20, మార్చి 2022, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35 మెల్లిగా కుదురుకుంటున్న మా జీవితాలు - 11

   

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆవూళ్ళు – 35  పసిపిల్లలతో సందడి సందడి - 11



పిల్లలతో అక్కమామగారి కార్యక్రమాలకి వెళ్ళినా పాపం అమ్మకి అస్సలు తీరుబడి వుండేది కాదు.  ఎంతసేపూ అక్కపిల్లల బట్టలు వుతకడం, అవి ఆరెయ్యడం మడతలు పెట్టడం పనులతో సరిపోయింది. ఇంక నేను ఇద్దరు పిల్లలని దగ్గర పెట్టుకుని అమ్మ చేసే పనులు చూస్తూ కూచునేదాన్ని. మొత్తానికి కార్యక్రమాలు అయ్యాయి.  అక్కావాళ్లు ఇంకా నాలుగు రోజులు వుండి బయల్దేరాల్సి వచ్చింది. అమ్మా,  నేను  ఆ పిల్లలని  వేసుకుని బస్టాండ్ కి వచ్చాం. బస్సుల మహా రష్ గా వున్నాయి. మొత్తానికి బావగారు ఎలాగో బస్ ఎక్కించారు. మొత్తానికి తాడేపల్లిగూడెం వచ్చి చేరాం. 


నేను, ముగ్గురు చెల్లెళ్లు అమ్మకి సాయం చేసేవాళ్ళం. నేను, నా తర్వాత చెల్లెలు ప్రభావతి స్కూల్లో టీచర్సుగా పనిచేసేవాళ్ళం. ఆ తర్వాత చెల్లెళ్లు ఇద్దరూ చదువుకుంటుండేవారు. నా చివరి చెల్లెలు నేను చేసే స్కూల్లోనే 5వ తరగతి చదువుతుండేది. నేనే ఆ క్లాస్ టీచర్ని. అందుకని మాతోబాటు స్కూలుకి వచ్చేది. ఆ పై చెల్లెలు గాయత్రి వేరే హైస్కూల్లో చదివేది. ఇంట్లో పనిమనిషి, చాకలి వుండేవారు. మేము స్కూలు నుంచీ వచ్చేవరకూ అమ్మ పిల్లలిద్దరినీ చూసుకుంటూ వుండేది. అక్క విజయవాడ ట్రాన్స్ ఫర్ అయి వెళ్ళిపోయింది. 


 నేను, ప్రభావతి మధ్యాహ్నం లంచ్ టైంలో ఇంటికి వచ్చి భోజనం చేసినా, సాయంత్రం ఇద్దరం స్కూలు నుంచి అటునుంచి అటు ట్యూషన్లు చెప్పి రాత్రి 8 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళం. స్కూలు అయిపోగానే కొంచెం పెద్ద పిల్లలు ఇంటికి వెళ్ళి  మాకిద్దరికీ అమ్మ టీ ఫ్లాస్కులో పోసి ఇస్తే తెచ్చి ఇచ్చేవారు. అది తాగేసి మేము ట్యూషన్ కి వెళ్ళిపోయేవాళ్లం.  అక్కడ ట్యూషన్ పిల్లల అమ్మ, అమ్మమ్మ "మేము ఇస్తాం కదండీ మీరు టీ ిఇంటి నుంచి తెప్పించుకోవాలా?" అనే వారు. కానీ, నాకెందుకో అది నచ్చేది కాదు. "లేదండీ మేము ఎప్పుడైనా కావాలంటే అడుగుతాము" అని తేలికగా నవ్వేసి ఊరుకునేవాళ్ళం.  అది వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టవుతుంది అనిపించేది. మన మర్యాద మనం కాపాడుకోవాలనిపించేది. వాళ్ళింకేమనలేక ఊరుకునేవారు. 


వాళ్ళకి మేమంటే చాలా అభిమానంగా వుండేది. వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. వాళ్ళు ఇంటికి ఎవ్వరు వచ్చినా మాట్లాడేవారు కాదుట. "మీరెలా మాట్లాడిస్తారో చదువుకన్నా ముందు అది చెప్పండి" అన్నారు.  వాళ్ళు నిజంగానే పెదిమలు కూడా కదపడానికి భయపడేవారు. పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా వుండేవారు. నల్లగా వున్నా ముద్దుగా వుండేవారు. వాళ్లకి ఒక వారం రోజులు నేనేం పాఠాలు చెప్పలేదు. రోజూ కబుర్లు, కథలు చెప్పేదాన్ని. వాళ్ళు చెప్పేవి వినేదాన్ని.  మెల్లిమెల్లిగా దారిలో పడ్డారు. చాలా చురుగ్గా తయారయ్యారు.  ఒక నాలుగు నెలల తర్వాత "మాస్టారూ (అప్పట్లో ఆడయినా, మగయినా మాస్టారూ అని అనేవారు) మీరు ఏం మంత్రం వేశారు. వీళ్ళని అస్సలు పట్టలేకపోతున్నాం. అందరితో ఒకటే కబుర్లు" అన్నారు. నాకు నవ్వొచ్చింది. పిల్లలని ఎప్పుడూ చదవమని సతాయించకుండా కాస్త కబుర్లు కూడా చెప్పాలి మరి!


ఇదిలావుండగా నాకు పచ్చకామెర్లు వచ్చింది. అక్క చిన్నప్పటి నుంచి స్నేహితురాలయిన పుష్పలత వాళ్ళ అమ్మగారు పసరు మందు వేస్తారంటే రోజూ పొద్దున్నే పరగడుపున వెళ్ళి ఆ పసరుమందు వేయించుకుని వచ్చేదాన్ని. ఆ చేదు పోవడానికి నా చిన్న చెల్లెలు వెంటనే నాకు ఒక అల్లం బిళ్ళ అందించేది. అలా ఒక పదిరోజులు వేయించుకుని, పత్యం చేశాక. మామూలు మనిషిని అయ్యాను. దాంతో స్కూలు టీచరుగా మానెయ్యాల్సి వచ్చింది. 


ఇక అమ్మ రెండోపాపని తీసుకుని విజయవాడ వెళ్ళమంది. నేను రెండోపాప రత్నని  తీసుకుని విజయవాడ వెళ్ళాను. అక్కావాళ్లు ఆఫీసుకి వెళ్ళిపోయిన తర్వాత పాప ఆలనా పాలనా నేను చూసుకునేదాన్ని. అక్కడ ఎంప్లాయ్ మెంట్ ఎక్సేంజిలో రిజిస్టర్ చేయించుకోమంటే, కనకదుర్గ గుడిలో మాకు తెలిసిన ఆయన వుంటే ఆయన్ని కలవడానికి వెళ్ళాల్సి వచ్చింది.  ఆయన టైముకి దొరకక పోవడంతో  ఇంచుమించు వారం రోజులు రోజూ పాపని తీసుకుని కనకదుర్గ గుడి మెట్లు ఎక్కి వెళ్ళేదాన్ని. మొత్తానికి ఆయన దొరకారు. ఎంప్లాయ్ మెంట్ లో రిజిస్ట్రేషన్ అయ్యింది కానీ. నాకు అక్కడ ఉద్యోగం ఏమీ రాలేదు.   ఇంతలోకే బావగారు ఇక్కడ ఒక స్కూల్లో టీచర్ పోస్టు ఖాళీగా వుందిట చేస్తావా అమ్మా అని అడిగారు.  సరే అన్నాను. రు. 100 జీతం.  అక్క బ్యాంక్ ఉద్యోగం, బావగారు రైల్వే అయినా ఆరోజుల్లో పిల్లల ఖర్చులు, వారి అమ్మగారి బాధ్యత, మా బాధ్యతలకి డబ్బులు సరిపోయేవి కాదు. వందరూపాయలు ఎక్కువే మరి. సరే అని ఒప్పుకున్నాను. రోజూ అక్క పాపని తీసుకుని స్కూలుకి వెళ్ళేదాన్ని. అందరూ నా కూతురు అనే అనుకునేవారు. నా కుర్చీ పక్కనే పడుకోపెట్టుకుని, పిల్లలకి పాఠం చెబుతుండేదాన్ని. అయితే ఒక రోజు ప్రిన్సిపాల్ పిలిచి మీ పాపకి ఏదైనా ఏర్పాటు చేసుకుని రామ్మా... అన్నారు.  నాకు ఈపని కష్టం అనిపించకపోయినా, స్కూలు పిల్లలు నన్ను ఇష్టపడినా ప్రిన్సిపాల్ మాట కాదనలేకపోయాను. 


ఒక ఆదివారం రోజు బయల్దేరి తాడేపల్లిగూడెం వెళ్ళి మళ్ళీ పాపాయి రత్నని వదిలిపెట్టేసి విజయవాడ వెళ్ళిపోయాను. నాకు చాలా బాధగా అనిపించింది. అమ్మకి పిల్లలు అలవాటే కాబట్టి, పనిమనిషి, చాకలి అందుబాటులో వున్నారు కాబట్టి అమ్మ ఏమీ మాట్లాడలేదు. 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి