8, ఆగస్టు 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 24 - తాడేపల్లిగూడెం - ఆ ఇంటితో రుణం తీరిన వేళ - 8

  జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 24 -  తాడేపల్లిగూడెం  - ఆ ఇంటితో రుణం తీరిన వేళ  - 8  



 జ్ఞాపకాల గూడుతో రుణం తీరింది

ఆ ఇంటితో రుణం తీరిన వేళ

 

అమ్మని చాలా బాగా చూసుకునేవారు. అమ్మ మేనగోడలే అయినా అమ్మకి ఏ విషయంలోనూ లోటు రానియ్యలేదు. నాన్నగారు చాలా శాంత స్వభావులు. అమ్మకి తన పిల్లలకి చెడ్డ పేరు రాకూడదని మమ్మల్ని చాలా మిలటరీ డిసిప్లిన్ తో పెంచింది. శిక్ష కఠినంగానే వుండేది.  మా అక్కచెల్లెళ్ళు అందరికీ ఆరేళ్ళు వచ్చేలోపునే తెలుగు అక్షరాలు, గుణింతాలు, మాటలు రాయడం, చదవడం. అన్నీ నేర్పేసింది. ఎబిసిడిలు మొదటి బరి రెండో బరి అనేవాళ్ళం. మొదటిది పొడి మాటలకి, రెండోది అక్షరాలు కలిపి రాయడానికి. మేము 6 సంవత్సరాలకి స్కూల్లో చేరేసరికి మాకు మొత్తం చదవడం, రాయడం వచ్చేసేది.  ఇంటిముందు కూచుని బియ్యం ఏరుకుంటూ చదువు చెప్పేది.

 

ఆ ఇల్లు చూసి ఇంతబాగా మళ్ళీ జ్ఞాపకాలు గుర్తు చేసుకుని, అందరికీ చెప్పిన నేను రుణం తీరిన విషయం కూడా చెప్పాలి.

 

ఒకరోజు అమ్మ మమ్మల్ని పొద్దున్నే 7 గంటలకి లేపింది. నాన్నగారు ఎందుకో కదలట్లేదు. నోట్లోంచి గురక వస్తోంది. మీరిద్దరూ వెళ్ళి మూర్తి డాక్టరుగారిని పిలుచురండి అంది. నేను 7వ తరగతి,  మా చెల్లెలు 5వ తరగతి. ఇద్దరం రైల్వేట్రాక్ దాటి డాక్టరుగారిని పిలుచుకు రావడానికి వెళ్ళాం. డాక్టరు గారు లేరు. అప్పట్లో నేను మా చెల్లెలు ఇంటికి వచ్చేసరికి నాన్నగారిని కారులో ఏలూరు తీసుకుని వెళ్ళారుట.  మేము వెళ్ళే లోపున  డాక్టరు గారికి ఎవరో కబురు అందించారు.  ఆయన చూసి ఏలూరు పెద్దాసుపత్రికి తీసుకుని వెళ్ళమన్నారు. తాడేపల్లిగూడెంలో పెద్ద ఆసుపత్రులు లేవు.

 

మమ్మల్ని బ్యాంక్ వాళ్ళు వేరే కారులో వెనక పంపించారు. మేము ఏలూరు చేరేసరికి సాయంత్రం అయిపోయింది.  మానాన్నగారి వూరు ఏలూరు కాబట్టి తిన్నగా బామ్మగారి ఇంటికి వెళ్ళిపోయాం.  తీరా చూస్తే నిర్జీవంగా పడుకున్న నాన్న. అంత హఠాత్తుగా వదిలివెళ్ళిన ఆ మనిషిని చూస్తే ఏడుపు కూడా రాలేదు.  ప్రశ్నార్థకమైన మొహాలేసుకుని చూస్తూ కూచున్నాం.  

 

నాన్నగారు పోయాక అందరూ మమ్మల్ని ఏలూరులోనే వుండమన్నారు కానీ, బ్యాంక్ వాళ్ళు మాత్రం మీరు గూడెం వచ్చెయ్యండి అన్నారు. మీ నాన్నగారు పిల్లలు చదువు గురించి చెప్పేవారు.  అని మాకు ఏడాదికి సరిపడా సరుకులు కొనిచ్చారు. అక్కకి బ్యాంక్ లో టెంపరరీగా ఉద్యోగం వచ్చేలా చేశారు. మెల్లగా పర్మనెంట్ అయి మా అందరినీ చదివించి, పెళ్ళిళ్ళు చేసింది.

 

అన్ని జ్ఞాపకాలు గూడుకట్టుకున్న ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయాం.

 

నాకు తాడేపల్లి గూడెం వెళ్ళి ఆ యింటిని చూడాలనిపించి చూసి, మళ్ళీ ఇవన్నీ గుర్తు చేసుకున్నాను.

 


4 కామెంట్‌లు:

  1. Felt very sad to learn that you lost your father at such a young age. Kudos to your sister and all your family members for staying strong to tide over this tragedy, to bounce back.


    I have been reading everyone of your articles. Excellent style of narration. You are taking me back to my childhood days.

    Please accept my apologies for posting this comment in English.

    రిప్లయితొలగించండి
  2. ఫర్వాలేదండీ ఇంగ్లీషయినా మీరు చెప్పాల్సింది చాలా బాగా చెప్పారు. నా ప్రతి ఆర్టికల్ చదువుతున్నానని, బావున్నాయని చెప్పారు. మీ పాత రోజులు గుర్తుకు వచ్చాయని చెప్తున్నారు. నిజంగా అవి ఒక అందమైన జ్ఞాపకాలు. నిజంగానే జీవితంలో జరిగే సంఘటనలు ఊహించనివిగా వుంటాయి. మా అమ్మ 5వ తరగతి వరకే చదువుకున్నా చాలా ధైర్యవంతురాలు. తను అలా వుండబట్టి మేమందరం సెటిల్ అవగలిగాం. మీకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  3. “రుణం తీరిన వేళ” అంటే ఈ రకంగా అని ఊహించలేదు. మీరందరూ చిన్న పిల్లలుగా ఉండగానే మీ తండ్రిగారు కాలం చెయ్యడం దురదృష్టకరం. మీ అక్కగారికి బ్యాంక్ వారు ఉద్యోగం ఇవ్వడం కొంత ఊరట.

    ఇంత కాలం తరువాత ఆ పాత గుర్తులను మళ్ళీ చూస్తే కలిగే అనుభూతే వేరు.

    రిప్లయితొలగించండి
  4. అది నిజంగా దురదృష్టమేనండీ. చిన్న సూది కూడా మా చేతులతో మేము కొనుక్కోలేదు. అలాంటిది రోడ్డున పడినట్లయ్యింది. అయితే అక్క చాలా బాధ్యతగా చూసింది. కానీ నిజంగానే ఇంతకాలానికి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కలిగిన అనుభూతే వేరు. అది వాళ్ళు పడగొట్టక పోవడం నా అదృష్టం. ఒక్కసారి ఆకాలంలోకి వెళ్ళిపోయినట్లయ్యింది. ఇంత బాగా మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి