14, ఫిబ్రవరి 2021, ఆదివారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 10

  మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 10



ఆర్ణకి డ్రెస్, డైపర్స్ మార్చడానికి ఒక ట్రాలీ వుండేది.  అప్పుడప్పుడు ఏడ్చినప్పుడు దానిమీద పడుకోపెట్టి అటూ తిప్పుతూ వుండేదాన్ని. కాసేపు ఏడుపు మానేసేది. మళ్ళీ కాసేపటికి మామూలే.

పాప చేష్టలు వింతగా వుండేవి. ఒక నెల రోజులు అయి ఊ ఊ అంటూ ఊ కొట్టేది. ఎవరైనా వీడియో కాల్ చేస్తే ఏడుపు మానేసి ఊ ఊ ఊ అంటూ కబుర్లు చెప్పేది. అవతల రెగ్యులర్ గా కనిపించే వాళ్ళ తాతా, నానమ్మలని బాగా గుర్తు పట్టి కేరింతలు కొట్టేది.

నేను ట్రాలీ మీద పడుకోపెట్టి కాకి, పిచుక కథ చెప్పేదాన్ని. గట్టిగా నెల రోజుల పిల్ల. ఏడుపు ఆపి నేను చెప్తున్నంతసేపూ అలా చూసేది. నేను జంతువుల అరుపులు చెప్తూ కాకి కావు కావు మంటుంది. పిచుక కిచకిచ అంటుంది అని చెప్పి.

కాకేమంటుందీ అనగానే ఆవ్ ఆవ్ అనేది. నాకు ఆశ్చర్యం వేసి, మా అమ్మాయిని పిలిచి చూడు చూడు అని మళ్ళీ కాకి ఏమంటుంది. అంటే ఆవ్ ఆవ్ అంది.  ఎందుకు అలా రిపీట్ చేసేదో.... దానికి ఏమర్ధమయ్యేదో తెలియదు.

నాకు అదేదో అంటే మేము ఊహించుకున్నామేమో అనుకుని డౌట్ వచ్చి మర్నాడు మళ్ళీ అడిగాను. మళ్ళీ అలాగే అంది. కానీ వీళ్లు రికార్డు చేద్దామనుకునేసరికి ఫోను వంక చూసి అనేది కాదు.  

అలా రెండోనెల గడిచిపోయింది. నేను సాయంత్రం అప్పుడు వీణ, శేఖర్ పాపని చూసుకుంటుంటే వాళ్ళకి దగ్గరలో వున్న పార్కుకి వాకింగ్ కి వెళ్ళి ఒక రెండు కిలోమీటర్లు తిరిగి వచ్చేదాన్ని.

రాగానే వంట కార్యక్రమం అయిన తర్వాత పాపని ఎత్తుకుంటే వీణా, శేఖర్ తినిసేవాళ్ళు. లేకపోతే వీణా పాపని ఎత్తుకుంటే తనకి నేను పెట్టేసి, తర్వాత నేను తినేదాన్ని. అస్సలు వీణా దగ్గర నుంచి వచ్చేదే కాదు. రెండు నెలలు నిద్ర లేని రాత్రులతో, పాప ఆపని ఏడుపులతో ఎలా గడిచిపోయాయో తెలియదు.  

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి