28, డిసెంబర్ 2022, బుధవారం

సాహితీప్రియుడు – నిస్వార్థపరుడు - 65

 ***సాహితీప్రియుడు – నిస్వార్థపరుడు - 65  ***

*** జుజ్జవరపు చంద్రమౌళిగారు ***
*** పుస్తకాలంటే ప్రాణం***


ఇన్నయ్యగారు నాకు అమెరికా నుంచి ఫోన్ చేసి “నాగలక్ష్మీ...! మనం ఇప్పటి వరకూ చేసిన పుస్తకాల పిడిఎఫ్ ఫైల్స్ ఒక సిడిలో పెట్టి, మీకొక ఫోన్ నెంబర్ ఇస్తాను. ఫోన్ చేసి వాళ్ళింటికి వెళ్ళి ఇచ్చెయ్యండి. ఆయన పేరు చంద్రమౌళి” అన్నారు.

ఆ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేశాను. “నేను చంద్రమౌళిని మాట్లాడుతున్నాను. ఎవరమ్మా మాట్లేది...?”
“నా పేరు నాగలక్ష్మి సర్! ఇన్నయ్యగారు సిడి ఇవ్వమన్నారు” అన్నాను.

చంద్రమౌళిగారు బేగంపేటలో సెంట్ ఫ్రాన్సిస్ వుమెన్స్ కాలేజీ పక్కన అని ఇంటి అడ్రస్ చెప్పారు.

చాలా తేలికగానే గుర్తుపట్టాను. పెద్ద ఇల్లు. ఇంటిముందంతా ఖాళీ స్థలం. చంద్రమౌళిగారు ఇంటిబయట ఉన్న వరండాలాంటి చోట కుర్చీలో కూచున్నారు. నాలుగు కుర్చీలు ఉన్నాయి. ఒక చిన్న టీపాయి, రాక్ వున్నాయి.

నేను వెళ్ళగానే కూచోమన్నారు. పెద్ద పెద్ద చెట్లుండడంతో గాలి బాగా వస్తోంది. కాలేజీ విడిచి పెట్టినప్పుడు మాత్రమే కిలకిలలాడుతూ అమ్మాయిల సందడి వినిపిస్తుంది. లేకపోతే ప్రశాంతమైన ప్రదేశం.

“ఏదమ్మా... సిడి ఇయ్యి!” అంటూ చెయ్యి జాపి, నేను వాటర్ వర్క్స్ లో ఛీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయ్యాను. “నువ్వేం చేస్తుంటావు?” అన్నారు. అప్పటికే ఆయనకి 77 సంవత్సరాలు వుంటాయేమో...

నేను మేం చేసే వర్కుల గురించి చెప్పాను. ఆయన “బలే వచ్చావమ్మా...! నేను చాలా పుస్తకాలు చేయిస్తుంటాను. నాకు ఇష్టమైనవి పేపర్ మీద రాసి అందరికీ పంపిస్తుంటాను. ఇప్పుడు నాకు రాసే పని తప్పింది” అని లోపలికి వెళ్ళి ఆయన శ్రీమతి ఝాన్సీగారిని పిలుచుకు వచ్చారు. ఆవిడ కూడా కాసేపు మాట్లాడి “ఉండు కాఫీ తీసుకువస్తాను” అని వెళ్ళిపోయారు.

చంద్రమౌళిగారు రెండు పేపర్ల మీద ఆచంట జానకిరాం గారి గురించి రాసిన మేటర్ ఇచ్చారు. రేపు టైప్ చేసి ప్రింట్ తెచ్చి పెట్టు అన్నారు. “సరే సర్” అని ఝాన్సీగారిచ్చి కాఫీ తాగేసి వచ్చేశాను.

నేను మర్నాడు తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఒక్క తప్పు కూడా లేని ఆ రెండు పేపర్లు చూసుకుని చాలా సంతోషించారు. అప్పటి నుంచీ ఆయన మాకు ఇలా పేపర్లు చేసి పెట్టమని, ఆ పేపర్లు జిరాక్స్ తియ్యడానికి ఒక మనిషిని పెట్టుకుని, వాటిని అన్నీ ఓపికగా మడతపెట్టి రెగ్యులర్ గా ఆయన ఇంటికి వచ్చే పోస్ట్ మాన్ కి ఇచ్చి ఫ్రండ్స్ అందరకీ పంపించేవారు. పోస్ట్ మాన్ కి కూడా నెలకి ఎంతో కొంత ఇస్తుండేవారు.

ఆయన ప్రింట్ చేసిన పుస్తకమే కాకుండా... ఆయనకి ఎవరి దగ్గరైనా పుస్తకాలు నచ్చితే... అవి డబ్బులిచ్చి కొని వాటిని కూడా ఫ్రెండ్స్ అందరికీ తన పోస్టల్ ఖర్చులు పెట్టుకుని మరీ పంపించేవారు. ఆయన పెన్షన్ లో చాలా వరకు వాటికే అవుతుందని సునందగారు చెప్పారు. ఒక పోస్ట్ మాన్ రెగ్యులర్ గా రమ్మని జీతంలా ఇచ్చేవారు.

ఆయన మాకు టైపు చెయ్యమని ఇచ్చే మేటర్ – వెడ్డింగ్ కార్డుల కవర్లమీద, లేకపోతే తనకి పోస్టులో వచ్చిన కవర్ల మీద రాసి ఇస్తుండేవారు. “నాగలక్ష్మి గారూ... ఎన్నింటికి వస్తారు?” అని అడిగేవారు. నేను వెళ్ళేసరికి ఆ టైముకి బయట కుర్చీలో కూచుని వుండేవారు. ఝాన్సీ గారు కాఫీ ఇస్తానంటే... “నాగలక్ష్మి వచ్చాక ఇద్దరికీ ఇద్దువు గాని” అని చెప్పేవారుట. నేను వెళ్ళాక ఆవిడ మా ఇద్దరికీ కాఫీ ఇచ్చేవారు. అప్పటి నుంచీ నేను వాళ్ళకి బాగా అలవాటయిపోయాను.

ఒకరోజు నేను వస్తానని చెప్పాను కానీ, ఇంటికి ఎవరో రావడంతో వెళ్ళలేకపోయాను. “రేపు పొద్దున్నే వస్తాను సర్” అని చెప్పాను. “మీరు ఇంక నా డిటిపి చెయ్యద్దు. నా వర్కులన్నీ సిడి లో పెట్టి, ఇప్పటి వరకూ ఎంతయ్యిందో చెప్తే రేపు డబ్బులు ఇచ్చేస్తాను. రేపు సిడీతో పాటు లెక్క కూడా తీసుకురండి” అని కోపంగా ఫోన్ పెట్టేశారు.

నేను మొత్తం వర్కంతా సిడిలో పెట్టి, ఒక పేపరు మీద లెక్కంతా రాసి పట్టికెళ్ళి ఇచ్చాను. “ఇలా రా కూచోమ్మా.. ఆ సిడి పక్కన పెట్టు. డబ్బులు ఇస్తాలే... నువ్వు, మీ ఆయన ప్రూఫ్ రీడింగ్ చేసి తప్పులు లేకుండా ఇస్తున్నారు కదా... నాకు చాలా పని తప్పించారు. ఇదిగో ఈ మేటర్ రెడీ పెట్టాను. చేస్తావా చెయ్యవా...? పెద్దవాడిని. అర్థం చేసుకో...” అన్నారు. నాకు ఏమనాలో అర్థం కాలేదు.

మా చేత ఆయన చేయించిన మొదటి పుస్తకం 1800 సంవత్సరంలో వెన్నెలకంటి సుబ్బారావుగారు రాసిన VANGAVOLE పుస్తకం, తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ చేశాం. అవి ప్రింటింగ్ కూడా మేమే చేయించి ఇచ్చాం. అలా ఆయన దాదాపు 10 పుస్తకాల దాకా డిటిపి, ప్రింటింగ్ చేశాం.

మధ్య మధ్యలో కోపాలు, మళ్ళీ ఆయన మామూలుగా అవడం ఇలా జరిగిపోతుండేది. ఇంట్లో ఉన్న మామిడి చెట్టు కాయలు కాసినప్పటి నుంచీ, పళ్ళయ్యేవరకు మాకోసం ఆయన సెపరేట్ గా తీసిపెట్టి ఇచ్చేవారు. ఇంట్లో ఉన్న పెద్ద కరివేపాకు చెట్టు ఆకు కోయించి వెళ్ళినప్పుడల్లా ఇచ్చేవారు.

అబ్బూరి ఛాయాదేవిగారి ‘మృత్యుంజయ’ పుస్తకం మళ్ళీ ప్రింట్ చేయించాలని వుందని చెప్పారు. నేను వెళ్ళినప్పుడు ఆ పుస్తకం ఇచ్చి డిటిపి చెయ్యమన్నారు. నేను ఆవిడ పేరు వినడమే కానీ, ఆవిడని ఎప్పుడూ చూడలేదని చెప్పాను. “అయితే సరే రేపు పొద్దున్న ఆ పుస్తకం తీసుకుని వచ్చెయ్యి. మనం సిఆర్ ఫౌండేషన్ కి వెడదాం. నేనూ ఆవిడని చూసి చాలా రోజులైంది” అన్నారు. వాళ్ళ ఫ్రెండ్ కారులో నన్ను సిఆర్ ఫౌండేషన్ కి తీసుకుని వెళ్ళారు. ఛాయాదేవిగారు కిందకి వచ్చారు. అక్కడ చెట్లకింద కూచుని చాలాసేపు మాట్లాడుకున్నారు. పుస్తకం ఆవిడ ప్రింటింగ్ చేయించమన్నారు.

వచ్చేస్తుంటే ఆయనకి తెలిసిన ఆయన ఎవరో కలిశారు. ఇద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు. ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ చూసుకోకుండా డోర్ వేశారు. చంద్రమౌళిగారి చెయ్యి నలిగింది. ఇంక బాధతో, కోపంతో ఆయన అరిచిన అరుపులకి నాకు చాలా వణుకు పుట్టింది. అప్పటి వరకూ ప్రేమగా మాట్లాడిన ఆయన్ని బాగా తిట్టారు. "నీకోసమే వచ్చానమ్మా.... నాకు దెబ్బతగిలింది. నన్ను చంపేసినట్టయ్యింది" అన్నారు. పాపం అప్పటికే ఆయని ఒంట్లో ఓపిక ఉండట్లేదు. మొత్తానికి గబగబా అక్కడ నుంచి బయల్దేరి వచ్చేశాం.

మర్నాడు వెళ్ళి ఆయన్ని పలకరించి వచ్చాను. అప్పుడు మామూలుగానే మాట్లాడారు. “నేను ఏమైనా అంటే పెద్దవాడిని కదా... పట్టించుకోకు. నువ్వన్నా, మీ ఆయన అన్నా నాకు అస్సలు కోపం లేదు” అన్నారు.

ప్రింటింగ్ వర్కులు గురించి మాట్లాడడానికి మావారు వెళ్ళేవారు. ఆయన కూడా చంద్రమౌళిగారికి బాగా నచ్చారు. మీకు ఏదో ఒకరకంగా నేను సాయపడతాను అన్నారు. మేము వినేసి వూరుకునేవాళ్ళం. కానీ ఆయన మాకు జీవితంలో మరిచిపోలేని చాలా గొప్ప సాయం చేశారు.

మేము బల్కంపేటలో ఉండేవాళ్ళం. ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చారు. "ఎన్ని రూములు?" అన్నారు. "మూడు రూములు" అన్నాం. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మర్నాడు మా వారిని పిలిచి శ్రీనగర్ కాలనీలో మాది త్రీ బెడ్ రూం ఫ్లాట్ వుంది. అది ఖాళీ అయ్యింది. మీరు అందులోకి వెళ్ళండి. ఒకసారి చూసి రండి అని మా వారికి తాళాలు ఇచ్చారు. మా వారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అది చూసి వచ్చారు. ఆయనకి బావుందని చెప్పారు. మర్నాడు ఇద్దరం వెళ్ళాం. అందులోకి ఎందుకు మారమన్నారో అర్థం కాని పరిస్థితి.

చంద్రమౌళిగారు "నాకు మీరు ఒక్క పైసా రెంట్ ఇవ్వద్దు. ఆ ఫ్లాట్ మీకే. మిమ్మల్ని ఎవరూ అడ్డు పెట్టరు" అన్నారు. కానీ ఆయన మాటలకి వెంటనే ఒప్పుకోక ఒక రెండు నెలలు తాత్సారం చేశాం. ఆయన ఎంత చెప్పినా వాళ్ళ కుటుంబ సభ్యులు అంగీకరించాలి కదా... అనుకున్నాం. కానీ ఆయన మేము అందులోకి మారే వరకూ ఊరుకోలేదు.

అస్సలు ఆ విషయంలో ఆయన మమ్మల్ని నోరెత్తనివ్వలేదు. ఇంట్లో వాళ్ళకి కూడా “మీరెవరూ ఈ విషయంలో అడ్డు రావద్దు. నా డబ్బులు నా ఇష్టం” అన్నారు.

మా ఆ ఇల్లు చాలా నచ్చింది. కానీ మేము దాన్ని మా సొంతం చేసుకోవాలని మాత్రం అనుకోలేదు. నాలుగు నెలలు గడిచాయి.

క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం బలహీనమవడం మొదలు పెట్టింది. ఆయనకి ఇంట్లోనే ఒక అటెండర్ ని పెట్టి హాస్పిటల్లో లాగా బెడ్ అవీ ఏర్పాటు చేశారు. ఒకసారి నేను ఆయన రమ్మంటున్నారు అని చెప్తే వెళ్ళాను. “ఇదిగో అమ్మా... నీకోసం ఈ అలారం వాచ్ కొని వుంచాను. ఇది చూసినప్పుడు నీకు నేను గుర్తుకు వస్తాను” అని నాకు ఇచ్చారు. దాన్ని తీసుకుని వచ్చేశాను.

మర్నాడు పొద్దున్నే వాళ్ళ మనవడు – “తాతగారికి రాత్రి సీరియస్ అయ్యింది. హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. పొద్దున్న చనిపోయారు. తొందరగా రండి. ఆయన కోరిక ప్రకారం ఉస్మానియా హాస్పిటల్ కి డొనేట్ చేస్తున్నాం” అన్నారు. ఇలా ఒక పుస్తక ప్రియుడు, సాహితీ ప్రియుడు లోకానికి దూరమయ్యారు. చాలా బాధ అనిపించింది.

ఇంతలోకే మా అమ్మాయి పెళ్ళి కుదిరింది. ఆ ఇంట్లోనే పెళ్ళికూతురిని చేసి, ఘనంగా పెళ్ళిచేశాం. అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. నేను శ్రీమతి చంద్రమౌళిగారికి ఫోన్ చేసి మాకు ఒక మూడు నెలలు టైం ఇవ్వండి మేము వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం అని చెప్పాం. రెంట్ ఇస్తామంటే సార్ వద్దన్నారు కానీ, మీకు ఇప్పటి వరకూ అయిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తామని చెప్పాం. కానీ వాళ్ళు ఇల్లు ఇచ్చేస్తామంటే సంతోషపడ్డారు. ఆయన మాటే మా మాట అని అప్పటి వరకూ అయిన రెంట్ మాత్రం తీసుకోలేదు. మేము అదే కాపౌండ్ లో వేరే ఫ్లాట్ లోకి మారాం. రెండు స్థలాలు వున్నా... పిల్లల చదువుల విషయంలో పడి ఇల్లు కట్టే ఆలోచన చెయ్యలేకపోయాం.

కానీ ఓ మహానుభావుడి ప్రోద్బలంతో ఒక మంచి చోటికి వచ్చామని అనుకున్నాం. రోజూ మనసులో ఆయనకి ఓ నమస్కారం పెట్టుకుంటాను.
ఆయన ముద్రించిన కొన్ని..... ఇంకా కొన్ని ఆగిపోయాయి. ఆయన మాచేత చాలా పుస్తకాలు డిటిపి చేయించి, ప్రింట్ చేయించారు.
1. తుమ్మపూడి, 2. జానకితో జనాంతికం, 3. సురపురం, 4. అమ్మకి జేజే, 5. నాన్నకి జేజే, గురువుకి జేజే, 6. రామతీర్థస్వామి, 7. ఎ.జి.కె. సూక్తులు, 8. ఎజికె - నా అమెరికా పర్యటన, 9. ఆర్కాటు సోదరులు, 10. వంగవోలు - ఇంగ్లీషు, (మొదటిసారిగా వెన్నెలకంటి సుబ్బారావుగారి ఆటోబయోగ్రఫీ ఆంగ్లంలో ముద్రింపబడింది) 11. తెలుగులో వెన్నెలకంటి సుబ్బారావు జీవయాత్రా చరిత్ర, 12. వినదగు నెవ్వరు చెప్పిన (అండవిల్లి సత్యనారాయణగారి ఆకాశవాణి ప్రసంగాలు), 13. కులపతి - ఎస్.టి.జె. వరదాచార్యులుగారి జీవితచరిత్ర (కొత్తసత్యనారాయణ చౌదరి) 14. ప్రజ్ఞానిధి తెన్నేటి విశ్వనాథం (డిటిపి పూర్తయ్యాక అముద్రితంగా వుండిపోయింది) 15. రమణీయ భాగవత కథలు (ముళ్ళపూడి వెంకటరమణ), 16. సంజీవదేవ్ రచనా రుచులు, 17. ఆచంట జానకిరామ్ గారి రేడియో ప్రసంగాలు, 18. మృత్యుంజయ (లేఖాసాహిత్యం)

2 కామెంట్‌లు:

  1. వాటర్ వర్క్స్ ఛీఫ్ ఇంజనీర్ గారు కదా - అతివృష్టి అనావృష్టి అన్నమాట 🙂🙂🙂.

    ఎందరో సాహితీప్రియుల ఆదరాభిమానాలు సంపాదించుకున్న మీరు నిజంగా అదృష్టవంతులు 👌.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు సర్. ఈ సాహితీప్రియులందరి దగ్గర నుంచీ చాలా విషయాలు నేర్చుకోగలిగాను సర్.

    రిప్లయితొలగించండి