15, ఆగస్టు 2021, ఆదివారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 25 - నాన్నగారి వూరు ఏలూరు వివరాలు -1

 జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 25 -  నాన్నగారి వూరు ఏలూరు వివరాలు -1  

 

ఏలూరులో మా నాన్నగారి తల్లితండ్రుల గురించి  పుట్టిల్లు గురించి కొంత చెప్పాలి.

 


                               నుంచున్నావిడ మా బామ్మగారు, ఆవిడ అత్తగారు


మా బామ్మగారి ఇల్లు ఏలూరు పవరుపేటలో అంబికా దర్బార్ బత్తి ఎదురుగా వుండేది. దాదాపు వెయ్యి గజాల స్థలం. పెద్ద ఎత్తు అరుగులతో ఒక పేద్ద పెంకుటిల్లు. దాని ఎదురుగా వరసగా మూడు పోర్షన్ల పెంకుటిల్లు. ఇవి కాకుండా పెద్ద ఖాళీస్థలం వుండేది. మా బామ్మ ఏలూరు మున్సిపల్ కౌన్సిలర్ గా చేసింది. మా తాతగారూ, బామ్మగారు అప్పట్లో కాంగ్రెస్ లో బాగా తిరిగేవారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.  రాజారామమోహనరాయలు ప్రారంభించిన బ్రహ్మ సమాజంలో తిరిగేవారు. రకరకాల పాటలు పాడుతుండేవారు.  మా బామ్మ మాకు ఆపాటలు చాలా నేర్పేది.  వాళ్ళు హరిజనోద్యమాలలో పాల్గొని పంక్తి భోజనాలు చేశారు.  ఇలా చేస్తున్న సమయంలో మా తాతగారు ప్రాణాయామం గురించి చెప్తూ ఉన్నట్టుండి గుండె ఆగి చనిపోయారని చెప్తారు. ఆయన మా బామ్మని బ్రహ్మసమాజ సిద్ధాంతాలకి అనుగుణంగా వితంతు వివాహం చేసుకున్నారు.  

 

బామ్మకి నాన్నగారు ఒక్కరే కొడుకు. ముగ్గురు కూతుళ్ళు. పెద్ద కూతురు సరళాదేవిగారిని సంగీతం విద్వాన్ చేయించారు. ఆవిడ మాకు చాలా పాటలు నేర్పేది. రెండో కూతురు సతీదేవి ఆవిడ అప్పట్లో ఎస్.ఎస్.ఎల్. సి చదివింది. మా అమ్మకి వాళ్ళమ్మ చనిపోతే,  సవతి తల్లిగా వచ్చింది. పెనుగొండలో వుండేవారు.   మూడో ఆవిడ అంజనాదేవి. ఆవిడ ఏలూరులోనే స్కూలులో పనిచేసేది.  

 

కాంగ్రెస్ లో తిరిగుతూ పెద్ద పెద్ద వాళ్ళ పరిచయం వుండటం వలన మా బామ్మకి చాలా పలుకుబడి వుండేది. బ్రిటీష్ రాణి ఎప్పుడైనా ఏలూరు వస్తే ఆవిడని కలుస్తూ వుండేవారుట. అప్పుడు బామ్మవెళ్ళినప్పుడు ఆవిడ పంఖా పీకు అనేవారట. అంటే పైన తెరలాంటి గుడ్డని తాడుతో ఊపితే గాలి వచ్చేదిట. సగం సగం తెలుగు నేర్చుకుని మాట్లాడేవారుట.       

మా బామ్మగారు, పక్కన మా మేనత్త
వెనక మేనత్త కూతుళ్ళు ముగ్గురు, అల్లుళ్ళు


4 కామెంట్‌లు:

  1. పాతకాలపు ఫొటోలు బాగున్నాయండి. కుర్చీ పక్కన ఓ స్టాండ్, దాని మీద ఓ పూలవేజ్ … టిపికల్ సెటప్ ఆ రోజుల్లో ఫొటోలకి.
    అది సరే కానీండి మీ బామ్మగారి అత్తగారు ఆ కాలంలోనే ఫొటో తీయించుకోవడానికి ఒప్పుకోవడం, దాని కోసం స్టూడియోకి వెళ్ళడం నిజంగా మెచ్చుకోదగిన విషయమే 🙂. మీ బామ్మ గారంటే ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి అన్నారు కాబట్టి ఆశ్చర్యం లేదు. అయితే వారి కుటుంబం ఊళ్ళో పలుకుబడి గల కుటుంబం అన్నారు కాబట్టి బహుశః స్టూడియో అతనే ఇంటికి వచ్చి ఫొటో తీశాడేమో?

    మీ తాత గారు కూడా ఆదర్శ వివాహం చేసుకున్న వ్యక్తిగా అందరకూ పూజనీయులే 🙏.

    రిప్లయితొలగించండి
  2. అవును సర్ బహుశ ఇంటికి వచ్చే ఫోటో తీసి వుంటారు. అత్తగారు పెద్దావిడ కదా. అవును సర్ మా తాతగారు అప్పట్లో కందుకూరి వీరేశలింగం గారూ వాళ్ళతో తిరిగేవారుట. గాంధీగారిని కూడా కలిశారని విన్నాను. మీరు అభిప్రాయం తెలియచేసినందుకు కృతజ్ఞతలు సర్.

    రిప్లయితొలగించండి