6, మార్చి 2021, శనివారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 17

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 17

అమ్మో.... చిన్నపాపతో క్వారంటైన్ ఘట్టం... 



మూడు రోజుల ప్రయాణం... ఎట్టకేలకు క్షేమంగా చేరిన గమ్యం.

గూటికి చేరేముందు దాటవలసిన మరో పెద్ద అగాధం క్వారంటైన్

అదో పంజరమా... అదో ఖైదా...

ఏమో... అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది.

అదీ ఆస్ట్రేలియాలాంటి దేశాల్లో... అన్నీ ఉచితంగానే ఇచ్చినా ఈ ప్రక్రియ కఠినంగానే వుంది కాబట్టే 400 మందీ ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళారు.

ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఫైవ్ స్టార్ హోటల్లో మెత్తటి పరుపులు, ఎ.సి., చలేస్తే హీటర్, వైయ్ ఫై, టీ.వీ. అన్ని హంగులూ ఉన్న అదోరకమైన ఖైదులో పెట్టేశారు.  క్షేమంగా ఆస్ట్రేలియా చేరినందుకు ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్ లు పంపించారు.



* * *

మూడురోజుల ప్రయాణంలో బాగా అలిసిపోయి మూడురోజులు బాగా నిద్రపోయి విశ్రాంతి తీసుకున్నారు. ఇక నాలుగో రోజునుంచి మా చిట్టిపాపాయితో మా అమ్మాయి ఒక్కత్తీ నాలుగు గోడల మధ్యన ఎలా మేనేజ్ చేసుకోగలిగిందో... నలిగిపోయిందో  చెప్పాలంటే ఓ పెద్ద కథ రాయచ్చు.

పాపకి 7వనెల వచ్చింది. ఇప్పుడిప్పుడే అన్నీ బాగా నడుస్తున్నాయి. 14 రోజుల ముందు వరకూ ఇంట్లో 5గురి మధ్య ఆనందంగా ఆడింది. ఎందుకు అక్కడుందో ఏమీ అర్థంకాలేదు. మా దగ్గరున్నప్పుడే పిల్లల పాటలు కంప్యూటర్ లో చూడ్డం అలవాటయ్యింది కాబట్టి. హోటల్ రూంలో టీవీలో కాసేపు అవి చూసేది. వాళ్ళ నాన్న - నానమ్మ, తాతయ్యలతో - మాతో నాలుగైదుసార్లు వీడియో కాల్స్, పేచీలు, ఏడుపులు, పలకరింపులు, ఆటలు, మేము చూస్తూ వుండడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి. మేము మాట్లాడితే కొంత ఉపశమనం అంతే... ఎవరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారో ఆ చిన్న బుర్రకి అర్థం కాలేదు.

ఇక రోజులు గడుస్తున్నకొద్దీ తను, తన అమ్మ మాత్రమే ఎందుకున్నారో ఆ చిన్న మెదడులో ఆలోచనలు కావచ్చు. తెలియకుండానే వాళ్ళమ్మ బుగ్గలు కొరకడం, జుట్టు పీకడం, మీదపడి కుమ్మడం లాంటివి చేసింది. అమ్మ ఎక్కడికీ వెళ్ళకూడదు. కనీసం బాత్రూంకి వెళ్ళడానికి కూడా లేకపోయింది.  







కాకపోతే వాళ్ళమ్మ పాడిన పాటలకి నోరుమెదపడం, కూచోవడం, అన్నీ పట్టుకుని నుంచోవడం నేర్చుకుంది. వాళ్ళు ఇచ్చిన బేేబీ ఫుడ్ ఇష్టంగా తినేది. నిజంగా ఎవరూ లేకుండా నాలుగు గోడల మధ్యన 14 రోజులు గడపడం చాలా కష్టం.

* * *

స్వేచ్ఛా విహంగాలు

విజయవంతమైన క్వారంటైన్ ఘట్టం

క్వారంటైన్ వివరాల్లోకి వెడితే

400 మందికి రూములు ఏర్పాటు చేసి, తలుపు తీసుకుని బయటికి రావద్దని చెప్పి నాలుగు గోడల మధ్య బంధించేశారు. ఎవరైనా బయటి వస్తారేమోనని ఒక్కో ఫ్లోర్ కి సెక్యూరిటీ గార్డ్ ని పెట్టారు.

వాళ్ళు పొద్దున్న అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏ టైముకి అవి గుమ్మం ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. వీళ్ళు మ్యూజియంలో బొమ్మ గడియారం కొట్టి డింగ్ మని లోపలికి వెళ్ళిపోయినట్లు అవి తీసుకుని వెంటనే లోపలికి వెళ్ళిపోవాలి. వీళ్ళు తినేసిన తర్వాత ఖాళీవన్నీ బయట పెట్టేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు.

వీళ్ళు రూంలోంచి మాత్రం బయటికి రాకూడదు. రోజూ మాత్రం మెడికల్ డిపార్ట్ మెంట్ వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే చెప్పమని ఫోన్ లో పలకరించేవారు, అవసరమైతే వచ్చి తగిన సేవలు అందించేవారు. వీడియోకాల్స్ లో మాట్లాడేవారు.

నాలుగు గోడల మధ్య పెద్ద వాళ్ళు అయితే ఫర్వాలేదు. పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం కష్టమే... మరి. ఒకరోజు ముందు కరోనా టెస్ట్ చేసి అందరినీ ఖైదులోంచి విడుదలచేశారు.

పాప ఒక్కసారి బయటికి వచ్చేసరికి ఏడ్చింది - వెలుతురు తట్టుకోలేకో, ఇన్నాళ్లూ నిశ్శబ్ద వాతావరణంలో వుండి బయట చప్పుళ్ళకో తెలియదు.   మెల్లగా బయటి వాతావరణానికి అలవాటు పడాలి.

మొత్తానికి  ఇంటికి వెళ్ళిపోయారు.

మొత్తానికి కథ సుఖాంతం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి