8, ఫిబ్రవరి 2022, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు -7

 

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు -7








పెద్దక్క పెళ్ళి


అమ్మమ్మ పెద్దక్కని చిన్నప్పటి నుంచీ మా చిన్న మేనమామ కృష్ణకి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని అనుకున్నారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగానే అందరూ అనుకునేవారు. మరి అమ్మకి ఇష్టమే కానీ, నాన్నగారు ఏమాలోచించేవారో తెలియదు. నాన్నగారికి ఎంతసేపూ పిల్లలని బాగా చదివించి ఉద్యోగస్తులని చెయ్యాలని అనుకునేవారు.

 

నాన్నగారు సడన్ గా రాత్రి పడుకున్న మనిషి పొద్దున్న లేవకపోయేసరికి పరిస్థితులు తారుమారయినట్టున్నాయి. ఎందుకంటే మేమింకా చిన్న పిల్లలం.

 

ఒకసారి తాతగారు ఆయన స్నేహితుడితో కలిసి తాడేపల్లిగూడెం వచ్చారు. అమ్మ ఇద్దరికీ భోజనం పెట్టింది.

అమ్మ ఏంటి నాన్నా ఇలా వచ్చావు అంది.

తాతగారు ఏమీలేదు కృష్ణని అన్నపూర్ణకి ఇచ్చి పెళ్ళి చేద్దామనుకున్నాం కదా.. ఇప్పుడు దానిమీద కుటుంబ బాధ్యత పడింది కదా... రెండోది రమాని ఇచ్చి చేస్తే బావుంటుంది కదా... ఏమంటావ్ అన్నారు. అమ్మ షాక్. అమ్మకి ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతలోకే మూడో అక్క ఉమ బయటికి వచ్చి తాతయ్యగారూ... మీరు ఇలా అడగడం ఏమీ బాగాలేదు. అక్కని వద్దనుకున్నారు. రమాక్క ఇంకా చదువుకుంటోంది. ఉద్యోగం చెయ్యాలి. రమాక్కని మాత్రం మామయ్యకి ఇచ్చి చెయ్యడం మాకు ఇష్టం లేదు అని చెప్పింది.

 

అక్క అలా చెప్తుంటే పెద్దక్క అన్నపూర్ణ, అమ్మ షాకయ్యారు. ఇంకోరకంగా బాగానే చెప్పింది అనుకున్నారు. కాకపోతే చిన్నదానిచేత చెప్పించారు అనుకుంటారేమో అని మరో భయం. ఏమయితేనేం. తాతగారు సరే అని వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని రోజులు ఉత్తరప్రత్యుత్తరాలు లేవు.

 

మామయ్యకి తాతగారు ఎలక్ట్రికల్ ఆఫీసులో ఉద్యోగం ఇప్పించారు. తణుకు దగ్గర కవిటం అనే ఊరికి సంబంధించిన అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేశారు. రెండో అక్క, మూడో అక్క పెళ్ళికి వెళ్ళారు. మొత్తానికి ఆ సమస్య అలా పరిష్కారం అయ్యింది.

 

ఇక పెద్దక్కకి సంబంధాలు వస్తున్నాయి. ఒకతను బొంబాయిలో ఉద్యోగం చేస్తాడు. బాగానే మాట్లాడారు. కానీ వాళ్ళన్నది ఏమిటంటే... పెళ్ళయ్యాక నాతోబాటు బొంబాయి వచ్చెయ్యాలి. కుటుంబ బాధ్యతలు కుదరవు అన్నారు. ఆ సంబంధం అలా తప్పిపోయింది.

 

అమ్మకి బెంగ వచ్చింది. ఏమిటో ఇలా... అని. 

మాచిన్నప్పుడు తాడేపల్లిగూడెంలో మొదట ఉన్న ఇంటి వెనకవైపున ఆ ఇల్లుగల వాళ్ళదే ఒక డాబా ఇల్లు వుండేది.  ఆ ఇంట్లో మాధవరావుగారని ఒకాయన వుండేవారు. ఆయనకి నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఆఖరి అబ్బాయి పెళ్ళికి ఉన్నాడు రైల్వేలో చేస్తున్నాడు. అబ్బాయిపేరు ప్రభాకర్. ఒకసారి మాట్లాడి చూడండి అని ఆ ఇల్లుగల వాళ్ళమ్మాయి కమల చెప్పింది.

 

ఇల్లుగలాయన ప్రకాశరావుగారితో అక్క అన్నపూర్ణ తన సంబంధం తనే మాట్లాడుకోవడానికి మాధవరావుగారు ఉన్న తణుకు దగ్గర రేలంగి వెళ్ళింది. చిన్నప్పటి నుంచీ తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా ఆదరంగా మాట్లాడారు. వాళ్ళ చుట్టాలందరూ కలిసి కూచుని అక్కతో అన్నీ వివరంగా మాట్లాడి వాళ్ళబ్బాయికి చేసుకోవడానికి ఒప్పుకున్నారు.

 

అక్క వచ్చి అమ్మకి చెప్పగానే అమ్మ చాలా సంతోషించింది. అయితే ఒకసారి ప్రభాకరరావుని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాం. ఆయన వచ్చినప్పుడు అక్క అన్ని విషయాలు వివరంగా మాట్లాడి, నా తర్వాత చెల్లెళ్ళిద్దరూ సెటిల్ అయ్యే వరకూ నేను బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. దీనికి మీరు అంగీకరిస్తారా... అంది.

 

ప్రభాకరరావుగారు సరే అని ఒప్పుకున్నారు. అక్కకి మొత్తానికి అన్నీ తెలిసిన వాళ్ళ సంబంధం కుదిరింది. 

5 కామెంట్‌లు:

  1. మీ కుటుంబ పరిస్ధితులు తెలిసున్న మీ తాతగారే అంత స్వార్థపూరితంగా అలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. అండగా ఉండవలసినది పోయి, కనీసం ఇచ్చిన మాట నిలబెట్టుకోక పోవడం విచారకరం.

    రిప్లయితొలగించండి
  2. అమ్మకి కూడా చాలా రోజులు మింగుడుపడలేదు. చేసుకుంటే ఎలా వుండేదో... మరి. అక్కకి కుదిరిన ప్రభాకరరావుగారు మాత్రం మా అందరి పెళ్లిళ్ళకి బాగా సహకరించారు. డబ్బు మాత్రమే కాదు. మోరల్ సపోర్టు కూడా. ఇంకా ఇలాంటివి చాలా జరిగాయి సర్.

    రిప్లయితొలగించండి
  3. మీ పెద్ద బావగారు ప్రభాకరరావు గారి దొడ్డమనస్సుకి నా అభివాదం  🙏.  
    తల్లిదండ్రులనే పట్టించుకోని మనస్తత్వాలు నడుస్తున్న కాలంలో అత్తవారింటి వైపు బాధ్యతలను కూడా తలకెత్తుకోవడం నిజంగా మెచ్చుకోదగిన వ్యక్తిత్వం.  

    రిప్లయితొలగించండి
  4. ఆవును సర్. ఆయన ఇప్పుడు లేనప్పటికీ ఆయన చేసిన సాయాన్ని మర్చిపోలేం.

    రిప్లయితొలగించండి