27, ఆగస్టు 2022, శనివారం

కొత్త జీవితానికి నాంది - 43 *** ఆరోజేమయ్యిందో తెలుసా...? ***

 కొత్త జీవితానికి నాంది - 43   *** ఆరోజేమయ్యిందో తెలుసా...? ***





నేను అమ్మ అడిగినట్లు ఒక వారం రోజులు అమ్మ దగ్గిర వున్నాను. అక్టోబరు 19వ తేదీ సోమవారం నేను సంజీవరెడ్డి నగర్ వెళ్ళి అక్కడ కొన్ని పనులు చూసుకుని మళ్ళీ 21వ తేదీ పొద్దున్న అంటే నరకచతుర్ధశి రోజు అమ్మ దగ్గిరకి వచ్చాను. అమ్మ ఎందుకో నీరసంగా వుంది. ఏమైందని అడిగితే - "అందరూ వస్తున్నారు కదా... నీళ్ళు సరిపోవాలి. పంపునీళ్ళు లేటుగా వస్తాయి. అందుకని ఇంటి ముందు ఉన్న బోరింగ్ కొట్టి నీళ్ళు నింపాను. ఎందుకో నీరసం వచ్చింది" అంది.

అమ్మ ప్రేమ ఎలా వుంటుందంటే అటు వచ్చేవాళ్ళమీద ప్రేమ - ఇటు నిద్రపోతున్న చెల్లెళ్ళనీ లేపడం ఇష్టం లేక తనే ఒళ్ళుమరిచి పడిన హడావుడి. అమ్మ పని ఉంటే ఎప్పుడూ కూచునేది కాదు. ముందు ఆ పని అయిపోవాలి. అప్పుడు అమ్మకి నిశ్చింత. అమ్మకి జ్వరం రావడం పడుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు. చాలా హుషారుగానే పనులు చేసుకునేది.

పెద్దక్క అన్నపూర్ణ, పిల్లలు విజయవాడ నుంచి వచ్చారు. రెండో అక్క, బావగారు, వాళ్ళబ్బాయి వచ్చారు. మా వారు నరకచతుర్ధశి రోజు మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చారు. మేము సాయం చేస్తే పెద్దక్క దీపావళి రోజుకి వంటల సంగతి చూసుకుంది. సాయంత్రం కొత్త ప్రమిదలు తెప్పించి, ఇల్లంతా దీపాలు పెట్టించి, అక్క పిల్లల చేత కాకరపువ్వత్తులు కాల్పించి సంతోషపడింది. దీపావళి రోజు అందరితో గడిపి, సాయంత్రం భోజనం చేసేసి, మర్నాడు పొద్దున్నే 5 గంటలకి డ్యూటీ వుందని వెళ్ళిపోయారు. పెద్ద బావగారు, రెండో బావగారు కూడా వెళ్ళిపోయారు. ఇంట్లో అందరం ఆడవాళ్ళు మాత్రమే వున్నాం.

*** గుబులు నింపిన దీపావళి ***

రాత్రి 11.30కి అప్పుడే నిద్రలోకి వెళ్ళబోతున్న నన్ను పెద్దక్క లేపింది. అమ్మ ఏదో అవస్థ పడుతోంది. ఏదో అర్థం కాని పరిస్థితి. నేను అన్నీ అర్థం చేసుకునేసరికి రాత్రి 12.00 గంటలు అయ్యింది. అక్క నాతో "బయట రిక్షా కానీ, ఆటో కానీ వుంటే చూడు అర్జంటుగా అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి" అంది. అంత రాత్రి అని కానీ, ఎలా అని కానీ ఆలోచన రాలేదు. చెల్లెళ్ళు, పిల్లలూ నిద్రలో వున్నారు. బయటికి వెళ్ళాను. కొద్ది దూరంలో రిక్షాలో ఒకతను నిద్రపోతున్నాడు. వెళ్ళి పిలిచాను. పిలవగానే లేచాడు. దగ్గరలో ఉన్న దుర్గాబాయ్ దేశ్ ముఖ్ హాస్పిటల్ కి వెళ్ళాలని చెప్పాను.

