16, డిసెంబర్ 2022, శుక్రవారం

సోమరాజు సుశీలగారితో నా అనుబంధం - 63

*** సోమరాజు సుశీలగారితో నా అనుబంధం - 63***



సాయంత్రం నాలుగు గంటలకి తెలియని ఫోన్ నెంబర్ తో ఫోన్. ఫోన్ తీశాను. అవతలి నుంచీ “హలో! నాగలక్ష్మిగారేనా!” ఎవరిదో ఆడవాళ్ళ గొంతు. “నాగలక్ష్మినే మాట్లాడుతున్నానండీ…” అన్నాను.

“నేను సోమరాజు సుశీలని మాట్లాడుతున్నాను. నరిసెట్టి ఇన్నయ్యగారు మీ నెంబర్ ఇచ్చారు. నేను పుస్తకాలు, వ్యాసాలు రాస్తుంటాను. చేత్తో రాయలేకపోతున్నాను. మీకు ఫోన్ లో చెప్తే చేసేస్తారని చెప్పారు. ఒకసారి మా ఇంటికి రండి. ఇద్దరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేద్దాం. అన్ని విషయాలూ మాట్లాడుకోవచ్చు” అన్నారు.

చాలా రోజుల తర్వాత ఒక స్నేహితురాలెవరో మాట్లాడుతున్నట్లు అనిపించింది. సుశీలగారి పుస్తకాలు చదివాను. ఎప్పుడూ చూడలేదు. ఆవిడ మాట్లాడే పద్ధతికి ఆవిడని కలవాలనే ఆసక్తి పెరిగింది. “అలాగే మేడమ్!” అన్నాను. వచ్చేముందు ఫోన్ చెయ్యమన్నారు. నేను వీలుచూసుకుని వెడదామని అనుకున్నాను.

ఒక రోజు ఫోన్ చేసి “వెంగళరావు నగర్ లో మా ఉమా పబ్లికేషన్స్ ఆఫీసు వుంది. మధ్యాహ్నం 3 గంటలకి అక్కడికి రండి. తర్వాత, నేను చెప్తుంటే ఇంగ్లీష్ రాసేవాళ్ళుంటే ఎవరైనా తీసుకురండి” అన్నారు. ముఖ పరిచయం ఏమాత్రం లేదు. అసలు ఆవిడ ఎలా వుంటారో కూడా తెలియదు. నేను “సరే మేడమ్” అని చెప్పి- ఇంగ్లీష్ ఎం.ఎ. చేసి ఖాళీగా (పిల్లలు సెటిల్ అయిపోయారు) వుంటున్నాను ఏదైనా పని చెప్పమంటున్న ఉషగారిని తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళాను.

మేము వెళ్ళేసరికి శ్రీరమణ గారు వచ్చి వున్నారు. ఆయన పేరు వినడం, ఫోటోలు చూడ్డమే కానీ డైరెక్ట్ చూడలేదు. అనుకోకుండా గొప్ప రచయితని చూసినందుకు సంతోషంగా అనిపించింది. ఆయనకి నమస్కారం చెప్పి “సుశీల గారు రమ్మన్నారు” అని చెప్పాను. “కూచోండి పది నిమిషాల్లో వస్తారు” అన్నారు శ్రీరమణగారు.

సరిగ్గా పదినిమిషాల్లో సుశీలగారు వచ్చారు. నన్ను నేను పరిచయం చేసుకుని, నాతో వచ్చిన ఉషగారిని పరిచయం చేశాను. ఒక్క నిమిషం అని చెప్పి, ఆవిడ పక్కన టేబుల్ వుంటే అక్కడ ఏదో హడావుడి పడుతున్నారు. నేను వెళ్ళి చూశాను. పెద్ద టిఫిన్ బాక్సులో పెరుగు వడలు, రవ్వ కేసరి అందరికీ పెట్టడానికి సద్దుతున్నారు. ఇప్పుడెందుకు తెచ్చారో అనుకుంటూ... నేను సుశీలగారికి సాయం చేశాను. (ఒక్క నిమిషం మా మూడో అక్క గుర్తుకు వచ్చింది. తను ఇలాగే అందరికీ పెడుతుంది.) “ఫర్వాలేదమ్మా నేను పెడతాను” అన్నారు. మేము కాకుండా ఇంకో ఇద్దరు ఎవరో వచ్చారు. అందరికీ నేను తీసుకెళ్ళి ఇచ్చాను. అలా ప్రారంభమైంది మా పరిచయం. ఆవడలు, రవ్వకేసరి చాలా రుచిగా వున్నాయి. అందరూ వస్తున్నారు కదా అని తీసుకువచ్చాను అన్నారు.

