5, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 4

 మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 4


ఆస్ట్రేలియాలో హాస్పిటల్ లో పాపని తల్లి పక్కన పడుకోనివ్వరు. పాలివ్వడానికి మాత్రమే తల్లి తీసుకోవాలి. పక్కన ఉయ్యాలలోనే పడుకోపెడతారు.  అందుకని ఆ రాత్రి నేను మా అమ్మాయి పక్కనే పడుకున్నాను. కొత్తచోటు కాస్త ఇబ్బందిగానే అనిపించింది. పడుకుంటే జారిపోయే పరుపులు. అందులోను సిల్కు చీర కట్టుకున్నానేమో చాలా ఇబ్బందిగా అనిపించింది. 

శేఖర్ ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్న హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన వెజిటబుల్  శాండ్ విచ్, పళ్ళ ముక్కలు తిన్నాను. పాపకి వాళ్ళు తల్లి దగ్గర అలవాటయ్యేలోపున చిన్న సీసాతో పాలు పట్టమని ఇచ్చారు. పాలు తాగి మళ్ళీ పడుకుంది. పడుకునే ప్రతిసారీ ర్యాప్ చేసేవారు. కదలకుండా పడుకునేది. పొద్దున్న 10 గంటలకి చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ వచ్చారు. ఆయన కూడా ఆస్ట్రేలియన్ ఆరడుగుల పొడుగు వున్నారు. పాపని అంతా చెక్ చేసి, తన రెండు చేతుల వేళ్ళు పాప చిట్టి చేతుల మధ్య పెట్టి పట్టుకోగానే పైకి లేచింది. రెండు రోజుల పిల్ల అలా లేచేసరికి డాక్టర్ కి చాలా ఆశ్చర్యం వేసింది. నవ్వుతూ వెరీ స్ట్రాంగ్ అని మళ్ళీ పడుకోపెట్టేశాడు. ఆయన 3.5 కిలోల పాపని అరిచేతిలో ఎత్తేసుకున్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. 

డెలివరీకి ముందు మా అమ్మాయి వీణ బ్లూ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బాదం పప్పులు, పిస్తా వేసిన జ్యూస్ తాగేది. శేఖర్ చాలా శ్రద్ధగా చేసి ఇచ్చేవాడు. బహుశ దాని ప్రభావం అనుకుంట పాప హెల్దీగా వుండడానికి అనుకున్నాం.

రెండోరోజు మధ్యాహ్నం నాకు లంచ్ కి వెజిటబుల్ కట్ లెట్ రోటీ, రాజ్ మా కర్రీ, పెరుగు, ఉడక పెట్టిన పండు గుమ్మడి ముక్క, ఒక గ్లాస్ నిండా బాదం పాలు ఇచ్చారు. చాలా హెవీ అయిపోయింది.

నేను లంచ్ చేసిన తర్వాత శేఖర్ నన్ను ఇంటి దగ్గర దింపాడు. ఆరోజు రాత్రి అంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్నీ వుండడానికి భయం వేసి. దగ్గరలోనే వున్న వీళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి పడుకున్నాను. 

అలా పాప పుట్టి రెండో రోజు అయ్యింది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి