11, నవంబర్ 2022, శుక్రవారం

*** ఇన్నయ్యగారి ఇంట్లో అందమైన జ్ఞాపకాలు *** - 59

 *** ఇన్నయ్యగారి ఇంట్లో అందమైన జ్ఞాపకాలు *** - 59


ఇన్నయ్యగారు, కోమల గారు (ప్రపంచాన్ని వీడి డిసెబరుకి సంవత్సరం)

ఇన్నయ్యగారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను పైన రూంలో వర్కు చేస్తుంటే మధ్యాహ్నం ఆయన చెరోచేత్తో చెరో టీ కప్పు పట్టుకుని కాలుతో మెయిన్ డోర్ తోసుకుని వచ్చేవారు. నేను వర్కులో ఉన్నప్పుడు చూసేదాన్ని కాదు. రెండు మూడుసార్లు అలా జరిగింది. ఒకసారి తలుపుకొట్టిన చప్పుడయ్యిందని చూద్దును కదా ఆ దృశ్యం కళ్ళబడింది. నాకన్నా దాదాపు 26 సంవత్సరాలు పెద్దాయన అలా తేవడం చూసి ఇబ్బంది పడ్డాను.

అప్పటి నుంచీ “కింద నుంచీ ఫోన్ లో పిలవండి సర్ నేను వచ్చి తీసుకుంటాను” అని చెప్పాను. కోమల గారు రోజూ ఏదో ఒక చిరుతిండి టీతో బాటు ఇచ్చేవారు. నాకు ఒక విషయం నవ్వు తెప్పిస్తుంది. ఒకరోజు ఇన్నయ్యగారు నా చేతిలో ఒక కాయితం పొట్లం పెట్టారు. నేను బయటికి వెళ్ళాక చూశాను. అందులో ఖర్జూరపు పళ్ళున్నాయి. ఒక్కసారి చిన్న పిల్ల చేతిలో పెట్టినట్లు అనిపించింది. ఒకరకమైన అనుభూతి. వాళ్ళిద్దరూ కూడా నన్ను చిన్నపిల్లలాగే చూసేవారు.

నేను కిందకి వెళ్ళి టీ తీసుకుని పైకి వచ్చినప్పుడు. ఇంటిని ఆనుకుని చెట్లకిందకి వచ్చేలా ఒక అరుగు వుండేది. ఆ అరుగు మీద కూచుని టీ తాగేదాన్ని. అలా కూచున్నప్పుడు ఎండిన చెట్ల ఆకుల మీద ఉడతలు పరుగులు తీస్తుంటే ఆ శబ్దం చాలా వింతగా, వినసొంపుగా వుండేది. అప్పుడప్పుడు ఎండిన ఆకులు గాలికి సుడులు తిరుగుతూ రాలుతుండేవి. ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి చిన్న చిన్న పక్షులు ఎగురుతూ ఆటలాడుతుండేవి. మల్లెపందిరి మీద విచ్చుకున్న పువ్వుల వాసన గాలితో అలా అలా ముక్కుపుటాలని తాకి వెళ్ళేది. చెట్ల చాటు నుంచి సూర్యకిరణాలు పచ్చటి ఆకుల మీద పడి అకుల పచ్చదనం మరింత ఎక్కువగా కనిపించేది.

గోడపక్కన ఉన్న కుంకుడు చెట్టు మీద నుంచీ కాయలు టపటపలాడుతూ కిందపడుతుండేవి. ఆ చప్పుళ్ళకి చెట్టుకింద ఉన్న ఉడతలు పరుగులు పెట్టేవి. ఆ చప్పుళ్ళు విని నాకు – కృష్ణదేవరాయలు పూరించమని ఇచ్చిన పద్యపాదం “జంబూఫలాని పక్వాని - పతంతి విమలే జలే – కపికంపితశాఖాభ్యో - గుళు గుగ్గుళు గుగ్గుళు” గుర్తుకు వచ్చింది.

