1, జులై 2021, గురువారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 19 - తాడేపల్లిగూడెం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 3

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 19 -  తాడేపల్లిగూడెం  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు - 3


(గతభాగం తరువాయి)




మేడ మెట్లపక్కనే ఒక చక్కటి డిజైన్ తో ఒక గోడ వుండేది. అది ఇప్పుడు లేదు అక్కడ ఒక చిన్న కిటికీ లాగ వుండి మిగిలినది గోడ కట్టేశారు. అక్కడి నుంచి మాకు వచ్చేపోయే రైళ్ళన్నీ కనిపించేవి. రోజూ అక్కడ నుంచుని రైళ్ళలో వాళ్ళకి టాటా చెప్పేవాళ్లం.  మాకు అక్కడ నుంచీ వెళ్ళేరైలు, వచ్చే రైలు కనిపిస్తుంటే బలే ఆనందంగా వుండేది.


ప్రతి శుక్రవారం ఆకుపచ్చ రంగులో ఉన్న  స్పెషల్ ట్రైన్ వచ్చేది. సరిగ్గా రాత్రి 7.30 కి. మేము భోజనాలు చేసే టైమ్. అయినా సరే తింటూ తింటూ స్పెషల్........ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేవాళ్ళం.


అప్పట్లో కొత్తగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ వచ్చింది. అది చాలా స్పీడుగా వెళ్ళేది. అది వెళ్తుంటే మేమున్న చోటు అదురుతూ వుండేది. అదో అనుభూతి.

 

మేము ట్రైన్ లో వాళ్ళకి టాటా చెప్పడం బాగానే వుండేది కానీ, అలా చెప్పకూడదని తెలియదు. ఒకసారి మెడికల్ షాపాయన పాపా అలా ట్రైన్ లో వెళ్ళేవాళ్ళకి టాటా చెప్పకూడదు అన్నారు అప్పటి నుంచీ ఊరికే చూసేవాళ్ళం.

 

ఏ రైలు ఎప్పుడొస్తుందో.... ఎప్పుడు వెడుతుందో టైము బాగా తెలుస్తుండేది. అప్పుడప్పుడు మా ఇంటి ఎదురుగా రైలు ఇంజను ఆగి వుండేది. మేడ మించి కిందకి దిగి ఆ రైల్వే ట్రాక్ మించి నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళని గ్రీజు అడిగి తీసుకునేవాళ్ళం. వాళ్ళదగ్గిర అభ్రకం కూడా వుండేది. అది కూడా ఇచ్చేవారు.

  

ఒకసారి నేను మా ఫ్రండ్ సరస్వతి వెళ్ళాం. ఇంజన్ డ్రైవర్ ఏం చదువుతున్నారు అనిఅడిగారు. 5వ తరగతి అని చెప్పాం.  ఆ అమ్మాయి నాకన్నా చాలా పొడుగ్గా వుండేది. నేను చిన్నపిల్లలా వుండేదాన్ని. ఇంత పెద్దగా వున్నావు. ఇంకా ఐదేనా అన్నాడు. పాపం ఆ అమ్మాయి చాలా బాధపడింది.

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి