17, ఫిబ్రవరి 2021, బుధవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 11

  మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 11శేఖర్, వీణా వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలందరినీ  ఎత్తుకుంటుండేవారు. వాళ్ళందరూ ఎవరు ఎత్తుకున్నా కుయ్ కయ్ మనేవాళ్ళు కాదు.  మా అమ్మాయి ఫ్రెండ్ సవితా అని వుంది.  వాళ్ళమ్మాయి 5వ నెల వచ్చినా  చడీ చప్పుడు లేకుండా కదలకుండా ఒళ్ళో పడుకునేది.  అలా చూస్తూ వుండేది అంతే... నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదే మా అమ్మాయి వీణాతో అంటే ఆస్ట్రేలియాలో పిల్లలు ఇలాగే వుంటారు చాలామందిని చూశాం కదా అంది. నేను నిజమే అనుకున్నాను.

కానీ వీళ్ళు పాప అంత ఏడుస్తుందని వూహించలేదు.  శేఖర్ వేరే రూంలో పడుకున్నా... కూడా అర్థరాత్రి లేచి వచ్చేవాడు. పాప ఏడుపు వినిపిస్తున్నట్లే వుందని. కానీ పాప నిద్రపోతుండేది.

అక్కడ తప్పనిసరిగా వారానికి ఒకసారి నర్స్ అప్పాయింట్ మెంట్ కి వెళ్ళాలి. వాళ్ళు పిల్లల బరువు, పొడుగు చూసి దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఆరోగ్యంగా వున్నారో చెప్పేవారు.  వాళ్ళు చెప్పడం అటుంచి మా అమ్మాయి వాళ్ళని సవాలక్ష ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టుకునేది. ఎన్ని అడిగినా నవ్వుతూ ఓపికగా సమాధానం చెప్పేవారు.

మూడవ నెల వచ్చింది. కొంచెం ఏడుపు తగ్గింది. ఒకరోజు పాపకి వాక్సిన్ వేయించడానికి నర్స్ అప్పాయింట్ మెంట్ కి వెళ్ళాం. చాలామంది వాళ్ళ పిల్లల్ని తీసుకు వచ్చారు. లోపల ఒక బాబుకి ఇంజక్షన్ చేస్తుంటే వాడు బాగా గట్టిగా ఏడుస్తున్నాడు.  నేను ఎందుకో పాప మొహంలోకి చూస్తే. బిక్కమొహం వేసుకుని వుంది. కళ్ళనుంచి ధారాపాతంగా నీళ్ళు కారిపోతున్నాయి. చాలా ఆశ్చర్యం వేసి వీణాకి చెప్పాను. తన భుజం మీద వుండడంతో వీణా చూడలేదు. తను కూడా చూసి ఆశ్చర్యపోయి కళ్ళు తుడిచింది.

ఇంతలోకే ఆ వాక్సిన్ వేయించుకున్న బాబు, వాళ్ళమ్మ బయటికి వచ్చారు. అసలే అక్కడవాళ్ళు తెల్లగా వుంటారేమో... పిల్లాడి బాధ చూడలేకపోయిందేమో ఆ అమ్మాయి మొహం ఏడ్చి, ఎరుపెక్కిపోయింది. మొత్తానికి కాసేపటికి నవ్వారు. పాప కూడా వాళ్ళని చూసి నవ్వింది.  కానీ పాపకి ఇంజెక్షన్ చేసినప్పుడు మాత్రం కొంచెం కుయ్ మని మామూలుగా వుంది.  అమ్మయ్య అనుకున్నాం. ఎంత ఏడుస్తుందో అని భయపడ్డాం. 

వాక్సిన్ వేయించాక జ్వరం కూడా ఏమీ రాలేదు. నేను చాలా భయపడ్డాను. ఎందుకంటే శేఖర్ వీణాలకి మొదటి సంతానం, కొత్త కావడంతో ప్రతి దానికీ కంగారు పడేవారు. 

 


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి