19, సెప్టెంబర్ 2022, సోమవారం

కొత్త ఆఫీసు, కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు - 49 ఎన్నోపాఠాలు నేర్పుతున్న జీవితం

కొత్త ఆఫీసు, కొత్త పరిచయాలు, కొత్త అనుభవాలు - 49  ఎన్నోపాఠాలు నేర్పుతున్న జీవితం

స్విఫ్ట్ ప్రింట్స్ లో వర్కు చాలా ఎక్కువగా వుంది. అక్కడ నాకు సుబ్బలక్ష్మి మంచి ఫ్రెండ్ అయ్యింది. తనకి తెలుగు చెయ్యడం అంతగా రాదు. నా దగ్గిర నేర్చుకుంది. ఎక్కడిక్కడ ఎవరో ఒకళ్ళు మంచి వాళ్ళే దొరుకుతున్నారు. ఇక్కడ యాపిల్ కంప్యూటర్ మీద బాగా వర్కు చెయ్యడం అలవాయ్యింది. విజయపాల్ గారి ఆఫీసులో లాగా ఇక్కడ డార్క్ రూం, డెవలపింగ్ అవీ లేవు. హాయిగా ఫాన్ కింద కూచుని ప్రింటర్ కి ఒక కమాండ్ ఇస్తే ప్రింటౌట్స్ వచ్చేస్తాయి. ఒక ఐదు కంప్యూటర్లకి ఒకటే ప్రింటర్ ని వాడుకునేలా సెట్ చేశారు. టెక్నాలజీ మనిషి జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తోంది, పరుగులు పెట్టిస్తోంది. నా దగ్గిర ఇద్దరు ముగ్గురు వర్కు నేర్చుకున్నారు.

నేను రెండోసారి అమ్మని అయే రోజులు దగ్గరపడ్డాయి. నాకు వర్కు చెయ్యడానికి ఇబ్బందిగా వుండేది. వర్కు గురించి మాట్లాడుతుంటే ఒకటే కదిలేవాడు. ఏం అర్థమయ్యేదో... అంతేకాకుండా బస్ దిగి ఎత్తుపల్లాలుగా ఉన్న రోడ్డు మీంచీ లోపలికి నడవడం కష్టం అయిపోయింది. నేను ఆఫీసుకి రానని చెప్పేశాను. నేను వర్కు కొంతమందికి నేర్పించాను కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవలేదు. సుబ్బలక్ష్మికి పిల్లలు లేరు. నేను వచ్చేస్తుంటే “మీకు ట్విన్స్ పుడితే నాకొకళ్ళని ఇచ్చెయ్యండి. నేను హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్ళిపోతాను. నాకు అడ్డు చెప్పకండి ప్లీజ్” అంది. నాకో పక్కన ఆశ్చర్యం, జాలి అనిపించింది. “అలాగే... తప్పకుండా” అని వచ్చేశాను.

పాపకి మూడో సంవత్సరం వచ్చింది. కేర్ సెంటర్ వాళ్ళు వాళ్ళకి మనవడు పుట్టడంతో కేర్ సెంటర్ తీసేస్తున్నామని చెప్పారు. నాకు అన్ని రకాలుగా కలిసి వస్తుందనిపించింది. నాకు ఆనందంగానే అనిపించింది.