అమ్మని మెల్లిగా నడిపించుకుంటూ రిక్షా దగ్గిరకి తీసుకెళ్ళాం. బాగానే ఎక్కగలిగింది. రోడ్డు మీద అక్కడక్కడ షాపులు తీసి వున్నాయి. జనాలు అంతగా లేరు. అవన్నీ ఆలోచించే టైము కూడా లేదు. అమ్మని చూస్తే పళ్ళ బిగువున బాధని అదుముకుంటోందని అర్థం అయ్యింది. ముట్టుకుంటే కూడా అమ్మ భరించలేకపోతోంది. మొత్తానికి హాస్పిటల్ కి చేరాం. సందడి లేదు.

ఒక చోటికి వెళ్ళి అడ్మిట్ చెయ్యాలని చెప్పాను. ఈలోపున అమ్మ రిక్షా దిగేసింది. "అయ్యో... వుండమ్మా... ఇక్కడ కాదుట. మళ్ళీ ఎక్కగలవా? అన్నాను", ఏమీ చెప్పలేకపోతోంది. రిక్షా అబ్బాయిని అమ్మని చూస్తూవుండమని, పక్కనే ఉన్న ఎమర్జెన్సీకి వెడితే, రిసెప్షన్ లో అమ్మాయి మంచి నిద్ర లో వుంది. లేపి సంగతి చెప్పి వీల్ ఛైర్ పంపమని అమ్మని లోపలికి తీసుకుని వెళ్ళాను.

అమ్మకి టెస్టులు చేస్తున్నారు. తెల్లారుతుండగా పెద్దక్క వచ్చింది. కానీ ఆరోజు అమ్మ పడిన వేదన మరిచిపోలేను. ఒకరోజంతా అయ్యాక కొంచెం బాగానే వుంది. ఐసియులో పెట్టారు. పదిగంటలకి డా. సోమరాజు హార్ట్ స్పెషలిస్ట్ వచ్చి చూసినప్పుడు అమ్మ - "కళ్ళంతా మసకగా వున్నాయి, కొంచెం నీరసంగా వుంది" అని చెప్పింది. "మూడు రోజుల్లో ఏమీ వుండవు" నన్ను, అక్కని పిలిచారు. "ఏం జరిగింది" అని అడిగారు.

"అమ్మకి బి.పి. వుండేది, డాక్టర్ ట్రీట్ మెంట్ లోనే వుంది. బోరింగ్ కొట్టి నీళ్ళు నింపింది" అని చెప్పాం. ఆయన చాలా విచారంగా మొహం పెట్టి, "అయ్యో! ఆ ఒత్తిడి ఆవిడ గుండెమీద పనిచేసింది. మీరు ఎవరికైనా చెప్పాలంటే చెప్పండి. ఇంక మూడు రోజులు మాత్రమే ఆవిడ ఉండగలరు" అని చెప్పారు. నాకు అప్పుడు అర్థమయ్యింది - మూడురోజుల్లో "ఏమీ వుండవ"ని అమ్మకి డాక్టర్ ఎందుకు చెప్పారో. మేము పడిన బాధ అంతా ఇంతా కాదు.

అమ్మ "స్నానం చెయ్యాలని వుంది. చిరాగ్గా వుంది. ఇంట్లో చాలా పనులు వుండిపోయాయి ఎప్పుడు ఇంటికి వెడతామో..." అంది. నేను, "అవన్నీ ఏమీ ఆలోచించకు. రేపు ఇంటికి వెళ్ళిపోదాం" అని చెప్పాను. "నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు. ఇంకా కొన్నిరోజులు నా దగ్గిర వుంటావా...?" అంది. ఏం మాట్లాడను నేను...? పైకి రాని దుఃఖం కుదిపేస్తోంది.

వెంటనే మళ్ళీ "నాకు వేడి వేడి చారు అన్నం తినాలని వుంది తెస్తావా...? అంది. వెంటనే ఇంటికి వెళ్ళి మెత్తగా అన్నం వండి, చారు పెట్టి అమ్మకి తీసుకెళ్ళి పెట్టాను. ఎంతో హాయిగా వుందని తింది. చాలా నేను రోజులు చారు అన్నం తినలేదు. ప్రభావతిని కూడా అలాగే పండు అడిగింది. డాక్టర్ పెట్టొద్దన్నారని పెట్టలేదు. ప్రభావతి కూడా చాలారోజులు అరటిపండు తినలేక పోయింది.

