22, జూన్ 2023, గురువారం

ఎన్నో రకాలుగా ఎదురీదితేనే జీవితం - 91 ఉద్యోగాల్లో పడే ఇబ్బందులు కొన్ని, శారీరకమైన ఇబ్బందులు మరికొన్ని

 ఎన్నో రకాలుగా ఎదురీదితేనే జీవితం - 91

ఉద్యోగాల్లో పడే ఇబ్బందులు కొన్ని, శారీరకమైన ఇబ్బందులు మరికొన్ని
***
***
ఆపిల్ కంప్యూటర్స్ కొత్తగా వచ్చినప్పుడు వాటి ట్రైనింగ్ కోసం హిమాయత్ నగర్ లో ఉన్న ఇంటర్నేషనల్ గ్రాఫిక్స్ కి వెళ్ళేదాన్ని. అప్పుడు ఒక వారం కిందట మా చెల్లెలి పెళ్ళయ్యింది. కొంచెం పని, అలసట బాగానే అయ్యింది. కంప్యూటర్ మీద ట్రైనింగ్ అవుతుంటే ఉన్నట్లుండి కడుపులో తిప్పి తిన్నదంతా బయిటికి వెళ్ళిపోయింది.. అక్కడ ఉన్న ఒకమ్మాయిని తీసుకుని సంజీవరెడ్డినగర్ మా ఇంటికి బయల్దేరాను. దారిలో అంతా నానా అవస్థాపడ్డాను.


లకడీకాపూల్ టర్నింగ్ లో క్యూర్ వెల్ హాస్పిటల్ అని బోర్డ్ కనిపించింది. ఇక నావల్ల కాదని ఆటో అతన్ని అక్కడికి తీసుకెళ్ళమన్నాను. ఆ హాస్పిటల్ కి ఎప్పుడూ వెళ్ళలేదు. ఆటో అతను లోపలికి తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడంతా పాడుచేశాను. వాళ్ళేమీ అనలేదు. నాతో వచ్చిన అమ్మాయి నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయింది. నన్ను లోపల బెడ్ మీద పడుకోపెట్టారు. మొత్తానికి ఫోన్ చేసి మా అక్కకి చెప్పాను.

ఈలోపున డాక్టర్లు వేళ్ళు చూపించి “ఎన్ని కనిపిస్తున్నాయి?” అన్నారు. “ఎన్నున్నాయో అన్నే” అన్నాను. వాళ్ళు నవ్వారు. అప్పట్లో మెదడువాపు వ్యాధి బాగా వుండేది అదీ వాళ్ళ డౌట్. అప్పుడే వచ్చిన అక్కతో రాత్రి వుండాలి. పొద్దున్న పంపిస్తాం అన్నారు. పొద్దున్న వాళ్ళు తేల్చినది ఏమిటంటే మీకు ఇయర్ డ్రమ్ ప్రాబ్లం అయ్యుంటుంది. కోటీ ఇఎన్ టి లో చెక్ చేయించుకోమన్నారు. అక్కడ వాళ్ళు ఎక్స్ రే తీసి, చెక్ చేసి నీకేం లేదుగా ఎందుకు వచ్చావ్ అన్నారు. మొత్తానికి పెళ్ళికి చేయించిన మిక్చర్ లో వేసిన పల్లీలే తినడం వల్ల ఇంతపని అయిందని తర్వాత అర్థం అయ్యింది.

***
***

ఈ పరిస్థితి నుంచీ కోలుకున్నాక అక్క కూతురు పెళ్ళని విజయవాడ వెళ్ళాం. అక్కడ పొద్దున్నే టిఫిన్ తిని అందరూ కూచున్న చోటుకి వెళ్ళి కూచుందామనుకుని నేనూ మా అమ్మాయి బయల్దేరాం. ఇద్దరం నడుస్తూనే వున్నాం. ఏమయిందో తెలియదు. ముందుకి ఢామ్మని పడ్డాను. ఆ పడడం చేతిమీద పడడంతో చెయ్యికి ఏదో అయిపోయిందని మాత్రం తెలుస్తోంది. తీరా హాస్పిటల్ కి వెడితే వాళ్ళు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అని చెయ్యికి కట్టుకట్టి మెళ్ళో ఓ తాడు వేశారు. రెండు నెలలు కంప్యూటర్ కి దూరం. ఆ చెయ్యి నెప్పి భరిస్తూ ఒంటిచేత్తో ఇంట్లో పనులు ఎలా చేసుకున్నానో. ఇప్పుడు ఆలోచిస్తే అది ఒక మరచిపోలేని నరకయాతననే చెప్పుకోవాలి. పిల్లలు, మావారు కొన్ని పనులు చేసేవాళ్ళు.

***
***

మొత్తానికి కొత్త కంప్యూటర్ మీద ట్రైనింగ్ అయ్యి కొన్ని చోట్ల ఉద్యోగం చేశాక - నాకు నేనే బాస్ ని అయితే బావుంటుదనిపించింది.
ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుని పని మొదలు పెట్టాం కానీ... ఆఫీసులో ఉద్యోగం వేరు ఇంట్లో కష్టపడడం వేరు. ఆఫీసులోలాంటి వీల్ ఛైర్లు కొనే పరిస్థితికాదు. కంప్యూటర్ కొత్తగా రావడంతో దాని ముందు ఎలా కూచుంటే అనుకూలంగా వుంటుందో ఎవరూ చెప్పలేదు. బల్కంపేటలో మేమే రారాజులం అవడంతో ఎవరి పనినీ కాదనలేకపోయేదాన్ని.
ఉన్నట్లుండి కళ్ళు తిరిగి కంప్యూటర్ టేబుల్ మీద తల వాలిపోయేది. ఏమీ అర్థం అయ్యేది కాదు. కళ్ళు తిరిగినప్పుడు కాసేపు కూచోవడం మళ్ళీ పని చేసుకోవడం. ఒకోసారి వికారం వచ్చి శరీరం లోపలిదంతా బయటికి పంపేది. మా కజిన్ ఒకాయనతో అంటే అది స్పాండిలైటిస్ ప్రాబ్లమ్ అని హోమియో మందులు ఇచ్చారు. నమ్మకమో... పనిచేశాయో తెలియదు. బాగానే అనిపించింది.

***
***

అమ్మయ్య అనుకునేలోపున ***చికెన్ గున్యా*** హలో... అంటూ మీదకి దూకింది. ఇంకంతే నాపని అయిపోయింది. జ్వరం. కాళ్ళు రెండూ బిగుసుకుపోయాయి. ఒకటే నెప్పులు. అడుగు పెట్టలేను. వారం రోజులు నరకం అనుభవించాను. నడవడానికి రాదు. కూచుంటే లేవడానికి రాదు. మొత్తానికి ఎలాగో మామూలు స్థితికి వచ్చాను కానీ... ఇప్పటికీ కుడికాలు మడత పెట్టి కింద కూచోవడానికి సహకరించదు. నాకే చిరాగ్గా వుంటుంది.

***
***

ఇవన్నీ అయ్యాయి. మళ్ళీ నా పనిలో నేను తలమునకలవుతున్నాను. ఉన్నట్టుండి కడుపులో పోట్లు. గిలగిలలాడిపోయేదాన్ని. పిల్లలు కంగారు పడతారని కంట్రోల్ చేసుకునేదాన్ని. పిల్లలు ఇనో నీళ్ళలో కలిపి ఇచ్చేవారు. అయినా తగ్గలేదు. ఏదైనా తింటే అది అన్ని రకాలుగాను బయటి వెళ్ళిపోయేది. ఎవరింటికైనా వెళ్ళాలంటే భయం. అక్కడ ఏం ఇబ్బంది పడతానోనని. పొట్టమీద చిన్నసైజు బత్తాయికాయంత ఉండ తగిలింది. నాకు ఏదో కాన్సర్ లాంటిది వచ్చేసింది. నా పిల్లలకి దిక్కెవరు. నేను చెయ్యాల్సిన పనులు ఏమైనా ఉంటే అవి చేసేసుకుంటే బావుంటుందేమో... ఇలా ఎన్నో ఆలోచించాను.



