28, జూన్ 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 18 - తాడేపల్లిగూడెం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 2

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 18 -  తాడేపల్లిగూడెం  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు - 2

(గత భాగం తరువాత)



ఇదే ఆ పుస్తకాల అలమారు

ఆ ఇంట్లో  నేను పెట్టుకున్న పుస్తకాల అలమారు చూసి ఆనందపడిపోయాను. అది అలాగే వుంది. దాని దగ్గర నుంచుని ఫొటో తీసుకున్నాను.  అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను. నాన్నగారితో సుబ్బారాయుడు షష్ఠికి వెళ్ళి అక్కడ ఒక చక్కని కృష్ణుడి బొమ్మ కొనుక్కున్నాను. ఆ బొమ్మకి చక్కటి బట్టలు కట్టి, తలకి పింఛం పెట్టి అలంకరించేదాన్ని. 

 


నాకు కుడిచేతివైపున ఉన్నదే ఆ కిటికీ

కొంచెం ఇవతలగా ఇంకో మంచం వుండేది. దాని దగ్గర ఒక కిటికీ వుంది. మేడకి వెనక వైపున పెద్ద స్థలం వుండేది. ఆ స్థలంలో అమ్మ, నేను ఎన్నో పువ్వుల మొక్కలు వేశాం. శీతాకాలంలో  ఈ కిటికీలోనుంచి మంచు బిందువులు పడి మినుకు మినుకుమని మెరుస్తూ అరవిచ్చిన మందారాలు, సగం విచ్చిన గులాబిరంగు డిసెంబరు పువ్వులు, తెల్లపువ్వులు, ఇంకా ఎన్నో రకాల పువ్వులు చూసి ఆనందించేదాన్ని.  కింద మేము పాతిన చిక్కుడు గింజలు మొలకెత్తి అవి పైకి పాక్కుంటూ మేడమీద వరకూ వచ్చాయి. అక్కడ కాయలు కాసి మాకు అందుబాటులో ఉండేవి.   అబ్బ ఒక్కసారి అవి తలుచుకుని ఆ కాలంలోకి వెళ్ళిపోయా.

 


అక్కలిద్దరూ అదిగో నేను తిరిగి వున్న మూల కూచుని ట్యూషన్ చెప్పించుకునేవారు

నా పై అక్కలిద్దరూ పదవతరగతి ప్రైవేటు మాస్టారి చేత లెక్కలు చెప్పించుకుంటూ మధ్యమధ్యలో ఒకళ్ళని ఒకళ్ళు చూసి నవ్వుకుంటూ సైగలు చేసుకునేవారు.  నవ్వుకునేవారు. మాస్టారికి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అర్థమయ్యేది కాదు. చాలా మంచాయన. అక్కలని ఏమీ అనేవారు కాదు. కానీ తర్వాత అమ్మ వాళ్ళిద్దరినీ బాగా తిట్టింది. నవ్వు నాలుగు విధాల చేటు. అలా ఊరికే నవ్వకూడదు అని చెప్పింది. 

 (ఇంకా వుంది)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి