30, జనవరి 2021, శనివారం

మనవరాలా... మజాకానా... - మనవరాలు ఆర్ణ ముచ్చట్లు 2

 

ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి వచ్చి మా అమ్మాయిని వీణాని చూడగానే చాలా ఆనందం అనిపించింది. అల్లుడు శేఖర్, వీణ అందరం కలిసి ఇంటికి వెళ్ళాం.  నాలుగు పడక గదుల ఇండిపెండెంట్ హౌస్. చాలా పెద్దది. అంతకు ముందే జనవరిలో ఒకసారి రావడంతో కొత్తగా అనిపించలేదు. 

అంత పెద్ద ఇంట్లోకి ఓ బుజ్జి పాపాయి వస్తోందంటే అందరికీ ఆనందమే.  వాళ్ళకి పుట్టబోయే పిల్లలు ఎవరో ముందే చెప్తారు కదా....  చాలా ఆర్భాటంగా, సందడి సందడిగా జెండర్ (ఆడపిల్లా, మగపిల్లాడా....) ఫంక్షన్ చేసేసుకోవడంతో అమ్మాయని తెలిసిపోయింది. 

నేను ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు సీమంతానికి కావలసిన రకరకాల వస్తువులన్నీ నాతోబాటు కొన్ని, కొరియర్ కొన్ని ఆస్ట్రేలియా చేరాయి.  

ఈలోపున పాపాయి వాళ్లమ్మ పొట్టలో రకరకాల విన్యాసాలు చేస్తోంది.  వాళ్ళమ్మకి సంగీతం వచ్చు కాబట్టి తను పాడే పాటలన్నింటికీ లోపల గంతులేసేది.  

నేను వెళ్ళిన వారం రోజులకి సీమంతం అనుకున్నాము.  నేను మా అమ్మాయి కలిసి కాజాలు, బర్ఫీ చేశాము. నేను ఇండియా నుంచి పట్టుకెళ్ళిన స్వీట్స్ కొన్నివున్నాయి.  

ఇండియా నుంచి పట్టుకెళ్ళిన ఆర్టిఫిషియల్ పువ్వుల దండలతో అలంకరణ చేసి ఐదు రకాల స్వీట్సు, పళ్ళు పెట్టి సీమంతం చేశాము.  ఒక ముప్పయి మందికి వంట నేను, మా అల్లుడు, వాళ్ళ ఫ్రెండ్ కలిపి చేశాము. ఇండియన్  ఇంటి వంట దొరకదు కాబట్టి అందరూ చాలా ఆనందంగా, ఆస్వాదిస్తూ తిన్నారు. 

ఇలా సీమంతం హడావుడి బాగా జరిగింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి