5, ఆగస్టు 2022, శుక్రవారం

ఎదురీతలో నేను - 39 *** పెళ్ళి చూపులకి వారొచ్చారు... ***

ఎదురీతలో నేను - 39  *** పెళ్ళి చూపులకి వారొచ్చారు... *** 


***అసలు పెళ్ళికొడుకుని ఆ రోజు మిస్సయ్యాం కదా...!***

పెద్దవాళ్ళందరి ఇంటర్య్వూ అయ్యింది. అమ్మ, నేను, అక్క ఇంటికి తిరిగి వచ్చేశాం. అమ్మ అక్కడ కొత్తగా ఫీలయినా అందరూ బాగా మాట్లాడారని, అమ్మయ్య కూతురికి పెళ్ళి కుదిరిందని సంతోషించింది. నాకు పెళ్ళవదనే అమ్మ భయాలన్నీ పటాపంచలయ్యాయి.

అక్క విజయవాడ వెళ్ళిపోయి పెళ్ళికొడుకు జానకిరాంకి ఉత్తరం రాస్తూ.... నా ఆఫీసు అడ్రస్ ఇచ్చింది. వచ్చే ఆదివారం నల్లకుంటలో మా ఇంట్లో కలుద్దాం అని ఆ అడ్రస్ కూడా ఇచ్చింది.

ఒకరోజు నేను వర్కులో వుండగా సాయంత్రం నాలుగు గంటలకి మీకోసం ఎవరో వచ్చారు అని చెప్పారు. బయటికి వచ్చి చూస్తే - కాబోయే పెళ్ళికొడుకు జానకి రామ్ వచ్చి వున్నారు. ఒక్క ఐదు నిమిషాలు కూచుని వూరికే కలుద్దామని వచ్చాను. కింద మా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు అని వెళ్ళిపోయారు. ఇంకేం మాట్లాడే అవకాశం లేదు. నాకు విచిత్రంగా అనిపించింది. సరేలే మొహాలు చూసుకున్నాం కదా.. అనుకున్నాను. ఫర్వాలేదు చూడ్డానికి బాగానే వున్నారు. ఇంక నా వర్కు హడావిడిలో నేను పడ్డాను. ఊహించుకుని కాసేపు కలలు కందామంటే మొహమే గుర్తులేదు. సరేలే ఆదివారం చూస్తాను కదా అనుకున్నాను.

మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్న జానకిరాం గారి MTAR Technologies Ltd. (Machine Tool Aids and Reconditioning) శనివారం అక్క, బావగారు ఆఫీసుకి వెళ్ళారు. ఎవరో వచ్చారని చెప్తే బయటికి వచ్చి, వీళ్ళతో మాట్లాడి ఆదివారం సాయంత్రం వస్తానని చెప్పారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకి పెళ్ళికొడుకు జానకిరాం గారు అసలు సిసలైన పెళ్ళిచూపులకి మా ఇంటికి వచ్చారు. అక్క కాఫీ, స్నాక్స్ ఇచ్చి, మాట్లాడుతూ వుండమని చెప్పి వంట ప్రయత్నాలలోకి వెళ్ళిపోయింది.

నా గురించి సమాచారం అంతా వెళ్ళిపోయింది కాబట్టి – పేరేమి? చదువేమి? ననుప్రేమిస్తావా? వయసెంత? - అని అడగలేదు. ఇంక పెళ్ళి చేసుకున్నాక ప్రేమించకపోతే బావుండదు కదా... !

ఆయనే వాళ్ళ ఆఫీసులో షిఫ్ట్ డ్యూటీస్ వుంటాయని చెప్పారు. తను చేసే ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ గురించి చెప్పడం మొదలుపెట్టారు - *** శ్రీహరి కోట నుంచి పంపించే రాకెట్ల మెయిన్ పార్ట్ వికాస్ ఇంజన్ *** వీళ్ళ ఆఫీసులోనే తయారు చేస్తారు. అవి ఒక్క మిల్లీమీటర్ తేడా వచ్చినా రిజెక్ట్ చేస్తారు. శ్రీహరికోట ఇస్రో నుంచి ఇన్స్ పెక్టర్స్ హైదరాబాద్ లోనే వుండి పార్ట్ తయారయ్యేలోపున ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుండేవారు. ఆ పార్టు పంపించేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు, దాన్ని ఎలా పంపిస్తారో.... ఇవన్నీ ఇమోషనల్ గా చెప్పుకుంటూ వెళ్ళుతున్నారు. అది ఒక ఆశ్చర్యకరమైన విషయమే. ఆ టెక్నాలజీ చాలా గొప్పగా వుంది. సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువే. రాకెట్ స్పేస్ లోకి పంపించినప్పుడు వికాస్ ఇంజన్ ని ముందర వదిలేస్తుంది. వీళ్ళందరూ పడే ఆనందం గురించి కూడా చాలా ఇమోషనల్ గా చెప్పారు.

వాళ్ళ అక్క చెల్లెళ్ళవి, అన్నదమ్ములవి, అమ్మగారివి ఫోటోలన్నీ చూపించారు. ఈయనకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ వెస్ట్రన్ మ్యూజిక్ అంటే ఇష్టం. వీళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి సికింద్రాబాద్ లో ఒకచోట నేర్చుకుని, హైదరాబాద్ రేడియోస్టేషన్ లో రెండుమూడుసార్లు ప్రోగ్రాం ఇచ్చారు. ఏ ప్రోగ్రాం మిస్సవకుండా వెడతామనీ చెప్పారు. ABBA గ్రూప్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ABBA గ్రూప్ సింగర్స్ తో ప్రోగ్రాం చేస్తోందని తెలిసి సంతోషించారు. (ఈయన వెస్ట్ర్ న్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఒక ఛాప్టర్ రాయాలి. అది ఇప్పుడు అవదు.)

చిత్తూరు జిల్లా నారాయణవనంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పాడేపాటలు ఏమేమి ఇష్టమో చెప్పారు. వాళ్ళు ఎలా పాడేవారో చెప్పారు. తను నేర్చుకున్న పాటలు తర్వాత పాడి వినిపిస్తానన్నారు. ఇవన్నీ మాట్లాడుకునేలోపున అక్క వంట పూర్తి చేసింది. భోజనం చేసి మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయారు.
నన్ను ఏదైనా పార్కుకి వెడదామని అడుగుదామనుకుని మళ్ళీ ఇంత చనువేమిటని అనుకుంటామని అడగలేదని తరవాత మళ్ళీ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు. పెళ్ళి గురించి చెప్తే ఫ్రెండ్స్ మాత్రం ప్రేమించి పెళ్ళిచేసుకుంటున్నాం అనుకున్నారుట. లేదు తర్వాత ప్రేమించుకుంటాం అని చెప్పారుట.
ఇంక వాళ్ళన్నగార్లు, మా అమ్మావాళ్లు పెళ్ళి ముహూర్తాల హడావిడిలో పడ్డారు. ఎట్టకేలకు జూన్ 19వ తేదీన ముహూర్తం ఖరారైంది.

2 కామెంట్‌లు:

 1. 1970లు, 1980ల్లో (తరువాత కూడా కొంతకాలం పాటు) ప్రపంచవ్యాప్తంగా పాప్ అభిమానుల్ని ఉర్రూతలూగించి “అబ్బా” (🙂) అనిపించిన గ్రూప్ “ABBA” 🙂. Pop లో వారి “పూర్వీకులు” (🙂🙂) అయిన The Beatles లాగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న గ్రూపు ABBA.

  అయితే మీవారు పాప్ సంగీత ప్రియులన్నమాట? ఇంకేం, మీ ఇంట్లో నిరంతరం సంగీతధ్వనులు వినిపిస్తుంటాయన్నమాట? బాగుంది.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. అవును సర్. ఇప్పుడు మూడేళ్ళ మా మనవరాలికి ఆ పోలిక వచ్చింది. దానికి శాస్త్రీయ సంగీతం, పాప్ మ్యూజిక్ రెండూ చాలా ఇష్టం. నాలుగు నెలల కింద ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు తాతతో పాడించుకుని తనూ పాడింది. మౌతార్గన్ తో తాతా మనవరాలు వాయిస్తూ ఆనందించారు. ఆస్ట్రేలియా వెళ్ళాక ఎక్కడో ఒక పాట విందిట. ఆ పాట వాళ్ళమ్మావాళ్ళని పెట్టమని తను మళ్ళీ విని తాతకి ఫోన్ చేసి పాట చాలా బావుంది వినమని చెప్పింది.

   తొలగించు