1, సెప్టెంబర్ 2022, గురువారం

నా జీవనయానంలో అమ్మ జ్ఞాపకాల నుంచి మెల్లగా మామూలు జీవితానికి - 44

 నా జీవనయానంలో అమ్మ జ్ఞాపకాల నుంచి మెల్లగా మామూలు జీవితానికి - 44

 

అమ్మ జ్ఞాపకాలు వెంటాడుతూనే వున్నాయి. చెల్లెళ్ళు ముగ్గురూ అమ్మ ఉన్న ఇంట్లోనే వుంటామన్నారు. అందరూ ధైర్యస్థులే కాబట్టి పెద్దక్క దానికి ఏమీ అభ్యంతరపెట్టలేదు.

 

 నేను, రెండో అక్క సంజీవరెడ్డి నగర్ లో దగ్గర దగ్గర ఇళ్ళలోనే వుంటున్నాం.




మెట్రోకి రూపుదిద్దుకుంటున్నప్పుడు


ఇక మెట్రోవచ్చాక రూపురేఖలు మారిపోయాయి



సంజీవరెడ్డిన నగర్ జంక్షన్


మేమున్న చోటు నుంచి నేను సంజీవరెడ్డి నగర్ బస్ స్టాప్ కి దగ్గిదగ్గిర ఒక కిలోమీటరు దూరం వుంటుంది. సంజీవరెడ్డి నగర్ బస్ స్టాప్ కి వెళ్ళేలోపున అటూ ఇటూ అన్నీ ఇళ్ళే. ఆదారిలో ఒకే ఒక శ్రీనివాస జనరల్ స్టోర్స్ అని పెద్ద కిరాణాషాపు. అప్పట్లో అదొక్కటే పెద్ద షాపు.  వాళ్ళ దగ్గిర గౌలి గూడా బస్ స్టాండ్ లో బస్ ఎక్కడానికి టిక్కెట్ల రిజర్వేషన్ ఉండేది. 

కాలనీ మెయిన్ రోడ్డు మీద నుంచి కాకుండా సందుల్లోంచి రావాలంటే నిర్మానుష్యమైన రోడ్లు. ఎటువంటి అపాయం లేదు కానీ, ఒక్కళ్ళూ వెళ్లాలంటే భయంగా వుండేది.

 

సంజీవరెడ్డిన నగర్ మెయిన్ రోడ్డు నుంచి లోపలికి చివరిగా వెళ్ళిపోతే ఒక వైపు బల్కంపేట, మరోవైపు అమీర్ పేట వెళతాము. 


అమీర్ పేట టర్నింగ్ లో ***గుడ్ లక్ కేఫ్*** అని ఒక ఇరానీ హోటల్ వుంది. ఇక్కడ టీ చాలా బావుంటుందని ఎక్కడెక్కడనుంచో వచ్చి ఇప్పటికీ తాగుతుంటారు. ఆ హోటల్ పక్కన పోలీస్ స్టేషన్ (ఇదికూడా స్థలం మారింది). దాని ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ (ఇప్పుడు అది పడగొట్టి చాలా పెద్దదిగా, అందంగా కట్టారు) దాని ముందు తెలుగులో రాతిస్తంభం మీద తెలుగులో సిమెంటు అక్షరాలు వుంటాయి. ఆ స్తంభం చాలా దూరం నుంచి కనిపిస్తూ ఇది ***సంజీవరెడ్డి నగర్*** అని చెప్పేది.

 

*** ఇప్పుడు ఆ బోర్డు కనిపించదు. హోటల్ న్యూ గుడ్ లక్ అని మార్చాడు. బస్ స్టాప్ కి వెళ్ళే రోడ్డు ఒక్ బ్యాంక్ స్ట్రీట్ అయిపోయింది. అక్కడ లేని బ్యాంక్ లేదు. అందరూ ఇళ్ళు నారాయణా, చైతన్యా కాలేజీలకి, ఆఫీసులకి, స్కూళ్ళకి అమ్మేసి కూకట్ పల్లి వైపు వెళ్ళిపోయారు. చాలా హోటళ్ళు, టిఫిన్ సెంటర్లు, పిజ్జా హౌస్ లు ఒకటేమిటి చాలా వచ్చేశాయి. ***

బస్ ఎక్కడానికి మెయిన్ రోడ్డుమీద నుంచీ కొంచెం దూరం నడవాలి. మరీ అంత రద్దీ కూడా వుండేది కాదు. మెట్రో స్టేషన్ లేని సంజీవరెడ్డి నగర్ ప్రశాంతంగా వుండేది.

 

*** అప్పటికీ ఇప్పటికీ ఎంతతేడానో ఫోటోల్లో చూస్తే తెలుస్తుంది.***

 

*** కొత్త జీవితం ***

 

190 నెంబర్ బస్ సనత్ నగర్ నుంచి ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ వరకు వుండేది. అది వయా హిమాయత్ నగర్ కాబట్టి నాకు అంత ఇబ్బంది అవలేదు. హిమాయత్ నగర్ లో బస్ దిగి ఆఫీసుకి వెళ్ళడానికి 5 నిమిషాలు. మొత్తానికి ఆ రూటుకి అలవాటుపడ్డాను. అయితే ఒకరోజు నేను ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేసరికి ట్రాఫిక్ వల్ల సాయంత్రం 7 అయిపోయింది.


పొద్దున్నే షిఫ్ట్ అయిపోయి ఇంట్లో వుంటారు ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలని హడావుడిపడుతూ వెళ్ళేసరికి తాళం వేసి వుంది. ఇల్లుగలవాళ్ళని అడిగి తీసుకుని లోపలికి వెళ్ళి వంట మొదలుపెట్టి చేస్తున్నాను. కడుపులో ఆకలికి పేగులు అరుస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళారో అర్థం కాలేదు. రాత్రి 9 గంటలకి ఇంటికి వచ్చారు.


తలుపు తీసిన నా మొహంలో క్వశ్చన్ మార్కు చూసి

నువ్వు ఎంతకీ రాకపోయేసరికి చాలా కంగారేసింది. మీ ఆఫీసుకి వెళ్ళాను. వెళ్ళిపోయావని చెప్పారు. మీ చెల్లెళ్ళ దగ్గిరకి వెళ్ళాను. రాలేదని చెప్పారుఎంత కంగారేసిందో తెలుసా...! అన్నారు. కొత్త మురిపాలు ఇలాగే వుంటాయేమో...? . 

 

నాకు ఏమనాలో అర్థం కాలేదు. ఇప్పటివరకూ మా అంతట మేము ఉన్నాం. కొత్తగా ఒక మనిషి నా గురించి ఆరాట పడుతున్నాడు అంటే నాకు ఒకపక్క ఆశ్చర్యం, ఇంకోపక్క ట్రాఫిక్ వల్ల లేటయి వస్తే ఇంత కంగారా... ! ! అనుకున్నాను. ఒక తోడు దొరికేసరికి ఎదురు చూపులు ఇంతగా వుంటాయా అనిపించింది. పెళ్ళవగానే వచ్చిన కొత్త అనుబంధానికి మెల్లిమెల్లిగా అలవాటుపడుతున్నాను.

అప్పటి వరకూ అమ్మ, చెల్లెళ్ళు మా కుటుంబం, బాధ్యతలలో ఇంకొకళ్ళ గురించి ఆలోచించే టైమే వుండేది కాదు. మెల్లి మెల్లిగా నా టైములకి అలవాటు పడ్డారు. మధ్యాహ్నం షిప్ట్ అప్పుడు వచ్చేసరికి రాత్రి 12 గంటలయ్యేది. ఇద్దరం అన్ని విషయాల్లోనూ అలవాటు పడ్డం మొదలయ్యింది. 

 

మా ఆఫీసులో కంప్యూటర్ మీద చేసే దాన్ని నేను ఒక్కదాన్నే అయిపోయాను. చెల్లెలు ప్రభావతికి కందనాతి చెన్నారెడ్డిగారు పెట్టిన పల్లకి ఆఫీసులో కొత్తగా వచ్చిన మోనోటైప్ కంప్యూటర్స్ కి ఆపరేటర్స్ కావాలి అంటే వెళ్ళిపోయింది. ఆ కంప్యూటర్స్ లో మా మొదటి కంప్యూటర్స్ లో లాగా కమాండ్స్ అవీ కనిపించకుండా తెలుగు తెలుగు లాగే కనిపిస్తుంది. మా కంప్యూటర్స్ తర్వాత వచ్చినవి అవి. కొత్తగా వచ్చిన సరళకి ట్రైనింగ్ ఇస్తున్నాను.