అసలు విషయంలోకి వస్తూ... “కొన్ని పుస్తకాలు “ఉమా పబ్లికేషన్స్” తో వేద్దామనుకుంటున్నాం” అన్నారు. విశ్వహిందూపరిషత్ వాళ్ళది ఇంగ్లీష్, తెలుగు రెండూ చెయ్యాలని చెప్పారు. ఉషగారిని పరిచయం చేశాను. ఇంక అప్పటి నుంచీ నేను రోజూ లంచ్ టైం వరకు వెళ్ళి ఆవిడ రాసినచ్చినవి టైప్ చేసి పెట్టేదాన్ని. శ్రీరమణగారు అప్పుడప్పుడు వచ్చేవారు.

రెండో రోజు నేను వర్కు చేస్తుంటే “లంచ్ చేద్దాం రండి. నాకు ఆకలి వేస్తోంది” అన్నారు. “మేడమ్ నేను వెళ్ళిపోతాను కదా అని తెచ్చుకోలేదు” అన్నాను. “ఫర్వాలేదు రండి. నేనూ మీకు చెప్పలేదు కదా... ఎక్కువే తెచ్చాను. ఇద్దరం కలిసి తిందాం” అన్నారు. నేను వర్కు ఆపేసి వెళ్ళాను. అన్నీ ఇద్దరికీ షేర్ చేశారు. తినేటప్పుడు “అమ్మయ్య! బెట్టు చేస్తారు, బతిమాలించుకుంటారు అనుకున్నాను. చాలా మాములుగా అలవాటయినట్టు వచ్చేశారు. ఇలా వుంటే బావుంటుంది” అన్నారు. నేను నవ్వాను.
ఇంక మర్నాడు నేనూ బాక్స్ పట్టికెళ్ళాను. లంచ్ టైంలో అరటి కాయ ఆవకూర, ఆనపకాయ పెరుగు పచ్చడి తీసి బయట పెట్టాను. రెండూ వేసుకుని తిని “చాలా బావున్నాయి. ఆనపకాయ పెరుగుపచ్చడి చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు చేసినా ఇంత బాగా రాదు” అని రెండోసారి వేసుకున్నారు. ఆనపకాయ పెరుగు పచ్చడి చేసినప్పుడల్లా సుశీలగారే గుర్తుకువస్తారు. ఆవిడతో కలిసి లంచ్ చెయ్యడం చాలా సరదాగా వుండేది. ఆ కాసేపట్లో ఏ కూరలు ఇష్టమో... వాళ్ళింట్లో వుండే వెంకటమ్మ ఎలా చేస్తుందో అన్నీ చెప్పేవారు. నాకు కూరగాయలు కొనడం ఇష్టం అని చెప్పాను. ఆవిడకి కూడా కూరలు కొనడం ఇష్టమని ఎక్కడెక్కడికి ఎలావెళ్ళేవారో... ఆవిడకి కూరగాయలవాళ్ళతో కొన్ని సంఘటనల గురించి చెప్పారు.

మేము బల్కంపేటలో వుండేవాళ్ళం వెళ్ళేదారిలో నన్ను కారెక్కించుకుని తీసుకుని వెళ్ళేవారు. వచ్చేటప్పుడు దింపేవారు. కానీ అక్కడికి రెగ్యులర్ గా రావడానికి శ్రీరమణ గారికీ, సుశీలగారికీ ఇద్దరికీ టైములు కుదిరేవి కాదు. ఇంక నాకు ఇంటికి పంపిస్తుండేవారు. ఇంక ఆఫీసుకి వెళ్ళడం మానేశాం. ఇంగ్లీష్ వర్కు చెయ్యడానికి ఉషగారికి కారు పంపించి వాళ్ళింటికి పిలిపించుకునేవారు. ఒకరోజు నాతో “ఆవిడ వల్ల ఎక్కువ ఉపయోగం అనిపించట్లేదు. కానీ నాకు ఎంతో కొంత సహాయపడుతున్నారు” అన్నారు. వర్కంతా అయిపోయాక ఉష గారితో ఎక్కువ పని చేయించుకోకపోయినా... ఆవిడకి పదివేలు ఇచ్చారు. అక్కడ ఆవిడ మంచితనం అర్థం అయ్యింది. ఉషగారు కూడా చాలా సంతోషించారు.

ఆ వర్కు అక్కడితో అయిపోయింది. నాకు ఒక్కోరోజు ఫోన్ లో వ్యాసాలు చెప్తుంటే నేను టైప్ చేసి ఇ-మెయిల్ పంపించేదాన్ని. అలా ఎన్నో వ్యాసాలు చేశాం. అప్పుడే సుశీలగారు, రంగారావుగారు, వాళ్ళమ్మగారు అమెరికా వెళ్ళినప్పటి విశేషాలతో అమెరికా ప్రయాణం పుస్తకం చెయ్యాలని మొదలు పెట్టారు. ఆ పుస్తకం చేసేటప్పుడు రాసినది ఒక్కటే కాకుండా ఆవిడ నాకు ప్రతి ఒక్కటీ వర్ణించి చెప్తుండేవారు. వెళ్ళివచ్చిన 15 సంవత్సరాల తర్వత ఇప్పుడు అవుతోంది అని చెప్పారు.

అందులో రాసిన ప్రతి సంఘటన హాస్యమిళితం, ఆనందసందోహం. వాళ్ళమ్మాయి శైలజతో జరిగిన చిన్న చిన్న వాదనలతో చాలా బావుంది. ఒకోసారి శైలజ ఆవిడకన్నా పెద్దది అయి వుంటే ఎలా వుండేదో అనిపించింది. మనం అమెరికా వెళ్ళి అక్కడివన్నీ చూసిన అనుభూతినిస్తుంది ఆ పుస్తకం.

***వీళ్ళింటికి ఏదో పనికి వచ్చిన ఒక కార్పెంటర్ ఇంటి వెళ్ళి, అతను ఎలా కట్టుకున్నాడో వర్ణించారు. నాకయితే అక్కడికి వెళ్ళిన అనుభూతి కలిగింది. ఎంత అద్భుతమైన ప్రదేశమో...*** మొత్తానికి అద్భుతమైన అనుభూతులు, అందమైన జ్ఞాపకాలతో ఆ పుస్తకం తయారయ్యింది. దానికి “ముగ్గురు కొలంబస్ లు” అని పేరు పెట్టారు. ఈ పుస్తకం ఆవిష్కరణకి శైలజ కూడా వచ్చింది. హిమాయత్ నగర్ చట్నీస్ లో మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా జరిగింది. నాకు చిరు సత్కారం చేసి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా పుస్తకాన్ని, ఒక చక్కటి అందమైన హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు. ఆ బ్యాగ్ నాకు చాలా ఉపయోగపడింది.

ముగ్గురు కొలంబస్ లు చేసినప్పుడు వాళ్ళింటికి వెడుతుండేదాన్ని, అప్పుడప్పుడు సుశీలగారు మా ఇంటికి వచ్చేవారు. వెళ్ళినప్పుడల్లా వెంకటమ్మ చేతి వంట తినేదాన్ని. సుశీలగారి దగ్గర నేర్చుకున్న వెంకటమ్మ చాలా బాగా చేసేది. భోజనం అయ్యాక స్వీటు ఒవెన్ లో వేడి చేసి పెట్టేవారు. ఒకవేళ సాయంత్రం వరకు ఉండాల్సి వస్తే పకోడీలో, బజ్జిలో వెయ్యమని అవీ, మంచి కాఫీ ఇచ్చేవారు. వాళ్ళింట్లో ఉన్న రకరకాల పువ్వుల మొక్కలు చాలా బావుండేవి. కాసేపు వాటిమధ్య తిరిగి వచ్చేదాన్ని.

ముగ్గురు కొలంబస్ లు అయిపోయాక సుశీలగారు రంగారావుగార్ల పెళ్ళితో మొదలుపెట్టి, మిత్రుల, బంధువుల ఇళ్ళలో జరిగిన పెళ్ళిళ్ళన్నింటి గురించీ తు.చ. తప్పకుండా ఆవిడ చెప్తుంటే నేను టైపు చేసేదాన్ని. మనం చేస్తున్న పుస్తకాలకి మొదటి పాఠకురాలు మీరే. ఏమైనా మార్చాలంటే చెప్పమనేవారు. ఆవిడ అలా అనడమే ఆనందంగా అనిపించేది. తప్పులు లేకుండా అప్పటికప్పుడు వెంటనే అయిపోవడం ఆవిడకీ తేలికగానే వుండేది. ప్రతిదీ కూడా శైలజకి చూపించి తన అభిప్రాయం తీసుకుంటేనే ఫైనల్ చేసేవారు. ఇద్దరికీ ఈ విషయాల్లో చర్చలు బాగానే జరిగేవి. ఒకో పెళ్ళి, వాటిలో జరిగిన విషయాలన్నీ చదువుతుంటే అంత సునిశితంగా పరిశీలించారనిపించింది. ఈ పెళ్ళిళ్ళలో *** వైజాగ్ సముద్రం ఒడ్డున జరిగిన పెళ్ళి టైముకి తుఫాను రావడం. షామియానా కుర్చీలతో సహా అన్నీ కొట్టుకుపోవడం – ఇక్కడ సుశీలగారి వర్ణన ఆ సందర్భం మన కళ్ళముందు కనిపించేలా చేసింది*** నాకు బాగా నచ్చింది. అది చదివితేనే బావుంటుంది.

మొత్తానికి రకరకాల పెళ్ళిళ్లతో “పెళ్ళిపందిరి” పేరుతో ఆ పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం రిలీజంగ్ బయట పెట్టుకుందామనుకున్నారు కానీ, రంగారావుగారికి ఒంట్లో బావుండలేదని ఇంట్లోనే పెట్టారు. కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఆరోజు వాళ్ళ పెళ్ళిరోజు కూడా కావడం విశేషం.

సుశీల గారు మా అమ్మాయి ఎంగేజ్ మెంట్ కి పిలవగానే వచ్చారు. శ్రీరమణగారి కుటుంబం కూడా వచ్చారు. ఆ రోజు నేను వర్కు చేస్తున్న సాహితీపరులందరినీ పిలిచాను. అందరూ చాలా ఆప్యాయంగా వచ్చారు. వాళ్ళందరూ అమ్మా మీ అమ్మాయి ఎంగేజ్ మెంట్ కాదు మాకు సాహితీ సమావేశంలా వుంది. అనుకోకుండా అందరం కలిశామని చాలా సంతోషించారు. వాళ్ళలో కొంతమంది నా పర్మిషన్ అడిగి అమ్మా నువ్వేమీ అనుకోకపోతే మా ఫ్రెండ్స్ ని తీసుకుని వస్తాం అన్నారు. వాళ్ళందరితో నాకున్న పరిచయం అలాంటిది. అందరూ కుటుంబసభ్యులే అయ్యారు మరి.





తర్వాత ఆవిడ రాసిన చిన్న చిన్న కథలన్నీ కలిపి ఒక పుస్తకం వేద్దామని అన్నీ రెడీ ప్రూఫ్ కరక్షన్ కూడా అయిపోయింది. ఒకరోజు మీ ఇంటికి వస్తాను ఫైనల్ చేసేద్దాం అన్నారు. ఇంతలోనే నేను మా అమ్మాయి డెలివరీకి ఆస్ట్రేలియా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేలోపున సుశీలగారిని కలుద్దామనుకున్నాను కానీ కుదరలేదు. ఫోన్ లోనే మాట్లాడాను. సరేలెండి నాకూ ఒంట్లో బావుండట్లేదు. మీరు వచ్చాకే ప్రింట్ కి ఇద్దాం అన్నారు. మళ్ళీ వెళ్ళేముందు ఫోన్ చేస్తే.... “నేను ఇంత పెద్ద వయసు వచ్చాక మంచం మీద సరిగా పడుకోవడం చేత కాక కింద పడ్డాను. మా ఆయన కూడా తలగడాలు అడ్డం పెట్టుకో అని జోక్ చేశారు. చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది. పది రోజులు హాస్పిటల్ లో వుండి ఇందాకే వచ్చాను. మీరు వచ్చాక పుస్తకం చేసేద్దాం ” అని ధీమాగా చెప్పారు. కానీ మాట బాగా తడబడుతోంది. సరే ఒంట్లో బాగాలేదుకదా అనుకున్నాను.

నేను 2019 సెప్టెంబర్ 5వ తేదీన ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. వెళ్ళిన కొన్ని రోజులకే వాళ్ళబ్బాయి శ్రీకాంత్ మెసేజ్ పెట్టాడు – “సుశీలగారు ఇక లేరని”. చాలా బాధగా అనిపించింది. ఆవిడ పుస్తకాలు పూర్తి చెయ్యలేకపోయాను. నేను ఆవిడతో ఉన్న అనుబంధం చాలా టూకీగా రాశాను. చాలా విషయాల్లో ఆవిడ గుర్తుకు వస్తూనే వుంటారు. ఒక గొప్ప వ్యక్తి దూరమయ్యారని చాలా బాధేసింది.

అసలు నేను చేసినన్నాళ్ళు ఆవిడలో కోపం చూడలేదు. వర్కు చేసేటప్పుడు మాత్రం నవ్వుకుంటూ, జోక్స్ వేస్తూ వుండేవారు. రాయాలంటే ఎంతో మరి....

2 కామెంట్‌లు:

  1. మీరు అదృష్టవంతులండీ, పలువురు సాహితీవేత్తలతో పరిచయాలు ఏర్పడినాయి. డాక్టర్ సోమరాజు సుశీల గారు విద్యాధికురాలు, పారిశ్రామికవేత్త మాత్రమే గాక మంచి రచనలు చేసిన వ్యక్తి కూడా. బహుముఖ ప్రజ్ఞాశాలి 🙏.

    అదేమిటి, చెయ్యి విరిగితే అసలు హాస్పిటల్లో ఇన్-పేషెంట్ గా ఉండడం ఎందుకు, అదిన్నీ పది రోజులా? ఆశ్చర్యంగా ఉందే. కట్టు కట్టి ఇంటికి పంపించేస్తారనుకున్నానే! ఏమైనప్పటికీ సుశీల గారు కాలం చెయ్యడం తెలుగు సాహితీరంగానికి లోటు 🙏.

    అవునూ, శ్రీరమణ గారి నివాసం మద్రాసు అనుకున్నానే, హైదరాబాదుకు మారారా?

    మీ అమ్మాయి నిశ్చితార్థం ఘనంగా జరిగినట్లుందే. వెరీ నైస్.

    రిప్లయితొలగించండి
  2. నమస్కారం సర్.

    ఆవిడ ఫుల్ డయాబెటిక్ సర్. భారీ పర్సనాలిటీ. అసలు మంచం కిందకే వుండేది. ఎలా పడ్డారో. డయాబెటిక్ వాళ్ళకి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు రికవర్ అవడం కష్టతరమైనదే అనుకుంటా. మరి కొంతమంది గురించి కూడా విన్నాను.

    చెయ్యి విరిగాక ఇంటికి వచ్చినా ఆవిడకి దాంతో చాలా సమస్యలు వచ్చాయి. బ్రెయిన్ కి అటాక్ అయ్యింది. దానికి ఆపరేషన్ చేశారు. ఇంచుమించు ఒక నెల రోజులు సఫర్ అయ్యారు. ఆవిడ కనుమరుగైన సంవత్సరానికి ఆయన కూడా కాలం చేశారు. నిజంగా సాహితీలోకానికి, పారిశ్రామిక రంగానికి లోటే.

    శ్రీరమణగారు ఎప్పటి నుంచో ఇక్కడే వుంటున్నారు సర్. ఇవాళే సుశీల గారి అబ్బాయితో... మాట్లాడాను.

    శ్రీరమణ గారికి ఫోన్ చేశాను కానీ తియ్యలేదు.

    అవును సర్ మా అమ్మాయి నిశ్చితార్థానికి చాలామంది రచయితలు వచ్చారు. అందరికీ నేనంటే చాలా అభిమానం. అమ్మా మీ అమ్మాయి ఎంగేజ్ మెంట్ కాదు సాహితీ సమావేశం అన్నారు.

    ధన్యవాదాలు సర్.

    రిప్లయితొలగించండి