10, జులై 2021, శనివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 20 - తాడేపల్లిగూడెం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 4

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 20 -  తాడేపల్లిగూడెం  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు  - 4


(గత భాగం తరువాయి)




మేము మేడ మీదకి వెళ్ళి కొత్తలో పక్కనే బాల్కనీని ఆనుకుని పెద్ద నారింజ చెట్టు వుండేది. నారింజ కాయలు అంటే ఇప్పటి పిల్లలకి కమలా పళ్లు (సంత్రాలు). కానీ అవి అసలు సిసలైన నారింజ కాయలు. ఆ చెట్టు  పక్కింట్లో ఉన్న మా ఫ్రెండు వాళ్ళింట్లోంచి బాగా విస్తరించి, పై వరకు వుండేది. కాయలు కూడా గుత్తులు గుత్తులుగా పెద్ద సైజులో వుండేవి. రుచి చాలా బావుండేది.

 

ఎన్ని కాయలు కోసుకున్నా వాళ్ళు ఏమీ అనేవారు కాదు.  పైగా మా ఫ్రెండ్స్ కి కూడా ఇచ్చేవాళ్ళం.

 

బాల్కనీలోకి చెట్టు వాలి వుండడం వలన చాలా కాయలే కోసుకునే వాళ్లం. వాటిల్లో ఉప్పూ కారం వేసుకుని తింటే బలేవుండేది. అంతే కాకుండా ఆకులు కోసి మా అమ్మ పల్చటి మజ్జిగలో వేసి, సాయంత్రానికి ఉప్పు వేసి ఇచ్చేది. వాసన పట్టి మజ్జిగ చాలా రుచిగా అనిపించేది.

 

మేము అక్కడ ఉన్న ఒక రెండేళ్ళ తర్వాత ఎందుకో ఆ చెట్టు బెరడు అంతా ఊడిపోవడం మొదలు పెట్టి ఉన్నట్టుండి ఎండిపోయింది. చాలా బాధగా అనిపించింది.

 

ఇప్పుడు దాని చోటులో పెద్ జామ చెట్టు వుంది. మేము  ఆ ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు నారింజ కాయల్ని గుర్తు చేసుకుంటూ జామకాయలు కోసుకుని తిన్నాం.

ఎడమవైపున కనిపిస్తున్న జామ చెట్టు స్థలంలో నారింజ చెట్టు వుండేది.

 


 

చిన్న  డాబా  కథ

 


మేడ ఎక్కే మెట్లకి వర్షం రాకుండా అనుకుంట ఒక చిన్న డాబా కట్టారు. దానికి మెట్లుండేవి కాదు.  దాని పక్కనే మా నాన్నగారు తడికలతో ఒక బాత్రూంలాగా కట్టించారు. మా అమ్మ అందులో నీళ్ళు కాచుకోవడానికి ఒక బాయిలర్ పెట్టేది. 


దాంట్లోకి ఇంధనం వుండాలిగా.... అందుకని పనిమనిషి చేత పేడ తెప్పించి, అప్పట్లో కుంపట్ల మీద వంట కాబట్టి బొగ్గు రజను కలిపి ఉండలు చేసి తను స్టూలు మీద నుంచుని మమ్మల్ని బుజాల మీద ఎక్కించుకుని,  మా కాళ్ళు పట్టుకుని పైకి ఎక్కించేది. అలా ఎక్కినప్పుడు ఒకోసారి మా పొట్టలకి గోడ గీసుకుని చర్మం లేచి మంట పుట్టేది.  తను తయారు చేసిన ఆ పేడ వుండలని ఇచ్చి మమ్మల్ని పైన పెట్టమనేది.  అదేంటో ఇంటిముందంతా స్థలం వుండేది అలా ఎందుకు చేసేదో తెలియదు.

 

అమ్మ ఆ వుండలు చేసినప్పుడల్లా మేమో పెద్ద సాహసం చెయ్యాల్సి వచ్చేది.

 


2 కామెంట్‌లు:

  1. అవునండి. వడ్లపూడి నారింజ అని కూడా అంటారు. బాగుండేవి. సరిగ్గా ఒలవకపోతే తొనలకు కొంచెం చేదు వచ్చేది. ఈ చెట్టుకు ముళ్ళు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడెక్కడా కనిపించడం లేదు. ఈ రోజుల్లో ఆరెంజ్ అంటే కమలా ఫలాలు అనే అర్థమే ప్రాచుర్యమై పోయింది.

    రిప్లయితొలగించండి
  2. అవునండీ. మీ స్పందనకు కృతజ్ఞతలు. నేను అందుకే కమలాఫలాల గురించి కూడా ఇచ్చాను.
    అసలు నారింజపళ్ళ రుచే వేరు.

    రిప్లయితొలగించండి