24, సెప్టెంబర్ 2022, శనివారం

జీవితంలో ఎన్నో మార్పులు, నేను, పిల్లలు నేర్చుకుంటున్న పాఠాలు - 50

 జీవితంలో ఎన్నో మార్పులు, నేను, పిల్లలు నేర్చుకుంటున్న పాఠాలు - 50


ఒకరోజు పొద్దున్నే ఒకమ్మాయి వచ్చి, “నాపేరు అజిత నేను బేబీ కేర్ సెంటర్ పెట్టాను. మీకు చిన్న పిల్లలు ఉన్నారని ఎవరో చెప్పారు” అంటూ వచ్చింది. చూడడానికి చక్కగా వుంది. పెళ్ళయ్యింది. మాకు దగ్గరలోనే అని చెప్పింది. నేను “అవసరమైతే చెప్తాను” అన్నాను.


తను వదలకుండా “మీరు వర్కులు చేసుకుంటారు కదా... కొంచెం సేపు బాబుని నా దగ్గిర పెట్టండి. బావుండకపోతే మానేద్దురు గాని” అంది. ఆ అమ్మాయి సమస్య ఏమిటో తెలియదు. నాకూ వర్కులు పెరుగుతున్నాయి. అమ్మాయి స్కూలుకి వెళ్ళినా, పోనీ బాబుని కొన్ని గంటలు పెడదామని అనుకున్నాను. ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడే మానెయ్యచ్చని చూడడానికి వెళ్ళాను. అప్పటికే కొంతమంది పిల్లలు వున్నారు. నీట్ గా నే వుంది.

మర్నాటి నుంచి అజిత దగ్గిర కొన్ని గంటలు పెట్టేదాన్ని. చాలా బాగా చూసేది. ఆ అమ్మాయి వాళ్ళాయన మంచివాడు కాదు. తాగుతాడు, కొడతాడు. తను ఎవరో బంధువుల ద్వారా వచ్చి రూము తీసుకుని బేబీ కేర్ సెంటర్ పెట్టుకుంది. పాపం అనిపించింది. ఒక పక్క పిల్లలని చూసుకుంటూనే జంతికల్లాంటివి చేసి అమ్ముతుండేది. చీరలు అమ్మేది. నాకు తోచిన సాయం నేను చేసేదాన్ని. తన స్వయం కృషితో డబ్బులు సంపాదించుకుంటోంది. అలా ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది.

నాకు ఇంట్లో ఎవరూ లేరనే సమస్య తీరింది అమ్మయ్య అనుకున్నాను. ఇంతలోకే ఎక్కడ నుంచి ఊడిపడ్డాడో వాళ్ళాయన వచ్చాడు. నేను మారిపోయానని చెప్పి కేర్ సెంటర్ నడపనివ్వలేదు ఆ మూర్ఖుడు. నిజమే అని నమ్మింది ఆ పిచ్చి పిల్ల. ఇద్దరూ కలిసి వుండడం మొదలు పెట్టారు. మళ్ళీ మామూలు వ్యవహారమే. ఆ అమ్మాయి ఏవైనా చేసి కొనమంటే కొనడం తప్ప, ఇంకేం చెయ్యలేని పరిస్థితి. కానీ నాలాంటి వాళ్ళు ఇచ్చిన మోరల్ సపోర్ట్ తో మొండి ధైర్యంగా వుండి తర్వాత బాగా సెటిల్ అయ్యిందని విన్నాను. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందని ఆ అమ్మాయికి చాలామంది సాయం చేశారు.

అప్పటికి బాబుకి రెండున్నర సంవత్సరాలు వచ్చింది. నేను ఇంక ఇలా కాదని వీణా చదివే స్కూల్లో ఎల్.కె.జిలో వేసేశాను. ఒకపూటే స్కూలు వుండేది. ఏదో కొంత వెసులుబాటు. తనూ చిన్న పిల్లే అయినా అక్కగా తమ్ముడిని చాలా బాగా చూసుకునేది.

అయినా వర్కులు చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ వర్కు అయేలోపున బాబుతో కబుర్లు చెపుతూ, ఆడిస్తూ వుండేవారు. నాకు చాలా సహకరించేవారు. వాళ్ళకి వర్కు సరిగ్గా అవడమే కావాలి.

*** పిల్లలకి నేర్పిన మొదటి పాఠం ***

హైదరాబాదులో అతి పెద్ద శ్రద్దా పబ్లికేషన్ సంస్థాపకుడు లక్ష్మీనారాయణ గారు. ఎక్కువ సైన్సు, మాథ్స్ పుస్తకాలు ప్రింట్ చేస్తారు. సిటీలో చాలా బ్రాంచ్ లు వున్నాయి.. మా కుటుంబ మిత్రులు రామారావుగారు ఆయనకి ఫ్రండ్. ఇద్దరూ కలిసి మా ఇంటికి వచ్చారు. లక్ష్మీనారాయణ గారు నేను చేసిన కొన్ని పుస్తకాలు చూసి నాకు రెగ్యులర్ వర్క్ ఇచ్చారు. నెలకి సైన్సు, మాథ్స్ పుస్తకాలు, వాటి సంబంధించిన వర్కు పుస్తకాలు వస్తూనే వుండేవి. సైన్స్ ఈక్వేషన్స్, మేథ్స్ చెయ్యడం వచ్చినవాళ్ళు తక్కువ. ఈ పుస్తకాలు చేశాక ప్రూఫు కరక్షన్స్ రామారావుగారు చేస్తారు.

రామారావుగారింటికి సాయంత్రం పిల్లలని తీసుకుని ప్రూఫులు ఇవ్వడానికి వెళ్ళాను. పిల్లలని చూసి వాళ్ళు పలకరించి. ఇద్దరికీ చెరొక రస్కు ఇచ్చారు. వాళ్ళిద్దరికీ ఇంకోటి తినాలనిపించింది. వాళ్ళు ఇవ్వలేదు. నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. అది చూసిన రామారావుగారి భార్య డబ్బా దాచేసి వచ్చింది. పెద్ద వాళ్ళు ఆ మాత్రం ఎందుకు గ్రహించుకోరో అర్థం కాలేదు.

వాళ్ళని తీసుకుని ఎక్కడికి వెళ్ళినా ఇంటి దగ్గరే షాపులో వాళ్ళకి కావలసిన చిరుతిండి కొనుక్కుని, దానితోబాటు నీళ్ళు కూడా తీసుకుని వెళ్ళడం అలవాటయింది. “మీకు ఏది కావలసినా నన్ను అడగండి. వాళ్ళు పెట్టినదే తీసుకోవాలి” అని చెప్పాను. ఏ కస్టమర్ దగ్గిరకి వెళ్ళినా... వాళ్ళకి నేను కొనిచ్చినవి తింటూ ఆడుకునేవారు. నా పని నేను చేసుకునేదాన్ని. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఏదైనా అత్యవసరం వస్తేనే ఎవరిసాయమైనా తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇద్దరికీ ప్రతి పనీ వాళ్ళే చేసుకోవడం కూడా అలవాటు చేసుకున్నారు.

*** జీవితం మ్యూజికల్ ఛైర్స్ ఆట ***

సంజీవరెడ్డి నగర్ లో ఆగస్టు 15కి ముందు పిల్లలకి రకరకాల పోటీలు పెట్టారు. మేమున్న అపార్ట్ మెంట్ లాంటి బిల్డింగ్ లో అందరూ చిన్న చిన్న పిల్లలు ఒక పదిమంది పిల్లలని తీసుకుని ఆ పోటీలకి వెళ్ళాను. ప్రతి పోటీలోనూ మా బిల్డింగ్ లో పిల్లలకే ప్రైజులు వచ్చాయి. పాటల పోటీలో వీణాకి, పక్కింటి అమ్మాయి సౌమ్యకి వచ్చింది. చివరగా మ్యూజికల్ ఛైర్స్ ఉంది. అక్కడ వున్న వాళ్ళలో మా అబ్బాయి 3 సంవత్సరాల వాడు. వాడు నేనూ ఆడతానని బయల్దేరాడు. పదిహేను మంది పిల్లలు వున్నారు. వీడు వాళ్ళ కాళ్ళంత పొడుగు కూడా లేడు. నేను వాడితో “నువ్వు కుర్చీ వంకే చూడు. ఎవరివంకా చూడకు” అని చెప్పాను. కానీ పిల్లలందరూ ఒకటే పద్ధతిలో ఆడారు. ఆటలో పోటీ కూడా కనిపించింది. వీడు చిన్నపిల్లాడు అని జాలి ఏమాత్రం పడలేదు. వాళ్ళ పోరాటపటిమ నాకు నచ్చింది. అదే మంచిదనుకున్నాను. వాడు కింద పడకుండా వుంటే అంతే చాలు అనుకున్నాను. చివరికి మా వాడు ఒక పదిహేను సంవత్సరాల వాడూ మిగిలారు.

నేను ఏం ఆడతాడులే అని ఎలా ఆడాలో చెప్పిన దాన్ని పట్టుకుని - కుర్చీ వంకే చూసుకుంటూ విజిల్ వెయ్యగానే గబగబా ఎక్కలేకపోయినా దాని దగ్గరకి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇంక వాడికి ఎంత ఆనందమో.... చక్కటి బొమ్మ ఒకటి ప్రైజ్ వచ్చింది. మెల్లిమెల్లిగా జీవితం మ్యూజికల్ ఛైర్స్ అని బాగా తెలుసుకున్నాడు. అప్పుడప్పుడు కొన్ని పనులు అవట్లేదని అనుకున్నా తన గోల్ మీద దృష్టి పెట్టి పనులు చేసుకుంటుంటాడు.

*** కేరళ ఆనందాశ్రమం వర్కు ***





రామారావు గారి స్నేహితుడు వెంకట్రామయ్యగారు కేరళ ఆనందాశ్రమంలో పనిచేస్తుండేవారు. ఒకసారి మాటల మధ్య ఆయన తెలుగు డిటిపి తప్పులు లేకుండా చేసే వాళ్ళు కావాలి అంటే మా ఇంటికి తీసుకు వచ్చారు. అప్పటి వరకూ వాళ్ళకి తెలుగులో పుస్తకాలు లేవు.

వెంకట్రామయ్యగారు ఏడాదికి పది పుస్తకాలు మాకు ఇస్తామని మాట ఇచ్చారు. కేరళ నుంచి వచ్చి ఒక నెల రోజులు హైదరాబాద్ లో వుండి, ఇంగ్లీషు నుంచి అనువాదం చేసి మాకు ఇచ్చేవారు. షుగర్ పేషెంట్ కాబట్టి, పెద్దాయన బయటికి వెళ్ళడం కష్టం కాబట్టి ఆయనకి మా ఇంట్లోనే భోజనం పెట్టేవాళ్ళం. ఆయన చివరలో దానికి కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి బాకీ లేకుండా చేసేవారు. ఆశ్రమం పుట్టుపూర్వోత్తరాలన్నీ అందులో వుండేవి. ఏ వర్కు చేసినా తెలియని విషయాలు తెలుసుకోవడం మంచిది అనుకునేవాళ్ళం. మాకు రావలసిన డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఏ వర్కయినా శ్రద్ధగా చేసి ఇవ్వడమే.

***
*** వెంకట్రామయ్యగారు మొత్తం పేజి సెటప్ అయ్యాక దానిని A4 size TP (Transperant Paper- అప్పుడు బండిల్ రు. 300 ) మీద మేటర్ రివర్స్ లో తీసుకునేవారు. అది ఫిల్మ్ వేసుకునే కన్నా చీప్ పడుతుంది. రివర్స్ లో తీసుకున్న మేటర్ ని డైరెక్ట్ ప్లేట్ మేకింగ్ అని ప్లేట్ మీదకి ట్రాన్స్ ఫర్ చేసినప్పుడు అది రివర్స్ రాకుండా మామూలుగా వస్తుంది. దానిని ప్రింటింగ్ మెషీన్ కి ఎక్కిస్తారు. ఈ ప్లేట్స్ 8 పేజీలు, 16 పేజీలు, 32 పేజీలు వచ్చే సైజులు వుంటాయి. TP పేపర్ కన్నా ఫిల్మ్ వేస్తే చాలా నీట్ గా ప్రింటింగ్ వస్తుంది. కానీ రేటెక్కువ. ఇప్పుడు చాలామంది ప్రింటర్స్ TP పేపర్ కూడా వాడుతున్నారు. వాళ్ళకి మిగిలే డబ్బులు ఎక్కువ వుంటాయి. ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి పేపర్ కటింగ్ లో వచ్చిన రద్దుకి కూడా వేలల్లో డబ్బులు వస్తాయి. ఫోటోలలో TP పేపర్, ప్రింట్ చేసే సిల్వర్ ప్లేట్స్ ఉన్నాయి ***

***
మమ్మల్ని చాలాసార్లు కేరళలో పది రోజులు వుండేలా రమ్మన్నారు. ఆశ్రమంలో అప్పుడు అంతా ఫ్రీగా వుండేది. ప్రశాంతమైన వాతావరణం అని చెప్పారు. పిల్లల చదువులతోనే కాకుండా మా వారి ఆఫీసులో బాబా అటామిక్ ఎనర్జీ వాళ్ళ వర్క్ కూడా చేసేవారు. దీంతో ఎప్పుడూ వర్కు అర్జంటే వుండేది. షిఫ్ట్ డ్యూటీలు వీటితో వెళ్ళలేకపోయాం. ఆ వెంకట్రామయ్యగారు లేరు, రామారావుగారు లేరు.

6 కామెంట్‌లు:

  1. >> తనూ చిన్న పిల్లే అయినా అక్కగా తమ్ముడిని చాలా బాగా చూసుకునేది.
    నాకు తెలిసి ముఖ్యంగా ఆడపిల్లలకే తమ్ముళ్ళూ చెల్లెళ్ళపట్ల ఎక్కువ ప్రేమా బాధ్యతా ఉంటాయండీ. మాచిన్నతమ్ముడికి ముందు అమ్మాయీ తరువాత అబ్బాయీను. ఆపిల్లకి తమ్ముడంటే ఎంత ప్రాణం అంటే, తనకి తినటానికి ఎవరన్నా ఏదన్నా ఇస్తే అదలా పట్టుకొనే ఉండటమే ఎంతసేపైనా సరే ఇంటికి వెళ్ళాక తమ్ముడికి పెట్టి మరీ తినాలని. నిజానికి నేను చూస్తున్నంతవరకూ పిన్నలయ్యేది పెద్దలయ్యేది కుటుంబంలోని సభ్యులపట్ల ఎక్కువ బాధ్యతగా ఆలోచించేదీ తాపత్రయపడేదీ ఆడపిల్లలే.

    రిప్లయితొలగించండి
  2. అవునండీ చిన్నప్పటి నుంచీ ఇప్పటి వరకూ తమ్ముడి మీద ప్రేమ, బాధ్యత. నిజంగానే ఆడపిల్లలు అలాగే వుంటారు. మీరు చెప్పినట్టు ఆడపిల్లలకి పెళ్ళయినా ఓ పక్కన సంసారం చూసుకుంటూ... ఇంకో పక్కన తన అమ్మా, నాన్న, తమ్ముడు లేదా చెల్లెలు పట్ల చాలా బాధ్యతగా వుంటారు.

    రిప్లయితొలగించండి
  3. మీ జీవనయానంలో మీ పట్టుదల మెచ్చుకోదగినది.

    మీకు, మీ కుటుంబానికి శరన్నవరాత్రి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎందుకో సర్ ఓడిపోయాను అని చెప్పుకోవాలంటే ఇష్టం వుండేది కాదు. కానీ అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వచ్చేది. అవి కూడా పాఠాలు బాగానే నేర్పాయి.

      మీకు, మీ కుటుంబానికి కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు సర్

      తొలగించండి