23, ఫిబ్రవరి 2021, మంగళవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 12

   మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 12






మూడవ నెలలోకి అడుగుపెట్టిన ఆర్ణ కొంచెం కొంచెం ఆటలు నేర్చింది. ఏడుపు కూడా తగ్గింది. వాళ్ళమ్మ ఆనుపానులని గుర్తుపడుతోంది. అటూ ఇటూ తిరుగుతుంటే గుర్తుపట్టి అటే చూడ్డం మొదలుపెట్టేది.

కొత్తపాపతో (2020) కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం.  మా అమ్మాయి జనవరి నెల ఎప్పుడు వస్తుందా పాపకి సంక్రాతికి భోగిపళ్ళు పోయాలని చాలా ఉత్సాహంగా వుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కుటుంబాలు ఇద్దరు ముగ్గురిని పిలిచారు.  నేను పాపాయికోసం తెచ్చిన బుజ్జి పట్టులంగా వేసింది. వాళ్ళత్తగారు చేయించిన, గాజులు గొలుసు వేసింది. ఏ కళనుందో పాప అస్సలు ఏడవలేదు. భోగిపళ్ళు పోసినంతసేపూ కదలకుండా కూచుంది.  అందరం కలిసి పాపకి భోగిపళ్ళు పోసి, చిన్నగా పేరంటం చేశాం. అది అయిన తర్వాత వాళ్ళు డిన్నర్ మా ఇంట్లోనే చేసి కాసేపు కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోయారు.  ఆస్ట్రేలియాలో వాళ్ళు పేరంటమైనా, ఫంక్షనైనా లంచ్ కానీ, డిన్నర్ కానీ తప్పనిసరిగా వుంటుంది. వేరే దేశాల్లో కూడా వుండచ్చు.

ఇంక నాకు ఇండియా మీద దృష్టి మళ్ళింది. ఎప్పుడు వెళతామా అని ఎదురు చూస్తూ కూచున్నాను. మా అమ్మాయి పెళ్ళయిన తర్వాత  మూడేళ్ళయిపోయింది. ఇండియా రాలేదు. సరే ఎలాగా లీవులో వుంటాను కదా ఇండియా వస్తాను అంది. జనవరి నాటికే వెళ్ళిపోవాలని అనుకున్నాము కానీ, పాపా ఫ్లైట్ లో ఎలా వుంటుందో అని భయం. అదీ కాకుండా మా అబ్బాయి హైదరాబాద్ లో డెంగ్యూ బాగా వుంది. దోమలు బాగా వున్నాయి ఇప్పుడు రాకండి అన్నాడు.

ఫిబ్రవరి 15 తేదీన మా అబ్బాయిది నిశ్చితార్థం అనుకున్నాం. అదో హడావుడి. మొత్తానికి ఫిబ్రవరి 10వ తేదీన ఇండియాకి టికెట్లు బుక్ చేశారు. అమ్మయ్య అనుకున్నాను.  రోజులు లెక్కపెట్టుకుంటూ కూచున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి