5, సెప్టెంబర్ 2022, సోమవారం

కొత్త జీవితం ప్రారంభమైంది - 45 అద్దె ఇంట్లో అగచాట్లు

కొత్త జీవితం ప్రారంభమైంది - 45  అద్దె ఇంట్లో అగచాట్లు



మొత్తానికి సంజీవరెడ్డి నగర్ నుంచి హిమాయత్ నగర్ కి వెళ్ళి రావడం అలవాటయ్యింది. మున్సిపల్ వాటర్ మేమున్న టైములో రావు కాబట్టి ఇల్లుగలవాళ్ళకి కీ ఇచ్చి వెళ్ళేవాళ్ళం. ఆ పని మాత్రం బాగా చేసి పెట్టేవారు కానీ....

కొత్త జీవితంలో కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు. ప్రతి దాన్నీ మనం సీరియస్ గా తీసుకోకపోతే ఆనందమే. అవి మన ఓపికకి పరీక్ష పెడతాయి కూడా.

మా పెళ్ళికి ముందే వారు ఆయనకి టైంపాస్ అవడానికి పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టివి కొనుక్కున్నారు. అది ఉంది కాబట్టి అందులో వచ్చేవి చూస్తూవుండేవాళ్ళం. అది కూడా పొద్దున్నే డ్యూటీ అయితే సాయంత్రం ఇద్దరం కలిసి టీవీ చూసేవాళ్ళం. కొత్త ముచ్చట కదా...

శుక్రవారం వచ్చింది. మెల్లగా మా ఇల్లుగల వాళ్ళ అమ్మాయి శిరీష, అబ్బాయి కృష్ణ వచ్చి “ఆంటీ చిత్రలహరిలో పాటలు వస్తాయంట కదా చూస్తాం” అన్నారు. సరే రమ్మన్నాం. వాళ్ళ వెనకాలే వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న కూడా వచ్చారు. వాళ్ళకీ చోటిచ్చాం. చిత్రలహరి అవగానే వెళ్ళారు. *** అప్పట్లో చిత్రలహరి కోసం ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళం. ఓ నాలుగు పాటలు వేసి ఐదో పాట టైమయిపోయి సగంలో ఆపేసేవారు. చాలా నిరాశగా వుండేది. ఒక్కసారి టెక్నాలజీ లో సునామీ వచ్చింది. ఎప్పుడు ఏది వినాలన్నా, చూడాలన్నా సెకండ్ల లో... ***

మర్నాడు శనివారం టివిలో తెలుగు సినిమా వస్తుంది. మా ఇద్దరికీ వేడి వేడి పకోడీ వేసాను. తినుకుంటూ టివి ఆన్ చేశాం. తెలుగు సినిమా మొదలయ్యింది. “ఆంటీ సినిమా మొదలయ్యిందా... మేమూ చూస్తాం” అన్నారు. మా నుంచి సమాధానం ఇంకా రాకుండానే... “అమ్మా...! సినిమా మొదలయిపోయింది. రండి రండి”, అంటూ అరుపులు. వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. పకోడీలు వాళ్ళకీ తలో రెండూ పెట్టాం. ఇక శుక్రవారం, శనివారం, ఆదివారం ఇదే తంతు.

ఇదయిపోయిందా... water immersion rod తో మేం రోజూ నీళ్ళు కాచుకునేవాళ్ళం. ఒకరోజు చూశారు. “ఆంటీ మాకు స్కూలుకి టైం అయిపోతోంది rod ఇవ్వండి” అంటూ వచ్చాడు కృష్ణ. ఇచ్చేవరకూ కదలలేదు. రోజూ ఇదే తంతు. మేమసలు దాంతో నీళ్లు కాచుకోవడం మర్చిపోయాం.

కృష్ణ ఒకరోజు పొద్దున్నే ఒంటి కాలుకి ఉన్న షూతో వచ్చి, “అంకుల్ మీ దగ్గిర బ్లాక్ షూపాలిష్ వుందికదా... మా ఇంట్లో అయిపోయింది. ఇవ్వండి. స్కూలుకి టైం అయిపోతోంది” అని తీసుకున్నాడు. అంతే అది తీసుకుని వెళ్ళిపోయి మళ్ళీ మేము అడిగేవరకూ ఇవ్వలేదు. మా మిక్సీలో రోజూ పచ్చడి చేసుకునేవారు. మా ఇంట్లో అగ్గిపుల్లలతో వాళ్ళింట్లో స్టౌవ్ వెలిగేది.

ఇవన్నీ ఇలా వుంటే... ఒకరోజు ఇంటికి వెళ్ళి తలుపు తీసి లోపలికి వెళ్ళాను. కొంచెం టీ తాగుదామని స్టౌవ్ దగ్గిరకి వెళ్లాను. ***సింకులో అంతా గంజి, ఆ గంజి మధ్యలో కుంగిపోయిన కుక్కర్ గిన్నె.*** మాకు పెళ్ళికి వచ్చిన కొత్త ప్రిస్టీజ్ కుక్కరు, కొత్త గ్యాస్ స్టౌవ్ పరిస్థితి అలా చూసేసరికి నాకు ఒక పక్కన బాధ, ఇంకో పక్కన కోపం. నేను కుక్కర్ ఇంకా వాడను కూడా వాడలేదు.

వాళ్ళింటికి వెళ్ళి “అదేంటండీ కుక్కర్ గిన్నె అలా వంకర పోయింది” అని అడిగితే... “నవ్వుతూ... గిన్నెని డైరెక్ట్ స్టౌ మీద పెట్టాం. అలా అయిపోయింది” అని కూల్ గా చెప్పారు. ఇంకేమాట్లాడాలి...? అసలు ఆశ్చర్యం – ఎంత డైరెక్టుగా పెడితేమాత్రం గిన్నె అన్ని వంకరలు ఎలా తిరిగిపోతుంది....!!! అర్థం కాక తిరిగి ఇంటికి వచ్చేస్తుంటే... నవ్వులు వినిపించాయి. హు... ఏం మనుషులు వీళ్ళు, ఎన్నాళ్ళో ఇలా... అనుకున్నాను.

సంక్రాంతి దగ్గిరపడుతోంది. కృష్ణ హడావుడిగా వచ్చి “అంకుల్ నేను పైన పతంగులు ఎగరేసుకుంటున్నాను. మీ చెప్పులు ఇవ్వండి” అని అంటూనే... అక్కడ ఉన్న ఇంట్లో వేసుకునే చెప్పులు వేసుకుని వెళ్ళిపోయాడు. సంక్రాంతి వెళ్ళిపోయి వారం అయినా చెప్పులు మాకు ఇవ్వలేదు. అసలు మా కంటికి కనిపించలేదు.

నేను బట్టలు ఆరెయ్యడానికి మేడ మీదకి వెడితే అక్కడ ***ఒక మూల చెప్పులు ఎండకి ఎండి, వానకి తడిసి నీలుక్కుపోయి, రంగుపోయి దీనంగా కనిపించాయి. *** వాటిని ఓ కవరులో పెట్టి ఇంట్లో ఒక మూల పడేశాను. రెండు రోజుల తర్వాత కృష్ణ వచ్చి – “అంకుల్ పైన మీ చెప్పులు ఉండాలి తీశారా?” అన్నాడు. అంటే... వాడు మధ్య మధ్యలో వాడుతున్నాడు. ఇంకొకళ్ళ వస్తువు అని స్పృహ లేదు.

పోనీ డబ్బు లేని వాళ్ళా అంటే... ఇల్లుగలాయనకి ఏదో ఫ్యాక్టరీ వుంది. మరెందుకు ఇలా చేశారో తెలియదు.

మా వారికి ఆఫీసు వాళ్ళు ఇల్లు ఇస్తారు కానీ, నాకు దూరం. సరే చూద్దాంలే ఎన్నాళ్ళో ఇలా అనుకున్నాం. మా అమ్మ నాకు 12 పెద్ద పెద్ద స్పూనులు ఇచ్చింది. ఇల్లంతా వెతికాను. ఒక్క స్పూను కూడా కనిపించలేదు. కానీ ఇద్దరం ఎక్కువ ఇంట్లో వుండేవాళ్లం కాదు కాబట్టి, అక్కకి దగ్గర కావడం ఇంకో ఇల్లు గురించి ఆలోచించలేకపోయాం.

*** సరదాగా కూరగాయల మార్కెట్లకి ***


నాకు మార్కెట్ లో తిరిగేస్తూ అన్నీ చూసుకుంటూ కూరలు కొనడం అంటే సరదా.... ఇంటినిండా కనిపిస్తూ వుండాలి. ఇప్పటిలాగా వారం వారం ఇళ్ళదగ్గిర కూరగాయల మార్కెట్లు, మోడల్ రైతు బజార్లు లేకపోవడంతో ఎక్కడ కూరలు ఎక్కువగా వుంటాయంటే అక్కడికి వెళ్ళాలనిపించేది.

