12, సెప్టెంబర్ 2022, సోమవారం

కొత్త జీవితం ప్రారంభమైంది - 47 కొత్తసంసారం - మూడోవ్యక్తి ప్రవేశం

 కొత్త జీవితం ప్రారంభమైంది - 47  కొత్తసంసారం - మూడోవ్యక్తి ప్రవేశం

ఎన్నో కొత్త కొత్త మార్పులు. రోజులు తెలియకుండా గడిచిపోతున్నాయి. బ్యాంక్ కి శనివారం శలవు కాబట్టి అక్క విజయవాడ నుంచి శనివారం పొద్దుటికి హైదరాబాద్ వస్తున్నాను. మీ ఇంటికి అందరినీ రమ్మను అనేది. ఇలా అక్కచెల్లెళ్ళు అందరం మా ఇంట్లో ఎక్కువసార్లు కలుసుకుంటూ వుండేవాళ్ళం. పంచభక్ష్య పరమాన్నాలు చేసుకోక పోయినా అప్పటికప్పుడు అందరికీ నచ్చినది చేసుకోవడం, తినడం. కబుర్లు, నవ్వులతో కాలం గడిపెయ్యడంలో ఎంత ఆనందమో... మర్నాడు ఇందిరా పార్కుకో, పబ్లిక్ గార్డెన్ కో వెళ్ళేవాళ్ళం. రెండో అక్క నేను దగ్గరలో వుండేవాళ్ళం కాబట్టి నాకేదైనా అవసరం వస్తే చూస్తుండేది. కానీ తనూ బ్యాంక్ ఉద్యోగస్తురాలు కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టేదాన్ని కాదు.


*** చిట్టి పాపతో ఇల్లంతా సందడి ***





అప్పటి వరకూ అక్కల పిల్లలు 6 మంది వుండేవారు. వాళ్ళకి తోడు మా ఇంట్లో ఓ చిట్టి పాపాయి వచ్చింది. దాని నవ్వులు, ఆటలు చూస్తుంటే ముందు పడిన కష్టమంతా మర్చిపోయేవాళ్ళం.

*****ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు లేక, మా వారికి తెల్లాగట్ల నాలుగు గంటలకి లేచి వంట చేసి ఇచ్చి, బస్ స్టాప్ కి అంత దూరం నడవలేక కళ్ళు తిరుగుతున్నాయని మధ్య దారిలో కూచుండి పోవడం, తీసుకెళ్ళిన టిఫిన్ బాక్సు వాసన నచ్చక పక్కన పెట్టేయడం, ఇంటికి వచ్చి సోలిపోయి మళ్ళీ ఎప్పుడో తినడం లాంటి కష్టాలన్నీ పాపని చూడగానే మాయమైపోయాయి.

కానీ ఆఫీసులో నా ఇబ్బంది చూసిన ఇందిరగారు నాకోసం ప్రేమతో తెచ్చిపెట్టినవి తిని తృప్తి పడేదాన్ని. ఆవిడని ఎప్పటికీ మర్చిపోలేను. మావారికి ESI ఉండేది కాబట్టి హాస్పిటల్ కే వెళ్ళాం. డాక్టర్స్ చాలా చక్కగా, ఓపికగా వుండేవారు. అంతేకాకుండా మా అమ్మాయి పుట్టేముందు నన్ను చూసిన సీనియర్ మోస్ట్ డాక్టర్ చక్కటి నవ్వు, తెల్లటి బట్టలు వేసుకుని ముద్దనందివర్ధనంలా వుండేది. డాక్టర్లు రాసిచ్చిన నిద్రమాత్రలు వేసుకునేదాన్ని కాదు. హై బీపీతో వారం రోజుల ముందు హాస్పిటల్ లో చేరిన నేను ఆవిడ ఎప్పుడు కనిపిస్తారా అని ఎదురు చూసేదాన్ని. నా దగ్గరికి వచ్చిన డాక్టర్ తో “డాక్టర్ నన్ను మీరే చూడండి” అని అడిగాను.

సాధారణంగా అలా అడగ్గానే చూస్తారో చూడరో కానీ, పాప పుట్టేవరకూ ఆవిడ పర్యవేక్షణలోనే వున్నాను నాకు ఎమర్జెన్సీ అయి ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చి రాత్రి 12 గంటలకి వచ్చిన ఆ డాక్టర్ మళ్ళీ అదే నవ్వు, అదే అందం. “ఇవాళ ఎక్కువ కేసులు లేవని ఇంటికి వెళ్ళిపోయాను. వేరే డాక్టర్ కి చెబ్దామనుకుని నువ్వు నేనే కావాలని అడిగావు కదా... అందుకే వచ్చాను” అని ఏమాత్రం చిరాకు లేకుండా చెప్తున్న ఆవిడని చూస్తే ఆశ్చర్యం వేసింది.

ఒక డాక్టర్ కి పేషెంట్ మీద ఇంత ప్రేమ వుంటుందా అనిపించింది. అసలు అలాంటి డాక్టర్లని చూస్తే మనకి వున్న రోగాలు కూడా పోతాయి. ఆ మొహం ఇప్పటికీ గుర్తుండిపోయింది. అక్కడ ఉన్న సిస్టర్స్ కూడా చాలా మర్యాదగా వుండేవారు. కేవలం 80 రూపాయల ఖర్చుతో హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాం. *****

సరిగ్గా మా పాప పుట్టేముందు ఒక నెల ముందు మా అత్తగారు వచ్చారు. నేను ఆవిడచేత ఏమీ చేయించుకోలేదు. ఆవిడకే నేను చేసి పెట్టాను. నాతో చేయించుకోవడానికి ఇబ్బంది పడ్డారు కానీ, నేను చేసిపెట్టినందుకు సంతోషించారు. నేను ఆఫీసుకి లీవు పెట్టేశాను.

పాపకి ***వీణాధరి*** అని పేరు పెట్టాం. ఆవిడ ఉన్నన్ని రోజులూ పాపని బాగా చూసుకున్నారు. అయితే కొన్నాళ్ళు వుంటారు కదా అని అనుకున్నాను. ఇంతలోకే ఆవిడ అర్జంటుగా మద్రాసు వెళ్ళిపోవలసి వచ్చింది. పాపకి నాలుగో నెల వచ్చింది. తరవాత సంగతి ఏమిటో నాకు, మా వారికి అర్థం కాలేదు.

**** కేర్ సెంటర్ లో అందిన (సొంతం కాని) తాత, అమ్మమ్మల ప్రేమ ****

ఎక్కడికో వెళ్ళి వస్తూ మెయిన్ రోడ్డుకి దగ్గర ఒక రోడ్డులో వెంకటేశ్వర కేర్ సెంటర్ అని బోర్డు చూసి నాకు చెప్పారు. వెంటనే నేను వెళ్ళి పాప పేరు వీణాధరి అని, నాలుగో నెల అని చెప్పాను. వాళ్ళు రేపు తీసుకురమ్మని చెప్పారు. మర్నాడు అత్తగారిని, పాపని తీసుకుని వెళ్ళాను. కేర్ సెంటర్ చూసే ఆవిడ పేరు సీత, ఆయన పేరు కోటేశ్వరరావు. సీతగారు వచ్చి పాపని ఎత్తుకున్నారు. ఇంక బార్ మని రాగాలు అందుకుంది. వాళ్ళు అలాగే ఏడుస్తుంది లెండి మీరు వెళ్ళిపోండి అన్నారు. మనసు బాధతో ఉసూరుమని నిట్టూర్చింది. కానీ అత్తగారు ఉన్న వారం రోజులూ అలవాటు చెయ్యక తప్పదు.

బాగా ఏడుస్తుండేది. మూడు రోజులకి సీతగారిని పది లంకణాలు చేసిన ఆవిడలాగా చేసింది. పాపం ఆవిడని చూసినా, వీణాని చూసినా జాలేసేది. కానీ, క్రమంగా వాళ్ళకి బాగా అలవాటు పడిపోయింది. పిలవగానే నవ్వుకుంటూ వెళ్ళిపోయేది. వాళ్ళు కూడా సొంత తాతగారు, అమ్మమ్మ లాగా చాలా ప్రేమగా చూసేవారు. వీణా వాళ్ళ కేర్ సెంటర్ లో మొదటి పాప. వాళ్ళకి ఇంకా ప్రాణం. ఇక నాకు ధైర్యం వచ్చింది. *** ఆస్ట్రేలియా నుంచి వాళ్ళ పాపతో వచ్చినపుడు వాళ్ళని కలిసి ఫోటో తీసుకుంది. *** కేర్ సెంటర్ లో తనని ఎంత బాగా చూసుకున్నారో... మళ్ళీ వివరిస్తాను.

అత్తగారు మద్రాసు వెళ్ళాలని లేకపోయినా వెళ్ళిపోయారు. కేర్ సెంటర్ మెయిన్ రోడ్డుకి దగ్గర కాబట్టి దారిలో పాపని దింపేసి నేనూ ఆఫీసుకి వెళ్ళిపోతుండేదాన్ని. మా ఆఫీసులో కంప్యూటర్స్ సరిగా పనిచెయ్యట్లేదు. వాటిని రిపేర్ చెయ్యాలంటే స్విట్జర్ లాండ్ నుంచి పార్ట్ రావాలి. ఎపిఐడిసి జాయింట్ వెంచర్ కాబట్టి ఇవన్నీ టైమ్ పడతాయి. విజయపాల్ గారు కొన్నాళ్ళు మీరు ఇంట్లోనే పాపని చూసుకుంటూ వుండండి కొత్త కంప్యూటర్లు తెప్పిద్దామనుకుంటున్నాము. మేము చెప్పాక వద్దురుగాని అని చెప్పారు. నాకు వచ్చేముందు శాలరీ కాకుండా కొంత ఎక్కువ డబ్బులు ఇచ్చారు. కానీ తర్వాత మొత్తం ఆఫీసు మేడ్చల్ కి మార్చేశారు. అంత దూరం చిన్నపాపతో కష్టం అనిపించింది.

కానీ ఇంతలోనే బరకత్ పూరాలో ఇంటర్ నేషనల్ ప్రింటర్స్ వాళ్ళు వాళ్ళకి ఆపరేటర్స్ కావాలని, ఒకమ్మాయికి, అబ్బాయికి ట్రైనింగ్ ఇమ్మన్నారు. అమ్మాయి పేరు వసంత, అబ్బాయి పేరు శ్రీనివాస్. వసంత నోట్లో నాలిక లేని అమాయకురాలు. పెళ్ళయిన నెలరోజులకే వాళ్ళాయన హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. ఆ దుఃఖం నుంచి ఆ అమ్మాయిని బయట పడెయ్యడానికి ఈ వర్కు నేర్చుకోమన్నారు.

ఘట్ కేసర్ నుంచి వచ్చేది. ఊరు భాష మాట్లాడుతూ వుండేది. ఆఫీసు, ఇల్లు తప్ప ఎక్కడికి వెళ్లాలన్నా భయమే. అలాంటిది నెల రోజుల్లో భాషంతా మారిపోయింది. కంప్యూటర్ మీద పర్ ఫెక్ట్ అయిపోయింది. ఆతర్వాత ఆ అమ్మాయికి ఒక చోట జాబ్ వచ్చింది. అక్కడే కంప్యూటర్ సెక్షన్ మేనేజర్ అయ్యింది. కొన్నాళ్ళకి అక్కడ కూడా మానేసి, సొంతంగా కంప్యూటర్ పెట్టుకుని చాలా బాగా సంపాదించుకుంది. పెళ్ళి చేసుకుంది. ఒక బాబు. నన్ను మాత్రం నాకు గురువు నువ్వే అనేది కనిపించినప్పుడల్లా. కానీ బలే తొందరగా సెటిల్ అయిపోయింది.

నేను కూడా కొత్తగా వచ్చిన యాపిల్ కంప్యూటర్లమీద ట్రైనింగ్ అయ్యాను. అప్పుడప్పుడు ఎవరైనా అడిగితే వెళ్ళి వర్కు చేసి పెట్టి వచ్చేదాన్ని.

2 కామెంట్‌లు:

  1. సిటీలో కాపురం, బతుకుదెరువు కోసం ఉరుకులుపరుగులు, పెరుగుతున్న సంసారం, చేసుకోలేక నీరసాలు ….. మధ్యతరగతి జీవితం గురించి బాగా వ్రాశారు. మొత్తానికి ఒడిదుడుకులను అధిగమిస్తూ ముందుకు నడిపించారు.

    కోటేశ్వరరావు గారు, వారి శ్రీమతి గారు నడిపిన ఛైల్డ్ కేర్ సౌకర్యం మీకు బాగా ఉపయోగపడినట్లుంది. మీ ఆఫీస్ విజయపాల్ గారు, ఇందిర గారు బహు విశిష్ట వ్యక్తులు అనాలి, తమ స్టాఫ్ పట్ల వారి మృదుప్రవర్తనను మెచ్చుకోవాలి.

    // “ ఒక డాక్టర్ కి పేషెంట్ మీద ఇంత ప్రేమ వుంటుందా “ // …. ఉండదు. మీకు కాన్పు చేసిన డాక్టరమ్మ గారెవరో మినహాయింపులాగా ఉన్నారు. అటువంటి వారు … ఈ కార్పెరెట్టల రోజుల్లో మరీనూ … ఉండరు గాక ఉండరు. అసలు పేషెంట్ తో నాలుగు మాటలు మాట్లాడడానికే చిరాకు.

    బ్యాంకుకు శనివారం సెలవు అన్నారు. ఎప్పటి నుంచీ అండీ? మీ కథాకాలం 1980లు 1990ల వరకు ఆ తరువాత చాలాకాలం వరకు కూడా శనివారం ఒకపూట పని చేసేవారు. తరువాత తరువాత రెండో శనివారం, నాలుగో శనివారం పూర్తి సెలవు ఇచ్చి, బదులు తతిమ్మా శనివారాలు పూర్తి working day అన్నారు. మీ అక్కగార్లు ఒకరు SBI, ఒకరు ఆంధ్రా బ్యాంక్ అన్నారు కదా - రెండూ కూడా ప్రభుత్వరంగ బ్యాంకులే, శనివారం సగం పనిదినమే. మరి మీరు చెబుతున్నది ఎప్పటి మాటో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారం సర్.

      మీరు చెప్పినది కరక్టే సర్. సాధారణంగా శనివారం బ్యాంక్ కి హాఫ్ డే శలవు వుండేది. అప్పుడు ఎందుకో శలవు కలిసి వచ్చినట్టుంది. తనయితే సగంరోజుకి లీవు పెట్టేది కాదు. నేను ఆ విషయం సరిగ్గా రాలేకపోవడం పొరపాటు. బావగారు రైల్వేలో చేసేవారు కాబట్టి ఇద్దరూ వీలు చూసుకుని పిల్లల్ని తీసుకుని పాస్ మీద వస్తూండేవారు.

      ఆ రోజుల్లో ఓ పక్క ఉద్యోగం, మావారికి చేసిపెట్టడం, పిల్లలతో ఉరుకుల పరుగుల జీవితం ఎలా గడిచిందా అని ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుల్లో ఉన్న ఒకే ఒక్క పిల్లో, పిల్లాడినో చూసుకోలేక పూర్తిగా అమ్మానాన్నల మీదో, అత్తగారు మామగారి మీదో ఆధారపడే వాళ్ళని చూస్తే ఏమనాలో అర్థం కాదు.

      మీరు చక్కటి స్పందనకి ధన్యవాదాలు సర్.

      తొలగించండి