26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 13

    మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 13

మేం బయల్దేరే లోపున టీవీలో చైనాలో కరోనా గురించి ఒకటే చెప్తున్నాడు. ఆంటీ సింగపూర్ లో కూడా చాలా వుందిట అంటూ శేఖర్ న్యూస్ గురించి రోజూ చెప్తూనే వున్నాడు. నేను ఇంతకు ముందు స్వైన్ ఫ్లూ గురించి కుడా ఇలాగే చెప్పారు. అది కూడా ఇలాంటిదేలే అని తీసి పారేశాను. ముందు ముందు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందని తెలియదు. ఏది ఏమైనా ఇండియా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను.

మా అమ్మాయితో నేను వెళ్ళిపోతాను నువ్వుండిపో అన్నాను. ఒక్కసారి షాకయ్యింది. ఫీలయ్యింది. కానీ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి 12 గంటలు ప్రయాణమే అయినా 3 నెలలు పూర్తయిన పాపని తీసుకుని వెళ్ళాలంటే ఇద్దరికీ భయంగానే వుంది.  ఫ్లైట్ లో ఎలా వుంటుందోనని. వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది మేము నెల రోజులకే వెళ్ళిపోయాం ఏం ఫరవాలేదు అని చెప్పారు.

సరే మేము బయల్దేరే రోజు వచ్చింది. శేఖర్ ఎయిర్ పోర్టు వరకు వచ్చాడు. ఈ మూడు నెలల్లో శేఖర్ కి పాప బాగా అలవాటయిపోయింది. తను పడుకోబెడితేనే పడుకునేది. ఎయిర్ పోర్టులో కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. మా అమ్మాయి కూడా 3 సంవత్సరాల తర్వాత వస్తోందేమో తనూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

మొత్తానికి సింగపూరు ఫ్లైట్ ఎక్కాం. మా ఇద్దరికీ ముందు సీట్లు ఇచ్చారు. ఇక ముందు సీట్లు లేకపోవడంతో ఫ్రీగానే వుంది. పాప అస్సలు ఏడవలేదు. చాలా బాగా  సహకరించింది. సింగపూర్ లో దిగాం. అప్పట్లో మాస్కులు  ఏవో పేపర్ వి దొరికాయి. సరే అవే పెట్టుకున్నాం. ఎయిర్ పోర్టులో వాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గింది. అందరూ మాస్కులు తీసేసి తిరుగుతున్నారు ఏం భయంలేదు అని చెప్పారు. ఏదైనా తప్పదు కదా.  

పాపతో ఎలా వుంటుందోనని 8 గంటలు బ్రేక్ వుండేలా ఫ్లైట్ బుక్ చేశారు. సింగపూర్ లో ఎయిర్ పోర్ట్ లో రూం బుక్ చేసుకున్నాం. మేము డైరెక్ట్ గా రూం కి వెళ్ళి, ఫ్రెషప్ అయి ఫుడ్ కోసం బయటికి వెడుతుంటే హోటల్ మేనేజర్ రూం బుక్ చేసుకున్నవాళ్ళకి ఫ్రీ ఫుడ్ అని చెప్పి వాళ్ళ హోటల్ చూపించాడు. అక్కడ బఫే సిస్టమ్.  రకరకాల బ్రెడ్ లు, బిస్కట్లు, ఐస్ క్రీంలు, పప్పు, అన్నం, శాండ్ విచ్ లు, స్వీట్లు, చాక్ లెట్స్ ఇంకా ఏవేవో వున్నాయి. సరే మేం తినగలిగినవి తిని రూంలో 4 గంటలు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ వేరే టెర్మినల్ కి వెళ్ళాలి కాబట్టి ముందే బయల్దేరాం.

ఇంకో టెర్మినల్ కి వెళ్ళాలంటే మా చిట్టిపాప, హ్యాండ్ లగేజి, పాప బ్యాగ్ ఒకటి కొంచెం కష్టమే అయింది. మొత్తానికి ఇండియా వచ్చే ఫ్లైట్ ఎక్కాం.  ఈ ఫ్లైట్ లో కూడా మాకు అనుకూలంగానే సీట్లు వున్నాయి. పాప అస్సలు ఏడవలేదు. ఇప్పటి వరకూ ఈ ప్రయాణం చాలా బాగా జరిగింది.  ప్రతిచోటా టెంపరేచర్ చెక్ చేసి పంపించారు. మొత్తానికి ఇండియా చేరుకున్నాం.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి