10, మే 2023, బుధవారం

ఏది ఎలా జరుగుతుందో... ఎవరికీ తెలియదు... 84

 ఏది ఎలా జరుగుతుందో... ఎవరికీ తెలియదు... 84


నేను తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేషీలో పనిచేస్తున్నరోజులు.

ఒకరోజు లంచ్ టైమ్ లో నేను పనిచేసే చోటికి ఒక పాతికేళ్ళ అబ్బాయి వచ్చాడు.

పేషీలో రాజుగారని సీనియర్ మోస్ట్ ఆఫీసర్ వున్నారు. ఆయన నాకోసం ఎవరో వచ్చారనుకుని తన పని తను చూసుకుంటున్నారు. సాధారణంగా ఎవరి విషయాల్లో కల్పించుకునే మనిషి కాదు. నేను ఆయనకోసం వచ్చాడని అనుకున్నాను.

అతను నా దగ్గిరకి వచ్చి - “మేడమ్ బావున్నారా... మీరు కొత్తగా వచ్చారు కదా... మిమ్మల్ని రోజూ బస్సెక్కేప్పుడు చూస్తూ వుంటాను. మీరు సంజీవరెడ్డి నగర్ నుంచి ఒకోసారి బస్ లోనూ, చాలా సార్లు ట్రెయిన్ లోనూ వస్తుంటే చూశాను. మీరు సంజీవరెడ్డి నగర్ లో ఫలానా రోడ్డులో, ఫలానా ఇంట్లో వుంటారు. అక్కడ మీ ఇంటి ఎదురుగా రోడ్డు చివర ఒక ఇంట్లో రోజూ ఆంజనేయస్వామి పూజలు చేస్తూ వుంటారు. నేను అక్కడే వుంటాను. నా పేరు శ్రీనివాస్. మాది హన్మకొండ” అన్నాడు.

నేను అన్నీ విని “ఓహో అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అన్నాను.

“మాకు హన్మకొండలో పొలాలు ఉన్నాయి. మాకు రైస్ పండుతుంది. నేను ఈ ఆఫీసులో చాలామందికి ఇస్తుంటాను” అన్నాడు. అక్కడ జిరాక్స్ రూములో ఒకతను పనిచేస్తుంటాడు. అతన్ని చూపించి “ఈసారు కూడా తీసుకుంటాడు” అన్నాడు. అలా అనగానే అతను మా వంక చూసి వెళ్ళిపోయాడు.

నేను “ఇంట్లో సార్ కి చెప్పాలి. తర్వాత చెప్తాలే” అనేసి నా పని నేను చూసుకుంటూ కూచున్నాను. వరసగా నాలుగు రోజులు వచ్చాడు. ఒకరోజు మా వారితో చెప్పాను. బియ్యం ఇంటికి తీసికెళ్ళి చూపించాను. చాలా తక్కువ రేటు చెప్పాడు.

మా వారు యూనివర్సిటీకి వచ్చారు. లంచ్ టైమ్ లో ఆ శ్రీనివాస్ మళ్ళీ వచ్చాడు. మమ్మల్ని ఇద్దరినీ ఎల్.బి. స్టేడియంకి రమ్మన్నాడు. ఇద్దరం వెళ్ళాం.

వాడు “ఒక రెండు వేలు ఇవ్వండి. మా మనిషి మీకు బస్తాలు ఇస్తాడు. అదిగో ఆ ఎదురుగా వున్నదే గొడౌన్. ఆ షాపులో తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టుకుంటాను” అన్నాడు.

“మీకు ఐస్ క్రీం కావాలా... మా మామకి ఐస్ క్రీం పార్లర్ వుంది. మీకు కసాటా, వెనిల్లా, అమూల్ ఐస్ క్రీం ఫ్యామిలీ ప్యాక్ తెచ్చిస్తాను ఇక్కడే వుండండి. మీరు డబ్బులు కూడా ఇవ్వక్కరలేదు” అంటూ ఒక ఐస్ క్రీం పార్లర్ చూపించాడు. ఐస్ క్రీం అంటే ఇష్టమయిన నేను నోట్లో నీళ్ళు వూరించుకుంటూ కూచున్నాను. అది కరిగిపోకుండా ఆఫీసు ఫ్రిజ్ లో పెట్టి, ఇంటికి ఆటోలో వెడదామనుకున్నాం.





మేము అక్కడ ఓ గట్టులాంటిది వుంటే అక్కడ కూచున్నాం. వాడు ఆ పార్లర్ దగ్గిరకి వెళ్ళాడు. తర్వాత లోపలికి వెడుతూ కనిపించాడు. ఒక 40ని. అవుతోంది రావట్లేదు. అర్థం కాలేదు. ఇద్దరం కలిసి ఆ ఐస్ క్రీం పార్లర్ లో ఉన్నాయన్ని అడిగాం. “నేనెవరికీ మామని కాదు. అసలు అలాంటి వాళ్ళు ఎవరూ నాకు తెలియరు” అంటూ... సెక్యూరిటీ అతన్ని పిలిచాడు.

ఈమాటలు విని స్టేడియం సెక్యూరిటీ అతను వచ్చాడు. అతనికి చెప్పాం. అతను తల కొట్టుకుని “అయ్యో... సర్. అలా ఎలా విన్నారు. ఇక్కడ గొడౌన్లు లేవు. వాడు చెప్పినటువంటి షాపులు లేవు. వాడు ఈ పాటికి స్టేడియం అటువైపు దారి నుంచీ వెళ్ళిపోయివుంటాడు. రకరకాల మోసాలు సర్. వాడు అంత తేలిగ్గా మోసం చేశాడంటే ఎంతమందిని ముంచాడో ఈపాటికి” అన్నాడు.

ఒక్కసారి నాకయితే సినిమాలో బ్రహ్మానందం గుర్తుకువచ్చి, అద్దంలో చూసుకుంటే మా మొహాలు అలాగే వుంటాయేమో అనిపించింది.

ఇద్దరం ఈ చేసిన ఘనకార్యానికి మళ్ళీ యూనివర్సిటీ దగ్గరికి వచ్చి, అక్కడ క్యాంటీన్ లో టీ తాగాం. ఆఫీసులో వాళ్ళకి చెబితే... మీకు, లక్ష్మి (రిజిస్ట్రార్ పి.ఎ., నాకు ఫ్రెండ్) గారికి తెలిసిన వాళ్ళు అప్పుడప్పుడూ వస్తున్నారు కదా... అనుకున్నాం అన్నారు.

ఇంటికి వచ్చి, వాడు చెప్పిన ఆంజనేయస్వామి పూజ చేసేవాళ్ళింటికి వెళ్ళి అడిగితే. “మా ఇంట్లో కిరాయికిచ్చే పోర్షనే లేదు. శ్రీని వాసా.... ఎవడూ లేడు” అన్నారు.

రెండు వేలు గోవిందా... 2005లో రెండువేలు అంటే చాలా ఎక్కువే మరి. ఐస్ క్రీం చూసినప్పుడల్లా... ఇదే గుర్తుకు వస్తుంది.

ఏది ఎలా జరుగుతుందో... ఎవరికీ తెలియదు...

మనం చేతకాని వాళ్ళం అని తెలిసేవరకూ...

అందంగా మోసం చేస్తారు

2 కామెంట్‌లు:

  1. ఉదరపోషణార్థం బహుకృత వేషం అన్నారు కదా.
    మరి ఆ Xerox Room లో పనిచేస్తున్న మీ సహోద్యోగి అయినా మిమ్మల్ని వారించలేదా? అతనేం కొలీగ్ అండీ?

    రిప్లయితొలగించండి
  2. జిరాక్స్ ఆపరేటర్ కొంచెం అయోమయంగా వుండేవాడు. అస్సలు ఏదీ పట్టించుకునేవాడు కాదు. నేనయినా ఇంకొళ్ళని అడిగివుంటే వాణ్ణి అప్పుడే తన్ని వుండేవాళ్ళు. టోకరా వేసేవాళ్ళు కూడా అలాగే వుంటారు. వాడు నేను ఎక్కడ నుంచి వస్తానో...అవన్నీ తెలుసుకున్నాడంటే చాలా తెలివైనవాడనుకోవాలి.

    రిప్లయితొలగించండి