వీణాని ఇంటి దగ్గరలోనే వున్న విద్యాంజలీ స్కూల్లో ఎల్ కే జిలో వేశాం. అందులో వేసిన మొదటి రోజు “నువ్వు కూడా ఇక్కడే కూచో” అంది. ఆ మొహం ఇంకా గుర్తుంది. కానీ తర్వాత తర్వాత బాగా అలవాటు పడిపోయింది. ఐదు నిమిషాలు దూరం కాబట్టి నేను రోజూ తీసుకెళ్ళి, మళ్ళీ తీసుకుని వచ్చేదాన్ని.
ఆదివారం రోజు ముందు రూంలో ఆడుకుంటోంది. నేను వంటగదిలో పని చేసుకుంటూ “ఓహో... ఓహో... వసంతమా... నవ మోహన జీవన వికాసమా... ” అని పాడుకుంటున్నాను. అప్పట్లో టి.వి.లో కొత్తగా వచ్చేది. ఎప్పుడు వచ్చిందో తెలియదు. నేను పాట పూర్తిగా పాడేవరకూ నిలబడి, పాటయ్యాక చీర కొంగు పట్టుకుని లాగి, “నువ్వేనా పాడుకునేది నాకు నేర్పవా…” అంది. నాకు ఆశ్చర్యం వేసింది. మొత్తం పాటంతా రాసుకుని నేర్పించాను. జనవరి 26న స్కూల్లో మొత్తం పాట ఒక్క తప్పులేకుండా, స్పష్టంగా పాడింది. మాకు పట్టలేనంత ఆనందం అనిపించింది. బుజ్జిదానికి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారు.
మళ్ళీ ఇఎస్ ఐ హాస్పిటల్ లోనే, నా అభిమాన అందాల ముద్దనంది వర్ధనం డాక్టర్ పర్యవేక్షణలో శివరాత్రి రోజు పొద్దున్న 9 గంటలకి ఆపరేషన్ మొదలు పెట్టారు. వాళ్ళు మొత్తం శరీరానికి ఎనస్తీషియా ఇవ్వరు కాబట్టి వాళ్ళు చాలా మెల్లిగా మాట్లాడుకుంటూ ఆపరేషన్ చేస్తున్నారు. మాటల్లో “కాలు వంకర” అని వినిపించింది. నాకు ఆత్రుత ఎక్కువయ్యింది. డాక్టర్ ని “బాబా...? పాపా...? ఎలావున్నారు? ఎవరికి కాలు వంకర?” అని అడిగాను.

నువ్వేం కంగారు పడకు, ఒక్క నిమిషం ఆగు అన్నారు. ఇంతలోనే పెద్ద బరువు తీసేసినట్టనిపించింది. ఇదిగో చూడు “నీకు బాబే...!” అని, నాకు కాళ్ళు చేతులూ అన్నీ లాగి చూపించారు. కానీ ఏడవలేదని, తలకిందులుగా పట్టుకుని నాలుగు దెబ్బలు వేశాక ‘కేర్’ మని ఏడ్చాడు. ముద్దుగా బావున్నాడు. బాగా ఇంతకీ పక్క బెడ్ మీద అమ్మాయి గురించి వాళ్ళు మాట్లాడుకున్నది అని తరవాత తెలిసింది.

ఆఫీసు నుంచి సుబ్బలక్ష్మి వచ్చి చూసి, “నన్ను మోసం చేశావు మేడమ్” అంది నవ్వుకుంటూ. ఇంటికి వచ్చాక వీణా ముట్టుకుని చూసి ఆనందపడింది. తమ్ముడంటే చాలా ప్రేమ. బాబుకి మూడోనెల వచ్చింది. పేరు శ్రీవత్స అని పెట్టాం. మా అత్తగారికి ఇష్టమైన పేరు.

మా అత్తగారు వెళ్ళిపోయారు. నేను వీణాని స్కూల్లోదింపి ఆఫీసుకి ఒక గంటలో వెళ్ళి వచ్చేద్దామని తెలిసిన వాళ్ళింట్లో బాబుని వుంచి వెళ్ళాను. మధ్యాహ్నం 2.30 గంటలకి వీణాకి స్కూల్లో జ్వరం వస్తే ఆయా ఇంటికి తీసుకు వచ్చింది. ఎవరూ లేకపోయేసరికి ఇల్లుగలవాళ్ళకి చెప్పి దింపేసి వెళ్ళిపోయింది. మావారు ఆఫీసుకి వెళ్ళిపోయారు. ఆయనకి ఈ సంగతి తెలియదు. లేకపోతే వుండిపోయేవాళ్ళు. వాళ్ళు అక్కడే కూచున్నారు కానీ లోపలకి తీసుకెళ్ళి పడుకోపెట్టడం చెయ్యలేదు. ఉత్తప్పుడు రోజూ ఎత్తుకుని ఆడించేవారు.

నేను ఇంటికి వచ్చేసరికి 5 అయిపోయింది. బాల్కనీ గోడని పట్టుకుని అలాగే నుంచుంది. నేను వచ్చాక వాళ్ళు ఇంట్లోకి రమ్మంటే రానందని చెప్పారు. చాలా బాధపడ్డాను. ఇంక అప్పుడే ఏమైనా సరే ఉద్యోగం చెయ్యద్దని డిసైడ్ అయిపోయాను. మా వారు వచ్చాక చెప్పాను. కంప్యూటర్ లోన్ తీసుకుని ఇంట్లో పెట్టుకుని వర్కులు చేసుకుందాం. నేనిక ఉద్యోగం చెయ్యనని గట్టిగా తీర్మానించుకున్నాను.

***స్వయంకృషి శ్రీకారం ***

కంప్యూటర్ పెట్టుకోవాలంటే అందరికీ అందుబాటులో వుండేలా సెంటర్ లో ఇల్లు, ఆఫీసు కలిసి వచ్చేలా చూసుకున్నాం. బ్యాంక్ లోన్ తీసుకుని యాపిల్ కంప్యూటర్, ప్రింటర్ కొన్నాం. మేము ప్రారంభించడమే తరువాయి. మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరూ వర్కు చేయించుకోవడానికి వచ్చేవారు. ఎక్కడెక్కడవాళ్ళో వెతుక్కుంటూ వచ్చేవారు. ఎప్పుడూ ఫుల్ బిజీ. రాత్రి పగలు వర్కు చేసేదాన్ని.

***మొట్టమొదటే ప్రముఖ వ్యక్తి పుస్తకం ***


యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు సుష్వాస్వరాజ్ లాంటి కొంతమంది ప్రముఖులైన ఆడవాళ్ళ గురించి రాసిన పుస్తకం అబలలజీవితం (అని మేము చేసినప్పటి పేరు) డిటిపికి వచ్చింది. మాకు ఆ వర్కు ఇచ్చినాయన ఒకరోజు పొద్దున్నే చెప్పాపెట్టకుండా లక్ష్మీ ప్రసాద్ గారిని తీసుకుని వచ్చారు. ఆయన “ఏమ్మా... పుస్తకం సైజు చెప్పాలికదా... ఏదీ మీ దగ్గిర ఏం పుస్తకాలు వున్నాయంటూనే.... అక్కడ ఎదురుగా అలమార్లో ఉన్న పుస్తకాలన్నీ గబగబా తీసి, వాటిల్లోంచి ఒక పుస్తకం చూపించి, ఈ సైజు చెయ్యండి” అన్నారు.

కూచుని కాఫీ ఇస్తే తాగి, కాసేపు వర్కు గురించి మాట్లాడి వెళ్ళిపోయారు. ఆయన వైజాగ్ లో వుండేవారు. అక్కడ నుంచి ఏవైనా డౌట్స్ వస్తే ఫోన్లో చెప్పేవారు. చాలా ఓపికగా మాట్లాడేవారు. మేము ఆయనకి ప్రూఫులు పోస్టులో పంపితే, ఆయన కరక్ట్ చేసి మళ్ళీ పంపేవారు. ఆ పుస్తకం తప్పులు లేకుండా బాగా వచ్చిందని సంతోషించారు. అలా ఓ ప్రముఖ వ్యక్తిని కలవడం అయింది. ఆయన హైదరాబాదు వచ్చినప్పుడు ప్రూఫులు ఇవ్వడానికి వెళ్ళేదాన్ని. నేను మళ్ళీ ఢిల్లీ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ఆయన్ని కలిశాను.

*** నాకు నేనే ధైర్యం చెప్పుకున్న (గుణపాఠం నేర్పిన) సంఘటన ***

ఇక్కడొక సంఘటన జరిగింది. వైఎల్ పి గారి పుస్తకంతోపాటు మరో రెండు పుస్తకాలు చేశాం. అన్నీ కలిపి వెయ్యి పేజీలు వుంటాయి. అసలే కొత్త కంప్యూటర్ వర్కు ఫుల్ గా నడుస్తోంది. ఏమైందో తెలియదు. ఉన్నట్టుండి. కంప్యూటర్ పనిచేయడం మానేసింది. వారంటీ వుంది కాబట్టి వచ్చారు. సిస్టమ్ మళ్ళీ ఆన్ అయేటట్లు చేశారు. కానీ సిస్టమ్ లో చేసిన వర్కంతా పోయింది. ఆ మూడు పుస్తకాలు పోయాయి. అంటే వై ఎల్ పి గారి పుస్తకం కూడా మాయమయిపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాళ్ళకి బ్యాక్ అప్ తీసుకురావడం తెలియలేదు. అప్పుడప్పుడే వస్తున్న టెక్నాలజీ కాబట్టి రాదని చెప్పేశారు.

మాకు తెలిసిన అబ్బాయి స్పీడుగా చేస్తాడు అని తెలిసి చేసి పెట్టమన్నా కుదరదు అన్నాడు. పుస్తక రచయితలకి ఎవరికీ విషయం చెప్పలేదు. కరక్షన్ చేసిన ప్రూఫులు దగ్గర వున్నాయి. మనసుకి ధైర్యం చెప్పుకున్నా – “నేను ఇవాళే కొత్తగా వర్కు మొదలు పెడుతున్నాను” అని పదే పదే చెప్పుకున్నాను. మనసుని గట్టి పరుచుకున్నాను.

పిల్లలిద్దరూ చిన్నపిల్లలు. వీణాని స్కూలుకి పంపించేసి, మా వారు డ్యూటీకి వెళ్ళిపోయాక. మధ్య మధ్యలో బాబుని చూసుకుంటూ ఒక తపస్విలాగా కూచుని, అవసరాలకి మాత్రమే లేస్తూ మొత్తానికి మూడు పుస్తకాలూ, అంతకుముందుకన్నా తొందరగా, తప్పులు లేకుండా అనుకున్న టైముకి వాళ్ళకి అందచేశాను. ఇప్పుడు తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. రాత్రి 3 గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. ఇంక అప్పటి నుంచీ కొన్ని పేజీలు అవగానే ఫ్లాపీలోకి కాపీ చేసేసుకోవడం మొదలు పెట్టాను. మరోసారి ఇటువంటి సంఘటన జరగకుండా చూసుకున్నాను. జీవితంలో ఇదో గుణపాఠం.

*** ఆంధ్రజ్యోతి నుంచి చంద్ర గారు ***

నాకు ముఖ్యమైన కస్టమర్ చెల్లెలి పెళ్ళి రమ్మన్నారు. వాళ్ళ కుటుంబానికి నేనంటే చాలా ఇష్టం. రాత్రి పెళ్ళి. సాయంత్రం వచ్చెయ్యమన్నారు. అన్నీ రెడీ పెట్టుకున్నాను.

ఇంతలోనే హడావుడిగా ఆంధ్రజ్యోతి నుంచి ఒకతను వచ్చి, “నా పేరు చంద్ర అండి. నేను ఆర్టిస్టుని. రేపు మా పేపర్లో కొన్ని ముఖ్యమైన ప్రకటనలు రావాలి. అవన్నీ అను ఫాంట్స్ లో చేయిద్దామనుకున్నాం. అనుఫాంట్స్ చాలా బావున్నాయి. మీ దగ్గిర వుందని మా ఫ్రెండ్ చెప్పాడు” అన్నాడు.

“నేను లేదండీ మేము పెళ్ళికి వెళ్ళాలి. చెయ్యను” అన్నాను.

“మీరు చెయ్యనంటే కుదరదు. నేను చేయిస్తున్నానని ఆఫీసులో చెప్పేశాను. అయినా మీరు పెళ్ళికి వెడితే డబ్బు ఖర్చు. వర్కు చేస్తే డబ్బులు వస్తాయి. ఇవిగో ఇక్కడ పెట్టి వెడుతున్నాను. నేను రాత్రి మళ్ళీ వస్తాను” అని అన్నీ నా ముందు పెట్టి, ఎలా చెయ్యాలో చెప్పి వెళ్ళిపోయాడు.

ఇంక ఏం మాట్లాడాలో తెలియలేదు. పిల్లలకి ఏదో చేసిపెట్టి, ఇంక పనిలోకి దిగాను. కొన్ని రాత్రికి, కొన్ని మర్నాడు పొద్దుటికి అన్నాడు. దాదాపు 100 పైనే ప్రకటనలు. రాత్రంతా నిద్ర లేకుండా రాత్రి కొన్ని ఇచ్చి, తెల్లారగట్ల 5 గంటలకి మొత్తం వర్కు ఇచ్చేశాను. నా చేతిలో రు. 5,000 పెట్టి చూశారా “ఒక్క రోజులో ఎన్ని డబ్బులు వచ్చాయో... పెళ్ళికి వెళ్ళి వుంటే వచ్చేవా...” అనేసి వెళ్ళిపోయాడు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత చాలాసార్లు వాళ్ళ వర్కు చేశాం. ఆ వచ్చినతను ప్రముఖ వ్యక్తి చంద్ర అని నాకు తరవాత తెలిసింది. 1993లో ఒక్క రోజులో 5000 అంటే చాలా పెద్ద మొత్తమే....

*** ఊపిరి సలపని వర్కు***
మాస్టర్ మైండ్స్ అని ఎడ్వర్ టైజింగ్ కంపెనీ వాళ్ళయితే రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. ఇంక చుట్టుపక్కలంతా స్క్రీన్ ప్రింటర్స్ వున్నారు. వాళ్ళందరూ మా దగ్గిర ప్రింటౌట్ బాగా వస్తోందని వచ్చేవారు.
*** అప్పుడు విజిటింగ్ కార్డులు, వెడ్డింగ్ కార్డులు, లెటర్ హెడ్స్ లాంటి వన్నీ *** స్క్రీన్ ప్రింటింగ్*** లోనే చేసేవారు. స్క్రీన్ ప్రింటర్స్ బాగా సంపాదించేవారు. కాకపోతే వాళ్ళు వాడే కలర్స్ వాసన భరించడం కష్టం. మాదగ్గిర మేటర్ TP (Transparent paper) మీద తీసుకుని దాన్ని స్క్రీన్ మీదకి ట్రాన్స్ ఫర్ చేసేవాళ్ళు. మేమిచ్చే TP ఏమాత్రం లైట్ గా వచ్చినా వాళ్ళకి ప్రింటింగ్ షార్ప్ గా వచ్చేది కాదు. అందుకే మా ప్రింటర్ లో బాగా వస్తుందని మా దగ్గిరకే వచ్చేవారు. వాళ్ళు ఆ స్క్రీన్ ని టేబుల్ కి ఫిట్ చేసుకుని, ఒక్కో కలర్ కి ఒక్కో స్క్రీన్ తీసుకుని చేసేవారు. వాళ్ళకి ఏ కార్డులు ప్రింట్ చెయ్యాలన్నా రోజులు పట్టేవి.


సంజీవరెడ్డినగర్, అమీర్ పేటలలో కలిపి 500 మంది స్క్రీన్ ప్రింటర్స్ వుండేవాళ్ళు. ఇప్పుడు డిజిటల్ ప్రింట్ వచ్చాక ఇంత కష్టం లేకుండా మేటర్ మనకి కావలసినట్లు సెట్ చేసుకుంటే, పావుగంటలో మన ముందు ప్రింట్స్ వుంటాయి. ***

*** స్క్రీన్ ప్రింటింగ్ పరికరాల ఫోటోలు ***

స్క్రీన్ ప్రింటింగ్ కూడా లేనప్పుడు నా పెళ్ళి శుభలేఖ విజయపాల్ గారి అతి పెద్ద ప్రెస్ లో ఆఫ్ సెట్ ప్రింటింగ్ లో వేయించుకున్న ప్రత్యేక వ్యక్తిని నేను.

8 కామెంట్‌లు:

  1. కృషితో నాస్తి దుర్భిక్షం
    జపతో నాస్తి పాతకం
    మౌనేన కలహో నాస్తి
    నాస్తి జాగరతో భయం.

    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. మీరు పడిన కష్టం నాకు కళ్ళముందు కనిపిస్తోంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. ఈ మధ్య సినిమాల్లో తరచూ ఒక డైలాగు వినబడుతుంటుంది తెలుసుగా - అదే …. “ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు” - అని 🙂. కంప్యూటర్ల మీద అన్నేళ్ళు పని చేసిన మీరు మధ్యమధ్యలో ఫ్లాపీ లోకి (ఆ కాలంలో) సేవ్ చేసుకోవాలనే చిన్న ప్రాథమిక సూత్రం ఎలా పట్టించుకోలేదు - అందులోనూ అంత పెద్ద వర్క్ చేస్తున్నప్పుడు? అది ఒక్కొక్కసారి చాలా ఖరీదైన పొరపాటవుతుంది. (బ్లాగుల్లో కామెంట్ వ్రాస్తున్నప్పుడే నేను రెండు మూడు లైన్లకొకసారి కాపీ చేసుంచుతాను 🙂🙂. నేను కాస్త పొడుగు కామెంట్లు వ్రాస్తుంటాను కదా 🙂🙂).

    అయినా మీ కంప్యూటర్ ని రిపేర్ చెయ్యడానికొచ్చిన వ్యక్తి బహుశః మొత్తం ఫార్మాట్ చేసేసి ఉంటాడని నా అనుమానం. ఆ రోజుల్లో రిపేర్ చెయ్యడానికి అదొక సంజీవని లాగా ఉపయోగించే వాళ్ళు లెండి కంప్యూటర్ కంపెనీ సోకాల్జ్ టెక్నీషియన్లు. లేదంటే సాఫ్ట్ వేరే ప్రోబ్లం అనడం, సాఫ్ట్ వేర్ వాడేమో హార్డ్ వేర్ ప్రోబ్లెం అండీ అనడం - పరిపాటి. అంతా విష్ణుమాయ.

    సర్లెండి, ప్రమాదో ధీమతా మపి అన్నారు పెద్దలు. ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ఇబ్బందిని మీరు ధైర్యంగా ఎదుర్కొన్నారు.
    ———————-
    ఉద్యోగం మానేసి స్వంతగా వ్యాపారం మొదలెట్టడం …. మీరు తీసుకున్న చాలా మంచి నిర్ణయం, స్వతంత్రంగా ముందుకు సాగే ప్రయత్నానికి తొలి అడుగు 👏. ఇప్పటికీ చేస్తున్నారా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నమస్కారం సర్.
      మీరు అన్న లాజిక్ ప్రకారం చూస్తే... నేను మా ఇంట్లో కంప్యూటర్ పెట్టుకునే టైముకి యాపిల్ లో కొత్త మోడల్ వచ్చింది. లోన్ పెట్టి కంప్యూటర్ కొనుక్కున్నాం. ఉన్న ఫ్లాపీలన్నీ మేటర్ తో నింపేశాం. కొత్తవి తెచ్చుకుని కాపీ చేద్దామనుకున్నాం. ఇంతలోకే ఏమయ్యిందో తెలియదు.

      ఆ ఇంజనీర్లు కూడా అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చి కొత్తగా ట్రైనింగ్ అవుతున్నారు. కొన్ని ఇలా జరిగితే కానీ వాళ్ళకీ అనుభవం రాదు. మాకూ అనుభవం రాదు అన్నట్లయ్యింది. వాళ్ళు పాపం ఎవరెవరినో అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు ఆటోమేటిక్ గా సేవ్ కమాండ్ మీదకి వేళ్ళు వెళ్ళిపోతాయి. ఏమయ్యిందో మరి. పైగా మేం మొదలుపెట్టి అప్పటికి 2 నెలలు అయ్యిందేమో... మాకు వారంటీ కూడా వుంది. ఆ ఇంజనీర్లు చదువు పూర్తిచేసుకుని వచ్చినవాళ్ళేమో... భయం భయంగా వుండేవాళ్లు. మొత్తం మళ్ళీ ఫార్మేట్ చెయ్యలేదు కానీ. పనిచేసేలా అయితే చేశాడు. అలా జరిగింది ఆ కథ.

      నాకూ బాగా అనుభవం అయ్యింది. అన్నీ రెండేసి ఫ్లాపీలలో కాపీ చేసుకోవడం అలవాటయ్యింది.

      ఇంక స్వంతంగా మొదలు పెట్టడం అంటే నాకు మొదటి నుంచీ ఎందుకో అలాగే వుండేది. అనుకోకుండా నా కోరిక తీరింది. మధ్యమధ్యలో ఎన్నో ఒడుదుడుకులు, అవాంతరాలూ ఎదురయ్యాయి.

      నేను ఇప్పటికీ చేస్తూనే వున్నాను. నాకు మావారు, మరో ఇద్దరు వర్కులో సహకరిస్తుంటారు. చాలామంది ప్రముఖులు నా దగ్గిరే వర్కు చేయించుకుంటారు. ఖాళీగా వుండకుండా వేరే ఆలోచనలు రాకుండా మా పని మేము చూసుకుంటున్నాం.

      ఏ విషయానికైనా దిగులు పడే అలవాటు లేకపోవడం అనేది మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది.

      ధన్యవాదాలు సర్.



      తొలగించండి
  4. >> .... కానీ ఏడవలేదని, తలకిందులుగా పట్టుకుని నాలుగు దెబ్బలు వేశాక ‘కేర్’ మని ...
    అంతే‌నండీ. డాక్టర్లు అలాగే చేస్తారు. మాచెల్లెలు ఒకమ్మాయి పుట్టగానే‌ ఏడవలేదని చెప్పి డాక్టరు గారు అలాగే తలక్రిందులుగా పట్టుకుని నాలుగు దెబ్బలు వేశాక ‘కేర్’ మంది!

    రిప్లయితొలగించండి