24, ఆగస్టు 2022, బుధవారం

కొత్త జీవితానికి నాంది - 42 *** పెళ్ళయ్యిందిగా... తిరుపతికి వెళ్లాలన్నారు ***

 కొత్త జీవితానికి నాంది - 42   *** పెళ్ళయ్యిందిగా... తిరుపతికి వెళ్లాలన్నారు ***

*** తిరుపతి ప్రయాణం – కాలినడకన కొండ మీదకి***




పెళ్ళయిన తర్వాత మా అత్తగారూ వాళ్ళు మద్రాసు వెడుతూ మమ్మల్ని తిరుపతి తీసుకుని వెళ్ళారు. మా తోటికోడలు వాళ్ళ పుట్టిల్లు తిరుపతి మిట్టవీధిలో వుంది. వాళ్ళ అన్నయ్యలు ముగ్గురు తిరుపతి దేవస్థానంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళింటికి వెళ్ళాం. ఉమ్మడి కుటుంబం. ఇల్లు మరీ పెద్దది కాకపోయినా ఇల్లంతా పిల్లలతో, మనవలతో వయసు మీరిన ఇంటిపెద్దలని చూస్తే ఆశ్చర్యం, ఆనందంగా అనిపించింది. తిరుపతి కాబట్టి వచ్చేపోయేవాళ్ళు ఎక్కువ. కానీ అందరూ మర్యాదస్తులు. వాళ్లు పెట్టిన భోజనం కన్నా... ఆప్యాయతకి కడుపు నిండిపోయింది.

నేను తిరుపతి చూడ్డం అదే మొదటిసారి కావడంతో చూడాలన్న ఆత్రుత ఎక్కువైంది. (ఎప్పుడో నేను చంటిపిల్లగా ఉన్నప్పుడు అమ్మావాళ్ళు కారులో వెళ్ళారని విన్నాను.) మర్నాడు పొద్దున్నే 4 గంటలకి బయల్దేరి మేము తిరుపతి కొండకి నడుచుకుంటూ వెళ్ళాం. అదొక అద్భుతమైన అనుభూతి. చల్లటి వేళ, పొద్దున్నే కాఫీ తాగి బయల్దేరాం. మధ్య మధ్యలో కూచుంటూ, మళ్ళీ మెట్ల దారమ్మట ప్రయాణం సాగించాం. దారిలో కట్టెల పొయ్యిమీద వేసిన వేడి వేడిగా చిల్లుల చిల్లుల మెత్తటి దోసెలు, పచ్చడి తిన్నాం. అతి తక్కువ ధరకే వచ్చాయి. ఆ చల్లదనానికి వేడిగా కడుపులో పడిన ఆ దోశలు శక్తినిచ్చాయి.

మరికొంత దూరం వెళ్ళాక పోపు, కరివేపాకు వేసిన పలుచటి మజ్జిగ తాగాం. చాలా బావుంది. ఎన్ని గ్లాసులు తాగినా తాగినట్టే లేదు. అక్కడక్కడ అమ్ముతున్న తోతాపురి మామిడి కాయల ముక్కలు కాలక్షేపాన్నిచ్చాయి.

దారిలో జింకల పార్కు చూడ్డానికి చాల బావుంది. మనని చూసి అవి చూసే బెదురు చూపుల్లో ఉన్న అందం చెప్పలేం. ఓసారి తొంగిచూసి వడి వడిగా వెళ్ళిపోతుంటే వాటి హడావుడికి నవ్వొచ్చింది. ఆ అడవి చెట్ల అందాలు, పక్షుల కిలకిలా రావాలు మనసుకి ఆహ్లాదంగా వుండి నడిచిన అలసట తెలియలేదు. మొత్తానికి ఆడుతూ పాడుతూ కొండ పైకి ఎక్కేశాం.

అక్కడకి వెళ్ళాక కాటేజ్ తీసుకుని కొంచెం విశ్రాంతి తీసుకుని పరిశుభ్రంగా దర్శనానికి వెళ్ళాం. దర్శనం చాలా బాగా జరిగింది. మధ్యలో వాళ్ళు పెట్టిన మిరియాల పులిహోర, అతి చిన్న లడ్డూలు చూసి నేను ఆశ్చర్యపడ్డాను. అప్పటి వరకూ మిరియాల పులిహోర తినలేదు. ఉచితభోజనం బావుంటుంది అన్నారు కానీ మాకోసం ఇంటిభోజనం రెడీగా వుండడంతో దాన్ని విరమించుకున్నాం.

కొండ దిగి వచ్చేటప్పుడు బస్ లో వచ్చాం. కొండ మార్గంలో బస్సు దిగుతుంటే అదొక వింత అనుభూతి. పచ్చని చెట్ల అందాన్ని, చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కొండ దిగువకి వచ్చాం. అక్కడ నుంచీ మళ్ళా మిట్ట వీధికి వెళ్ళి వాళ్ళు పెట్టిన చిట్టి మామిడి పండ్ల పులుసు (కాయలకి కాయలతో), వేయించిన కందిపప్పుతో చేసిన పప్పు, పులిహోర, గారెలు, పరమాన్నంతో ఆనందంగా భోజనం చేసి వాళ్ళిచ్చిన బహుమతులు స్వీకరించి తిరుగు ప్రయాణం అయ్యాం.

విజయవాడలో మా పెళ్ళి పీటల మీద కూచున్న పెద్దక్కా వాళ్ళింటికి వెళ్ళి, వాళ్ళతో కాసేపు గడిపి రాత్రికి హైదరాబాదుకు ప్రయాణం అయ్యాం. పొద్దున్నే ట్రైన్ దిగి నేను అమ్మదగ్గిరకి, ఆయన వాళ్ళ రూంకి వెళ్ళిపోయాం.

*** కొత్త సంసారానికి సంరంభం ***

పెళ్ళి హడావుడిగా అయిపోవడంతో ఇల్లు గురించి ఆలోచించే టైము లేకపోయింది. జానకిరాం గారి ఆఫీసు బాలానగర్ కావడం, షిఫ్ట్ డ్యూటీలు అవడంతో దూరం అయితే కష్టం అవుతుందని అప్పటికే సంజీవరెడ్డి నగర్ లో ఉన్న అక్కకి ఇల్లు చూడమని చెప్పాం. అంతదాకా ఎవరిళ్ళలో వాళ్ళు.

మొత్తానికి అక్కావాళ్ళ ఇంటి దగ్గరే మాకు ఇల్లు దొరికింది. రు. 300 అద్దె. ఇంటివాళ్ళు చాలా బాగా మాట్లాడారు. ఇల్లు బాగానే వుంది కానీ, ఇంట్లోకి సామాను అమర్చుకోవాలి. మా పెళ్ళికి గిన్నెలు, గ్లాసులు, ప్లేట్లు, కుక్కర్ తో సహా కావలసినవన్నీ వచ్చాయి.

ఒకసారి అమ్మని తీసుకుని వెళ్ళి ఇల్లు చూపించాను. అమ్మ ఏమీ మాట్లాడలేదు. అమ్మ కొంచెం దిగులుగా ఉన్నట్లు అనిపించింది. మళ్ళీ అమ్మని తీసుకుని వెళ్ళిపోయాను. మేము సెటిల్ అవడానికి కొన్ని రోజులు పడుతుంది.

మధ్య మధ్యలో జానకిరాం గారు వచ్చి వెడుతుండేవారు. జూన్ లో పెళ్ళయితే సెప్టెంబరు వరకూ అమ్మ దగ్గిరే వుండిపోయాను. పిన్నీవాళ్ళ పిల్లలు ఏలూరు వెళ్ళిపోవడంతో రెంట్ తగ్గుతుందని చిక్కడపల్లి మెయిన్ రోడ్డు మీద ఒక మేడమీదకి మారాం. అక్కడ నీళ్ళ ఇబ్బంది. రాత్రీపగలు వాహనశబ్దాలు మరీ భయంకరంగా. మళ్ళీ అక్కడ నుంచి నారాయణగూడా తాజ్ మహల్ ఆపోజిట్ వెదురు బుట్టలు తయారు చేసే వాళ్ళ వెనక వుండే ఇంట్లోకి వెళ్ళాం. అది ఎవరో చెప్పారని వెళ్ళాం. కానీ అందరూ అక్కడవుండలేరు. ఇది నచ్చలేదు.

ఒక నెల రోజులకే బరకత్ పూరా చౌరస్తాకి దగ్గరలో కింద ఇల్లు అన్ని రకాలుగా వీలుగా వుంది. అక్కడికి మార్చేసి, సెప్టెంబరు 10వ తేదీకి నేను సంజీవరెడ్డి నగర్ లో వున్న మా ఇంటికి వెళ్ళిపోయాను.

ఆఫీసుకి నల్లకుంట దగ్గిరే కాబట్టి లంచ్ టైంలో అమ్మ దగ్గిరకి వస్తుండేదాన్ని. అమ్మకి ఇష్టమయిన పెద్ద పెద్ద సీతాఫలాలు, జామకాయలు, అరటిపళ్ళు- ఇంకా కూరగాయలు తెచ్చి ఇస్తుండేదాన్ని. ఒకరోజు నేను వెళ్ళడం లేటయింది. అమ్మ అప్పుడే అన్నం పెట్టుకుని తింటోంది.

“ఏంటమ్మా ఇంకా తినలేదు” అంటే, “నువ్వొస్తావని కూచున్నాను. నువ్వు రాలేదని ఇప్పుడే తింటున్నాను” అంది ఆ మాటల్లో నన్ను మిస్సవుతున్న బెంగ బాగా కనిపించింది. నాకు తల్చుకుంటే కళ్ళనీళ్లు వస్తాయి. అమ్మకి అన్నీ అమర్చిపెట్టేదాన్ని. అమ్మ దేనికైనా తిట్టినా పట్టించుకునేదాన్నికాదు.

నేను మళ్ళీ ఆఫీసుకి వెళ్ళేటప్పుడు “ఒక వారం వచ్చి వుంటావా... దీపావళి వస్తోందికదా... అక్కలు వాళ్ళ పిల్లలు వస్తారు. జానకిరాంకి నేను చెప్పానని చెప్పు” అంది.

“సరే అమ్మా!” అని ఆఫీసుకి వెళ్ళిపోయాను. రోజూ లంచ్ టైంలో మాత్రం అమ్మ దగ్గిరకి వెళ్ళేదాన్ని. వెడుతూ వెడుతూ పళ్ళో, కూరలో ఏవో ఒకటి తీసుకుని వెళ్ళి ఇచ్చేదాన్ని.


2 కామెంట్‌లు:

  1. ఆ రోజుల్లో తిరుపతి ఆహ్లాదంగానే ఉండేది. అవునూ తెల్లవారుఝామున నాలుగింటికే మెట్లు ఎక్కడం మొదలెట్టారా? ఈ రోజుల్లో అలా చీకటితోనే వెళ్ళడం అంత సేఫ్ కాకపోవచ్చని నా అభిప్రాయం (నేను వెళ్ళి చాలా యేళ్ళయింది లెండి).

    ఇప్పుడంటే ఈ అపార్ట్-మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు వచ్చేసి బీభత్సంగా తయారయింది గానీండి ఒకప్పుడు సంజీవ రెడ్డి నగర్ చిన్న చిన్న ఇండిపెండెంట్ ఇళ్ళతో చాలా బాగుండేది. ఫ్రంట్ లైన్ లో IAS ఆఫీసర్ల క్వార్టర్లు కూడా ఉండేవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈమధ్య మా అమ్మాయిావాళ్ళు ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు తిరుపతి వెళ్ళాలన్నారు. అందరం కలిసి వెళ్ళాం. నడవలేదు. వర్షాలకి మెట్లన్నీ పాడయ్యాయని రిస్క్ తీసుకోలేదు వాళ్ళు. ఒక వెహికిల్ మాట్లాడుకున్నాం. నిజంగానే ఇదివరకటి అందం లేదు, ప్రశాంతత లేదు. కొండమీద పందులు తిరుగుతున్నాయి. అదేమిటి అంటే వరాహావతారంట. అందుకని వాటిని తరమరుట. చాలా మురికిగా ఎక్కడపడితే అక్కడ చితచితగా వుంది. చాలా నిరాశకలిగింది. శుభ్రమనేది కనిపించలేదు. పొద్దున్నే అయితే చల్లగా వుంటుందని మా పెళ్ళయిన కొత్తలో అలా వెళ్ళాం. ఇప్పుడయితే రిస్కే.

      సంజీవరెడ్డి నగర్ మీరు చెప్పినట్లు ఇండిపెండెంట్ ఇళ్ళతో ప్రశాంతంగా వుండేది. పగలు సందులలోంచి నడవాలంటే భయంవేసేది. జనసంచారం వుండేది కాదు. మేమువెళ్ళిన కొత్తలో సంగతులు ముందు ముందు వస్తుంది.

      తొలగించండి