29, మే 2022, ఆదివారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 17 హైదరాబాద్ నగరంలో ఎదురీత

  మలుపులు తిరుగుతున్న నా జీవితం - 17   హైదరాబాద్ నగరంలో ఎదురీత

హైదరాబాద్ లో నా జీవనయానం - 5

ధైర్యానికి సవాల్ ఆ రోజు

రోజూ మెహదీపట్నం నుంచి 117 బస్ టోలీచౌకీ, శేర్లింగంపల్లి గచ్చిబౌలిల మీదుగా బిహెచ్ ఇ ఎల్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి పటాన్ చెరు చేరేది. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ గా మారిన ఈ ప్రదేశాలన్నీ అప్పుడు పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా వుండేవి.

నేను పొద్దున్న 9 గంటలకి బస్ స్టాప్ లో వుంటే బస్ చాలా రష్ గా వుండేది. దాదాపు గంట ప్రయాణం. అందుకని నా ప్రయాణాన్ని 7.30 గంటలకి మార్చుకున్నాను. బస్ లో అంత పొద్దున్నే వెడుతుంటే అటూ ఇటూ పచ్చటి చెట్లు స్వాగతం చెప్పేవి. దారిలో అక్కడక్కడ వున్న కస్తూరి తుమ్మ చెట్లు పచ్చటి పూలతో కమ్మటి సువాసనలు వెదజల్లేవి. అప్పుడప్పుడు బస్ చెట్ల పక్కనించి వెళ్ళినప్పుడు కొమ్మలు సుతారంగా తాకి గిలిగింతలు పెట్టేవి. పచ్చటి చెట్లలో నుంచీ కోయిల కుహు కుహు రాగాలు, పిట్టల కిచకిచలు చాలా ఆనందాన్నిచ్చేవి. అక్కడక్కడ చిన్నచిన్న నీటి కాలవలు పారుతూ వుండేవి. బాస్ లో కూచోడానికి చోటు దొరికేది కాబట్టి ఇదంతా ఆస్వాదించేదాన్ని.

దారిలో చెప్పుకోదగ్గ ముఖ్యమైన బస్ స్టాప్ ALIND (Alluminium Industries Ltd. India’s Largest Alluminium Fabrication, Estd. 1946) శేర్లింగంపల్లి. పనిచేసేవాళ్ళతో సందడి సందడిగా వుండేది. ఇప్పుడు దానిని షూటింగ్ లకి వాడుతున్నారని తెలిసింది.


ఇదంతా బాగానే వుంది. మా ఎమ్.డి. రెడ్డిగారు రోజూ వచ్చేవారు కాదు. ఒకరోజు ఆఫీసుకి వచ్చారు. ఆ రోజు సాయంత్రం రెడ్డిగారు నన్ను, అకౌంటెంట్ ని కారు ఎక్కించుకుని ఆఫీసు రోడ్డు చివరకి రాగానే నువ్వు ఇక్కడ దిగేసి బస్ లో వెళ్ళు నీకు రూటు తెలియాలి అని దింపేసి వెళ్ళిపోయారు.

అప్పటికి సాయంత్రం 6 గంటలైంది. రోజూ ఆ టైముకి బస్ వుండేది. కానీ రావలసిన బస్ ఎంతకీ రాలేదు. 7 గంటలైపోయింది. పటాన్ చెరు డిపోకి వెడదామంటే చాలా దూరం. ఇంతలోనే ఫ్యాక్టరీలో పనిచేసే ఒకతను వచ్చి అయ్యో అమ్మా ఇంకా వెళ్ళలేదా అని, నేను సైకిల్ మీద డిపోలో దింపుతాను. అక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పాడు. ఇంకేం చేస్తాను మరి. సైకిల్ ఎక్కి డిపోకి వెళ్ళాను. అక్కడ కూడా బస్ ఎంతకీ రాలేదు. ఇంతలోనే ఒక సెట్విన్ బస్ బిహెచ్ ఇఎల్ వరకు వెళ్ళేది వచ్చింది. అందరితోబాటూ నేనూ ఎక్కాను.