కుంకుడు చెట్టు పక్కనే ఒక ఔట్ హౌస్ వుండేది. అందులో వాళ్ళ పనిమనిషి వుంటుంది. ఆ ఔట్ హౌస్ పక్కన మెట్లున్నాయి. ఆ మెట్ల మీద నుంచి పైకి వెడితే కొండ బల్లపరుపుగా వుండేవి. రకరకాల మొక్కలు వుండేవి. అక్కడ నుంచీ కొంచెం ముందుకి వెడితే కొంతదూరం వెళ్ళి అగిపోయిన ఒక కొండ దారి, ఆ కొండని మలిచారా అన్నట్టు చిన్న చిన్న కొండలు కూచునేందుకు వీలుగా వున్నాయి. అక్కడ కూచుని టీ తాగుతూ, ఒక పుస్తకం చదువుకుంటూ వుంటే ఎంత బావుంటుంది అనిపించింది.

నాకయితే ఒక రోజు రాత్రి ఆ ఇంట్లో వుండి పొద్దున్న ఆ చెట్ల కింద కూచుని ఉదయపు అందాలు ఆస్వాదించాలనిపించేది. వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా ఆ చెట్ల అందాలు ఆస్వాదించేదాన్ని.
వాళ్ళు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కోమలగారు అనువదించిన “కాళరాత్రి” పుస్తకం ఇన్నయ్యగారి ఇంటి పైన స్థలంలోనే జరిగింది. – ప్రస్తుతం వాళ్ళ ఇల్లు కొనుక్కున్న అక్షర పబ్లికేషన్స్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్లుగా దాన్ని చేసుకున్నారు. నేను వర్ణించిన అందాలు ఇప్పుడు లేవు.

***

ఇన్నయ్యగారింట్లో పైన చాలా పుస్తకాలతో ఒక లైబ్రరీ వుండేది. అక్కడ రకరకాల పుస్తకాలు వుండేవి. ఎప్పుడైనా ఆ పుస్తకాలు చూస్తుండేదాన్ని. హేతువాదం, నాస్తికత్వం, రాజకీయాలు, సైన్స్ కి సంబంధించిన ఎన్నో పుస్తకాలు - ఆయన చేసి హేతువాద ఉద్యమ కార్యక్రమాలకి సంబంధించిన సిడిలు, ఫోటోలు వుండేవి. ఒక వ్యక్తికి నచ్చిన విషయంలో రకరకాల పరిశోధనలు చేసి, పుస్తకాలు రాసి దానికోసం కృషి చెయ్యడమనేది గొప్ప విషయం. ఆయన రచనల్లో ఒక అనుభవమున్న పాత్రికేయుడుగా రాసిన పుస్తకాలు చాలా నేను చేశాను.

అందరి దగ్గర నుంచీ నేర్చుకునే విషయాలు చాలానే వుంటాయి. మనకి నచ్చిన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీడియా చేతిలో ప్రపంచం ఉంది కాబట్టి మనం అడక్కుండానే అన్ని విషయాలు మన కళ్ళముందుంటున్నాయి. నేను నా జీవనయానంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఇన్నయ్యగారి పుస్తకాలకి స్టేట్ ఆర్కైవ్స్ వాళ్ళు ఒక పూర్తి ర్యాక్ ఇచ్చారు. ఆయన వ్యాసాలు పడిన ప్రతి న్యూస్ పేపర్, రచించిన ప్రతి పుస్తకం అక్కడ ఉంది.

