31, మే 2022, మంగళవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 18 హైదరాబాద్ నగరంలో ఎదురీత

  మలుపులు తిరుగుతున్న నా జీవితం - 18   హైదరాబాద్ నగరంలో ఎదురీత

** టైపిస్ట్ కమ్ ట్యూషన్ టీచర్***


రోజూ పటాన్ చెరూ బస్సెక్కి ఆఫీసుకి వెళ్ళడం దినచర్య. ఆఫీసులో ఎం.డి. గారు వచ్చినప్పుడు వర్కు వుండేది. లేకపోతే ఆఫీసు వెనక తోటలో తిరిగి రావడం. ఇంకా బోరు కొడితే కెమికల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ వైపు వెళ్ళి చూసి వచ్చేదాన్ని. అయితే పని వాళ్ళు చాలా జాగర్త అని చెప్పారు. ఆ కెమికల్స్ తయారు చేసే తొట్లలో పొరపాటున పడితే ఎముకలు కూడా కరిగిపోతాయి. అంత ప్రమాదం. ఒక వర్కర్ అలా మాయమయ్యాడు. తెల్లారి అతని చెయ్యిమాత్రమే కొంచెం పైకి వచ్చి వుంది.

క్రమంగా తెలిసిందేమంటే ఎమ్.డి. రెడ్డిగారికి చాలా అప్పులు వున్నాయిట. ఫ్యాక్టరీ అంతంత మాత్రమే నడుస్తోంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 3వతరగతి చదువుతున్న వాళ్ళబ్బాయి చందుకి ట్యూషన్ టీచర్ కావాలి కాబట్టి నన్ను, టైప్ మిషన్ ని యూసఫ్ గూడా బస్తీలో వున్న వాళ్ళ స్వగృహంలోకి మార్చారు. ఇల్లు చాలా బావుండేది సినిమా సెట్టింగ్ లాగా.

నేను వాళ్ళింటికి వెళ్ళాలంటే మెహదీపట్నంలో బస్ ఎక్కి - లకడీకాపూల్ లో దిగి - అమీర్ పేట వెళ్ళే బస్ ఎక్కి అక్కడ దిగి దగ్గర దగ్గర 2 కిలోమీటర్ల దూరం నడిచి యూసఫ్ గూడా బస్తీలో వాళ్ళింటికి వెళ్ళాలి.



రోడ్డు మొదట్లో సారధీ స్టూడియోస్, మధ్యదారిలో ఒక మసీదు తప్ప దారంతా చాలా ఖాళీగా వుండేది. ఏవో చిన్న చిన్న ఇళ్ళు వుండేవి. మట్టి రోడ్డు. షేర్ ఆటోలు లేవు, బస్సులు లేవు. చచ్చినట్లు నడవాల్సిందే. అప్పుడప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూలుకి వెళ్ళి వాళ్ళ అబ్బాయి ఫీజు కట్టి వచ్చేదాన్ని. వాళ్ళ టీచర్ తో మాట్లాడమనేవారు. ఏవో బ్యాంక్ పనులు చేసేదాన్ని. ఇలాంటి పనులు ఉన్నప్పుడు నాలుగుసార్లు నడవాల్సి వచ్చేది. ఆయన రిక్షాలో వెళ్ళి రమ్మనేవారు. కానీ వాళ్ళావిడ నడిస్తే ఎక్సర్ సైజు, నడవమనేది.
చందు ఇంగ్లీషు మీడియం 3వ తరగతి చదువుతున్నాడు.. నేను ఎం.ఎ.తెలుగు, బి.ఎ. తెలుగు అయినా ధైర్యంగా ట్యూషన్ చెప్పడానికి రెడీ అయ్యాను. నేను చెప్పడం మొదలు పెట్టాక వాడికి మార్కులు పెరిగాయి. అప్పుడప్పుడు ఏవైనా లెటర్లు వుంటే టైప్ చేసేదాన్ని. నేను అక్కడికి వెళ్ళడం మొదలయ్యి రెండు నెలలు అయ్యాయి.

నా అదృష్టమో ఏమో నాంపల్లి నుంచి ‘9y’ రెండు బస్సులు వేశాడు. కొంత రిలీఫ్.

*** మళ్ళీ ఎప్పుడూ లాస్ట్ స్టాప్ అనలేదు ***

రోజూ లకడీకా పూల్ లో 9y ఎక్కి యూసఫ్ గూడ బస్తీకి వెళ్ళడం అలవాటయ్యింది. బస్తీ బస్ స్టాప్ లో చిన్న చిన్న షాపులు, ఆ వెనక రోడ్డులో రెడ్డిగారు వాళ్ళిల్లు. అందుకని ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేకపోయేది. మళ్ళీ సాయంత్ర 6 గంటలకి అక్కడ బస్ ఎక్కి వెళ్ళేదాన్ని. హాయిగా వుంది అనుకున్నాను.

ఒకరోజు లకడీకాపూల్ లో 9y బస్ ఎక్కాను. మరీ రష్ గా ఏమీ లేదు. టికెట్ కండక్టర్ అందరికీ టికెట్లు ఇస్తున్నాడు. వెనక నుంచి ఎవరో లాస్ట్ స్టాప్ అన్నారు. కండక్టర్ నా దగ్గిరకి రాగానే నేనూ స్టైల్ గా “లాస్ట్ స్టాప్” అన్నాను. కండక్టర్ టికెట్ ఇచ్చాడు. బస్ అమీర్ పేట నుంచీ సారధీ స్టూడియోస్ పక్కనుంచి లోపలికి ప్రవేశించింది. ఇంకొక 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను అని నిశ్చింతగా కూచున్నాను. కొంతమంది మధ్యలో దిగిపోయారు. బస్ ఏదో కొత్త రూటులో వెడుతున్నట్టు అనిపించింది. అయినా లాస్ట్ స్టాప్ అని చెప్పాను కదా అని కూచున్నాను.

ఇంక బస్ లో నేను, ఒక పల్లెటూరి ముసలామె, ఇంకొకతను, డ్రైవరు, కండక్టరు వున్నాం. ఆ బస్సు మట్టిరోడ్లమీంచి కొండలు, గుట్టల మధ్యలో ఆగింది. కండక్టరు “దిగండి దిగండి” అన్నాడు. ఎక్కడికి దిగాలీ.... ఇక్కడ ఆగిందేమిటీ... అనుకుంటూ... “యూసఫ్ గూడా బస్తీకి కదా వెళ్ళాలి” అన్నాను. “నువ్వు లాస్ట్ స్టాప్ అన్నావు కదమ్మా… ఇదే లాస్ట్ స్టాప్. కొత్తగా ఒక స్టాప్ పెంచారు” అన్నాడు కండక్టర్.

“నేను యూసఫ్ గూడా బస్తీకి వెళ్ళాలి, మళ్ళీ బస్సు ఎప్పుడు వెడుతుంది?” అన్నాను. “ఇంకా చాలా టైముందమ్మా.... నువ్వు అలా నడుచుకుంటూ పో.... పోలీస్ లైన్స్ వస్తాయి. అక్కడనించీ నీకు దగ్గరే” అన్నాడు. వేరే అతను, ఆ ముసలామె వెళ్ళిపోయారు. డ్రైవరు, కండక్టరు చాలా మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది.

కానీ నాకు మాత్రం బుర్ర తిరిగింది. వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్ళిపో అని తేలికగా అన్నారు కానీ.... అక్కడ మొత్తం సగం సగం తీసిన పునాదులు, గుట్టలు గుట్టలు గా రాళ్ళు, ఎర్రమట్టి. ఎక్కడో దూరంగా ఇద్దరు ఒక ఆడ, ఇద్దరు మగ పనివాళ్ళు పనిచేస్తున్నట్టు కనిపించింది. ఒక్కసారిగా....

“పాపం పసివాడు” సినిమా గుర్తొచ్చి, అందులో పాట “అమ్మా చూడాలని వుంది. నిన్నూ చూడాలని వుంది. పొరపాటు పనులిక చేయబోనని చెప్పాలని వుంది.... ” పాట కూడా గుర్తొచ్చింది. ఒక్కక్షణం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కొత్తగా హైదరాబాద్ వచ్చి ఇవేం సాహసాలు రా బాబూ అనుకుంటూ.... బయల్దేరాను.


ఆ బస్సు ఇప్పటి కృష్ణానగర్ నుంచి టర్న్ అయి ప్రస్తుతం జూబిలీ చెక్ పోస్ట్ ఏరియాకి వెళ్ళింది. అస్సలు ఒక్క బిల్డింగ్ కూడా లేదు. విపరీతమైన ట్రాఫిక్ తో నిండివున్న ఇప్పటి ఏరియా అప్పుడు అలా వుంది. మంచి ఎండ. అంతా మట్టి దిబ్బలు కాబట్టి పరిగెత్తేందుకు లేదు. మొత్తానికి ఆ మట్టి దిబ్బలు, పునాదులు దాటుకుంటూ, చీకట్లో చిరుదీపంలా ఆ పనివాళ్ళని చూసుకుంటూ, మనుషులున్నారనే ధైర్యం మనసుకి చెప్పుకుంటూ.... వాళ్ళ దగ్గిరికి వెళ్ళాను. వాళ్ళని పోలీస్ లైన్స్ కి ఎటు వెళ్ళాలి అని అడిగాను. అలా ముందుకి సీదా పో అమ్మా... అన్నారు.

అక్కడ కనుచూపు మేరలో ఏం కనిపించట్లేదు. మళ్ళీ నడక సాగించాను. మొత్తానికి ఆ పోలీసు క్వార్టర్స్ దగ్గిరకి వచ్చాను. అక్కడికి ఒక నాలుగు కిలోమీటర్లు నడిచి వుంటానేమో.... అక్కడ నుంచీ మొత్తానికి బయట పడ్డాను. మళ్ళీ దారి కనుక్కుంటూ.... రిక్షాలు వుండేవి. ఆటోలు అంతంత మాత్రమే. ఎక్కాలని కూడా అనుకోలేదు. మళ్ళీ అక్కడ నుంచీ 1.5 కిలోమీటరు నేను వెళ్ళాల్సిన రెడ్డిగారిల్లు. ఇప్పటిలాగా స్ట్రెయిట్ రోడ్లులేవు. జనసంచారం అంతగా లేదు. మళ్ళీ అందరినీ అడుగుతూ మొత్తానికి చేరాను. పొద్దున్న 9.30 గంటలకి చేరాల్సిన దాన్ని మధ్యాహ్నం 12.30 అయ్యింది.

వెళ్ళగానే మా ఆడబాస్ ఏంటి నాగలక్ష్మీ ఇప్పుడా రావడం. రెడ్డిగారు ఇప్పటి వరకూ చూసి బయటికి వెళ్ళిపోయారు. ఇంక రారేమో అనుకున్నాను అంది. ఒక్క నిమిషం అని - ఆవిడతో ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కాస్త ఫ్రెషప్ అయ్యి, మంచినీళ్ళు తాగి అప్పుడు జరిగినదంతా చెప్పాను.

అయ్యో! అవునా... అసలే సన్నగా వున్నారు. ఎలా నడిచారండీ బాబూ... (లావుగా వుంటే ఎక్కడో కూచుండిపోయేదాన్ని) ఎలాగా లేటయ్యింది కదా... లంచ్ చేసేసి, చందూ స్కూల్ నించి రాగానే ట్యూషన్ చెప్పి వెళ్ళిపోండి అంది. పొద్దున్న తిన్నదంతా అరిగిపోయింది.

ఇంక తప్పదుగా... వాళ్ళపని వాళ్ళకి. చందూగాడికోసం ఎదురుచూస్తూ కూచున్నాను.

2 కామెంట్‌లు:

  1. 🙂🙂
    సిటీబస్ ప్రయాణాలకి రకరకాల ట్రెయినింగ్ దొరికిందన్న మాట 🙂. దాంతో రాటుదేలిపోయుంటారు లెండి.

    రిప్లయితొలగించండి
  2. అవును సర్. అంతే అనుకోవాలి.

    రిప్లయితొలగించండి