అక్క నన్ను, చెల్లెలు ప్రభావతిని హాస్పిటల్లో వుండమని చెప్పి తను వెంటనే బయల్దేరి విజయవాడ వెళ్ళింది. మేము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అక్కడే వున్నాం. 26 రాత్రి ఇద్దరం హాస్పిటల్ లో వున్నాం.
27వ తేదీ పొద్దున్న నేను ప్రభావతితో "అమ్మ నిద్రపోతోంది. నేను ఒకసారి సంజీవరెడ్డి నగర్ వెళ్ళి వస్తాను" అని ఇంటికి వచ్చాను. "నా వెనకే హాస్పిటల్ లో పక్కన బెడ్ వాళ్ళ అబ్బాయి మిమ్నల్నందరినీ హాస్పిటల్ కి రమ్మంటున్నారు" అన్నాడు. ఆఘమేఘాల మీద వెళ్ళాం.

11 సంవత్సరాలకి పెళ్ళయి మధ్యలో అనారోగ్యాలు లేకపోయినా పుట్టిన పిల్లల ఆలనా పాలనా, రూపు దాల్చకుండా పోయిన పిల్లలు, 38 సంవత్సరాలకే భర్తని పోగొట్టుకుని పడిన ఆవేదనలు - ఇలా ఎన్నో రకాలుగా అలిసిపోయిన శరీరాన్ని 54 ఏళ్ళకే వదిలి శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది. ఏడుగురు పిల్లల్ని వదిలేసి మాయమయిపోయింది.

ఢిల్లీ అక్కకి చెప్దామంటే ట్రంకాల్ బుక్ చెయ్యాల్సి వచ్చింది. ఎస్ టిడి లేదు. టైముకి చెప్పలేకపోయాం. మొత్తానికి చివరగా చూశారు.

ఇక్కడ కూడా మాకు విజయపాల్ గారు రాముల్ని, కారుని పంపి పూర్తిగా సహకరించారు.

కానీ అప్పటి నుంచీ దీపావళి పండగ వస్తుందంటే మనసంతా గుబులుగా వుంటుంది. నాన్నగారు 1971, అక్టోబరు 7వ తేదీన రాత్రి పడుకుని పొద్దుటికి లేవలేదు. 15వ తేదీన వచ్చిన దీపావళికి మేమింకా దుఃఖంలో వున్నాం. చాలా సంవత్సరాలు దీపావళిని మర్చిపోయాం.

అమ్మని హైదరాబాదు తీసుకువచ్చి దూరం చేసుకున్నామా...? లేకపోతే కనీసం అన్ని రోజులైనా తనతో గడపగలిగామా? అన్నది మాకు ప్రశ్నగానే వుండిపోయింది. ఏది ఏమైనా కాలం మాత్రం ఆగనిది. తర్వాత ఎన్నో మార్పులు.


6 కామెంట్‌లు:

  1. అయ్యో, 54 యేళ్ళకేనా? అప్పుడే రాలిపోయే వయసు కాదు. మా తల్లిగారు కూడా అంతే, 59 వయసుకే పోయారు, అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటుతో గంటలో పోయారు.

    అధిక సంతానంతో కూడిన పెద్ద సంసారాలలో గృహిణులకు ఆ చాకిరీ వల్ల ఎప్పుడూ ముప్పే.

    తల్లి, తండ్రి పోయిన బాధ, లోటు ఎప్పటికీ తీరేవి కాదు. అయితే మీ అమ్మగారిని హైదరాబాద్ కు తీసుకురావడం వల్ల దూరమయ్యారా అని మీరు చింతించవలసిన పని లేదు. ఏ ఊళ్ళో ఉన్నా జరగాల్సింది జరిగేతీరుతుంది. హైదరాబాద్ వచ్చి తన చివరి రోజులు (చివరి రోజులు అని ఊహించరు లెండి) మీ అందరి దగ్గరా గడిపారు, మీ పెళ్ళి చూసారు. ఆ రకంగా అనుకుంటుంటే కాస్త ఊరటగా ఉంటుంది.

    దీపావళి పండగ అంటే మీకందరకూ గుబులుగా ఉండడం సహజం. మా పెదనాన్న గారి భార్య వినాయకచవితి రోజున కాలం చేసారు. వాళ్ళింట్లో అప్పటి నుంచీ వినాయకచవితి చేసుకోవడం మానేసారు. అటువంటి సంఘటనలు ఎప్పుడు ఎలా జరగాలి అన్నది ముందే నిర్ణయం అయిపోయుంటుంది కదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రిప్లయి ఇచ్చాను. ఎందుకు రాలేదో అర్థం కాలేదు. మా అమ్మ 54 సంవత్సరాలలో చాలా కష్టనష్టాలు ఎదుర్కొంది. కానీ ఎప్పుడూ ధైర్యంగానే వుండేది. నిజంగానే చివరి రోజుల్లో మా దగ్గిర వుండడం అనేది మాకు సంతోషకరమైనదే. నేను తనకి కావలసినవన్నీ అందించగలిగాను. ఎంతో సంతోషంగా వుండేది. మిగిలిన ముగ్గురు చెల్లెళ్ళ పెళ్ళీ చూడలేకపోయింది. మాకు దీపావళి వస్తుందంటే చాలా గుబులుగా వుండేది. మా నాన్నగారు పోయిన పదిరోజులలోపల దీపావళి వచ్చింది. అమ్మని అదే రోజు హాస్పిటల్ లో చేర్పించడం ఇవన్నీ కళ్ళముందు కదుల్తాయి. ఇంక ఇప్పుడిప్పుడే మారడానికి ప్రయత్నిస్తున్నాం. మీ స్పందనకి ధన్యవాదాలు సర్.

      తొలగించండి
  2. మీలాంటి పిల్లలని కన్న ఆ తల్లి అదృష్టవంతురాలు. చివరిదాకా మీ దగ్గరపెట్టుకుని ఆవిడ ఆప్యాయతానురాగాలు అనుభవించారు. మీ వూళ్ళోనే వుండి ఒంటరిగా ఆవిడ వెళ్ళిపోయివుంటే మీరందరు ఇంకెంత బాధపడేవారో. మీరు వ్రాసిన పద్ధతి, ఆడపిల్లలు చిన్న వయసులో కష్టపడి పైకి రావటము, సహాయం చేసినవారిని ఇన్ని సంవత్సరాలతర్వాతైనా తలుచుకోవటము మనసును కదిలించాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకు ధన్యవాదాలండీ. నిజంగానే దూరంగా వుండి వుంటే ఇంకా బాధపడేవాళ్ళం. కానీ మా అమ్మకి నేను దగ్గరుండీ చాలా చేశాను. ఇప్పటికీ ఇంకా ఏదో చెయ్యలేదేమో అనే నాకు అనిపిస్తూ వుంటుంది. నిజంగా మనం ఎవరి నుంచైనా సహాయాన్ని అందుకున్నప్పుడు ఆ కృతజ్ఞత అలా వుంటేనే మనకి ఇంకా బావుంటుందనిపిస్తుందండీ.

      తొలగించండి
  3. నిజానికి మీఅమ్మగారు చాలా చిన్నవయస్సులోనే వెళ్ళిపోయారు. మానాన్నగారు కూడా అంతే నలభైతొమ్మిదికే. ఏం చేస్తాం ప్రాప్తం ఎంతో అంతవరకే కదా. సుకృతీ గతాయుః పోనివ్వండి మీరు అభివృధ్ధిలోనికి వచ్చి పెండ్లిచేసుకొనటం సంబరంగా చూసారు కదా. అదే తృప్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మా నాన్నగారు ఆంధ్రాబ్యాంక్ లో చేసేవారు. ఆయన 48 సంవత్సరాలకే పోయారు. అప్పటికి అమ్మకి 37 సంవత్సరాలు. అప్పట్లో 11 సంవత్సరాలకి పెళ్ళిచేశారు. చిన్నవయసులోనే ఎన్నో చూసింది. నిజమేనండీ... అయిపోయిన దానికి ఏమీ చెయ్యలేం. కానీ ఆ సంఘటనలు అప్పుడప్పుడు కళ్ళముందు కదులుతూ వుంటాయి. మీ స్పందనకి ధన్యవాదాలండీ.

      తొలగించండి