ఇన్నయ్యగారు ఏదైనా విషయం చెప్తూ మనం దాన్ని సరిగ్గా గ్రహించలేదు అన్నప్పుడు ఆయనకి కోపం వచ్చినా... ఇది ఇక్కడతో వదిలేద్దాం అని మాట్లాడకుండా వెళ్ళిపోయేవారు. ఒక రెండురోజులు ఫోన్ కూడా చెయ్యకుండా వుండి. మళ్ళీ మూడో రోజున ఫోన్ చేసి వర్కు చెయ్యడానికి రమ్మనేవారు. మొహం మీద తిట్టేవాళ్ళకన్నా ఇలా మాట్లాడకుండా ఉండేవాళ్ళంటే భయం ఎక్కువ వుంటుంది. మనం తర్వాత వాళ్ళని నెమ్మదిగా అడిగి మన తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే అవకాశం వుంటుందని నా అభిప్రాయం. ఇన్నయ్యగారికి సంబంధించిన ఎన్నో పుస్తకావిష్కరణలలో, కార్యక్రమాలలో నేను కూడా పాల్గొన్నాను. కొన్నింటికి నిర్వహణాబాధ్యత నాకు అప్పగించారు.

4 కామెంట్‌లు:

  1. >వాళ్ళిద్దరూ కూడా నన్ను చిన్నపిల్లలాగే చూసేవారు.
    అవునా. కావచ్చునండీ. అభిమానం ఉన్నచోట అలాగే ఉంటుంది. మాచిన్నతమ్ముడికి నలభైయైదు. వాడి పుట్టుక కూడా నాకింకా బాగా గుర్తే. నాకంటికి ఇప్పటికీ వాడు చాలా చిన్నపిల్లవాడిలాగానే కనిపిస్తాడు. ఎప్పటికీ అలాగే కనిపిస్తాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజంగానేనండీ. మేమూ అంతే మా చిన్న చెల్లెలి పుట్టుక చూశాం. ఎత్తుకుని, ఆడించి, అన్నం తినిపించి చేసేవాళ్ళం. ఇప్పుడు తను ఒక 16 సంవత్సరాల పిల్లకి తల్లయినా... మా దగ్గిర గారాలు పోతూనే వుంటుంది. మాకూ చిన్న పిల్లలాగే వుంటుంది.

      తొలగించండి
  2. ఇన్నయ్య దంపతులు పాతతరం వారు కదా వారు చూపించే అభిమానాలు అలాగే ఉండేవి.

    ఆనాటి పెద్ద సైజు కుటుంబాల్లో చాలా మటుకు అలాగే ఉండేదండి. ఇప్పుడు 60 కు దగ్గర పడుతున్న మా ఆఖరి తమ్ముడి పుట్టుక నాకూ గుర్తే. వాడిని నేను మా “దూరపు” బంధువు అంటుంటాను (మా ఎనిమిది మందిలో చివరివాడు లెండి) 🙂.

    మీరు వర్ణించిన జుబిలీ హిల్స్ ఏ యుగంనాటిదో అనిపిస్తుంది - ఇప్పటి కాంక్రీట్ జంగిల్ని చూస్తుంటే. అప్పటి కాలనీకి నేనూ తరచుగా వెడుతూనే ఉండేవాడిని. వ్యాపారులకు, కార్పెరేట్లకు దాసోహం అయిపోయి చక్కటి నివాస ప్రాంతాన్ని నాశనం చేసారు. పాలరాయి అమ్మకం దుకాణాల్ని అనుమతించి శ్రీనగర్ కాలనీని ఆనుకునున్న కాలనీలను భ్రష్టు పట్టించినట్లు. ఇవన్నీ అరబ్బు - ఒంటె కథ లాంటివి (The Arab and the Camel) (Aesop’s Fables) ::: అంగుళం చోటిస్తే ఆరడుగులు ఆక్రమించుకున్నట్లు. ఇప్పుడంతా వ్యాపారులదే హవా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బావుంది సర్ మీ ఆఖరి తమ్ముడి ముచ్చట. ఎంత పెద్దయినా చిన్నవాళ్ళే అనిపిస్తారు. డబ్బు మహత్యం. అన్ని చోట్లా అలాగే మారిపోయాయి. ఒకప్పుడు శ్రీనగర్ కాలనీలో రెండే పాలరాయి షాపులున్నట్టు గుర్తు.

      అంగుళం చోటిస్తే ఆరడుగులు ఆక్రమించుకున్నట్లు. ఇప్పుడంతా వ్యాపారులదే హవా - ఇది కరక్టేసర్.

      తొలగించండి