బిహెచ్ ఇ ఎల్ వెడుతుంటే నా పక్కన కూచున్నావిడ ఎక్కడికి వెళ్ళాలమ్మా అంది. మెహదీపట్నం అన్నాను. అయ్యో అవునా... అని, బిహెచ్ ఇఎల్ లో నేను దిగిపోతాను. మా ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ ఇస్తాను. బస్ రాకపోతే ఫోన్ చెయ్యి మా ఇంటికి వచ్చేద్దువుగాని. రేపొద్దున్న మా అమ్మాయికి కూడా ఇలా జరగచ్చేమో... అంటూండగానే ఆవిడ దిగే స్టాప్ వచ్చింది. నేనూ అక్కడ దిగాను.



రోజూ బస్ బిహెచ్ ఇ ఎల్ మీదుగా వెళ్ళినా కూడా దిగేపనిలేదు కాబట్టి కొత్త ప్రదేశమే. రాత్రి 8 గంటలు అయ్యింది. ఫోన్లు లేవు. జనసంచారం అంతంతమాత్రమే. ఏంచెయ్యాలో తోచలేదు.

నేను లక్ష్మీకెమికల్ ఇండస్ట్రీస్ ఆఫీసుకు వెళ్ళేదారిలో ఫైర్ ఆఫీసు వుంది. అక్కడ ముగ్గురు పనిచేసేవాళ్ళు రోజూ నన్ను చూస్తుండేవారు. నా వెంట పడి పేరు అడిగేవారు. నేను పట్టించుకోకుండా వెళ్ళిపోయేదాన్ని. నన్ను మా ఆఫీసు అబ్బాయి బస్ డిపోలో దింపినప్పుడు వాళ్ళు అక్కడే వుండి నేను పటాన్ చెరులో బస్ ఎక్కేవరకూ చూస్తూ ఎక్కాక టాటా చెప్పారు. నాకు భయం వేసింది. చూస్తూ కూచున్నాను.

ఇంక బి హెచ్ ఇ ఎల్ కూడా వచ్చారు. ఇదెక్కడి గోలరా అనుకున్నాను. అప్పుడు భయపడి నేను చేసేది ఏమీలేదు. సరేలే నాతోబాటు ఎవరో ఒకరు బస్ ఎక్కేవరకూ వున్నారు కదా... అనుకున్నాను.

ఇంతలోకే 117 వచ్చింది. అమ్మయ్య అనుకుని బస్ ఎక్కాను. వాళ్ళు మాత్రం బస్ ఎక్కలేదు. ఏదైతే ఏం లే. ఇంటికి వెళుతున్నానుగా అనుకున్నాను.

రాత్రి 9.30 అయ్యింది. మెహదీపట్నంలో బస్ దిగి గుడిమల్కాపూర్ లో ఉన్న ఇంటికి అర కిలోమీటరు దూరం లోపలకి నడవాలి. ఇళ్ళు కూడా అంతంతమాత్రమే. జనాలు ఎవరూ లేరు. అటూ ఇటూ చెట్లు, తుప్పలు వుండేవి. దారిలో లైట్లు కూడా అంత సరిగా వుండేవి కాదు. బిక్కు బిక్కుమంటూ ఇంటికి వెళ్ళేసరికి - అక్క ఆఫీసు వాళ్ళు దింపుతారులే అనుకున్నట్టుంది. ప్రశాంతంగా పుస్తకం చదువుకుంటోంది.

నాకు నిజంగా ఇదొక సవాల్ లాగే అనిపించింది.

2 కామెంట్‌లు:

  1. ఆ సమయానికి, పరిస్ధితులకు తగిన నిర్ణయం ఏదో మీ బ్యాంక్ అక్కగారు తీసుకుని ఉంటారు లెండి గానీ నాకు ఆశ్చర్యంగా తోస్తున్నది ఏమిటంటే ఆఫీస్ నారాయణగుడాలో ఉన్నప్పుడు అద్దె నివాసం ఎక్కడో గుడిమల్కాపూర్ లో ఏమిటండీ?

    నారాయణగూడా చుట్టుపక్కల బర్కత్-పుర, కాచిగుడా, చిక్కడపల్లి, వివేక్ నగర్ (త్యాగరాయ గానసభ ప్రాంతం), P&T Colony, అశోక్ నగర్, హిమయత్ నగర్, ఓ రూపాయ తక్కువ అద్దెకి నల్లకుంట - ఇన్ని మధ్యతరగతి ఏరియాలు (నడక దూరంలో) ఉండగా మెహదీపట్నం దాకా వెళ్ళడం ఏమిటండీ బాబూ? సరే, మీ స్వవిషయం అనుకోండి. ఇప్పుడదంతా గతం.

    అవును, ఆ రోజుల్లో - అంటే ఈ ట్రాఫిక్కూ, నిర్మాణాల madness పెరగక ముందు - మెహదీపట్నం నుండి BHEL వరకు ఆ ఓల్డ్ బాంబే రోడ్డు చాలా ఆహ్లాదంగా ఉండేది. అప్పుడప్పుడు ఆ వైపు పనేమీ లేకపోయినా కూడా నేను స్కూటర్ మీద ఆ రోడ్డులో BHEL దాకా వెళ్ళి వస్తుండేవాడిని. ఇప్పుడసలు రోడ్డు మీద కాలు పెట్టలేం. అన్నట్లు మీరు చెప్పిన ఆ ALIND స్థలం అన్యాక్రాంతమయిందని ఇటీవలి వార్త.

    ఆ రెడ్డి గారు బలే మనిషండీ. ఆ వైపుల సిటీ బస్సు సౌకర్యం అంతగా పెరగని ఆ రోజుల్లో, ఓ వైపు చీకటి పడుతుంటే ఓ మహిళా ఉద్యోగిని అలా వదిలేసి వెళ్ళి పోవడం ఏమిటి - రూటు అలవాటవ్వాలి అనే ఎంత సదుద్దేశం అయినప్పటికీ ? అది సమయం కాదు. ఏం భావ్యంగా లేదు.

    నిజంగా మీది "ఎదురీతే".

    రిప్లయితొలగించండి
  2. గుడిమల్కాపూర్ దగ్గరలో నవోదయ కాలనీలో మా మేనత్త కూతురు వాళ్ళుండేవారు. వాళ్ళే ఈ ఇల్లు చూపించారు. అక్కలకి సిటీకి కొత్త కాబట్టి అక్కడ ఉండిపోయారు. తర్వాత అక్కడ చాలా మంది కుటుంబ స్నేహితులయ్యారు. వీళ్ళకి ఏ సహాయం కావలసినా చేసేవారు. అలా అక్కడ అలవాటు పడిపోయారు. అయితే ఇప్పుడున్నంతగా మెహదీపట్నం అప్పట్లో లేదు కాబట్టి గుడిమల్కాపూర్ నుంచి కొంత దూరం రాగానే బస్ డిపో వుండేది. డిపోలోనే బస్ ఎక్కేసేవారు. చాలా ప్రశాంతంగా వుండేది. ట్రాఫిక్ అంతగా ఉండేది కాదు కాబట్టి బస్ ఒక 20 నిమిషాల్లో నారాయణగూడా చేరుకునేది.

    ఇప్పుడయితే ఈజీగా గంట పడుతుంది.

    తను ఫస్ట్ అప్పాయింట్ మెంట్ నారాయణగూడా కాబట్టి అప్పుడే అందరూ పరిచయాలు అవుతున్నారు. అందులోను తను ఎంత తెలివైనదో నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం తక్కువ. మా మూడో అక్క తీసుకునే నిర్ణయాలమీద తను ఆధారపడేది. అందుకని అక్కడ నుంచీ కదలలేదు.

    ఇకపోతే రెడ్డిగారు చేసిన పనికి మర్నాడు మా అకౌంటెంట్ వెంకటరత్నంగారు చాలా నొచ్చుకుని మర్నాడు ఆయనతో చెప్పారు. ఆయనేమన్నారో నాతో చెప్పలేదు. కానీ నన్ను వదిలేసినప్పుడే బస్ లు రాకపోవడం, సవాలు లాగా అలా జరగడం ఊహించని విషయమే.

    ఇలా చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఆరోజులు కాబట్టి క్షేమంగా ఇంటికి చేరానని అనుకున్నాను.

    రిప్లయితొలగించండి