15, సెప్టెంబర్ 2022, గురువారం

కొత్త జీవితం ప్రారంభమైంది - 48 పాపముచ్చట్లు - కొత్త ఉద్యోగం - జీవితంలో కొత్త పాఠాలు

 కొత్త జీవితం ప్రారంభమైంది - 48  పాపముచ్చట్లు - కొత్త ఉద్యోగం - జీవితంలో కొత్త పాఠాలు


పాప వీణా కేర్ సెంటర్ లో బాగా అలవాటు పడిపోయింది. తరవాత ఒక ఆరుగురు పిల్లలు చేరారు. నేను కేర్ సెంటరి కి ఇచ్చిన డబ్బులు రు. 120. కానీ కోటేశ్వరరావుగారు తన పక్కనే పడుకోపెట్టుకునేవారు. వాళ్ళతోబాటే రకరకాల కూరగాయలు, మీగడ పెరుగు, స్వీట్లు అన్నీ పెట్టేవారు. ఆయన ఎత్తుకుని కబుర్లు చెబుతూ పెట్టేవారు. మెల్లి మెల్లిగా మాటలు, నడక వస్తున్నాయి. తాత అని పిలిచేది. ఎంత గారాబం చేసేవారో. రోడ్డుమీద వచ్చేపోయేవన్నీ చూపిస్తూ వాటి గురించి చెబుతుంటే ఆ చిన్ని బుర్రలో ఏం ఎక్కేదో తెలియదు. అన్నీ బాగా వినేది.




నేను సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి గోడ మీద కూచోబెట్టుకుని ఎదురు చూస్తుండే వారు. నన్ను దూరం నుంచీ చూడగానే కేరింతలు కొట్టేది. నేను పొద్దున్న ఎంత నీట్ గా పంపించానో సాయంత్రం కూడా అంతే నీట్ గా నాకు అందించేవారు. వాళ్ళు చెప్పినవన్నీ వచ్చీరాని మాటలలో నాకు చెప్పేది.

నేను రోడ్డు మీద ఒక చేత్తో నా హ్యాండ్ బ్యాగ్, ఇంకో చేత్తో పాప, పాప బ్యాగ్ పట్టుకుని నడుస్తుంటే ఉన్నట్లుండి రోడ్డు పక్కన కనిపించిన చెట్టుకున్న పువ్వుని చూపించి ‘అమ్మ పువ్వు’ అని అడిగేది. కోసి ఇవ్వగానే బుగ్గమీద ఓ ముద్దు పెట్టేది. ఎంత మధురమైన అనుభూతో అది. ‘అమ్మ చూడు’ అని తనవైపు చూడగానే ఓ నవ్వు నవ్వేది. కానీ నేను ఇంటికి రాగానే కింద బుజ్జి అనే 12 సంవత్సరాల అమ్మాయి చేతులోంచి అందుకుని ఆంటీ నేను తెచ్చిస్తాను అనేది. నేను గబగబా పాపకి అన్నీ రెడీ చేసి, తినిపించి నిద్రపోగొట్టేదాన్ని.

అస్సలు అల్లరి చెయ్యకుండా తన దారిన తను ఆడుకోవడంతో నాకు అస్సలు ఇబ్బందే అవలేదు. నేను ఆఫీసుకి రెడీ అయ్యేలోపున నిద్రపోయేది. నాకు లేప బుద్ధేసేది కాదు. కానీ ఇంక తప్పదు అన్నట్టు లేపి బుజం మీద వేసుకుని, సరంజామా అంతా తీసుకుని బయల్దేరేదాన్ని. అక్కడికి వెళ్ళగానే మాత్రం లోపలికి పరిగెత్తి తాత ఒళ్ళో కూచునేది.

***కానీ పాప ముచ్చట్లు ఎన్ని మిస్ అయిపోయానో. అన్ని ముచ్చట్లూ వాళ్ళకే అంకితం అయిపోయాయి. అందుకే దొరికిన టైములో పాపతో ఎక్కువ గడపడానికి ఇష్టపడేదాన్ని. ఇప్పుడు మా మనవరాలిని చూస్తే ఇన్ని ఆటలు మిస్సయ్యాను కదా... అనుకుంటాను.***

ఆయన వీణాని చూడకుండా ఉండలేకపోయేవారు. ఆదివారం వస్తే సాయంత్రం వాకింగ్ కి వచ్చి మా ఇంటికి వచ్చి “వీణయ్య రా!” అనుకుంటూ తీసుకెళ్ళి రకరకాల బిస్కట్లు ఎస్.ఎస్.బేకర్స్ లో కొనిచ్చేవారు. అసలు అన్నిరకాల బిస్కట్లు వుంటాయని అప్పటివరకూ తెలియదు. వారం వారం ఇలాగే చేసేవారు. పుట్టినరోజు వస్తే రెండు గౌన్లు కొనిచ్చేవారు.

ఒకరోజు సాయంత్రం వెళ్ళేసరికి ఆవిడ కళ్ళనిండా నీళ్ళతో... “వాకర్ కొన్నాం. దాంట్లో నిలబెట్టాం బాగానే తిరుగుతోంది. ఒక్కసారి స్పీడుగా వెళ్ళేసరికి గేటుకి కొట్టుకుని పెదిమ చిట్లింది. మా వారు బాగా తిట్టారు” అన్నారు. నేను “ఫర్వాలేదు లెండి. మా ఇంట్లో అయినా తగులుతాయి కదా...” అని వచ్చేశాను. అప్పటి వరకూ అక్క పిల్లలని పెంచిన అనుభవం నేర్పిన పాఠాలు కొన్ని, మనం డబ్బులు ఇచ్చినా, మనం చేసుకోలేని పని వాళ్ళు చేసిపెట్టినందుకు తొందరపడి మాట కూడా అనడం ఇష్టం లేక ఏమీ మాట్లాడలేదు. వాళ్ళూ పరాయి పిల్లలా చూడట్లేదు. ఒకోసారి కొన్ని బంధాలు ఎలా ఏర్పడతాయో తెలియదు.




*** జీవిత పాఠానికి మరో కొత్త ఉద్యోగం ***

కంప్యూటర్ వర్కులో సీనియారిటీ వుంది కాబట్టి రాజ్ భవన్ రోడ్డులో స్విఫ్ట్ ప్రింట్స్ అని కొత్తగా పెట్టిన ఆఫీసులో చేరాను. మేనేజర్ పేరు వేణుమాధవ్. చాలామంచి వ్యక్తి. అక్కడ పెత్తనమంతా నాదే కాబట్టి నాకు కష్టం అనిపించలేదు. పంజాగుట్టలో దిగి కపాడియా మార్గం లోనుంచి డైరెక్ట్ గా వెడితే మా ఆఫీసుకి చేరి పోయేదాన్ని. అదో అరకిలోమీటరు దూరం. అటు రాజభవన్ రోడ్డుకి కలిసేది.

మా ఆఫీసుకి దగ్గరలో ఏలే లక్ష్మణ్ గారు, వాళ్ళ తమ్ముడు రమేష్ వుండేవారు కాబట్టి వాళ్ళు నా దగ్గిరకొచ్చి వాళ్ళకి కావలసినట్లు వర్కు చేయించుకునేవారు. ఆయన డిజైనింగ్ కి కావలసిన ఫాంట్స్ మా దగ్గిర వుండేవి. చాలా వర్కులే చేయించుకున్నారు. లక్ష్మణ్ గారు చాలా ఓపికగా, హడావుడి లేకుండా మాట్లాడేవారు. అప్పుడప్పుడు వాళ్ళ ఆఫీసుకి వెళ్ళి ఆయన వేసిన బొమ్మలు చూస్తుండేదాన్ని. అంత గొప్ప చిత్రకారుడితో పరిచయం అయినందుకు సంతోషంగా అనిపించింది. ఇప్పటికి కూడా ఎక్కడైనా అనుకోకుండా కనిపిస్తే తప్పకుండా పలకరిస్తారు.

అక్కడి ఒక నార్త్ ఇండియన్ వచ్చేవారు. వాళ్ళు బెడ్ షీట్స్ కి డిజైన్ చేస్తుంటేవాళ్ళు. పేజి మేకర్ లో రకరకాలుగా గళ్ళు గీయించేవారు. లేకపోతే సున్నాలతో డిజైన్ చేయించేవారు. కొన్ని గీతలు క్రాస్ గా, కొన్ని గీతలు అడ్డంగా మొత్తానికి చివరిగా చూస్తే ఆ డిజైన్ బావుదనిపించేది. ఆయన భార్య కూడా వచ్చేది. వాళ్ళు గియ్యమన్నట్టు గియ్యడమే పని. కొన్ని బాక్సులుగాను, కొన్ని నలుపు రంగు నింపినవి ఎన్నో రకాలుగా చేసి ఇచ్చేదాన్ని. అప్పుడు ఇంకా ఫోటోషాపు అంతగా రాలేదు. ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. కళ్ళు మూసుకుని తెరిచే లోపున ఇల్లాంటి డిజైన్ లు ఎన్ని చెయ్యచ్చో అనిపించింది.

ఈ ఆఫీసు సంజీవరెడ్డి నగర్ కి దగ్గిరే కాబట్టి ఇంటికి తొందరగా వెళ్ళగలిగేదాన్ని. పంజాగుట్ట కార్నర్ లో శాన్ బాగ్ హోటల్ ఉండేది. అప్పట్లో దానికి బాగా పేరుంది. ఒకసారి ఏదో పండకకి భోజనానికి వెళ్ళాం. . ఇంకోసారి ఆ హోటల్లో భోజనం చెయ్యకూడదనిపించింది.

హైదరాబాద్ సెంట్రల్ మాల్ అవేమీ లేవు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒక కార్నర్ లో వుంటే దాని పక్కనుంచీ వరసగా నిమ్స్ హాస్పిటల్ వరకూ అన్నీ గవర్నమెంట్ క్వార్టర్సే. ఇప్పుడు గలేరియా మాల్ వాటిని నామరూపాలు లేకుండా చేసింది. మెట్రో రైలు రకరకలా మార్పులు తీసుకు వచ్చింది. రాజభవన్ రోడ్డు చాలా ఖాళీగా వుండేది.

2 కామెంట్‌లు:

  1. కోటేశ్వరరావు దంపతులది పెంచిన ప్రేమ కదా. మరి ఆ అటాచ్ మెంట్ సహజం.

    // “ఇప్పుడు మా మనవరాలిని చూస్తే ఇన్ని ఆటలు మిస్సయ్యాను కదా... అనుకుంటాను.*** “ // ……. నాది కూడా డిటో ఫీలింగ్. చాలా చాలా మిస్సయ్యాను.

    పంజాగుట్టలోని ఆనాటి శాన్ భాగ్ హోటల్ కు వెళ్ళడం అంత దండగ పని మరొకటి లేదు. ఆ స్టాఫ్ ప్రవర్తనలో కూడా మర్యాద ఉండేది కాదు. ఆ హోటల్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం నాకేమీ విచారం లేదు.

    విచ్చలవిడి వ్యాపార సంస్కృతి పంజాగుట్ట ఆనవాళ్ళన్నీ చెరిపేసింది. పాత రోజుల్లో సిటీ బస్సులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ స్టాప్ వరకు (టికెట్) చెప్పేవాళ్ళం. ఇతర గుర్తులోమైనా చెప్పాలంటే ఆ పోలీస్ స్టేషన్ రిఫరెన్స్ గా చెప్పేవాళ్ళం. ఇప్పుడో … తమ స్టేషన్ హైదరాబాద్ సెంట్రల్ ఎదురుగా అని చెప్పుకోవలసిన పరిస్ధితేమో? హైదరాబాద్ నగరంలో ఆ పాత ఛార్మ్ (charm) పోయిందనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి