3, ఆగస్టు 2021, మంగళవారం

జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 23 - తాడేపల్లిగూడెం - నాన్నగారితో.... ఆ ఇంట్లో - 7

   జ్ఞాపకాల పొదరిళ్ళు ఆ వూళ్ళు – 23 -  తాడేపల్లిగూడెం  - నాన్నగారితో....  ఆ ఇంట్లో  - 7  


                                        ఇది ఇంటికి వచ్చే గుమ్మం. ఈ గుమ్మంలోంచే మా పరుగులు

సాయంత్రం  నాన్నగారు Bank నుంచి వచ్చేటప్పుడు సందు తిరగగానే దగ్గు వినిపించేది. మేము పరుగులు పెట్టుకుంటూ కిందకి వెళ్ళేవాళ్ళం.  ఎదురెళ్ళి ఇంటికి కలిసి వచ్చేవాళ్ళం.

 

Bank నుంచి రాగానే టిఫిన్ తిని, కాఫీ తాగి అలా బజారు దాకా వెళ్ళేవారు. తనతోబాటు నన్ను కానీ, మా మూడో అక్క ఉమని కానీ తీసుకుని వెళ్ళేవారు. తాడేపల్లి గూడెం ఎండుమిర్చి, చింతపండు, బెల్లంకి మంచి వ్యాపార ప్రదేశం. నాన్న Cash లో కూచునేవారు కాబట్టి షాపుల వాళ్ళందరితోటీ బాగా పరిచయాలుండేవి. అక్కడ ఒక షాపుకి తీసుకుని వెళ్తే సుబ్బారావుగారి పాప వచ్చింది. జీడిపప్పు, పటికబెల్లం ఇమ్మనేవారు. ఇంచుమించు పావుకిలో జీడిపప్పు, పావుకిలో పటికబెల్లం ఇచ్చేవారు.  అవి తీసుకుని ఇంటికి వచ్చి అమ్మకి ఇచ్చేవాళ్ళం. 

 

నాన్నగారు Bank లో క్యాషియర్ గా పనిచేసేవారు. అప్పట్లో బ్యాంక్ ఉద్యోగస్తులంటే చాలా గొప్పగా వుండేది.  ఎవరైనా డబ్బు కట్టడానికి కానీ, తీసుకోవడానికి కానీ వస్తే లెక్కపెట్టేటప్పుడు తెల్లకాగితాలు మాత్రమే కనిపించేవిట. ఒక్కళ్ళని కూడా వెయిట్ చేయించేవారు కాదు. అందరూ వ్యాపారస్తులు అవడంతో రష్ గానే వుండేది.  ఊరందరికీ నాన్నగారు దేవుడు.

 

ఈ ఇంటికి అప్పుడప్పుడు నాన్నగారి ఫ్రెండ్స్ వస్తూండేవారు. వాళ్ళందరూ కలిసి కింద రూంలో పేకాట ఆడుకునేవారు. అది ఒక సరదాగానే వుండేది.  పడుకునే మంచం దగ్గర వున్న కిటికీ దగ్గర నిలబడితే వచ్చేవాళ్ళు కనిపించేవారు. ఇష్టం లేకపోతే అక్కడ నుంచి చెయ్యి ఊపి రావద్దని చెప్పేవారు.

 


ఆ చివరగా ఉన్న కిటికీ దగ్గర మంచం మీద పడుకునేవారు.  తెరిచిపెట్టి వున్న చివరి కిటికీ నుంచీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుండేవారు.


పండగలు వస్తే చాలు శ్రీరామనవమి, దసరా, సంక్రాంతి , వినాయక చవితి పండగలకి నాన్నగారు దగ్గరుండి అలంకారాలు చేసేవారు. శ్రీరామనవమికి అయితే ఒక చక్కటి గొడుగుతో ఉన్న సింహాసనం చేశారు. అప్పట్లో ఇలా ఫోటోలు తీసుకోవాలని తెలియదు. అంతేకాకుండా వినాయక చవితికి పెద్ద విగ్రహం కొని, పాలవెల్లి అలంకరించేవారు.  

 


అమ్మా నాన్నలతో ఆరుగురం - నాన్నగారు అలంకరించిన సంక్రాంతి బొమ్మల కొలువు


దసరాకి బొమ్మలకొలువు బాగా అలంకరించారు. మా నాన్నగారు ఇండియా బొమ్మ సిమెంటుతో తయారు చేసి అందులో నదులు అవన్నీ కూడా డిజైన్ చేశారు.  నాన్నగారు మంచి ఆర్టిస్టు.  పెద్దక్కకి సైన్సు రికార్డుల్లో బొమ్మలన్నీ నాన్నగారే వేసి పెట్టేవారు.  

 

ఇంటి వెనకవైపు నేనూ అమ్మా ఎన్నో పువ్వుల మొక్కలు వేశాం. బావి పక్కన వేసిన మందార చెట్టు అంచలంచలుగా ఎదిగి రోజుకి 80 దాకా పువ్వులు పూసేది.  గులాబీ రంగు డిసెంబరు, ముళ్ళ గొబ్బీ, కనకాంబరం ఒకటేమిటి అమ్మకి దేవుడికి పెట్టటానికి కావలసిన పువ్వులన్నీ వుండేవి. నేను ఇంత బాగా పెంచుతుంటే నాన్నగారు నాకు ఒక గులాబీ మొక్క కొనిచ్చారు. అది మొగ్గ తొడిగి, పువ్వు పూసేదాకా దాని చుట్టూ తిరిగేదాన్ని. పూసిన పువ్వుని చూసి నా ఆనందం అంతా ఇంతా కాదు. 



ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న కుండీలో కనకాంబరం మొక్క వుండేది. ఎన్ని పువ్వులో పూసేది. అమ్మ దండ కట్టి గాయత్రి చిన్న జడలలో పెట్టేది. అది గంతులు వేసుకుంటూ తిరిగేది. 




మేము కింద పెట్టిన  చిక్కుడు, దొండ పాదులు ఈ కిటికీ వరకూ పాకుతూ వచ్చి మళ్ళీ పైన కూడా కాయలు కాసేవి. వీటికోసం నాన్నగారు తాళ్ళు కట్టేవారు. ఈ రెండు కూరలు బాగా తిన్నాం. 


(వచ్చేవారం ముగింపు)



 

 

 

 

 

 

 

 

 

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి