8, జూన్ 2022, బుధవారం

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 21 ట్యాంక్ బండ్ మీద జ్ఞానోదయం - జీవితం నేర్పుతున్న పాఠాలు

మలుపులు తిరుగుతున్న నా జీవితం - 21    ట్యాంక్ బండ్ మీద జ్ఞానోదయం - జీవితం నేర్పుతున్న పాఠాలు


మళ్ళీ ఒకసారి వెనక్కి అక్కకి ట్రాన్స్ ఫర్ అవకముందు



అప్పట్లో ట్యాంక్ బండ్

నేను హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయడానికి సికిందరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఆరోజే ఏలూరు నుంచి మా బాబాయి వచ్చాడు. అక్క నన్ను ఎగ్జామ్ సెంటర్ దగ్గర దింపేసి, “నీ ఎగ్జామ్ అయ్యేసరికి 3 అవుతుంది - నువ్వు సికింద్రాబాద్ లో నెం.5 ఎక్కితే ట్యాంక్ బండ్ మీద కోడిబొమ్మ షాపు (అప్పట్లో పేద్ద తెల్ల కోడిలాంటి షాపు ఉండేది) దగ్గిర రిక్వెస్ట్ బస్ స్టాప్ వుంటుంది అక్కడ దిగు. నేను, బాబాయికి సిటీ చూపిస్తాను. 4 గంటల లోపు అక్కడ వుంటాం. అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం” అని బాబాయికి సిటీ చూపించడానికి తీసుకెళ్ళింది.

నా ఎగ్జామ్ అయ్యింది. నేను కోడిబొమ్మ షాపు దగ్గిర దిగాను. అక్కడ అక్కావాళ్ళు లేరు. చేతికి వాచ్ వుండేది. టైమ్ సా. 4 అయింది. ఒక అరగంట వెయిట్ చేశాను రాలేదు. సరే కదాని కాసేపు టాంక్ బండ్ అందాలు, వచ్చేపోయే వాళ్ళని చూసుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్నాను. ఇంకా రావట్లేదు. అక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఆ హుస్సేన్ సాగర్ నీళ్ళలో ఎన్ని కెరటాలు, ఎంత పైకి లేస్తున్నాయో లెక్కపెట్టేశాను. అది ఆగదుగా బోరు కొట్టింది. డబుల్ డెక్కర్ బస్సులలో ఎక్కి, దిగే మనుషుల్ని, వాళ్ళ హడావిడిని చూశాను.

టైమ్ సా.6 అయ్యింది. ఇంక కాసేపు తిరుగుదాం అని మళ్ళీ మొదలుపెట్టాను. ఇలా తిరిగేటప్పుడు నలుగురు అబ్బాయిలు ఒక్కోక్కళ్ళుగా నా వెనక తిరగడం మొదలుపెట్టారు. నేను వాళ్ళు వచ్చి వెళ్ళేవాళ్ళు అనుకున్నాను. కానీ కాదని తర్వాత అర్థం అయ్యింది. ఇంతలోకే ఒక పెద్దమనిషి అంటే నాకన్నా పెద్దే.... ఆయనతోటి చెప్పి, ముందుకి నడుస్తున్నాను. ఆయన పాటలు పాడుకుంటూ... చెయ్యి తగిలించుకుంటూ నడుస్తున్నాడు. నాకు చిరాకనిపించింది. కాకపోతే ధైర్యం అనేది ఎక్కడో మూలల నుంచి తడుతుంటే... పరిస్థితిని అర్థం చేసుకుని ఇంక నేను అక్కడ నుంచి వెనక్కి చూడకుండా ట్యాంగ్ బండ్ చివర ఉన్న బస్ స్టాప్ కి వెళ్ళాను.

అక్కడ ఇద్దరు చిన్నపిల్లలలతో భార్యా భర్త ఉన్నారు. ఆవిడ నా దగ్గిరకి వచ్చి “ఏమైందమ్మా?” అంది. చెప్పాను. “ఎదురుగా పోలీస్ స్టేషన్ వుంది కంప్లయింట్ ఇయ్యి” అన్నారు ఇద్దరూ. నాకు ముందరే పోలీసులంటే భయం. “ఫర్వాలేదు లెండి వెళ్ళిపోయారుగా” అన్నాను. “నువ్వు సిటీకి కొత్తనుకుంట. ఇంకెప్పుడు టాంక్ బండ్ మీద ఒంటరిగా తిరగగకు. అదీ సాయంత్రమప్పుడు. మామూలు వాళ్ళు తిరిగే చోటు కాదు” అన్నారు.

ఎంతకీ బస్ రావట్లేదు. వాళ్ళు ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోయారు. బస్ స్టాప్ లో నేను, ఇంకో ఇద్దరూ వున్నాం. మొత్తానికి 7.30 కి డబుల్ డెక్కర్ బస్ వచ్చింది. బస్ లో కొంచెం జనాలు బాగానే వున్నారు. వెంటనే ఎక్కి కూచున్నాను. హుస్సేన్ సాగర్ లో కెరటాలు ఎగిసి ఎగిసి పడుతూ నా భయాన్ని చూసి నవ్వినట్టనిపించింది.

ఇంటికి వెళ్ళేసరికి రాత్రి గం. 8.15ని. అక్కావాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేసరికి రాత్రి 9.30 అయ్యింది. “మీరెందుకు రాలేదు?” అన్నాను.

“మేమిద్దరం నౌబత్ పహాడ్ కి, బిర్లామందిర్ కి వెళ్ళాం. పబ్లిక్ గార్డెన్స్ చూడడానికి కిందకి వెళ్ళి వెళ్ళాలని చెప్పాను బాబాయికి – బాబాయి నౌబత్ పహాడ్ మించి కిందకి చూసి ఈ పక్కన్నించి అంతా స్లోప్ గానే వుంది. మనం మెల్లిగా ఇక్కడ నుంచి కిందకి కూచుని దిగుతూ వెళ్దాం” అన్నాడు అని చెప్పింది. పైగా ఎంత సాహసమో.... ఇద్దరూ చెప్పులు కిందకి విసిరేసి. మెల్లిగా కొండమీంచి జారుకుంటూ మొత్తానికి పబ్లిక్ గార్డెన్ కి చేరారుట. దానికే గంట టైం పట్టిందిట. కాళ్ళూ, చేతులూ గీరుకుపోయాయి. పబ్లిక్ గార్డెన్స్ చూసి, ఇంకెక్కడికో వెళ్ళి వచ్చారు. ఇంక నేనేమీ మాట్లాడలేదు.

కానీ తర్వాత ఓ నిర్ణయానికి వచ్చాను.

నాకు మొత్తానికి ట్యాంక్ బండ్ మీద జ్ఞానోదయం అయ్యింది. నేను తీసుకున్న నిర్ణయాలు నా జీవితంలో బాగా ఉపయోగ పడ్డాయి.

అవి -
1. పబ్లిక్ ప్లేస్ లలో వెయిటింగ్ పెట్టుకోకూడదు. గుడులు, పుస్తకాల షాపులు, ఇంకేవైనా షాపులు ఓకే.

2. ఎవరైనా కలుద్దామని చెప్తే అనుకున్న టైం కన్నా అరగంట మాత్రమే ఎక్కువ వెయింటింగ్ ఉంటుంది. ఫోన్లు లేవు కాబట్టి ఆరునూరైనా ఇంటికి వెళ్ళిపోవడం.

కొన్నిసార్లు నా పద్ధతి చూసి కొంతమందికి కోపం వచ్చింది. కానీ నా వరుకు నేను టైం పాటించడం మొదలు పెట్టాను. ఇక ఎప్పుడైనా ట్రాఫిక్ వుండి, కుదరని పరిస్థితులు వుంటే ఇప్పుడు ఫోను వుంది కాబట్టి ఇబ్బంది లేదు.

టైం పాటించకపోతే అవతలి వాళ్ళకీ, మనకీ ఇద్దరికీ ఇబ్బందే అన్న విషయం తెలుసుకున్నాను.

తర్వాత మళ్ళీ అసలు కథలోకి వస్తాను.

2 కామెంట్‌లు:

  1. వింత సిటీబస్సు అనుభవాలండీ మీవి.

    అదే నెం.5 సిటీబస్సు మెహదీపట్నం వరకు తీసుకు వెళ్ళేదిగా - మధ్యలో టాంక్ బండ్ దగ్గర దిగాల్సి వచ్చింది గానీ . మీరు చే‌సుకున్న తీర్మానాలు కరెక్ట్ గా ఉన్నాయి.

    చివర్లో మీరన్నట్లు నాలుగింటి నుండి ఓ అరగంట మహా అయితే ఓ గంట ఎదురు చూస్తే సరిపోయేది.

    సిటీబస్సు రూటు నెంబర్లు ఇప్పటికీ అవే ఉన్నట్లున్నాయి.

    రిప్లయితొలగించండి
  2. నేను ఇప్పుడు తలుచుకుంటే నాకే వింతగా అనిపిస్తుంది సర్. మధ్యలో టాంక్ బండ్ దగ్గర అక్క, బాబాయి వస్తారని దిగాను. బాబాయి టాంక్ బండ్ చూడాలనుకున్నాడు. రూటు నెంబర్లు ఇప్పటికీ అవే ఉన్నాయి. సిటీ కొత్త కాబట్టి ఏమీ తెలియదు. ఫోన్లు లేవు. కానీ పెద్ద ఎక్స్పీ రియన్సే సర్.

    రిప్లయితొలగించండి