4, మార్చి 2022, శుక్రవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు - 10

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  మెల్లిగా  కుదురుకుంటున్న మా జీవితాలు - 10

మూడో అక్క పెళ్లి అనుకోకుండా అయ్యాక అమ్మకి కొంత రిలీఫ్ అనిపించినా... రెండో అమ్మాయి రమ వుండిపోయిందని దిగులు కూడా పడింది. 

అయితే రమాక్క చాలా తెలివైనది. తను ప్రైవేట్ కంపెనీలో చేస్తూనే రైల్వే, స్టాఫ్ సెలక్షన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ల పోటీ పరీక్షలు రాసింది. మూడింట్లోనూ ఒకేసారి ఇంటర్వ్యూకి వచ్చింది. తనకి స్టేట్ బ్యాంక్ లో చెయ్యాలనే కలతో వుంది. మూడింటికీ ఇంటర్వ్యూకి వెళ్ళింది. మూడింట్లోనూ సెలక్ట్ అయ్యింది.  కానీ తను స్టేట్ బ్యాంక్ లోనే చేరాలనుకుంది. ఫస్ట్ అప్పాయింట్ మెంట్ నారాయణగూడా స్టేట్ బ్యాంక్ లో వచ్చింది. చాలా సంతోషించింది. అమ్మావాళ్ళు కనీసం ఉద్యోగం మంచిది దొరికిందని సంతోషించారు. 

మా మేనత్త కూతురు వాళ్ళింటికి దగ్గరలో అక్కలిద్దరూ కలిసి  ఉన్న రూంలోనే ఉండిపోయింది. ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళు. ఇల్లుగలవాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఒక కోటలాంటి గేటులోపల వున్న పోర్షన్లలో పది కుటుంబాలు వుండేవి. అందరూ కలిసికట్టుగా వుండేవాళ్ళు.  అందుకని అమ్మకి అక్క గురించి బెంగ వుండేది కాదు. ఒక రకంగా అమ్మ ధైర్యంగా వుండబట్టే అందరం సెటిల్ అవగలిగామేమో అనిపిస్తుంది. 

నేను తాడేపల్లిగూడెంలో స్కూల్లో ఉద్యోగం చేస్తుండగా పెద్దక్కకి 1980లో మొదటి పాప పుట్టింది. అప్పట్లో అక్కడ వున్నది ఒకే ఒక హాస్పిటల్. అక్క ఆంధ్రాబ్యాంక్ లో చేసేది కాబట్టి  హాస్పిటల్ వాళ్ళు బ్యాంక్ కస్టమర్స్ అవడంతో ఆ హాస్పిటల్ లోనే చేరింది. లేకపోతే పక్కవూరు తణుకు వెళ్ళవలసిన అవసరం వచ్చేది. పాపం అమ్మే హాస్పిటల్ లో వుంది. మే నెల  11వ తేదీన రాత్రి 8.30 కి అరిచేతిలో సరిపోయే బొమ్మలాంటి ఆడపిల్ల పుట్టింది. చక్కగా ముద్దుగా వుంది కానీ, అంత చిన్న పాపని చూసేసరికి మాకు చాలా భయం వేసింది.  అమ్మ రాత్రి తన పక్కన పడుకోపెట్టుకుంది. ఆ పాపమీదకి  అమ్మ ఎక్కడ వెళ్ళిపోతుందోనని రాత్రంతా ఇంట్లో వున్న నాకు నిద్రపట్టలేదు. 

అక్క డిస్చార్జ్ అవ్వడానికి 300 రూపాయలు కావలసి వచ్చింది. దానికోసం నేను ట్యూషన్ చెప్పేవాళ్ళదగ్గర ముందుగా తీసుకుని హాస్పిటల్ లో డబ్బులు కట్టి అక్కని ఇంటికి తీసుకువచ్చాము. వాళ్ళు వత్తిడి పెట్టలేదు కానీ... పద్ధతులు పద్ధతులే కదా... ఉన్నకొద్దీ డబ్బులు పెరుగుతాయి. బావగారు ఊరునించి వచ్చాక వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వచ్చాం. అప్పట్లో గూగుల్ పే అవన్నీ లేవు. ఆయన ఎక్కడో బాడ్మింటన్ ఆడడానికి వెళ్ళి వెంటనే రాలేకపోయారు. 

పాపతోటి అమ్మకి పని ఎక్కువయింది. తాడేపల్లిగూడెంలోనే ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల సంవత్సరాలతరబడి ఒకే పనిమనిషి, ఒకే చాకలి వుండేవారు. అయినా ఇంట్లో పని ఎక్కువగానే వుండేది. నేను, మా చెల్లెలు స్కూల్లో టీచర్స్ గా ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మేము స్కూలుకి వెళ్ళిపోయేవాళ్ళం. అక్క  బ్యాంక్ కి వెళ్ళిపోయేది. అమ్మకి అప్పటికి 41 సంవత్సరాలు. ఎంత ఓపిక లేకపోయినా అమ్మ ఎప్పుడూ కూచునే రకం కాదు. అమ్మకి పడుకునేందుకు నిద్ర వుండేదో లేదో తెలియదు.  మేము స్కూలు నుంచి వచ్చేసరికి పాపని పక్కన పెట్టుకుని విపులో, చతురో చదువుతూ పడుకునేది. 

ఇంటికి రాగానే పాపాయిని మేము చూసుకుంటూ వుండేవాళ్ళం. అమ్మ వంట చేసేది. పాపాయికి పదోనెల వస్తూండగానే దానికి మరో చెల్లెలు పుట్టింది. పెద్దపాప పేరు ఛాయ, రెండోదానిపేరు రత్న. ఇద్దరూ ట్విన్స్ లా వుండేవారు. రత్న ఏడిస్తే ఛాయ కూడా ఏడ్చేది. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం అయ్యేది కాదు. 

వాళ్ళని పెంచడానికి అమ్మకి మేమందరం సాయం చేసేవాళ్ళం. ఒకసారి అక్కావాళ్ళమామగారు పోయారని అక్కావాళ్ళు ముందర వెళ్ళిపోయారు. నేను, అమ్మ ఇద్దరం చెరొకళ్ళని వేసుకుని తాడేపల్లిగూడెం నుంచి తణుకు బస్ లో వెళ్ళి అక్కడ నుంచీ రిక్షాలో రేలంగి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేలోపున ఇద్దరూ బస్ లో ఒకటే ఏడుపు. అందరూ కవలపిల్లలా, దిష్టి తగిలిందేమో... తల్లిపాలు కాదా... అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. వాళ్ళకి గబగబా డబ్బాలో ప   పౌడర్ రెండు బాటిల్స్ వేసి, ఫ్లాస్క్ లోంచి వేడి నీళ్ళు పోసి పాలుకలిపి ఇద్దరికీ చెరో బాటిల్ ఇస్తే తాగేసి పడుకున్నారు. 

మొత్తానికి రేలంగి చేరాం. ఇల్లు పెద్దదవడంతో అందరికీ పడుకోవడానికి పెద్ద ఇబ్బంది అవలేదు. కానీ ఛాయ, రత్న ఇద్దరూ అందరూ మంచి నిద్రలో వుండగా ఏడుపు మొదలుపెట్టారు. ఆకలి కాదు. ఎందుకు ఏడ్చారో ఇప్పటికీ తెలియదు. అందరూ నిద్రలోంచి లేచి "పిల్లలు ముద్దుగా వున్నారు. దిష్టి తగిలిందేమో... దిష్టి తియ్యండి. లేకపోతే వాము నీళ్ళు పట్టండి" ఇలా సలహాలు ఇచ్చారు. మాకు వీళ్ల సంగతి తెలుసు కాబట్టి "ఏమీలేదు వీళ్ళిలాగే ఏడుస్తారు మీరు పడుకోండి" అని చెప్పాం. అందరూ నిద్రపోయారు. మర్నాడు మళ్ళీ ఏడిస్తే ఒక్కళ్లు కూడా నిద్రలోంచి లేవలేదు. 



3 కామెంట్‌లు:

  1. ఒక్కొక్కరూ సెటిల్ అవడం బాగుందండీ. మీ అమ్మగారు కష్టపడినందుకు ఊరట దొరికింది.

    చంటిపిల్లల ఏడుపు అంటే Woodward's Gripe Water గుర్తొచ్చింది. నిజానికి మా చిన్నప్పుడు అందరి ఇళ్ళల్లోనూ ఆ సీసా ఉండేది, చంటిపిల్లలు ఏడుస్తుంటే ఓ చెంచాడు పట్టించేవారు - ఏ కడుపునొప్పిగానో ఉంటే (gripe) చంటిపిల్లలు చెప్పలేరు కాబట్టి ఏడుస్తారు అని పెద్దవాళ్ల అంచనా 🙂.

    అవునూ, రేలంగి ఊరు రైల్ మార్గంలో లేదా? మరి “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో రేలంగి స్టేషన్ అని బోర్డ్ చూపిస్తారే? సినిమా మాయే అంటారా 🙂?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విన్నకోట వారు, తణుకు పక్కనే రేలంగి రైల్వే స్టేషన్ ఉందండి. కాని చిన్న స్టేషన్, అన్ని రైళ్లూ ఆగవు.

      తొలగించండి

    2. ఓ, అయితే రేలంగి స్టేషన్ ఉందన్నమాట ? బహుశః భీమవరం వెళ్ళే దారిలో ఉండుంటుంది?
      థాంక్స్ండీ, బోనగిరి గారు.

      తొలగించండి