మలుపులు తిరుగుతున్న నా జీవితం - 22 *** ఒంటరి పోరాటంలో ఆనందం ***
నాంపల్లి ఆఫీసులో ఉద్యోగం మానేశాక. చేతిలో అవసరాలకి సరిపడిన డబ్బులు ఎంతోకొంత వున్నాయి. అక్క తాడేపల్లిగూడెం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా డబ్బులు అవసరం వస్తే అడగమంది. నాన్నగారు ఆంధ్రాబ్యాంక్ లో చేస్తూ ఉన్నట్టుండి ప్రపంచానికి దూరమయినప్పుడు - పెద్దక్క తను బ్యాంకులో చేస్తూ కుటుంబ బాధ్యత తీసుకున్నప్పుడు, అందరం అందరికీ సాయంచేసుకోవాలి అనుకున్నాం. ఇక రెండో అక్క స్టేట్ బ్యాంక్, మూడో అక్క ఢిల్లీలో గవర్నమెంట్ ఉద్యోగం. చెల్లెళ్ళకి సాయం చెయ్యడానికి అసలు వెనకడుగు వెయ్యరు.
కానీ చూద్దాంలే అని నా ప్రయత్నం నేను చేద్దాం అనుకున్నాను. అవసరమైతే చూద్దాం అనుకున్నాను. చిన్నప్పటి నుంచీ ‘డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్’ అంటూ వుండేదాన్ని. అక్కావాళ్ళు నవ్వుతూ వుండేవారు. నాకెందుకో అది నచ్చింది. అందరూ నన్ను చూసి నవ్వేవారు. అది మైండ్ లో వుండిపోయింది.
ముందర అర్జంటుగా ఇంటి వాళ్ళతో మీకు రెంట్ మూడు ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తానని చెప్పాను. ఇంటి రెంట్ రు. 60. అప్పటికి అది ఎక్కువే. వాళ్ళు సరే అన్నారు. అస్సలు ఏమీ అనలేదు. “నీ దగ్గిర ఎప్పుడు డబ్బులు వుంటే అప్పుడే ఇయ్యి బిడ్డా” అన్నారు. అమ్మయ్య ఒక సమస్య తీరింది అనుకున్నాను. కానీ నెలకి 20 రూపాయలు చొప్పున వాళ్ళకి ఇచ్చేశాను.
*** (గుడిమల్కాపూర్ లో మేమున్న ఇల్లు ఒక పెద్ద గేటు, ఆ గేటులోపల కాంపౌండు. మధ్యలో పెద్ద పెద్ద కుంకుడు, చింత, మామిడి, నేరేడు చెట్లు, ఒక పక్కగా రేగు చెట్టు వుండేవి. చుట్టూరా కోటగోడలాంటి ఎత్తైన గోడ. అచ్చు కోటలో ఉన్న రక్షణ వుండేది. దానిని పప్పుకోట అనేవాళ్ళు. ఒకప్పుడు పప్పుల మిల్లు వాళ్ళు పప్పులు ఆరబెట్టుకునేవారుట. లోపలంతా ఏడెనిమిది పోర్షన్లు వున్నాయి. ఇంటివాళ్ళు ఒక పెద్ద పెంకుటింట్లో వుండేవారు.)***
అదే రోజు గేటు బయటికి వెళ్ళి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి మీ పిల్లలకి ట్యూషన్ చెపుతాను అన్నాను. వాళ్ళు వెంటనే పిల్లలని పంపించడం మొదలుపెట్టారు. ఒక పదిమంది పిల్లల దాకా వచ్చేవారు. నాకు మా వూళ్ళో పిల్లలకి చెప్పిన అలవాటు వుంది కాబట్టి వాళ్ళకి ట్యూషన్ చెప్పడం ప్రారంభించాను. ప్రస్తుతం ఖాళీగా వుండకుండా పని కల్పించుకున్నాను. పిల్లలందరితో మంచి కాలక్షేపం అయ్యేది. వాళ్ళతో కబుర్లు చెపుతూ పాఠాలు చెప్పేదాన్ని. చక్కగా నేర్చుకునేవారు. వాళ్ళకి మార్కులు కూడా బాగానే వచ్చాయి.
ఒకసారి వాళ్ళని తీసుకుని గుడిమల్కాపూర్ లో వున్న జామ్ సింగ్ వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్ళాను. *** (దీనిని నిజాం నవాబు సికిందర్ జా అశ్వదళాధిపతిగా పనిచేసిన జాంసింగ్ 1810లో దేవాలయాన్ని నిర్మించాడు. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం.)*** పిల్లలు బలే సంతోషపడ్డారు. చాలా పెద్ద గుడి. అక్కడ కాసేపు పంజరం నుంచి బయటికి వచ్చిన పక్షుల్లా స్వేచ్ఛగా తిరిగారు. వాళ్ళెవరూ ఎప్పుడూ రాలేదుట. పాపం అనిపించింది. ఇలా రెండో నెల గడిచిపోయింది.
మంచి చోట చూసుకుని చేరదాం అని ఆగాను. నేను కనీసం నా ఉద్యోగ విషయాలు అమ్మకి కానీ, అక్కావాళ్ళకి కానీ ఉత్తరం రాయలేదు. వాళ్ళకి రాసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదు. కాలక్షేపానికి పుస్తకాలు చదువుకునేదాన్ని. పిల్లలతో ఆటలు ఆడేదాన్ని.
*** భవిష్యత్తుకి బాటమొదలైనరోజు ***
మా బంధువులాయన లక్ష్మణరావుగారని మాకు కొంత దగ్గరలో వున్నారు. అక్క, నేను కలిసి ఉన్నప్పుడు సన్నజాజిపూలకోసం రోజూ వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. వాళ్ళింట్లో చాలా మొక్కలు వుండేవి. వాటి మధ్య తిరుగుతూ వుండేదాన్ని. అక్కవెళ్ళాక నేను వెళ్ళలేదు. ఒకరోజు వాళ్ళింటికి వెళ్ళాను. ఆయన క్షేమసమాచారాలు అన్నీ అయ్యాక –
****
“మరేం మా ఆఫీసులో ఇంగ్లీషు తెలుగు ఒకటే టైపు మిషన్ మీద వస్తాయి. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు ఇద్దరు వున్నారు కానీ, ఇంకెవరైనా తెలుగు టైపు వచ్చిన వాళ్ళు కావాలని అంటున్నారు. నేనే నీ దగ్గిరకి వద్దామనుకున్నాను. సరే నువ్వు రేపొకసారి హిమాయత్ నగర్ లో ఆఫీసు వుంది. ఆఫీస్ కి రా అని అడ్రస్, ఫోన్ నెం. ఇచ్చారు”. ఆయన నన్ను గుర్తుపెట్టుకుని చెప్పినందుకు సంతోషంగా అనిపించింది. థాంక్స్ చెప్పేసి ఇంటికి వచ్చేశాను.
****
చూద్దాం ముందు ముందు ఏం జరగబోతోందో.... నేను వీళ్ళింటికి రావడం కూడా మంచిదయింది అనుకున్నాను. అమ్మ అన్ని పరిస్థితులు తట్టుకుని ధైర్యంగా వుండేది. అదే మార్గంలో నేనూ....
క్రమంగా వివరాలు మీరు చెబుతారు అనుకోండి కానీ నాకొక సందేహం.
రిప్లయితొలగించండిఒక అక్క గారు ఆంధ్రా బ్యాంక్, ఇంకో అక్క గారు స్టేట్ బ్యాంక్ - మరి మీరెందుకు బ్యాంక్ ఉద్యోగానికి ప్రయత్నం చెయ్యలేదు?
మీ సందేహం బావుంది సర్. నేను బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను. ఇంటర్వ్యూ వరకు వచ్చి పోయింది ఒకసారి. ఇలా ప్రయత్నాలు చేస్తూనే... నేను కొత్త ఉద్యోగంలో చేరాను. దాని గురించి ముందు ముందు తెలుసుకుంటారు.
రిప్లయితొలగించండి