9, సెప్టెంబర్ 2022, శుక్రవారం

కొత్త జీవితం ప్రారంభమైంది - 46 మళ్ళీ ఆఫీసు పనులు - ప్రారంభమైన యాపిల్ కంప్యూటర్ల యుగం

కొత్త జీవితం ప్రారంభమైంది - 46  మళ్ళీ ఆఫీసు పనులు - ప్రారంభమైన యాపిల్  కంప్యూటర్ల యుగం


 మా ఆఫీసులో వర్కు ఎప్పుడూ ఆగకుండా నడుస్తూనే వుంది. అప్పుడప్పుడు కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రూఫ్ రీడింగ్ కూడా చేసి పెట్టమని అడుగుతారు. మామూలు రొటీన్ లో పడ్డాం. ఆగని కాలం. విషాదాన్ని నింపిన 1987 వెళ్ళిపోయి 88 వచ్చేసింది.


*** ఏదైనా మనమంచికే (అమ్మ చెప్పింది కదా...) ***

*** కొత్త టెక్నాలజీని ఆహ్వానించిన తెలుగు అకాడమీ ***




నేను అప్పుడే ఆఫీసుకి వచ్చి నా రూములోకి వెళ్ళబోతున్నాను, తెలుగు అకాడమీ నుంచి ఒక ఆఫీసరు దామరాజు హరి వాసు గారు వచ్చారు. ఆయన వస్తూనే మా రూము దగ్గిరకి వచ్చి బయట కూచున్నారు. నేను కంప్యూటర్ ఆన్ చేసి వచ్చి -

“ఏం కావాలి సర్?” అన్నాను.

“అమ్మా.... తెలుగు అకాడమీలో కొత్తగా యాపిల్ కంప్యూటర్లు తీసుకువచ్చాం. దానికి ఎక్సపీరియన్స్, తెలుగు బాగా వచ్చిన ఆపరేటర్లు కావాలి. నువ్వు చాలా రోజుల నుంచీ చేస్తున్నావు కదా... మా ఆఫీసులో ఉషాపన్నాల గారి గోండు భాష పుస్తకం చేశారు కదా... ఆవిడ కూడా నీకు కంప్యూటర్స్ గురించి చెప్పమన్నారు. రేపు ఒకసారి మా ఆఫీసుకి రా... ఇంకెవరైనా వుంటే కూడా చెప్పు” అన్నారు. అసలు అవేంటో చూడాలని ఆత్రం.

(*** గోండు భాష అదిలాబాద్ బస్తర్ జిల్లాలో గిరిజనులు మాట్లాడే భాష గోండు. ఉషాపన్నాల గారు ఆ భాషలో ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధించి పుస్తకం రాశారు. చేసినప్పుడు చాలా తమాషాగా అనిపించేది. ఎడ్కి = జ్వరము, పిర్ = వాన, మర్మి = పెండ్లి, పాడి = ఇంటి పేరు, నాడి = రేపు, నర్ క = రాత్రి, సక్ రే = ప్రొద్దున, , రోన్ = ఇల్లు, సమ్దిర్ = అందరు, కరుమ్ = దగ్గర, యేర్ = నీరు, గాటో = అన్నం, కై కాల్ = కాలు చేతులు, మంత = ఉంది, సిల్లె = లేదు, బత పొరోల్? = ఏమి పేరు?, గాటో తిత్తికీ ?= అన్నం తిన్నవా? ఉద = కూర్చో ........ ఇలా వుండేవి. సరదాగా అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. ***)

మర్నాడు విజయపాల్ గారికి చెప్పాను. ఒక గంట సేపే కాబట్టి ఆయన ఏమీ అనలేదు. తెలుగు అకాడమీకి వెళ్ళాను. మూడు మాకిన్ తోష్ క్లాసిక్ కంప్యూటర్లు వున్నాయి. అతి చిన్న కంప్యూటర్లు ముద్దుగా వున్నాయి.

***ఫోటోలో చూపించినట్లు ***

*** చిన్న కంప్యూటర్లు వాటి ఫ్లాపీలు కూడా చిన్న చిన్నవిగా పట్టుకునేందుకు వీలుగా వున్నాయి. ***

ట్రైనింగ్ ఇవ్వడానికి ఒకతను వచ్చాడు. చెప్తున్నాడు. కొంచెం అర్థం అయ్యీ అవకుండా వుంది. మొత్తానికి తెలుగుకోగలిగాను.

హార్డ్ డిస్క్ కెపాసిటీ 250 ఎంబి. అదే మూడు సిస్టమ్స్ కి షేర్ చేస్తారు. అంటే ఒకో దానికి 80 ఎంబి అన్నమాట. విచిత్రంగా అనిపించింది. ఎప్పటికప్పుడు ఫ్లాపీల్లో మేటర్ కాపీ చేసేసుకోవాలి. లేకపోతే సిస్టమ్ స్లో అవుతుంది. ఒక సిస్టమ్ నుంచి తెలుగు ప్రింట్ ఇవ్వాలంటే మెయిన్ సిస్టమ్ నుంచి తెలుగుకి సంబంధించిన ప్రోగ్రాం ప్రింటర్ కి అందచెయ్యాలి. అప్పుడే ప్రింట్ వస్తుంది. తెలుగు స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త విప్లవంలో భాగస్వాములయ్యే అవకాశం.

రెండు రోజులు అయ్యాక మా చెల్లెలు ప్రభావతికి కూడా రమ్మని చెప్పాను. తను చేస్తున్న కందనాతి చెన్నారెడ్డి గారి ఆఫీసులో లీవు పెట్టి వచ్చింది. మొత్తానికి వారం రోజుల్లో నేర్పించారు. ఇంకెన్నాళ్ళు రావాలో తెలియదు. కంప్యూటర్ గురించి పూర్తిగా నేర్చుకున్నాక నన్ను, మా చెల్లెలు ప్రభావతిని పిలిచి “మీ ఇద్దరూ అక్కచెల్లెళ్ళు కదా... ఒకళ్ళనే తీసుకుంటాం. ఎవరుంటారో ఆలోచించుకోండి” అన్నారు.

నాకు వెంటనే నిర్ణయాలు తీసుకోవడం అలవాటు కదా... నేను ఒక పది నిమిషాలు ఆలోచించి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. ఆ టైములో ఆ జాబ్ వస్తే నాకు ముందు ముందు బావుంటుందని కానీ, గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నానని కానీ ఆలోచన రాలేదు. నేను ఆలోచించినది ఒక్కటే – నాకు పెళ్ళయిపోయింది. నేను జీవితంలో సెటిల్ అయ్యాను.

ఇంకా చెల్లెలు ప్రభావతికి ఎటువంటి సెటిల్ మెంటు లేదు. ఆ ఉద్యోగం వస్తే... తను తర్వాత ఉన్న ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరూ సెటిల్ అయ్యేవరకు సపోర్టు గా వుంటుందనిపించింది. గీతా ఇంకా ఇంటరు చదువుతోంది. అంతే బయటికి వచ్చేశాను. ఇంటికి వచ్చి మా వారికి చెప్పాను. నా నిర్ణయం ఎలా వున్నా – ఆయన కూడా నా నిర్ణయానికి ఎటువంటి అడ్డూ చెప్పలేదు. ఆయన నాకు సహకరించినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన ఏమాత్రం నాకు అడ్డు చెప్పినా పరిస్థితులు ఎలా వుండేవో. అంతా మంచికే జరిగింది అనిపించింది.

ప్రభావతి తర్వాత ఆ జాబ్ పర్మనెంట్ అవడంలో ఏవో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా... ఒక మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యింది. నేను ఎప్పటికీ అక్కడ చేరలేదని బాధపడలేదు. నేనూ అక్కడే వుండి వుంటే... ఎంతోమంది ప్రముఖులతో పరిచయాలు అయ్యేవి కాదు, వాళ్ళ పుస్తకాలు చెయ్యగలిగేదాన్ని కాదు. వాళ్ళ నుంచి నేర్చుకున్న వాటితో మా పిల్లలిద్దరికీ ఎన్నో జీవిత పాఠాలు నేర్పాను. వాళ్ళు బుజ్జి బుజ్జి అడుగులు వేస్తున్నప్పటి నుంచీ నేను ఎక్కడి వెళ్ళినా నాతోనే వున్నారు. ఇదంతా మళ్ళీ ఒక కథే. ఏదైతేనేం వాళ్ళు జీవితంలో రాటుదేలేలా చెయ్యగలిగాను.

***

*** ప్రపంచంలో యాపిల్ పర్సనల్ కంప్యూటర్స్ విప్లవం - 1986 ***

యాపిల్ కంపెనీ అప్పటి వరకూ అతిచిన్న కంపెనీగా వున్న యాపిల్ కంపెనీ ఐబియమ్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద డిజిటల్ కంపెనీలతో పోటీ పడాలనుకుంది. ప్రపంచంలో పర్సనల్ కంప్యూటర్స్ తో డిజిటల్ విప్లవ సమాచారాన్ని అందించడానికి నాంది పలికింది. కంప్యూటర్లని రోజువారీ జీవితంలో భాగం చేసింది. స్టీవ్ జాబ్స్, స్టీవ్ వాజ్నియాక్ ఇద్దరూ సహ వ్యవస్థాపకులు యాపిల్ కంప్యూటర్స్ తో విప్లవాన్ని తీసుకువచ్చారు. ఇండియాకి వచ్చేసరికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది.

*** ఆంధ్రప్రదేశ్ లో యాపిల్ కంప్యూటర్ల సంచలనం***

హైదరాబాదులో ఉన్న మందలపు రాఘవరావు గారు ఈ కంప్యూటర్ల డిస్ట్రిబ్యూషన్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని అంతా యాపిల్ కంప్యూటర్స్ తో పెద్ద సంచలనం తీసుకు వచ్చారు. మా ఇంకో చెల్లెలు గాయత్రి నా దగ్గిర కంప్యూటర్ నేర్చుకున్న అనుభవంతో ఆయన ఆఫీసులో చేరి మార్కెటింగ్ మేనేజర్ గా వుండి కంప్యూటర్ సేల్స్ పెరగడంలో చాలా సహకరించింది.

9 కామెంట్‌లు:

  1. మొత్తానికి మీరు ఆలంబనగా ఉండి మీకుటుంబసభ్యులు జీవితంలో పైకి రావటానికి దోహదం చేసారు. చాలా ఆనందం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అలా ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకోవాలని అనుకున్నామండీ. మీకు ధన్యవాదాలు.

      తొలగించండి
  2. చిన్న వయసులోనే దూరదృష్టితో కుటుంబశ్రేయస్సు కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు మెచ్చుకోదగినవి 👏👏.

    గోండు భాష పదాలు మీకింకా గుర్తున్నాయా? 36 యేళ్ళ క్రితం నాటి మాట కదా. పైన మీరు ఉదహరించిన పదాల్లో “యేర్”, “కై కాల్” మాత్రమే తేలిగ్గా అర్థమయ్యాయి నాకు 😔.

    అవునండీ ఆ రోజుల్లో హార్డ్ డిస్క్ కెపాసిటీలు తక్కువే ఉండేవి. PC లు 20 MB హార్డ్ డిస్క్ తో వచ్చేవి, దాన్ని వింఛెస్టర్ అనేవాళ్ళు. ఇప్పుడయితే GB ల్లో తప్పితే మరో మాట లేదు 🙂🙂.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీకు ధన్యవాదాలు సర్. ఆ రోజుల్లో ఆ గోండు భాష చాలా సరదాగా అనిపించేది. అప్పుడప్పుడు వాడుతూ వుండేవాళ్ళం.

      అప్పటి హార్డ్ డిస్క్ కెపాసిటీ తల్చుకుంటే నవ్వు వస్తుంది సర్. ఎప్పటి కప్పుడు ఫ్లాపీలో మేటర్ కాపీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడయితే జిబి కూడా కాదు టిబి కెపాసిటీ వచ్చింది సర్. కళ్ళముందు అద్భుతాలు జరుగుతున్నాయి.

      తొలగించండి
    2. మొదట్లో పేపర్‌టేప్ వాడేవాళ్ళం. సెకనుకు పది కారెక్టర్లు చదివే టెలీటైప్ మెషీన్ల పైన వాటిని వాడుతూ హైస్పీడ్ రీడర్ అని అప్టికల్ రీడర్ ఒకటి సెకనుకు నూరూ నూటయాభై కారెక్టరర్లు చదివేది రాగానే అద్భుతం అనుకున్నాం. తరువాత మేగ్నెటిక్ టేపులు రాగానే ఓయబ్బో అనుకున్నాం. అప్పుడు మేగ్నెటిక్ డిస్క్ డ్రైవులు వచ్చాయి -మొదట్లో 7.5MB డిస్క్ డ్రైవ్ అన్నదే ఒక పెద్ద వాషింగ్ మెషీన్ అంత ఉన్నా దానికే నోరు వెళ్ళబెట్టాం ఆ కెపాసిటీకీ ఆ స్పీడుకీ. అన్నీ ఒకదాని వెనుక మరొకటి అద్భుతాలే. 8" ఫ్లాపీ అద్భుతమే అనుకున్నట్లే చివరకు 3.5" ఫ్లాపీ మరింత అద్భుతం మరి. చివరికి ఆ ఫ్లాపీలకూ‌ సీడీలు వచ్చి కాలం చెల్లింది - ఫ్లాపీలని $౦ ధరకు (అంటే ఉచితంగానే ఇచ్చేసారు స్టోర్లల్లో!)

      ఒకప్పుడు మేము ఆర్టిఫిషియల్ ఇంటిలిఒజెన్స్ గురించి పనిచేస్తుంటే ఒక సాటి ప్రోగ్రామరే ఈ ఏ ఐ అంతా ఒక హంబగ్ కదా అన్నాడు. కాలంచక్రం గిర్రున తిరిగి ఇప్పుడా ఏ ఐ రాజ్యం చేస్తోంది. అది ఇప్పటికే కొన్ని అద్భుతాలు చేసింది. ముందు ముందు ఇంకా చేయబోతోంది.

      ఈ సాఫ్ట్‌వేర్ రంగం అన్నదే ఒక అద్భుతం. నిత్యం అద్భుతాలను సృష్టిస్తూ ఉండే అద్బుతజనని ఇది.

      తొలగించండి
    3. చాలా బాగా చెప్పారు. నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. నిజమేనండీ చాలా అద్భుతాలు చూస్తామేమో...

      తొలగించండి
    4. శ్యామలీయం సార్!మీరు AI మీద వర్క్ చేసారా?పతంజలి యోగానీ పాణిని అష్టాధ్యాయినీ కలిపి అధ్యయనం చేస్తే AIని మరింత డెవలప్ చెయ్య్వచ్చును కదూ!అలోచన ఎలా పుడుతుంది అనేది పతంజలి చెప్తాడు.ఆలోచనని ఎలా వ్యక్తీకరించాలో పాణిని చెప్తాడు.AI అంటే కూడా అదే కదా!

      తొలగించండి
  3. అన్నట్లు హోలరిత్ పంచ్ కార్డ్‌ల గురించి వ్రాయటం మర్చిప్యానే. పేపర్‌టేప్‌ల తరువాత ఇవి రంగప్రవేశం చేసాయి. ప్రతికార్డుమీద 80 కారెక్టర్లు పంచ్ చేసే అవకాశం ఉంది. కార్డ్ రీడర్ ఐతే నిముషానికి 600కార్డుల వరకూ చదవగల సామర్ధ్యం కలిగి ఉండేది. అంటే నిముషానికి 600 x 80 = 48,000 కారెక్టర్లు అన్నమాట. అప్పట్లో ఘనమే. పేపర్‌టేపులో తప్పు ఉంటే అదంతా వేష్ట్ అయ్యేది - మళ్ళా కొత్తటేప్ చేయటం తప్పదు. కాని ఏదైనా కార్డులో తప్పుంటే అదొక్కటే మళ్ళా పంచ్ చేసుకుంటే సరిపోయేది. గొప్పసౌకర్యం! తరువాత మేగెటిక్ టేపుల యుగం వచ్చాక, టేపు మీద ప్రోగ్రాములను ఎడిట్ చేయాలంటే పాతదాన్ని చదువుతూ ఎడిట్ చేసిన కొత్తభాగాలతో మొత్తం కొత్త టేప్ మీది ఎక్కించటం కోసం అప్‌డేటర్ ప్రోగ్రాములు వ్రాసుకొనే‌ వాళ్ళం. అలాంటివి సాధారణంగా మెషీన్ అసెంబ్లో లాంగ్వేజ్‌లో వ్రాసుకొనే వాళ్ళం కాని తమాషాగా నేను ఆప్రోగ్రాం ఒకదానిని సరదాగా కోబాల్ లాంగ్వేజీలో వ్రాసాను - అబ్బో కొన్నేళ్ళు తెగ వాడాం దాన్ని! ... ఆ రోజులే వేరండీ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు ఇన్ని విషయాలు చెప్తుంటే చాలా ఆనందంగా వుందండీ... అవునండీ టేపుల విషయం అలాగే వుండేది. నాకు కొంతమాత్రమే తెలుసు. మీరు చెప్తుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి. కొంచెం కష్టమయినా ఆ టెక్నాలజీ వేరేగా వుండేది. చాలా ధన్యవాదాలండీ. ఇప్పుడన్నీ అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లున్నా... ఎంతవరకు ఆనందిస్తున్నారనేది ప్రశ్నార్థకమే.

      తొలగించండి