21, నవంబర్ 2020, శనివారం

అమ్మకు ప్రేమతో - మా అమ్మాయి వీణాధరి నాకు రాసిన ఉత్తరాలు -10


 అమ్మా...

నాకు, చిన్నుగాడికి ఇవాళ నీతో మాట్లాడాలని చాలా అనిపించింది. అలా అలా అనుకుంటూ ఇద్దరం మళ్ళీ చిన్నప్పటి విషయాల్లోకి వెళ్ళిపోయాం. నువ్వు నీ కంప్యూటర్ వర్క్సు పార్కు దగ్గిర ఇంట్లో మొదలు పెట్టావు కదా. మేమిద్దరం చాలా చిన్నపిల్లలం. నాకు ఐదేళ్ళు, చిన్నుగాడికి రెండే్ళ్ళు. అక్కడ పిల్లలు ఎక్కుమంది వుండేవాళ్ళు కాదు. మేమిద్దరమే. ఇద్దరం కలిసే ఆడుకుంటూ వుండేవాళ్ళం.
నీ దగ్గిర వర్కు చేయించుకోవడానికి చాలామంది వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో వీనస్ అంకుల్, మాస్టర్ మైండ్స్ బ్రహ్మం అంకుల్ ఎక్కువగా వచ్చేవాళ్ళు. ఇంకా చాలామంది వచ్చి వర్క్ చేయించుకునేవాళ్ళు. అయితే వీనస్ అంకుల్ రాగానే మేమిద్దరం పరిగెత్తుకుంటూ వెళ్ళి వీనస్ అంకుల్, వీనస్ అంకుల్ అంటూ గంతులేస్తూ చుట్టూ తిరిగేవాళ్ళం. అసలు అలా ఎలా చేసేవాళ్ళం అమ్మా... అంకుల్ ని లోపలికి రానిచ్చేవాళ్ళం కాదు. ఆయన సరే సరే అని పక్కకి వెడదామంటే మేము దారిస్తే కదా...
మాస్టర్ మైండ్స్ బ్రహ్మం అంకుల్ వస్తుంటే కిలోమీటర్ దూరం నుంచీ బైక్ చప్పుడు వినిపిస్తూ వుండేది. అది వినగానే మాస్టర్ మైండ్స్ అని పరుగెత్తుకుని వెళ్ళేవాళ్ళం. ఏంటో ఇప్పుడు తలుచుకుంటే ఒకపక్క నవ్వు వస్తుంది. మరోపక్క చిరాకేస్తుంది.
ఇంకోసారైతే ఒక అబ్బాయి, ఒకమ్మాయి బైక్ మీద వచ్చారు. ఆ అబ్బాయి పెద్ద స్టైల్ గా పిలక వేసుకుని వచ్చారు. మాకు విచిత్రంగా అనిపించింది. నువ్వేమో సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నావ్. వాళ్లు నీదగ్గిరకి వచ్చి వర్క్ గురించి మాట్లాడి వెళ్ళిపోతుంటే... మేమిద్దరం పిలకంకుల్ పిలకంకుల్ అంటూ వాళ్ళవెనక పరిగెత్తాం.
నువ్వు మా ఇద్దరినీ పిిలిచి అలా అనద్దని, చాలా గట్టిగా చెప్పావు. ఎందుకు మమ్మల్ని నువ్వు అలా అన్నావో మాకు అర్థం కాలేదు. అలా ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని చెప్పావు. ఇవన్నీ తలుచుకుంటే ఇప్పుడు అవన్నీ తెలియక చేసిన చిలిపి పనులయినా అలా ఎలా పిచ్చిగా చేశామా అనుకున్నాం.
మా చిన్నప్పటివి ఎన్ని అనుభవాలు, అనుభూతులో కదమ్మా... తలుచుకున్న కొద్దీ వస్తూనే వున్నాయి.
మేమిద్దరం బాగానే వున్నాం.
వుంటానమ్మా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి