12, జులై 2021, సోమవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 20 - తాడేపల్లిగూడెం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 4 - ఎదురుగా తాళం వేసి ఉన్న ఆ గది చిన్న వంటిల్లు.

 

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 20 -  తాడేపల్లిగూడెం  - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు  - 4

ఎదురుగా తాళం వేసి ఉన్న ఆ గది చిన్న వంటిల్లు.

 





అమ్మ దేవుడి మందిరం అక్కడ పెట్టించుకుంది. నాన్నగారు రామభక్తులు. రోజూ రాత్రిపూట ఒక పావుగంట రామజపం చేసుకునేవారు. మల్లె మొగ్గలు తెచ్చి జపానికి నన్ను లెక్కపెట్టి ఇమ్మనేవారు. పెద్ద రాముడి ఫోటో వుండేది. శ్రీరామనవమికి ఆ ఫోటోనే పెట్టేవాళ్ళం.

 

అమ్మ వంట బయట కుంపటి, పొట్టు పొయ్యి, పెట్టుకుని వంటచేసేది. వంట చేసిన తర్వాత అవన్నీ లోపల పెట్టేది. ఆ బాల్కనీ నించీ కోతులు అవీ రాకుండా నాన్నగారు వెదురు బద్దలతో చేసిన పెద్ద పెద్ద కర్టెన్లలాంటివి అడ్డాలు కట్టించారు.  అందుకని అమ్మ వంటకి పెద్ద ఇబ్బంది వుండేది కాదు.  కుడివైపున ఉన్న గుమ్మం హాలులోకి దారి. అందుకని వంట చేశాక అందరం హాలులో కూచుని భోజనం చేసేవాళ్ళం.  


అమ్మ వంటచేసే చోటు నుంచి కొంచెం ఇవతలకి ఒక స్తంభం దగ్గిర పొద్దున్నే మాకోసం చద్దన్నం గిన్నెలో పెట్టి వుంచేది. మేము ఏదోఒక ఊరగాయ, మజ్జిగ వేసుకుని తినేసి స్కూలుకి వెళ్ళిపోయేవాళ్ళం.  పొద్దున్న 7.30 నుంచి 11 గంటల వరకు స్కూలు వుండేది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్కూలు వుండేది. అందుకని 11 గంటలకి వచ్చేసరికి అమ్మ వంట చేసేది అప్పుడు అన్నీ వేసుకుని అన్నం తినేవాళ్ళం.

 

అట్లతద్ది, ఉండ్రాళ్ళ తద్ది వస్తే ఆ స్తంభం దగ్గిరే మాకు పొద్దున్నే 5 గంటలకి గోంగూర పచ్చడి, పెరుగు వేసి అన్నం పెట్టి ఆడుకోవడానికి పంపించేది. 


హాలులోనుంచి ఈ గుమ్మం బయటికి వెడితే అక్కడ ఒక స్టూలు మీద మంచినీళ్ళ కుండ వుండేది. దానికి టాప్ వుండేది. దాన్నించి నీళ్ళు కిందపడితే తడి అయి జారుతుందని నాన్నగారు ఒక వెడల్పాటి  మట్టి కుండీ తీసుకువచ్చి దాని కింద పెట్టేవారు. ఒకవేళ గ్లాసు కడిగినా నీళ్ళు అందులోనే పోసేవాళ్ళం.

నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఎవరో పెద్ద బెల్లం బుట్ట ఇచ్చారు. అమ్మ జీళ్ళు ఎక్సపరిమెంట్  చేసింది. పాకం కొంచెం చల్లారడానికి ఆ నీళ్ళలో ఒక ప్లేటులో పెట్టింది. ఆ ప్లేటు మునిగి పోయి దాన్నిండా నీళ్ళు వచ్చి ఇంకొంచెం పలచబడింది. ఇంకేం చెయ్యలేక దాన్ని అవతల పోసేసింది. 



 


ఆ బాల్కనీలో పైన కనిపిస్తున్న ఖాళీ పైన మేడమీదకి వెళ్ళడానికి చెక్కమెట్లు వుండేవి. అవి సగం సగం విరిగిపోతే నాన్నగారు ఒక నిచ్చెన కొనుక్కుని వచ్చి దాని మీద వేశారు. అప్పుడు పైకి ఎక్కడానికి వీలుగా వుండేది.

 

నేను, నా తర్వాత చెల్లెలు ప్రభావతి దసరా వస్తే ఆయుధ పూజకోసం పుల్లలతో బాణాలు చేసుకుని ఆ చెక్క నిచ్చెన మీద పెట్టుకున్నాం. మర్నాటికి అవి మాయం. ఏమయ్యోయో అనుకుంటే నాన్నగారు బయట పడేశారని తెలిసింది. మా ఇద్దరికీ కోపం వచ్చింది. కానీ నాన్నగారంటే గౌరవం కాబట్టి కొంచెం బాధపడి వూరుకున్నాం.   పుల్లలతో కళ్ళలో పొడుచుకుంటామని ఎంత భయపడ్డారో ఇప్పుడు అర్థం అవుతుంది.

 

(ఇలా ఎన్నో ఆ ఇంట్లో జ్ఞాపకాలు. ఇంకా వున్నాయి. )

 

 

 

 

 

2 కామెంట్‌లు:

  1. బాగుందండి. నా చిన్నప్పుడు మేము నివసించిన ఇటువంటి ఇళ్ళు గుర్తొస్తున్నాయి. ఆ nostalgia వేరు.

    రిప్లయితొలగించండి
  2. అవునండీ. నేను అసలు ఆ ఇంటికి వెళ్ళగానే కళ్ళనించి నీళ్ళు వచ్చాయి. అది ఆనందమే కావచ్చు. ఆరోజులు మళ్ళీ రావనే కావచ్చు. ఆ ఇల్లు ఎక్కడ పడగొట్టేస్తారో అనుకున్నాను.

    రిప్లయితొలగించండి