మలుపులు తిరుగుతున్న నా జీవితం - 20 హైదరాబాద్ నగరంలో ఎదురీత
రెడ్డిగారింటికి స్వస్తి చెప్పేముందు ఈనాడులో ఆడవాళ్ళకి సబ్ ఎడిటర్ పోస్టులకి పడింది. నాకు ఎందుకో ఆ పోస్టు అంటే ఇష్టం. నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం. అప్లయి చేశాను. ఒకరోజు ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వస్తే... ఈనాడు ఆఫీసుకి వెళ్ళాను.
అక్కడ కింద సెక్యూరిటీ వాళ్ళు ప్రముఖ పాత్రికేయులు, రచయిత, సంపాదకులు, చిత్రకారులు చలసాని ప్రసాదరావుగారి దగ్గరికి పంపించారు. నాకు అంతకుముందే ఆయన మాట్లాడలేరు, వినలేరు అని తెలుసు. ఆయన చాలా బిజీగా వున్నారు. కాసేపు కూచున్నాక ఆయన దగ్గిరకి రమ్మంటే వెళ్ళాను. ఆయనకి నా సర్టిఫికెట్లు అందించాను. వాటిని ఆయన పక్కన పెట్టేశారు. కొన్ని ప్రశ్నలు రాతపూర్వకంగానే అడిగారు. నేను రాతపూర్వకంగానే సమాధానం చెప్పాను. ఆయన మొహంలో సంతృప్తి కనిపించింది. బావుంది. మీరు రేపు ఒకసారి రండి అని రాశారు. మర్నాడు వెళ్ళాను.
చిరునవ్వుతో వున్నారు. పేపరు తీసుకుని “మీరు ఇవాళ నుంచీ చేరవలసి వుంది. మాకు కావలసిన పనులు మీరు చెయ్యగలరు. కానీ కొన్ని కారణాలవలన తీసుకోలేకపోతున్నాం. క్షమించండి” అని రాశారు. నవ్వుతూ ఆయనకి నమస్కరించి బయటికి వచ్చేశాను.
నేను ఏమీ నిరాశపడలేదు. ఎందుకంటే – “అమ్మ అనేది ఏది జరిగినా మన మంచికోసమే” అని.
కానీ, అక్కడ కూచున్న కాసేపు ఆయన పెదవులమీద చిరునవ్వు, కళ్ళతో ప్రపంచాన్ని మొత్తం పరిశీలించగల శక్తిని చూశాను. ఆ కాసేపట్లో ఆయన ఆఫీసు వాళ్ళకి సందేహాలని కానీ, చెయ్యాల్సిన పనులని కానీ పేపరు మీదే చెప్పడం – వాళ్ళూ ఆయన విలువైన సూచనలు తీసుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక గొప్ప ప్రముఖుణ్ణి కలిసినందుకు చాలా ఆనందంగా అనిపించింది. అన్నీ సక్రమంగా పనిచేస్తూ… మౌనంగా వుండి ఎంతమంది చెయ్యాల్సిన పనులు సక్రమంగా చెయ్యగలరు? అనిపించింది.
*** నెల రోజుల వైభోగం ఆ ఉద్యోగం - కొత్తపాఠం నేర్చుకున్నా ***
ఇంటికి వచ్చేసరికి అక్కకి హైదరాబాద్ నుంచి తాడేపల్లిగూడెం ట్రాన్స్ ఫర్ అయినట్టు తెలిసింది. తను రెండు రోజుల్లో వెళ్ళి జాయిన్ అయిపోవాలి. పక్కనే వున్న వాళ్ళకి అందరికీ చెప్పింది. అప్పటికే నేను నాంపల్లిలో వున్న ఒక ఎడ్యుకేషనల్ సెంటర్ లో తెలుగు టైపిస్టు పోస్టుకి అప్లయిచేశాను. తను అందుకని ధైర్యంగా వుంది. రెండు రోజుల తర్వాత తాడేపల్లి గూడెం వెళ్ళిపోయింది.
పక్కనే వున్న లలితగారు వచ్చి అమ్మాయ్ నువ్వేం భయపడకు. మేమందరం వున్నాం. కావాలంటే మా ఇంటికి వచ్చి పడుకో అన్నారు. అందరూ చుట్టుపక్కల తెలిసినవాళ్ళే. కాబట్టి భయంగా ఏమీ అనిపించలేదు.
ఒకరోజు ఎడ్యుకేషన్ సెంటర్ వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ పంపారు. నాంపల్లి స్టేషన్ రోడ్డులో హోటల్ అన్నపూర్ణా వెనకవైపు వుంది. ఇంటర్య్వూకి వెళ్ళాను. కొన్ని పేపర్లు టైపు తెలుగులో చెయ్యమన్నారు. చేశాను. నేను పాసయిన తెలుగు టైపు అక్కడ ఉపయోగపడింది. నేను చదివిన ఎం.ఏ. తెలుగుకి సార్థకత వస్తుంది అనుకున్నాను. రేపటి నుంచి వచ్చి చేరమన్నారు. అమ్మయ్య అనుకున్నాను. అక్కడ నీరజ అని ఒకమ్మాయి వుంది. తను మెహదీపట్నం నుంచే వస్తుందిట. చేరింతర్వాత నుంచీ నేనూ తనూ కలిసివెళ్ళి వస్తూండేవాళ్ళం.
ఆ ఎడ్యుకేషనల్ సెంటర్ వోనర్ ఖదీర్ వరంగల్ కి చెందిన వ్యక్తి. తెలుగు చాలా బాగా మాట్లాడేవారు. స్టూడెంట్స్ కి కూడా క్లాసులు చెప్పడంలో దిట్ట. సరే నేను అక్కడ వర్కు బాగానే చెయ్యగలిగాను. ఒక శనివారం సాయంత్రం నేను ఇంటికి వచ్చేస్తుంటే ఆయన - "మా బొచ్చుకుక్క పిల్లలని పెట్టింది.. వాటిని అమ్మడానికి పేపర్లో ప్రకటన ఇచ్చాను. కొనుక్కునేవాళ్ళు రేపు వస్తారు. మీరు ఆఫీసుకి రండి" అని చెప్పారు. అయితే మర్నాడు ఆదివారం. ఓహో ఉద్యోగాల్లో ఆదివారం కూడా రావాలేమో... పిల్లలకి పరీక్షలు ఉన్నాయి కదా అనుకున్నాను. - అయితే నీరజ “లక్ష్మీ నువ్వు ఇప్పుడు ఆయనతో ఏమీ చెప్పకు. నువ్వు మాత్రం రావద్దు” అని చెప్పింది.
నేను ఆదివారం ఆఫీసుకి వెళ్ళకుండా సోమవారం మామూలు టైముకి వెళ్ళాను. నేను కూచునే చోటులో టైపు మిషన్ లేదు. ఖదీర్ గారు ఆయన రూములో పెట్టుకుని టైపు చేసుకుంటున్నారు. నేను వెళ్ళి “వర్కు చేస్తాను టైపు మిషన్ ఇమ్మ”ని అడిగాను. నాతో ఏమీ మాట్లాడలేదు. సరే కాసేపు చూద్దాంలే అనుకుని, నేను నా ప్లేస్ లో వచ్చి కూచున్నాను.
నీరజని పిలిచి "నెలాఖరుకి వచ్చి శాలరీ తీసుకెళ్ళమను" అని చెప్పారు. తను నాకు చెప్పింది. నేను వెంటనే బాగ్ తీసుకుని ఇంటికి వచ్చేశాను. నేను వచ్చేశాక – “బతిమాలుతుందనుకున్నాను. కాళ్ళు పట్టుకుంటుందనుకున్నాను. కళ్ళలో ఒక్క కన్నీటి బొట్టు కూడా లేదు. పైగా నాకు చెప్పేసి మరీ వెళ్ళిపోయింది. ఉద్యోగం పోయిందని భయమే లేదు” అన్నారని నీరజ మర్నాడు చెప్పింది.
నా మైండ్ లో రేపటి సంగతి ఏమిటి? అనే ప్రశ్నే రాలేదు. “ఏదైనా మన మంచికోసమే” అన్న అమ్మమాట మరోసారి తలుచుకున్నాను. ఇది బలే గొప్ప మాట తెలుసా... మనలో ఆత్మవిశ్వాసాన్ని బలే పెంచుతుంది. అప్పటి నుంచీ నన్ను నేను మరింత మోటివేట్ చేసుకోవడం ప్రారంభించాను.
అసలు ఆ ఉద్యోగం విషయమే మర్చిపోయాను. కాకపోతే నేను అక్కడ నుంచీ బయటి వస్తుంటే.... పక్కషాపుల వాళ్ళు "ఏమ్మా! ఏమైంది? వచ్చి వెళ్ళిపోతున్నావు?" అన్నారు. జరిగిన సంగతి చెప్పాను.
వాళ్ళు "మంచి పని చేశావు. వాడసలు మంచివాడు కాదు. నీకు మంచి ఉద్యోగమే దొరుకుతుంది. ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు చేసి మానేశారో మాకు తెలుసు" అన్నారు.
అదేమో కానీ... అప్పడప్పుడు నీరజతో పిచ్చిగా మాట్లాడడ్డం మాత్రం చూశాను. ఏదైతేనేం. బయటపడ్డాను. నీరజకి చాలా థాంక్స్ చెప్పాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి