14, నవంబర్ 2020, శనివారం

అమ్మకు ప్రేమతో... మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన 9వ ఉత్తరం

 

అమ్మా... 

ఏం చేస్తున్నారు... ?  

మా ఇంటికి ఇవాళ రోహిణీ వాళ్ళ అబ్బాయి అర్వి వచ్చాడు. వాడు ఎక్కువ అల్లరి చెయ్యకుండా కదలకుండా కూచుంటాడు కానీ, వాడికి నీళ్ళంటే చాలా పిచ్చి. శేఖర్ మొక్కలకి నీళ్ళు పోస్తుంటే వాడూ పోస్తానని తయారవుతాడు. నాకు చిన్నుగాడే గుర్తుకు వచ్చాడు.  వాడు ఇవాళ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎక్కడికో వెళ్ళాడు. 

వాడి చిన్నప్పుడు బలే జరిగింది కదా... నీకు గుర్తుందా... వాడి అల్లరి..?

నువ్వు వంటింట్లో పని చేసుకుంటున్నావు. గుమ్మంబయట నీళ్ళ బకెట్ వుంది. నేనూ వాడు ముందు రూములో  ఆడుకుంటున్నాము. ఎప్పుడు వెళ్లాడో తెలియదు.  వాడికి ఇంకా పూర్తిగా ఏడాది నిండలేదు.  పాక్కుంటూ వెళ్ళి బకెట్ పట్టుకుని నుంచుని నీళ్ళ మీద తపతపా కొట్టి ఆడుతున్నాడు. ఏంచేశాడో కానీ బకెట్ లో పడిపో



యాడు. నేను గబగబా వచ్చి నీకు చెప్పాను. నువ్వు పరిగెత్తుకుని వచ్చి వాడిని తీశావు. 

అమ్మో... ఇలా అయితే ఎలా అని చాలా భయపడ్డావు. నిన్ను చూస్తే నా చిన్ని బుర్రలో భయం వేసింది. ఓహో ఇది చాలా ప్రమాదం అనుకున్నాను. 

మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అలాగే బకెట్ లో పడ్డాడు. నేను వెంటనే వెళ్ళి బకెట్ ని పక్కకి పడేశాను. వాడు తడిసిపోయిన బట్టలతో పాక్కుంటూ బయటికి వచ్చేశాడు. నువ్వు చాలా మంచి పని చేశావని నన్ను మెచ్చుకున్నావు. 

ఇప్పటికీ అనుకుంటాను వాడిని బలే కాపాడానని. అమ్మో... అలా వదిలేస్తే ఇంకేమన్నా వుందా... అప్పటి నుంచీ చిన్న పిల్లలు ఎవరన్నా నీళ్ళ దగ్గిరకి వెడితే కనిపెట్టుకుని చూస్తుంటాను. 

వుంటానమ్మా.. నాన్నని అడిగినట్లు చెప్పు.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి