18, జులై 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 21 - తాడేపల్లిగూడెం - ఇంటి ముందు ఖాళీ స్థలం - మధురమైన బాల్య స్మృతులతో ఆ ఇల్లు - 5 -

   జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 21 -  తాడేపల్లిగూడెం  - ఇంటి ముందు ఖాళీ స్థలం - మధురమైన బాల్య స్మృతులతో   ఆ ఇల్లు  - 5  




 

వేసవికాలం వస్తే అందరం ఆరుబయట వెన్నెల్లో భోజనం చెయ్యడం ఒక చక్కని అనుభూతి.  అమ్మ వంట చాలా బాగా చేసేది. ఊరగాయలు కాకుండా ఎప్పటికప్పుడు రోటి పచ్చడి ఏదో ఒకటి వుండేది.    చుట్టూరా మా పిల్లలందరినీ కూచోపెట్టుకుని  పెద్ద కంచంలో అందరికీ కలిపి పెట్టేది. 

 

అలా తినేటప్పుడు అందరం ఏవో ఒకటి మాట్లాడుతూ తినేవాళ్ళం.  మధ్యమధ్యలో జోకులు వేసుకుంటూ... ఆ జోకులకి అందరికీ బాగా నవ్వు వచ్చేది. పొట్టలు పట్టుకుని నవ్వేవాళ్ళం. చిన్నప్పుడు ఎందుకో  ప్రతి దానికీ నవ్వు వచ్చేది. 

 

అన్నం తింటూ నవ్వితే అమ్మకి భయం పొరమారుతుందేమో... అని.  కానీ నవ్వు ఆగేది కాదు.  అమ్మతిడుతూ వుండేది. గొంతుకి అడ్డం పడి ప్రాణాలు పోతాయి అని. కానీ తనూ నవ్వకుండా వుండలేకపోయేది. అమ్మకి అప్పటికి  37 ఏళ్ళు.  పదకొండు సంవత్సరాలకే పెళ్ళి అయిపోయింది. మాతో బాగా ఎంజాయ్ చేసేది.   అది ఒక మరిచిపోలేని అనుభూతి.


***


ఈ ఇంటి ముందు ఏవైనా ఎండపెట్టుకోవాలన్నా బాగుచేసుకోవాలన్నా అమ్మకి చాలా వీలుగా వుండేది. 

 

అక్కడ కూచుకుని అమ్మ బియ్యం ఏరుతుండేది. అప్పట్లో బియ్యం బస్తా 100 కిలోలు 70 రూపాయలు.  మేము ఆరుగురు (చిన్నపిల్లలం) అమ్మాయిలం, అమ్మ, నాన్న కలిపి ఎనిమిది మంది కదా... పైగా అప్పట్లో టిఫిన్లు లేవు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అన్నమే.

 

ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే ఆ బస్తాలో వడ్లు, నూకలు, నల్లమట్టి రాళ్ళు వుండేవి.  అమ్మ బియ్యం ఏరి వడ్లు రాళ్ళు బయట పడేసేది. ఆ వడ్లు తినడానికి పిచుకలు వచ్చేవి. ఒక నాలుగైదు పిచుకలు వచ్చి తినేవి. మేము దూరం నుంచీ వాటిని చూస్తూ వుండేవాళ్ళం.

 

ఒకసారి మా బామ్మ వచ్చింది.  బామ్మయినా అలా పిలిచేవాళ్ళం కాదు. మా అమ్మకి (మేనరికం)  అమ్మమ్మ కాబట్టి మేమూ అమ్మమ్మ అనే వాళ్ళం. వాళ్ళూ ఏమీ పట్టించుకునేవారు కాదు.  

 

ఆవిడ సంగతి ఏమిటంటే...  అమ్మకి అన్ని పనుల్లో సాయం చేసేది.

 

ఆవిడకి చాలా పొదుపు ఎక్కువ.  అందుకని వడ్లు అన్నీ ఒకచోట పోగు పెట్టి  బియ్యం కొలతకి ఒక పావు కిలో బియ్యం పట్టే రేకు డబ్బా వుండేది. అది కొంచెం గరుకుగా వుండేది. ఆ డబ్బా నిండా వడ్లు అవగానే... వాటిని చాటలో పోసి ఆ డబ్బాతో వడ్లని (పైన రుద్దడం) ఎనిపేది.  అప్పుడు ఆ పొట్టు వూడి వచ్చేసేది. వాటిని బియ్యంలో కలిపేది.

 

ఆవిడ ఉన్నన్నాళ్ళూ పాపం  పిచుకలు కాసేపు దూరంగా గోడమీద కూచుని నిరాశగా వెళ్ళిపోయేవి.


ఆవిడ ఊరు వెళ్ళిపోయాక మళ్ళీ వచ్చేవి.  మాకు బాగా కాలక్షేపం అయ్యేది. 

 

 

 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి