2, జూన్ 2022, గురువారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 19 హైదరాబాద్ నగరంలో ఎదురీత

 మలుపులు తిరుగుతున్న నా జీవితం - 19   హైదరాబాద్ నగరంలో ఎదురీత



*** మౌనమే మేలనిపించింది ***

మళ్ళీ మామూలుగా బస్ ఎక్కడం దిగడం రొటీన్ అలాగే వుండేది.

కాకపోతే నాకు ఇంట్లో ఆఫీసు అయ్యేసరికి కొన్ని చికాకులు మొదలయ్యాయి.

ఒకరోజు రెడ్డిగారి భార్య ఆడబాస్ అరుణ "నాగలక్ష్మీ! నేను కొంచెం పనిలో ఉన్నాను. స్టౌవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టవా....!" అని అడిగింది.

అప్పట్లో కుక్కర్ లు కొత్తగా వస్తున్నాయి. నాకు దాని మొహమే తెలియదు. మా వూళ్ళో అమ్మ కుంపటి మీద కమ్మగా రకరకాలు చేసి పెడితే తినడం, అమ్మకి ఏమైనా కావాలంటే బయటి నుంచి తెచ్చిపెట్టడం తెలుసు అంతే. "నేనయితే వంటెప్పుడూ చెయ్యలేదు. నాకు కుక్కర్ ఎలా పెట్టాలో తెలియదు" అని చెప్పాను. కొంచెం చిరాగ్గా మొహం పెట్టుకుని ఆవిడే చేసుకుంది.
ఇంకోరోజు "ఇవాళ మా ఇంటికి ఫ్రండ్స్ వస్తున్నారు. పనమ్మాయిని తీసుకుని వెళ్ళి మజాలు తీసుకురండి" అని చెప్పింది.

నేను “మజాలా....? అవేంటీ ఎలావుంటాయి?” అని అడిగాను.

ఆవిడ వెర్రిమొహం వేసుకుని చూసి “ఏమిటీ మజా అంటే తెలియదా....? మరీ వింతగా మాట్లాడుతున్నారు" అంది. ఆ మజా వింతేమిటో నాకర్థమయితే కదా....! మజా కూడా అప్పట్లో కొత్తగా వస్తోంది. కూల్ డ్రింక్స్ మీద అసలు ఇంట్రస్ట్ లేదు. పైగా ఇప్పటిలా ఎక్కడపడితే అక్కడ ప్రకటనలు లేవు. అందుకే నిజంగానే అసలు అదేమిటో అర్థం కాలేదు. ఆవిడే పనమ్మాయిని పంపించి తెప్పించుకుంది. తర్వాత నాకు కొంచెం ఇచ్చింది లెండి. అప్పుడనుకున్నాను - ఓహో మామిడి పండు రసమన్నమాట. మజాగానే వుందిలే అనుకున్నాను.

రెడ్డిగారు ఫోన్లు ఏమైనా వస్తే నేను లేను బయటికి వెళ్ళానని చెప్పమన్నారు – అప్పులున్నాయి కదా. సరేకదా అని – ఒకరోజు ఫోను రింగయితే “సార్ లేరు బయటకి వెళ్ళారు” అని చెప్పాను. ఆవిడ వచ్చి "నేను లోపల ఎక్స్ టెన్షన్ తీశాను. అలా ఎందుకు చెప్పారు? ఆయనకి చాలా మంచి స్నేహితుడు. నన్ను పిలవాల్సింది" అని అరిచింది. నాకేం తెలుసు మంచో చెడ్డో... నాకు మాత్రం కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

ఎంత మంచి స్నేహితుడో తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి తెలిసింది. ఆయన చిట్ ఫండ్ కంపెనీ పెట్టి జనాల్ని ముంచి అరెస్టయ్యాడు.

ఇంక రెడ్డిగారు బయటికి వెడితే వచ్చి కూచుని వాళ్ళ గొప్పలన్నీ చెప్పుకుంటూ వుండేది. అవన్నీ నేను చేతులు కట్టుకుని వినాలి. ఒకరోజు ఆడవాళ్ళ అలంకరణలు, అందం విషయంలో తీసుకునే జాగ్రత్తలకి సంబంధించిన పుస్తకం తెచ్చి అందులో వున్న విషయాలన్నీ చెప్తోంది. అప్పుడే ప్రపంచంలోకి అడుగుపెట్టానేమో అందులో విషయాలు కొన్ని నాకు అర్థంకాలేదు. నేను మాటాడకుండా వింటూ... “అవును కొంతమంది కొన్నివిషయాలు పట్టించుకోరు” అన్నాను. ఆవిడ దేనికి అన్వయించుకుందో తెలియదు. పుస్తకం అక్కడ పడేసి విసురుగా వెళ్ళిపోయింది. అప్పుడేమో.... అమాయకంగా చూస్తూ కూచున్నాను. ఇప్పుడేమో ఆవిడ ఫీలింగ్స్ గుర్తు చేసుకుంటే ఏదో పెద్ద విషయానికే అన్వయించుకున్నట్టుంది అనుకున్నాను. చాలా అందంగా మాత్రం వుండేది.

రెడ్డిగారు ఈవిడకి మేనమామ - ఇష్టపడి చేసుకున్నారు. ఎంత అందగత్తో అంత అహంకారమూ వుంది. వాళ్ళమ్మ వసుంధరగారు వాళ్ళు ఎదురుగా రోడ్డులో వుండేవారు. ఆవిడ వస్తుంటే మహారాణీలా వుండేది. చూడగానే నమస్కరించాలనిపించేది. ప్రశాంతవదనం. పొందికైన మాట. ఈ ఆడబాస్ అరుణ మాత్రం తనకి రోజూ నమస్కారం పెట్టమనేది. పొరపాటున మర్చిపోయి పెట్టకపోతే ఆ రోజంతా మొహం మటమట.

అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రెడ్డిగారు పిలిచి “నాగలక్ష్మీ! నువ్వు అరుణతో సరిగ్గా వుండట్లేదుట ఏమైంది?” అన్నారు. ఏం సరిగ్గా వుండట్లేదో నాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆవిడ ఏం చెప్పిందో… ఈయన ఏం అనుకున్నారో తెలియదు. నేను ఏమీ మాట్లాడకుండా నుంచున్నాను. ఆయన అడిగే మాటలకి నాకు కోపం, బాధ తన్నుకుని వస్తోంది. కానీ ఆవిడ గురించి నేను ఒక్క మాట కూడా ఆయనకి చెప్పలేదు.

నేను “నాకు శాలరీ ఇచ్చెయ్యండి సర్. నాకు వేరే జాబ్ వచ్చింది” అని చెప్పాను. నాకు నచ్చకపోతే తరవాత విషయం ఎలా వున్నా... వెంటనే డెసిషన్ తీసుకునే అలవాటు నాకు. (దూకాలా వద్దా అన్నదే నా పాలసీ) ఆయనకి షాక్. “ట్యూషన్ బాగా చెప్తున్నావు కదా... చందూకి మార్కులు పెరిగాయి” అన్నారు. మౌనమే సమాధానమయ్యింది. మాటాడకుండా డబ్బులు ఇచ్చేశారు. నేను వచ్చేశాను. బస్సులో కూచున్నానన్నమాటే కానీ నాకు కళ్ళ నించి నీళ్ళు కారిపోతున్నాయి. నా పక్కన కూచున్న పెద్దావిడ "ఏమయ్యిందమ్మా... అలా ఏడుస్తున్నావు?" అంది. ఎలాగో దుఃఖాన్ని దిగమింగుకుని కళ్ళు తుడుచుకుని "ఏమీలేద"న్నాను. "వయసులో ఉన్న ఆడపిల్లవి ఏమయ్యోదో అనుకున్నాను" అంది. "ఫ్రెండ్స్ మధ్య గొడవ" అన్నాను.

***
*** ఓడలు బళ్ళయ్యాయి ***

దాదాపు పదేళ్ళ తర్వాత నేను మా పిల్లల స్కూలుకి వెళ్ళినప్పుడు ఒకావిడ నాకు ఎదురుపడి నన్ను దాటుకుంటూ వెళ్ళిపోయింది. ఎవరో చూసినట్టు వుంది అనుకుంటూ గబగబా వెనక్కి వెళ్ళాను. చూడగానే “మీరు చందూ వాళ్ళ అమ్మమ్మ కదూ” అన్నాను. “అవునమ్మా నువ్వెవరు?” అందావిడ. “వసుంధర గారు వెలిసిపోయి, ముడతలు పడిన వాయిల్ చీరలా” వుంది. అప్పటి హుందాతనం లేదు. నాకు బాధేసింది.

“నేను మీ అమ్మాయి వాళ్ళింట్లో చందూకి ట్యూషన్ చెపుతూ, టైపింగ్ కూడా చేసేదాన్ని కదా...” అన్నాను. “నువ్వామ్మా బావున్నావా....!” అని, ఈవిడ అల్లుడు కమ్ తమ్ముడు రెడ్డిగారు తన ఆస్తి అంతా పోగొట్టుకుని, బావమరుదుల పేరుమీద ఉన్న ఆస్తులు కూడా పోగొట్టారుట. పరిస్థితి చాలా హీనంగా వుందిట. "నువ్వేం చేస్తున్నావు?" అని అడిగారావిడ. నేను అప్పటికి ప్రింటింగ్ లైన్లో బాగా స్థిరపడ్డాను. ఆవిషయం చెప్పాను.

"అమ్మా! ఏమీ అనుకోకపోతే ఒక పదివేలు అప్పు ఇస్తావా...! ఆ పదివేలు కడితే మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది" అని చెప్పింది. ఆవిడ దీనంగా అడిగే పద్ధతి నాకు కడుపులో ఎక్కడో బాధ తన్నుకుని వచ్చింది. ఆవిడకి సాయం చేశాను.

వసుంధరగారు నన్ను వాళ్ళింటికి తీసుకుని వెళ్ళి "కూచో అమ్మా! కూల్ డ్రింక్ ఇస్తానుఠ అన్నారు. ఒక మేడమీద (దాన్ని ఇప్పుడు పెంట్ హౌస్ అంటారు.) ఈ పొడుగు నుంచి ఆ పొడుగుదాకా ఉన్న రేకుల షెడ్. ఇంతలోకే రెడ్డిగారి భార్య అరుణ వచ్చి, "మా దగ్గిర చేసినవాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు. మేము మాత్రం ఇలా అయ్యాం. మీరు వెళ్ళిపోండి. మా అమ్మకి నేను చెప్తాను" అంది.

నాకేమనాలో తెలియక అక్కడ నుంచి వెళ్ళిపోయాను. వసుంధరగారు ఒకరోజు కనిపించి అడిగితే ఏదో పనుండి వెళ్ళిపోయానని చెప్పాను. ఫోనొచ్చిందని చెప్దామంటే అప్పట్లో ఫోన్లు లేవు. అదీ సంగతి.

4 కామెంట్‌లు:

  1. మొదట్లో గమనించలేదు, కొన్ని టపాలు చదవలేకపోయా ననుకుంటాను. ఈమధ్య గమనించి చదువుతున్నాను. చక్కగా వ్రాస్తున్నారు. నిజమే వెనుకకు తిరిగి చూసుకుంటే గతకాలపుటనుభవాలు చిత్రంగా అనిపిస్తాయి, మీ అంత బాగా వ్రాయలేను కాబట్టి నేనూ వ్రాసే సాహసం చేయలేను. జీవనగమనం ఇంత చమత్కారంగా ఉంటుంద అని అనిపిస్తుంది మీ రచన చదువుతుంటే. బాగుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలండీ... ఏదో సరదాగా రాద్దామని మొదలుపెట్టాను. ఇన్ని సంవత్సరాలయ్యాక సినిమా రీలులా కళ్ళముందు కదుల్తుంటే నాకే ఆశ్చర్యంగా వుంది. మా అమ్మా వాళ్ళు పాడీపంటలో పెరిగిన వాళ్ళు. తను ఉన్నప్పుడు తెలుసుకోవడానికి నేను మధ్యలో అమ్మాయిని అయిపోయాను. చిన్నదాన్ని అన్నీ అడగాలని తెలియలేదు. ఇప్పుడు బాధపడుతున్నాను. ఇప్పుడు జల్లెడ పట్టి వాళ్ళ బంధువులందరి దగ్గరా సమాచారం సేకరిస్తున్నాను. మా అమ్మ విజేత అని నెచ్చెలిలో సీరియల్ గా రాస్తున్నాను.

      తరవాత మా తాతగార్లు, బామ్మలు, అమ్మమ్మలకి చాలా గొప్ప కథలు వున్నాయి. ఆవిషయంలో కూడా ఇలాగే సేకరిస్తున్నాను.

      నా విషయం నేనే రాసుకుంటే నా పిల్లలకి తెలిస్తుంది... అందుకే ఇలా రాయాలని మొదలుపెట్టానండీ.... వాళ్ళని ఎంత సెటిల్ చేసినా.... వాళ్ళకీ కొన్ని విషయాలు తెలియాలి. నేను మిస్సయినట్లు వుండకూడదు. వాళ్ళు చాలా వరకు అర్థం చేసుకుంటారు. చిన్నప్పటి నుంచీ నా వెనకే వున్నారు. కొన్ని మాత్రమే తెలుసు.

      తొలగించండి
  2. చివరకు ఆ చాకిరీ నుండి బయట పడ్డారన్నమాట.
    అనుకున్నాను - అటువంటి యజమానులు వద్ద ఎక్కువ కాలం పని చెయ్యడం కష్టం - అని. పోనీండి, good riddance అని ఆంగ్లంలో అన్నట్లు ఏది జరిగినా మంచికే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవును సర్ మా అమ్మ అంతయూ మనమేలుకొరకే... అని ఒక రాజుగారి కథ చెప్పేది. మా అమ్మ బాగా వాడుతుండేది. నాలో ఒకలాంటి మొండి ధైర్యం వుండేది. ముందుర ఇక్కడ నుంచి బయటపడాలి అనుకునేదాన్ని.

      తొలగించండి