25, జూన్ 2022, శనివారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 26 *** గాడిలో పడుతున్న పనితనం – కంప్యూటర్ సెక్షన్ కి నేనే మహారాణీని ***

 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 26  *** గాడిలో పడుతున్న పనితనం – కంప్యూటర్ సెక్షన్ కి నేనే మహారాణీని ***



లక్ష్మి లీవులో వెళ్ళిందని చెప్పారు. మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఇక రవీంద్రనాథ్ ని బయట పనులకి పంపించడం మొదలుపెట్టారు. ఇప్పుడు పెద్ద కంప్యూటర్ నా చేతికి చిక్కింది. టైపిస్ట్ ప్రసాద్ అప్పుడప్పుడు నేను నేర్చుకున్న చిన్న కంప్యూటర్ మీద ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అతను అప్పటికే కొంత నేర్చుకున్నాడు.
విజయపాల్ రెడ్డిగారు “నాగలక్ష్మీ మనకి ఇంక వర్కులు మొదలవుతాయి. మీరు తెలుగు బాగా ప్రాక్టీస్ చెయ్యండి. అలాగే ప్రింటర్ మీద ప్రింటౌట్స్ ఎలా ఇవ్వాలో కూడా చూడండి. పేపరు వేస్ట్ అవుతుందని చూడద్దు. వర్కు రావడం ముఖ్యం. మాన్యువల్స్ ఇచ్చాను కదా... వాటిల్లో కూడా మీకు నేర్చుకునేవి చాలా వుంటాయి” అని చెప్పేసి వెళ్ళిపోయారు.

ఏదో ఒక మేటర్ దగ్గిర పెట్టుకుని ప్రాక్టీస్ చేసేదాన్ని. అది సరిగ్గా వచ్చిందోలేదో చూడడానికి మళ్ళీ డార్క్ రూంలోకి వెళ్ళి డెవలప్ చేసేదాన్ని. అలా ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటూ (***అంటే చెప్పాను కదా... ఒక లెటర్ మీద ఎత్వాలు, గుడులు పడడానికి కెర్నింగ్ ఇచ్చేవాళ్ళమని, అదన్నమాట***) మొత్తానికి చాలా వరకు కరెక్ట్ గా చెయ్యడం నేర్చుకున్నాను. నాకు వర్కు ఎంతవరకు వచ్చిందో ఇంకా విజయపాల్ గారికి తెలియదు.

అయితే ఒకరోజు నేను 6 గంటలకి అన్నీ సద్దుకుని ఇంటికి బయల్దేరడానికి రెడీ అయ్యాను. ఇంతలోనే ఒకతను ఆఘమేఘాల మీద వచ్చాడు. “మేడమ్ వెళ్లిపోతున్నారా... ఇది టిటిడి వాళ్ళది, రేపు పొద్దున్న అర్జంటుగా పేపర్లో రావాలి. ఇదొక్కటీ చేసేసి వెడతారా?” అన్నాడు. నేను “ఎం.డి గారిని అడగండి” అన్నాను.

అతను విజయపాల్ గారి దగ్గిరకి వెళ్ళి అడిగాడు. ఆయన “ఇంకా మా వాళ్ళు ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు ఇంత హడావిడి అయితే కష్టం” అన్నారు. అతను నా మొహంలోకి, ఆయన మొహంలోకి చూస్తున్నాడు.

“ఏం నాగలక్ష్మీ మీకు తోడుగా కృష్ణ (వాళ్ళావిడ) ని పంపిస్తాను చేస్తారా, మిమ్మల్ని ఇంటిదగ్గర మేము దింపుతాము” అన్నారు. నేను కాదనలేకపోయాను. మళ్ళీ వెళ్ళి కంప్యూటర్ ఆన్ చేశాను. అతను మేటర్ ఇచ్చేసి మళ్ళీ గంటలో వస్తాను అని వెళ్ళిపోయాడు. కూచుని వర్క్ మొదలుపెట్టాను. కృష్ణ గారు వచ్చారు. ఆవిడ వెనకే నాకు తినడానికి బిస్కట్లు, టీ రాములు తెచ్చి ఇచ్చాడు. వాటి పని కానిచ్చి, మళ్ళా చెయ్యడం మొదలు పెట్టాను.

బయటికి వెడుతున్న మొట్టమొదటి ఔట్ పుట్. కొంచెం కంగారుగానే అనిపించింది. అంటే మొత్తానికి అది చేసే సరికి రాత్రి తొమ్మిది అయిపోయింది. దాన్ని మళ్ళీ డార్క్ రూం లోకి తీసుకెళ్ళి డెవలప్ చేశాను. దానిని తీసుకుని వచ్చి చూస్తే అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు వున్నాయి.

అతను దానికే చాలా థాంక్స్ మేడమ్ అన్నాడు. నేను ఆ తప్పులు కూడా కరెక్ట్ చేశాను. మొత్తానికి ఫైనల్ ఔట్ పుట్ వచ్చేసరికి రాత్రి పది గంటలు అయ్యింది. అతను చాలా సంతోషంగా తీసుకుని వెళ్ళిపోయాడు. విజయపాల్ గారు, కృష్ణ ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. నామీద వాళ్ళకి మొట్టమొదటిసారిగా మంచి అభిప్రాయం కలిగింది. నా మీద నాకు నమ్మకం కూడా వచ్చింది.
కానీ వాళ్ళు నన్ను దింపాలంటే మెహదీపట్నం రావాలి. అంత రాత్రి వాళ్ళకీ కష్టమే. ఆరోజు వాళ్ళింట్లోనే వుండిపోయాను. రాములు నాకు కావలసినవన్నీ చూసిపెట్టాడు. నేను వాళ్ళింట్లో ఒక సభ్యురాలిగా అయిపోయాను. మర్నాడు పొద్దున్న ఆఫీసులో ఏదో పెండింగ్ పని వుంటే చూసుకుని మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయాను. నాకు కావలసినవన్నీ - తినడానికి, తాగడానికి రాములు చూసుకున్నాడు.

*** అప్పటి ముఖ్యమంత్రి రామారావుగారి బడ్జెట్ వర్కు***




ఎన్.టి.రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలకి బడ్జెట్ వర్క్ మా ఆఫీస్ కి వచ్చింది. వరసగా 5 రోజుల పాటు వాళ్ళు పగలూ రాత్రి వచ్చి ఆఫీలో వర్కు చేసుకునేవారు. పగలు నేను, రాత్రి ప్రసాద్ చేసేవాళ్ళం. ఒక్కోసారి లేటుగా కూడా వుండాల్సి వచ్చేది. ఎందుకంటే నా కంప్యూటర్ మీద పని ఎక్కువ చెయ్యాల్సి వచ్చేది.

సెక్రటేరియట్ నుంచి వచ్చిన వాళ్ళు మేము చేసిన వర్కు ప్రింట్లు తీసుకుని – రామారావుగారి దగ్గిరకి ***తెల్లవారుఝామున 4 గంటలకి*** వెళ్ళేవారు -

ఆ టైములో వీళ్ళకి వెళ్ళగానే వేడి వేడిగా ఇడ్లీ, నెయ్యివేసిన కారప్పొడి, చిక్కటి కాఫీ ఇచ్చేవారుట. వాళ్ళు తినేలోపున - ఆయన అన్నీ చూసి కరక్షన్స్ ఎక్కడ ఏం చెయ్యాలో చూసి చెప్పేవారు. ఆయన వాళ్ళతో ఎటువంటి విసుగూ లేకుండా మాట్లేడేవారని చెప్పారు. ఎంత ఓపికగానో చూసేవారని చెప్పారు.

4 గంటలకి ఒక్క నిమిషం లేటయినా వూరుకునేవారు కాదు. అందుకని వాళ్ళూ నిద్రలేకుండానే మాతోబాటు పనిచేసేవారు. ఆయన వాళ్ళని పనితోబాటు, ఎక్కడ చేయిస్తున్నారు అనే విషయం కూడా తెలుసుకునేవారని చెప్పారు. రామరావుగారు ఎప్పటికప్పుడు వర్కు ఎంతవరకు సాగుతోంది అనే వివరాలు తెలుసుకుంటుండేవారు. హిమాయత్ నగర్ లో ఉన్న మా ఆఫీసు సెక్రటేరియట్ కి చాలా దగ్గరగా వుండడంతో వాళ్ళకి పేపర్లు త్వరగా అందించగలిగాం.

సెక్రటేరియట్ నుంచి వచ్చిన ఒకతని పేరు ఆనంద్ బాబు. ఆయన పుడుతూనే ఏడవలేదుట. ఎప్పుడూ నవ్వుతూనే వుండేవాడుట. అందుకని ఆ పేరు పెట్టారుట.

ఆనంద్ బాబుగారు ఒక రోజు టైముకి తప్పులు లేకుండా మీరు చేసిస్తున్నారని ముఖ్యమంత్రిగారు చాలా సంతోషిస్తున్నారమ్మా.... ఆయనకి తెలుగు భాష అంటే గౌరవం అని చెప్పారు. మిమ్మల్ని జాగ్రత్తగా సెక్రటేరియట్ కారులోనే ఇంటికి పంపించమన్నారు అన్నారు.


ఆనంద్ బాబుగారికి రామారావు వాళ్ళ ఆఫీసు కారులో నన్ను ఇంటి దగ్గర దింపుతామంటే.... విజయపాల్ గారు ఊరుకునేవారు కాదు. రాముల్ని ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి పంపేవారు.

మాకు ముఖ్యమంత్రిగారి వర్కు చెయ్యడం అంటే చాలా సంతోషంగా వుండేది.


2 కామెంట్‌లు:

  1. పనితనానికి వినయం కూడా తోడయితే పై వారి మెప్పుతో బాటు వృద్ధిలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిరూపించుకున్నారు.

    అవునట, ఎన్టీ రామారావు గారు - ఇంట్లోను, స్టూడియోలోను ఎలా ఉండేవారో తెలియదు గానీ - బయట అందరితోను ముఖ్యంగా మహిళలతో చాలా మర్యాదగాను హుందాగానూ ప్రవర్తించేవారని అంటారు.

    రిప్లయితొలగించండి
  2. అవును సర్. నా ఓపికే నాకు కొత్త పని నేర్చుకోవడానికి అవకాశాన్నిచ్చింది. రామారావుగారి విషయాలు ఆనంద్ గారూ వాళ్ళు చాలాసార్లు చెప్పేవారు.

    రిప్లయితొలగించండి