిచ్చిన మేటర్ ని ప్రింట్ ఫార్మేట్ లో టైపు చెయ్యడం లేదా మార్చడం. ఇప్పుడు కొంతమంది రచయిత/రచయిత్రులు వర్డ్ ఫైల్ లో యూనికోడ్ లో టైపు చేసి మెయిల్ చేస్తారు. దాన్ని నేను అనూలోకి మార్చుకుంటాను.

    రిప్లయితొలగించండి