ఇల్లుగల వాళ్ళమ్మాయి శిరీష కొంచెం రిజర్వుడు గానే వుండేది. తనకి, నాకు బస్ పాస్ వుండేది. ఒకసారి సికిందరాబాద్ మోండా మార్కెట్ కి, ఒకసారి చార్మినార్ దగ్గిర మీరాలంమండీకి, ఇంకోసారి ఇంకోచోటికి వెళ్లి రెండు సంచుల నిండా కూరలు కొనుక్కుని వచ్చేవాళ్ళం. వాటికి మాత్రం తనే డబ్బులు ఇచ్చుకునేది.

మీరాలంమండీకి మాత్రం ఒక్కసారే వెళ్లాం. కూరగాయలు మోండా మార్కెట్ కంటే చాలా చీప్. ఎక్కువ మోసం కూడా లేదనిపించింది. మాకు భాష సమస్య వల్ల మళ్ళీ వెళ్ళలేదు. మెహదీపట్నం కారవాన్ సబ్జీమండీ తెల్లారగట్ల వెళ్లాలి. 6 గంటలు అయితే కూరలు ఉండవు. నల్లకుంట కూరల మార్కెట్ వుండేది కానీ నాకు తెలిసి రేట్లు ఎక్కువ వుండేవి. తప్పనిసరి అయితే కొనుక్కునేవాళ్ళం.

ఆ అమ్మాయి అప్పుడు 9th చదువుతోంది. సాధారణంగా ఆ వయసు పిల్లలు అలా కూరలు కొనడం నేను చూడలేదు. అన్నీ కొన్నాక నేను బరకత్ పూరాలో మా చెల్లెలు వాళ్ళుంటారు వాళ్ళకి కొన్ని కూరలు ఇచ్చేసి వెడదాం అనేదాన్ని. ఆవంకతో చెల్లెళ్ళని కలవచ్చని, వాళ్ళకి సాయం చేసినట్టు వుంటుందని నా స్వార్థం. ఏమీ మాట్లాడకుండా నాతో వచ్చేది. ఇంచుమించు పదిహేను రోజులకి ఒకసారి కూరలకి వెళ్ళేవాళ్ళం. కొన్నప్పుడల్లా చెల్లెళ్ళకి ఇచ్చి వచ్చేదాన్ని. ఒకోసారి వాళ్ళు ఇంట్లో వుండేవారు కాదు. వాళ్ళ ఇల్లుగలవాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇమ్మనేదాన్ని.

చంద్రబాబునాయుడు గారి ధర్మమా అని ఎక్కడంటే అక్క మోడల్ రైతు బజార్లు రావడం ఇంకా ఆనందంగా అనిపిస్తోంది. నాకు రోడ్ల మీద మార్కెట్ లో కంటే రైతుబజార్ కి వెళ్ళడం చాలా ఇష్టం.

6 కామెంట్‌లు:

  1. > మా ఇంట్లో అగ్గిపుల్లలతో వాళ్ళింట్లో స్టౌవ్ వెలిగేది.
    ఈ ఒక్కమాటతో వాళ్ళసంగతి పూర్తిగా తెలిసింది. ఇలాంటివాళ్ళను నేనూ చూసాను.

    > చంద్రబాబునాయుడు గారి ధర్మమా అని ఎక్కడంటే అక్క మోడల్ రైతు బజార్లు రావడం..
    అయ్యబాబోయ్ అంతమాట అనేసారేమిటీ! ఈరెండురాష్ట్రాల దొరలకీ ఈయనపేరు చెబితేనే అరికాలిమంట నెత్తికెక్కుతుం దండీ. ఒకాయన బాబు దొంగా లుఛ్చా 420 అంటాడు. మరొకాయన ఈబాబు చేసిందేముందీ, అభివృధ్ది అంతా నిజాందొర చేసిందేకదా అంటాడు. మీరేమో ఇలా అంటే రాజద్రోహం కేసు పడిపోతుందండీ‌ వాళ్ళకి తెలిస్తేనూ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇలాంటి ఇంటి వాళ్ళని ఎక్కడా చూడలేదండీ...

      చంద్రబాబుగారి పాలనలోనే రైతుబజార్లు వచ్చాయని తెలుసు. అందుకే రాశాను. తీసెయ్యమంటే తీసేస్తానండీ. నేను అంతదూరం ఆలోచించలేదు. మరి ఒక్కొక్కళ్ళ పరిపాలనలో ఒక్కో మంచి విషయాలు జరిగాయి కదా...

      తొలగించండి
    2. ఏమీ తీసెయ్యక్కరలేదండీ. సరదాకి అలా అన్నాను. ఈరోజున రాజకీయులు అలా ఉన్నారని నా ఉద్ధేశం. బాగా వ్రాస్తున్నారు.

      తొలగించండి
    3. అవునండీ... నిజమే... సరేనండీ. ధన్యవాదాలు

      తొలగించండి