 

బైబిల్ హౌస్ వాళ్ళ వర్కు వచ్చింది. పీటర్, జేమ్స్ అని ఇద్దరు ఆ వర్కు చేయించుకోవడానికి వచ్చారు. వాళ్ళిద్దరూ చాలా ఓపికగా కబుర్లు చెబుతూ వర్క్ చేయించుకున్నారు. పీటర్ ఆయన అమెరికా వెళ్ళినప్పటి కబుర్లన్నీ చెబుతుండేవారు. అమెరికా వెళ్ళడం అంటే అప్పుడు చాలా గొప్పగానే వుండేది. ఈసారి నేను నీకు అమెరికా వెళ్ళినప్పుడు వాచ్ తెచ్చి పెడతాను అన్నారు. నేను వినేసి ఊరుకున్నాను. కానీ మొత్తం బైబిలు అంతా చదివినట్లయ్యింది. ఈ వర్కులు చెయ్యడం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. మేము చేస్తున్న పుస్తకాలలో సారమంతా నా మైండ్ లో నిక్షిప్తమైంది.  మతగ్రంథాలలో చెప్పేదంతా ఒకటే అనిపించింది. 

 

4 కామెంట్‌లు:

  1. // “ ….. కొత్తగా ఒక మనిషి నా గురించి ఆరాట పడుతున్నాడు అంటే నాకు ఒకపక్క ఆశ్చర్యం,…… “ //

    మరీ చెప్తారు.
    మనసులో మురిసి పోలేదా 🙂?
    —————————————-
    మారిపోయిన / ఇంకా ఇంకా మారిపోతున్న నగరపటం గురించి ఆలోచిస్తుంటే విచారం కలుగుతుంది. ఇదేనేమో అభివృద్ధి అంటే అనుకోవడమే.

    రిప్లయితొలగించండి
  2. ఎందుకు మురిసిపోలేదు సర్. కానీ ఇలా మూడు నాలుగుసార్లు జరిగింది. ఆయన మొహంలో ఆదుర్దా నాకు ఇంకా గుర్తుంది. ఇక్కడ ఒక్కరూ రూంలో వుండేవారు. ఒక్కసారి కొత్త మనిషి జత అయ్యేసరికి టైముకి రాకపోతే ఆదుర్దా.

    నాకు మా నాన్నగారు గుర్తొచ్చారు. చిన్నప్పుడు మా ఇంటికి దగ్గరలో మా స్కూల్లో తెలుగు టీచర్ భగవద్గీత నేర్పించేవారు. సాయంత్రం ఆయన బ్యాంక్ నుంచి వచ్చేసరికి మేము ఇంట్లో వుండాలి.

    ఒకరోజు ఆవిడ వంకాయలు తెచ్చిపెట్టమన్నారు. మేము తెచ్చి ఇచ్చేలోపున మాకోసం ఆవిడ దగ్గిరకి వెళ్ళి, అక్కడ లేకపోయేసరికి ఆవిడ కూరలకి పంపించారని తెలిసి ఆవిడతో నా పిల్లలని ఎందుకు పంపించారని హడావుడి చేశారు. అప్పటి నుంచీ ఆవిడకి మామీద కోపంగా వుండేది. భక్తి భక్తే, కోపం కోపమే అని ఇప్పుడు అర్థమవుతోంది. ఆవిడ కృష్ణుడి పూజలు చేసేవారు.

    ప్రతి విషయంలో ఇలాగే కంగారు పడేవారు. మామగారి పోలికలు వచ్చాయని, మా నాన్నని ఈ విషయంలో మిస్ అవలేదు అనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  3. అధిక శాతం ఆడపిల్లలకు తమ తండ్రి హీరో / రోల్ మోడల్. తనకు వచ్చే భర్త కూడా బుద్ధుల్లో తమ తండ్రి లాగానే ఉండాలని ఆశిస్తుంటారు. మీకు సరిగ్గా అలానే లభించారుగా మీ వారు. అదృష్టవంతులు 👍🙂.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు సర్. నిజంగానే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం సర్. నేను ఎక్కువ గడిపాను ఆయనతో.

      తొలగించండి