నన్ను బాగా ఇష్టపడే సత్యవాణిగారికి చెప్పాను. ఆవిడ నీలిమ హాస్పిటల్, మారుతీనగర్ కి వెళ్ళమ్మ అక్కడ మా మేనగోడలు నీలిమ అని వుంటుంది. తనకి చూపించుకో అన్నారు. సరే అని ఆవిడ దగ్గిరకి వెడితే చూసి, ఇది హెర్నియాలా వుంది. ఎర్రగడ్డలో మా హాస్పిటల్ లో ఫేమస్ గాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఆనంద్ డాక్టర్ అని వుంటారు. ఆయన్ని కలవండి అని చెప్పారు. ఆనంద్ డాక్టర్ దగ్గిరకి వెళ్ళాను. ఆయన నిజంగానే చక్కటి నవ్వుతో ఆనందంగా వున్నారు. సమస్య చెప్పాను. చూసి “ఇది హెర్నియా మీరు తీయించుకోపోతే ముందు ముందు చాలా సమస్యలు వస్తాయి. వీలైనంత తొందరలో ఆపరేషన్ కి రెడీ అవ్వండి” అన్నారు.

ఇంటికి వచ్చి పిల్లలకి, మా వారికి చెప్పాను. మా అమ్మాయి ఇంజనీరింగ్ అయి, కొత్తగా ఉద్యోగంలో చేరి సంవత్సరం అయ్యింది. తను ఇన్స్యూరెన్స్ కి అప్లయ్ చేసింది. (2012 జూన్ 18) ఆపరేషన్ కి డేట్ ఇచ్చారు. హాస్పిటల్ కి వెళ్ళాను రూమ్ ఇచ్చారు. నేను మా అమ్మాయి వెళ్ళాం. ఇంతలోనే ఒక జూనియర్ డాక్టరు వచ్చి, “ఆపరేషన్ చేయించుకోవడానికి పేషెంట్ వచ్చారుట ఎక్కడున్నారు?” అన్నాడు.

“నేనే” అన్నాను.

“మీరా???” అని తెల్లమొహం వేశాడు.

మరి డౌట్ రాక ఏమవుతుందీ... చక్కటి పసుపు రంగు ఇస్త్రీ చీర కట్టుకుని, పువ్వులా నీట్ గా వుండి మా అమ్మాయితో నవ్వుతూ కబుర్లు చెప్పేస్తున్నాను. ఏకోశానా పేషెంట్ రూపు రేఖలు అతనికి నా మొహంలో కనిపించలేదు. అప్పటికే పిల్లలు పుట్టినప్పుడు శరీరాన్నిరెండుసార్లు డాక్టర్ల కోతకి (మేజర్ ఆపరేషన్) అప్పగించాను. ఇక మూడోసారి మళ్ళీ ఏం చేసుకుంటే చేసుకోండిలే అని రెడీ అయిపోయాను.

మళ్ళీ అతను “అవునా... మీరు పేషెంట్ అనుకోలేదు. డాక్టరుగారు మీరు వచ్చారేమో చూసి ఆపరేషన్ కి రెడీ చెయ్యమన్నారు” అనేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక ఇంకో సిస్టర్, ఇంకెవరో వచ్చి అలాగే అడిగి వెళ్ళిపోయారు.

ఇంకోగంటలో అన్నీ సిద్ధం చేసుకుని... నా శరీరంలోంచి ఆ వ్యర్థ పదార్థాన్ని తీసేసి, నన్ను క్షేమంగా రూంలోకి పంపించారు. ఆ డా. ఆనంద్ మా అమ్మాయి అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చక్కగా చెప్పి, ఏ డౌట్ వున్నా ఫోన్ చెయ్యమని నన్ను ఇంటికి పంపించారు. ఇప్పటి వరకూ నేను ఎప్పుడు ఫోను చేసినా ఆయన మాట్లాడతారు. ఏవైనా డౌట్స్ వుంటే చెప్తారు.

ఇంటికి వచ్చాక నాకు తోడు వుంటానని వచ్చిన ఒకావిడ నాలుగు రోజులకే వెళ్ళిపోయింది. ఇక మా అమ్మాయి వారం రోజులు వుండి లీవు అయిపోయిందని ఆఫీసుకి వెళ్ళిపోయింది. ఇక తప్పదన్నట్లు ఆపరేషన్ అయిన 20 రోజుల నుంచే మెల్లిగా అన్ని పనులూ చేసుకుని అతి తొందరలో మళ్ళీ నా కంప్యూటర్ పనులు చేసుకోగలిగాను.

***
***

ఒకరోజు ఎవరో వర్కు గురించి రమ్మంటే... హడావుడిగా వెడుతున్నాను. మా ఇంటి దగ్గర వున్న టిఫిన్ సెంటర్ దగ్గిరకి వచ్చేసరికి కళ్ళుతిరిగి ఉన్నట్టుండి రోడ్డుమీద నరికిన చెట్టులా బోర్లా పడ్డాను. అందరూ వచ్చి నీళ్ళు చల్లండి, లేవతియ్యండి అంటుంటే... అందరినీ ఒక్క ఐదు నిమిషాలు ఆగమని నేన లేచి అక్కడ ఒక పక్కగా కూచుని తెలిసిన వాళ్లని ఇంటికి వెళ్ళి మా అబ్బాయిని పిలుచుకు రమ్మన్నాను. చెయ్యీ కాలూ మాత్రం విరగలేదు.

వాడు వచ్చాక దగ్గరలో వున్న హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ అన్ని చెకప్ లు అయ్యాక వాళ్ళు మీకేమీ లేదు పడడం వల్ల బిపి పెరిగింది. కొన్నాళ్ళు టాబ్లెట్స్ వాడమని ఇచ్చారు. ఇదీ అతిగా పని చెయ్యడం వల్ల అని తర్వాత తెలిసింది. కానీ, అది మెయిన్ రోడ్డు మీద పడివుంటే... నా మీద నుంచీ ఏ బస్సో వెళ్ళిపోయి వుంటే... అమ్మో ఆ ఆలోచనకే భయం వేస్తుంది.

ఇన్ని రకాల అనుభవాలు అయ్యాక, కంప్యూటర్ దగ్గర ఎలా కూచోవాలి. ఎలా కూచుంటే ఇబ్బంది అవదు అనేవన్నీ తెలుసుకుని ఆచరిస్తూ ఎంత పననయినా చెయ్యగలుగుతున్నాను. రాటుదేలిపోయాను. ఇప్పుడయితే కొంతసేపు పనిచేసి మధ్యలో రెస్ట్ తీసుకుంటాను. కూచునే కుర్చీ వెనక దిండు పెట్టుకుని అనుకూలంగా కూచుంటున్నాను. ఇప్పుడు పనిచేయడం వల్ల సమస్యలు లేవు. నాకు పని చెయ్యక పోతేనే తోచదు. చేసేటప్పుడు ఒళ్ళు తెలియదు.

ఈ మధ్య మా అపార్ట్ మెంట్ లో వాకింగ్ చేస్తూ బోర్లా పడ్డాను. కాళ్ళూ చేతులూ కొట్టుకు పోయాయి. ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. తర్వాత తగ్గిపోయాక చెప్పాను.

ఇప్పటికీ ఈ డా. ఆనంద్ (గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్) , డా. నీలిమ (గైనకాలజిస్ట్), డా. రామకృష్ణ (జనరల్ ఫిజీషియన్), డా. సాయిబాబు (చెస్ట్ స్పెషలిస్ట్, ఎమ్.డి.) ఇలా కొంతమంది డాక్టర్ల నెంబర్లు అందుబాటులో పెట్టుకుంటాను. మధ్యలో పలకరిస్తూ వుంటాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి