10, ఫిబ్రవరి 2021, బుధవారం

మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 7

  మనవరాలా మజాకానా.... మనవరాలు ఆర్ణ ముచ్చట్లు - 7

రాత్రి బాగానే నిద్రపోయింది. మూడు రోజులు పాపాయి ఇంట్లో వుందా లేదా అన్నట్లు వుండేది. 

వీణాకి కూడా తినవలసినవి అన్నీ టైం ప్రకారం చేసి పెట్టాను.  డిష్ వాషర్ అంటారు కానీ, అందులో గిన్నెలు సద్దడం, మళ్ళీ డ్రై అయిన గిన్నెలు తియ్యడం పెద్ద పనే. 

ఇల్లంతా తెల్లటి మార్పుల్ కాబట్టి కొంచెం కిందపడినా మరకలు కనిపిస్తుంది. ఇల్లంతా క్లీనింగ్ శేఖర్ చూసుకునేవాడు.  అంత పెద్ద ఇల్లు క్లీన్ చెయ్యడానికి చిన్న రౌండ్ గా వుండే Robot ని తీసుకున్నారు. డస్ట్ అంతా క్లీన్ అయిపోయేది.  

 నేను వీణా ఒక రూంలో పడుకునేవాళ్ళం.  పాపని మధ్యలో పడుకోపెట్టేది. గుడ్డలో ర్యాప్ చేసి పడుకోపెట్టేది కాబట్టి కదలకుండా పడుకునేది. అయినా కూడా నేను పాపమీదకి వెళ్ళిపోతానేమోనని మంచం చివరికి పడుకునేదాన్ని. రాత్రి కిందపడతానేమోనని భయం.  మళ్ళీ వీణాకి ఆకలి వేస్తుంది కాబట్టి తొందరగా లేవాలని ఆరాటం. సరిగా నిద్ర పట్టేది కాదు.

నాలుగోరోజు రాత్రి పాప బాగా ఏడవడం మొదలుపెట్టింది. వీణా కంగారుగా శేఖర్ రూంలోకి వెళ్ళి లేపింది. నేను చెప్తూనే వున్నా... అలాగే ఏడుస్తారు కంగారు ఏం లేదు. ఇప్పుడే బయటి ప్రపంచంలో అడుగు పెట్టింది కదా.... వాతావరణం అన్నీ అలవాటు అవ్వాలి కదా అని.  నాకు ఆ విషయాలు పాత అయినా వాళ్ళకి కొత్త కదా... రాత్రి 1 గంట అయ్యింది.  ఇద్దరూ కలిసి పాపని తీసుకుని కారులో 20 కిలో మీటర్ల దూరంలో    తనకి డెలివరీ అయిన God Murdoch Hospital వెళ్ళారు. 

వాళ్ళు తిరిగి వచ్చేసరికి తెల్లవారు జామున 3 గం. అయింది.  హాస్పిటల్ వాళ్ళు పిల్లలు పుట్టిన కొత్తలో అలాగే ఏడుస్తారు. కంగారేం లేదు అని చెప్పారుట.  అప్పుడు శంఖంలో పోస్తే తీర్థం అయినట్లు అయింది. 

శేఖర్ కి కూడా నెల రోజులు లీవు ఇచ్చారు. పొద్దున్న అందరం లేటుగా లేచాం. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి