18, జూన్ 2023, ఆదివారం

***పడిలేచే కడలి తరంగంలా నేను*** - 90

***పడిలేచే కడలి తరంగంలా నేను*** - 90

నా జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో... తలుచుకుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది.

అనారోగ్యాల మాటెలా వున్నా... నా చిన్నప్పుడు జరిగిన సంఘటన తలుచుకుంటే... నాజీవితం అప్పుడే ముగిసిపోయి వుంటే...

హైదరాబాదులో నా జీవనయానమూ వుండేది కాదు. నేను ఎఫ్.బిలో వుండేదాన్నీ కాదు. ఇంతమంది స్నేహితులయ్యేవారూ కాదు. ఏదో ఒక ఉద్ధరింపు ఉంటుంది జీవితానికి. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం-

చిన్నప్పుడు నేను చదివింది గవర్నమెంట్ స్కూలు. అవుట్ బెల్ (అప్పట్లో ఉ. 10 గంటలకి ఇచ్చే బ్రేక్ ని అవుట్ బెల్ అనే వాళ్లం) లో అందరం బయటికి పరిగెత్తి ఆడుకునేవాళ్ళం. మంచి నీళ్ళు కావాలంటే పక్కవాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తాగేవాళ్ళం. స్కూల్లో ఒక ఇత్తడి డ్రమ్ తో నీళ్ళు పెట్టేవారు. స్కూలు దగ్గరలో కాలవ వుండేది. స్కూలుకి, కాలవకి మధ్య మెయిన్ రోడ్డు. ఒకసారి మాక్లాసు పిల్లలు ఇద్దరు కాలవకి వెళ్ళి నీళ్ళు తాగి వచ్చాం అన్నారు. నేనెందుకు ఆ సాహసం చెయ్యకూడదు అనుకున్నాను. అప్పుడు 4వ తరగతి చదువుతున్నాను. రెండు బలపాలు చేత్తో పట్టుకుని మెల్లిగా కాలవ దగ్గిరకి వెళ్ళాను. అప్పుడు ఒకాయన స్నానం చేస్తున్నాడు. బలపాలు మెట్టు మీద పెట్టి, నీళ్ళు తాగడానికి వంగాను. తర్వాత ఏమైందో తెలియదు. నిండుగా ప్రవహిస్తున్న కాలవలోకి కొంతదూరం కొట్టుకు వెళ్ళిపోయాను.


కానీ ఇంతలోకే మాటలు వినిపించాయి. ఒక సోడాబండీ నరసింహ నన్ను పైకి తీసుకువచ్చాడుట. నన్ను గట్టు మీద పడుకోపెట్టి ప్రథమచికిత్స చేస్తున్నారు. ఒక పోలీసు కూడా వచ్చాడు. చాలా భయపడ్డా... (పోలీసంటే నాకు చాలా భయం. ఎందుకో తెలీదు. కాకపోతే పోలీసు చచ్చిపోడనుకున్నా... ఒకసారి ట్రైన్ కిందపడి పోలీసు చచ్చిపోయాడన్నారు. అప్పుడు తెలిసింది వాళ్ళూ మనుషులే అని) అన్నీ అయ్యాక తడి గౌనుతో స్కూలుకి తీసుకెళ్ళారు. హెడ్మాస్టారు ఇద్దరు పిల్లలని ఇచ్చి ఇంటికి పంపించారు.

స్కూలవ్వకుండా తడి గౌనుతో వచ్చిన నన్ను చూసి అమ్మ గాభరాగా ఏమైందని అడిగింది. నాతో వచ్చినవాళ్ళు కాలవలో పడ్డానని చెప్పారు. అంతే!!! అమ్మ భద్రకాళి అవతారం ఎత్తి ముందు వీపుమీద నాలుగు ఉతికింది. ఆ పిల్లలిద్దరూ భయపడి పారిపోయారు.

తర్వాత అమ్మ నన్ను కాగలించుకుని భోరున ఏడుస్తూ “నీకు కాలవ దగ్గిర ఏం పని... అలా ఎందుకు వెళ్ళావు. నువ్వు కొట్టుకుని వెళ్ళిపోతే నేనేమైపోవాలి. ఇంకెప్పుడూ అలా చెయ్యకు. నీళ్ళు కావాలంటే ఇంటికి రా...” అని బట్టలు మార్చి, కాసేపు పడుకోమని చెప్పింది.

సాయంత్రం నాన్నగారు బ్యాంక్ నించి వస్తూండగానే రోడ్డు పొడుగూతా... “మీ అమ్మాయి కాలవలో పడిపోయింది. ఎవరో పైకి తీశారు. ఇప్పుడు ఇంట్లో వుంది” అని చెప్పారు. నాన్నకి ఒకటే కంగారు. గబగబా ఇంటికి వచ్చి “అలా ఎందుకు వెళ్ళావు నాగా.. చూశావా... నువ్వు రోజూ... ఆంజనేయస్వామికి దణ్ణంపెట్టుకుంటావు కదా... ఆయనే నిన్ను బయటికి తీశాడు. ఇంకెప్పుడూ అలా వెళ్ళకు. నీకు నీళ్ళు కావాలంటే ఇంటికి వచ్చి తాగు” అన్నారు. ఏమో మొత్తానికి బతికి బయటపడ్డా.

నాన్న ఊరుకున్నారా... మర్నాడు స్కూలుకి వచ్చి హెడ్మాస్టారుతో, మిగిలిన మాస్టార్లతో పిల్లలు ఎటువెళ్తున్నారో చూసుకుంటూ వుండండి. ఇవాళ మా అమ్మాయి... రేపు ఇంకొకళ్ళు అని గట్టిగా చెప్పి బ్యాంక్ కి వెళ్ళిపోయారు. మర్నాడు సోడాబండీ నరసింహని తగిన విధంగా సత్కరించారు.

మా ఊళ్ళో ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ రెండే వుండేవి. నాన్నగారు ఆంధ్రాబ్యాంక్ లో చేసేవారు. మాస్టార్లందరికీ అక్కడ అకౌంట్ వుండేది. ఆయనంటే గౌరవం వుండేది. అప్పుడప్పుడు స్కూలుకి వచ్చి వాళ్ళతో మాట్లాడుతూండేవారు.

ఇదీ నా చిన్నప్పటి సంగతి మరి నా జీవనయానం మధ్యలో పలకరించిన అనారోగ్యాల సంగతి రేపు.

ఫోటోలో ఉన్నదే ఆ కాలవ, ఆ మెట్లు. కాలవ మీద చిన్న వంతెన.


నన్నుచూసి ఆ కాలవ పలకరింతగా నవ్వింది. నేను ఆనందంగా ఫోటోతీసుకున్నా మరి. చిన్ననాటి జ్ఞాపకం కదా...

4 కామెంట్‌లు:

  1. ఈ ఉదంతం కళ్ళకు కట్టినట్లు వ్రాసారు.
    ఇలాంటి గండాలైతే నేను చాలా చాలా దాటి వచ్చానండీ.
    మీరన్నట్లు గతంలో జరిగిన ఇలాంటివి తలపు వస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
    మనవలన కావలసిన పనులున్నాయి కాబట్టే అవి దాటాం అన్నమాట.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆ గండాలు దాటి రావడం అనేది గొప్ప విషయమే. మన వలన ఏవో జరగవలసినవి వుండడం వల్లే జీవితం కొనసాగింపబడుతుందేమో. ధన్యవాదాలండీ మీకు.

      తొలగించండి
  2. శ్యామలీయం గారు కరక్ట్ గా చెప్పారు. మీ వలన కావలసిన పనులు ఇంకా ఉన్నాయి కాబట్టే గండం గడిచిందన్నమాట.

    ఆ కాలవ రైల్వే స్టేషన్ కు దగ్గరగా ఉన్నట్లుందే?

    రిప్లయితొలగించండి
  3. అవును సర్ శ్యామలీయంగారు చెప్పింది కరెక్ట్. అవును సర్ ఆ వంతెన దిగి రైల్వేస్టేషన్లో పట్టాలు దాటుకుంటూ ప్లాట్ ఫామ్ లు ఎక్కుతూ దిగుతూ కాలేజీకి వెళ్ళేవాళ్ళం. బ్రిడ్జి కూడా వుండేది. కానీ ట్రైన్ రాకుండా చూసుకుని దాటేవాళ్ళం. అప్పట్లో ఇన్ని ట్రైన్లు కూడా లేవు.

    రిప్లయితొలగించండి